Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి మరియు ఖతార్ దేశ అమీర్ మధ్య టెలిఫోన్ సంభాషణ


ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఖతార్ దేశ అమీర్ గౌరవనీయులు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని తో టెలిఫోను లో మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్-19 మహమ్మారి కి సంబంధించి కొనసాగుతున్న పరిణామాలపైన, దాని సామాజిక, ఆర్ధిక ప్రభావం పైన, ఇరువురు నాయకులు చర్చించారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తమతమ దేశాలలో చేపట్టిన చర్యల గురించి వారు ఒకరికొకరు తెలియజేసుకున్నారు. సార్క్ దేశాల మధ్య ఇటీవల చేపట్టిన ప్రాంతీయ కార్యక్రమాల గురించి, జి-20 నాయకులతో ఈ ఉదయం నిర్వహించిన వర్చ్యువల్ సదస్సు గురించి కూడా ప్రధానమంత్రి గౌరవనీయులైన అమీర్ కు తెలియజేశారు.

ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి వైరస్ వల్ల ప్రభావితమైన దేశాలన్నీ చేస్తున్న కృషి, చర్యలు త్వరలోనే సానుకూల ఫలితాలిస్తాయన్న ఆశాభావాన్ని ఇరువురు నాయకులు వ్యక్తం చేశారు. ఈ మహమ్మారిని ఎదుర్కోడానికి చేస్తున్న పోరాటంలో అంతర్జాతీయ సంఘీభావం, సమాచార భాగస్వామ్యం ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు.

ఖతార్ లో నివసిస్తూ, పనిచేస్తున్న భారత జాతీయుల సంక్షేమంపై ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో గౌరవనీయులైన షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ద కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఖతార్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల రక్షణ, సంక్షేమం గురించి గౌరవనీయులైన అమీర్, ప్రధానమంత్రికి హామీ ఇచ్చారు.

ప్రస్తుత పరిస్థితిపై తరచుగా కలుసుకుని, సంప్రదింపులు జరపాలని ప్రధానమంత్రి, గౌరవనీయులైన అమీర్ అంగీకరించారు.