Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి మన్ కీ బాత్ తెలుగు అనువాదం – 29.03.2020


నా ప్రియతమ దేశవాసులారా..

సాధారణంగా మన్ కీ బాత్ లో నేను అనేక విషయాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అయితే ఈరోజు మన దేశమే కాదు.. ప్రపంచం మనసులో కూడా ఒకే ఒక్క విషయం కదలాడుతోంది. అదే ప్రాణాంతకమైన కరోనా వ్యాధి సృష్టించిన భయంకర కష్టం. ఇటువంటి సమయంలో వేరే విషయాల గురించి మాట్లాడటం సమంజసంగా ఉండదు. ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలనుకున్నాను కానీ.. ఈ ప్రాణాంతక వ్యాధికి సంబంధించి కొన్ని విషయాలను తెలియజేయాలని నా మనసు కోరుకుంటోంది. అయితే ముందస్తుగా దేశప్రజలందరినీక్షమించమని కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను క్షమిస్తారని నా ఆత్మ చెబుతోంది. ఎందుకంటే కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనివల్ల మీరందరూ ఎన్నో కష్టనష్టాలకు గురికావల్సి వస్తోంది. ముఖ్యంగా నా నిరుపేద సోదరసోదరీమణులను చూస్తుంటే ఏమనిపిస్తోందంటే వారందరూ కూడా ఈనేం ప్రధానమంత్రి? మమ్మల్ని కష్టనష్టాల ఊబిలోకి తోసేసాడు అని వాళ్లు అనుకుంటున్నారనిపిస్తోంది. నన్ను క్షమించమని ప్రత్యేకంగా వారిని కోరుకుంటున్నాను. బహుశా,  చాలామంది నా మీద కోపం పెంచుకుని ఉంటారు. మమ్మల్నందరినీ ఇట్ల ఇళ్లలో బందిస్తావా అని ఆగ్రహిస్తున్నారు. నేను మీ అందరి కష్టనష్టాలను అర్థం చేసుకోగలను. మీఅందరి ఇబ్బందులను అర్థం చేసుకోగలను అయితే.. 130 కోట్ల జనాభా గల మనలాంటి దేశంలో కరోనా పై యుద్ధానికి ఇంతకుమించిన మరోమార్గం లేనేలేదు. కరోనాతో యుద్ధమంటే జీవితానికి చావుకు మధ్య జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో మనం గెలవాలి. అందుకే కఠినమైన నిర్ణయాలు తప్పనిసరి అయ్యాయి. ఎవ్వరి మనసూ ఇంత కఠినమైన నిర్ణయాలను అంగీకరించరు. అయితే ప్రపంచ దేశాల్లోనిపరిస్థితులను చూస్తుంటే మిమ్మల్ని మీ కుటుంబాల్ని క్షేమంగా ఉంచడానికి ఇదొక్కటే మార్గమని తేలుతుంది. నేను మరోసారి మీకు కలిగిన ఇబ్బందులకు, కష్టాలకు క్షమించమని కోరుకుంటున్నారు.

సహచరులారా…

మనదగ్గర ఒక సూక్తి ఉంది. “ఏవం ఏవం వికార: అపి తరుణా సాధ్యతే సుఖం” అంటే వ్యాధులు, రోగాలను అవి ప్రబలకముందే, వాటిని ప్రారంభంలోనే ఎదుర్కొవాలి. లేకపోతే అవి ముదిరిన తర్వాత నివారించడం అసాధ్యమవుతుంది. రోగాలను నయం చేయడం కూడా మరింత కష్టమవుతుంది. ఈరోజు యావత్ భారతం ఒకటే చెబుతోంది. సోదరసోదరీమణులారా.. తల్లులారా… కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్నీ బందీచేసింది. జ్ఞానులను, వైజ్ఞానికులను, నిరుపేదలను, ధనవంతులను, బలహీన వర్గాలను, శక్తి మంతులను అందరినీ ఇది సవాల్ చేస్తోంది. ఇది దేశాల సరిహద్దులకు కానీ, ఒక ప్రాంత సరిహద్దులకు కానీ, ఒక వాతావరణ పరిమితులకు కాని, దేనికీ కట్టుబడటం లేదు. ఇది మానవజాతిని నాశనం చేయడానికీ, అంతం చేయడానికీ పట్టుబట్టి కూర్చుంది. అందుకే అందరూ.. కలిసికట్టుగా, యావత్ మానవజాతీ ఈ వైరస్ అంతంచూడడానికి సంకల్పం చేసుకోవాలి. లాక్ డౌన్ ను పాటిస్తూ ఇతరులను కాపాడుతున్నామన్న భావన కొంతమందిలో కలుగుతోంది. ఇది కేవలం అపోహ. ఈ భ్రమలోంచి బయటపడండి. ఈ లాక్ డౌన్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికీ, మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవడానికీ.ఇంకా ముందు ముందు కూడా కొన్ని రోజుల వరకు మీరు ఓర్పు వహించక తప్పదు సహనం ప్రదర్శించాలి. లక్ష్మణరేఖను దాటకూడదు. సహచరులారా.. నాకు తెలుసు ఎవ్వరూ కూడా కావాలని చట్టాన్ని ఉల్లంఘించాలని కోరుకోరు. నియమనిబంధనలను పాటించకూడదని ఎవ్వరూ అనుకోరు. కానీ కొంతమంది ఇట్లా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేకపోతున్నారు. వారందరినీ కోరేది ఒక్కటే లాక్ డౌన్ నియమాలను పాటించకపోతే. కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడం కష్టతరమవుతుంది. ప్రపంచంలో చాలా మంది ఈ అపోహలతోనే కాలం గడిపారు. ఇప్పుడు పశ్చాతాప పడుతున్నారు. ఆరోగ్యం పరంభాగ్యం –స్వాస్థ్యంసర్వార్థ సాధనం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే, దేనినైనా సాధించడానికి సాధనం. ప్రపంచంలో అన్ని సుఖాలను పొందడానికి సాధనం కేవలం ఆరోగ్యమే అందుకే లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించేవారు తమ జీవితంతో ఆటలాడుకుంటున్నారని చెప్పక తప్పదు. ఈ యుద్ధంలో అనేక మంది యోధులు కేవలం ఇంట్లో కూర్చొని కాకుండా బయటకు వెళ్లి కరోనా వైరస్ తో పోరాడుతున్నారు. వీరంతా యుద్ధంలో అగ్రభాగాన నిల్చిన సైనికులు. ముఖ్యంగా నర్సులు. ఈ నర్సుల్లో మన సోదరులు, సోదరీమణులు కూడా ఉన్నారు. డాక్టర్లు, సహచర వైద్య సిబ్బంది వీరంతా కరోనాను ఓడిస్తున్నారు. మనం వీరి నుంచి స్ఫూర్తి పొందాలి.

ఈ మధ్య నేను కొంత మందితో ఫోన్ లో మాట్లాడాను. వారిలో ఉత్సాహాన్ని నింపాను. వారితో మాట్లాడటం వల్ల నాలో మరింత ఉత్సాహం పెరిగింది. వారితో మాట్లాడి ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. ఈసారి మన్ కీ బాత్ ద్వారా ఆ సహచరుల అనుభవాలు, వారితో మాట్లాడిన విషయాలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా నాతో కలుస్తున్నవారు రామ్ గంప తేజా గారు. నిజానికి ఆయన ఐటీ ప్రొఫెషనల్. రండి ఆయన అనుభవాలను విందాం.

మోదీ : ఎస్ రాం

రామ్ గంప తేజా : నమస్కారమండీ.

మోదీ : ఎవరు? రామ్ గారేనా మాట్లాడేది.

రామ్ గంప తేజా : అవును సర్. రామ్ ను మాట్లాడుతున్నారు.

మోదీ : రామ్ నమస్తే.

రామ్ గంప తేజా :నమస్తే.. నమస్తే..

మోదీ : మీరు కరోనా వైరస్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని విన్నాను.

రామ్ గంప తేజా : అవును సార్.

మోదీ :మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నారు. చెప్పండి మీరు పెను ప్రమాదం నుంచి ఎట్లా బయటపడ్డారు. మీ అనుభవాలు వినాలనుకుంటున్నాను.

రామ్ గంప తేజా :నేను ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగిని. పనిలో భాగంగా మీటింగ్స్ కోసం దూబాయ్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అనుకోకుండానే అలా జరిగిపోయింది. తిరిగి రాగానే జ్వరంలాంటివి మొదలయ్యాయి సార్. ఆతర్వాత ఐదారు రోజులకు డాక్టర్లు కరోనా వైరస్ పరీక్షలు జరిపారు.  అప్పుడు పాజిటివ్ వచ్చింది. వెంటనే హైదరాబాద్ లోని ప్రభుత్వ గాంధీ హాస్పిటల్ లో నన్ను చేర్చారు. ఆతర్వాత 14 రోజులకి నాకు నయమైంది. డిశ్చార్జి చేశారు. నిజంగా అదంతా ఎంతో భయంకరంగా సాగింది.

మోదీ :అంటే మీకు కరోనా వైరస్ సోకిందన్న విషయం తెలిసింది?.

రామ్ గంప తేజా : అవును సార్.

మోదీ :మీకు ఈ వైరస్ ఎంతో భయంకరమైనదన్న అన్న విషయం ముందే తెలుసుకదా. జ్వరంతో బాధ పడుతున్నారు కదా.

రామ్ గంప తేజా : అవును సార్.

మోదీ :అయితే వైరస్ సోకిన విషయం తెలియగానే మీకు ఏమనిపించింది.

రామ్ గంప తేజా : ఒక్కసారిగా భయంవేసింది. ముందైతే నేను నమ్మలేకపోయాను. ఇట్లా ఎట్లా జరిగిందో అర్థం కాలేదు. ఎందుకంటే భారత దేశంలో కేవలం ఇద్దరి, ముగ్గురికే ఈ వ్యాధి సోకింది. అందుకే ఏమీ అర్థం కాలేదు. ఆస్పత్రిలో చేరిన తర్వాత నన్ను క్వారంటైన్ లో ఉంచారు. రెండు, మూడు రోజులు అట్లాగే గడిచిపోయాయి. అక్కడ ఉన్న డాక్టర్లు… నర్సులు…

మోదీ : ఆ ఇంకా…

రామ్ గంప తేజా :వాళ్లు ఎంతో మంచివాళ్లు. ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్లు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవాళ్లు నాకు ఏమీ కాదన్న నమ్మకాన్ని కలిగించే వాళ్లు. మీరు తొందరగా కోలుకుంటారు. అంటూ ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్లు. పగటి పూట ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు మాట్లాడేవాళ్లు. నర్సులు కూడా మాట్లాడేవాళ్లు. మొదట్లో భయం వేసింది. కాని క్రమంగా ఇంతమంది మంచివాళ్ల మధ్య ఉన్న కారణంగా నాకేమీ కాదన్న నమ్మకం కుదిరింది. ఏంచేయాలో వాళ్లకి తెలుసు. తప్పనిసరిగా నాకు మెరుగవుతుంది అన్న విశ్వాసం పెరిగింది.

మోదీ : మీకుటుంబ సభ్యుల మనస్థితి ఎట్లా ఉండేది.

రామ్ గంప తేజా :నేను ఆస్పత్రిలో చేరినప్పుడు మొదట్లో వాళ్లు ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఇక్కడ మీడియా కూడా కొంత సమస్యాత్మకంగా మారింది. ఆతర్వాత మాకుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశారు. నెగిటివ్ వచ్చింది. నాకూ, నాకుటుంబ సభ్యులకూ, చుట్టు పక్కల వారికి కూడా ఎంతో ఊరటనిచ్చింది. ఆ తర్వాత రోజురోజుకీ నా పరిస్థితిలో మెరుగుదల కన్పించింది. డాక్టర్లు మాతో మాట్లాడేవారు. కుటుంబ సభ్యులకు కూడా విషయాలు చెప్పేవారు. వారు ఏఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఏవిధంగా చికిత్స చేస్తున్నారో అన్ని విషయాలు కుటుంబ సభ్యులకు తెలిపేవారు.

మోదీ :మీరు స్వయంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు. మీ కుటుంబ సభ్యులు ఏ ఏ జాగ్రత్తలు తీసుకునేవారు?

రామ్ గంప తేజా : నేను క్వారంటైన్ లోకి వెళ్లిన తర్వాతే ఈ విషయం తెలిసింది. అయితే క్వారంటైన్ తర్వాత కూడా మరో 14 రోజులు పడుతోందని డాక్టర్లు చెప్పారు. ఆ 14 రోజులు ఇంటి దగ్గరే ఒక గదిలో ఉండాలని చెప్పారు. వారిని ఇంట్లో తమకుతాముగా క్వారంటైన్ లో ఉండాలని కోరారు. నేను ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోనే ఒక గదిలో ఉండేవాన్ని.. దాదాపుగా రోజంతా ఎక్కువసేపు మాస్క్ తగిలించుకొని ఉండేవాన్ని. తినడానికి గదిలోంచ బయటికి వచ్చే ముందు చేతులను శుభ్రంగా కడుక్కునేవాడిని. ఇది ఎంతో ముఖ్యం.

మోదీ : సరే రామ్.. మీరు ఆరోగ్యం పుంజుకొని బయటికి వచ్చారు. మీకు, మీకుటుంబ సభ్యులకు ఎన్నోన్నో శుభాకాంక్షలు.

రామ్ గంప తేజా : ధన్యవాదాలు సార్.

మోదీ :కానీ మీ ఈ అనుభవం…

రామ్ గంప తేజా : ఆ సార్..

మోదీ : మీరు ఐటీ ప్రొఫెషన్ లో ఉన్నారు.. కదా…

రామ్ గంప తేజా : చెప్పండి సార్..

మోదీ : అయితే ఆడియో తయారు చేసి…

రామ్ గంప తేజా : ఆ సర్…

మోదీ : ఇతరులతో పంచుకోండి… ప్రజలతో పంచుకోండి. దీనిని సామాజిక మాధ్యమంలో వైరల్ చేయండి. ఈ విధంగా చేస్తే ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉంటారు. ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలో కాడా తెలుస్తుంది. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి దూరంగా ఉండడానికి తమనుతాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు.

రామ్ గంప తేజా :అవును సార్. బయటికివచ్చి చూస్తున్నాను క్వారంటైన్ అంటే తమకు తాము జైలులో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇది నిజంగా ఇలాంటిది కాదు. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చెబుతున్న క్వారంటైన్ కేవలం వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా మంచిది. అందుకే.. ఎంతో మందికి ఈ విషయాలను చెప్పాలనుకుంటున్నాను. పరీక్షలు చేయించుకోండి. క్వారంటైన్ అంటే భయపడకండి. క్వారంటైన్ అంటే అదేదో మచ్చలాంటిది అనుకోకండి.

మోదీ :మంచిది రామ్. మీకు ఎన్నెన్నో శుభాకాంక్షలు.

రామ్ గంప తేజా : ధన్యవాదాలు.. ధన్యవాదాలు…

మోదీ : ధన్యవాదాలు..

రామ్ గంప తేజా : సార్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను.

మోదీ : ఆ చెప్పండి… చెప్పండి.

రామ్ గంప తేజా :నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు తీసుకున్న చర్యలు ప్రపంచంలో ఏ దేశం కూడా తమ పౌరుల కోసం తీసుకోలేదు. అంతేకాదు మీ కారణంగా మేమందరం కూడా క్షేమంగా బయట పడగలమని ఆశిస్తున్నాను.

మోదీ :ఈ వైపరిత్యం నుంచి దేశ బయటపడాలి. ఇది ఎంతో భయానకమైన పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి.

రామ్ గంప తేజా : ఏమీ కాదు సార్. మొదట్లో నాకు భయం వేసింది. మీరు లాక్ డౌన్ ప్రకటించినప్పుడు. మీరు తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే నాలో నమ్మకం పెరుగుతోంది. మనందరం మీ సహాయంతో బయటపడతాం సార్. ధన్యవాదాలు సార్.

మోదీ : ధన్యవాదాలు సోదరా… ఎన్నెన్నో కృతజ్ఞతలు.

రామ్ గంప తేజా : ధన్యవాదాలు సర్.

దేశవాసులారా… రామ్ గంప తేజా  గారు చెప్పినట్లు ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిన తర్వాత డాక్టర్లు ఇచ్చిన ఆదేశాలను తూచాతప్పకుండా పాటించారు. ఆకారణంగానే ఆయన ఆరోగ్యవంతుడై మళ్లీ సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు. కరోనాను ఓడించిన మరో వ్యక్తి మనతో కలుస్తున్నారు. కేవలం ఆయనే కాదు.. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ కరోనా ఊబిలో చికుక్కుకుపోయిన వారే. నవయువకుడైన వారి కుమారుడు కూడా ఈ ఊబిలో చికుక్కున్నాడు. రండి.. ఆగ్రాకు చెందిన అశోక్ కపూర్ గారితో మాట్లాడదాం.

మోదీ : అశోక్ గారు.. నమస్తే…. నమస్తే…

అశోక్ కపూర్ : నమస్కారం సార్… మీతో మాట్లాడడం నా అదృష్టం సార్.

మోదీ :నిజమే.. ఇది మా అదృష్టం కూడా. అందుకే మీకు ఫోన్ చేశాను. ఎందుకంటే మీ కుటుంబం యావత్తు ఈ ప్రమాదంలో పడింది కదా..

అశోక్ కపూర్ : అవును… అవును… అవును.

మోదీ :            నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఈ సమస్య గురించి, ఈవ్యాధి గురించి ఎట్లా తెలిసింది. ఏం జరిగింది. ఆస్పత్రిలో ఏం జరిగింది. ఈవిషయాలు చెప్పండి. మీరు చెప్పేవి విని వాటిలో దేశానికి పనికొచ్చే అంశాలను నేను ఉపయోగించుకుంటాను.

అశోక్ కపూర్ :తప్పనిసరిగా ఉపయోగించుకోవచ్చండీ… నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వారు ఇటలీ వెళ్లారు. అక్కడ చెప్పులకు సంబంధించిన ఒక ప్రదర్శన జరిగింది. మేం చెప్పులు, బూట్లు తయారు చేస్తాం. చెప్పులు, బూట్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది.

మోదీ : చెప్పండి.

అశోక్ కపూర్ :అక్కడ ఇటలీలో మేళా జరిగింది. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పటికీ…

మోదీ : ఆ… చెప్పండి.

అశోక్ కపూర్ :అక్కడికి మా అల్లుడు కూడా వెళ్లారు. ఆయన ఢిల్లీలో ఉంటారు. ఆయనకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. వెంటనే ఆయన రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి వెళ్లారు.

మోదీ :ఆ.. చెప్పండి.

అశోక్ కపూర్ :అక్కడ ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఆయనను సఫ్ధర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు.

మోదీ : ఆతర్వాత…

అశోక్ కపూర్ : మాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. మీరు కూడా ఆయనతో వెళ్లారు కదా.. మీరు కూడా పరీక్షలు చేయించుకోండి. కాంతో మా ఇద్దరు అబ్బాయిలు పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లారు. ఇక్కడి ఆగ్రా జిల్లా ఆస్పత్రిలో… ఆస్పత్రి వారు, ఎందుకైనా మంచిది మీకుటుంబ సభ్యులను కూడా పిలుచుకోండి అని చెప్పారు. ఇంకేముంది? అందరం అక్కడి వెళ్లాం.

మోదీ : ఆ… తర్వాత.

అశోక్ కపూర్ : మేం మొత్తం ఆరుగురం. మా ఇద్దరు అబ్బాయిలు, నేను, భార్య నా వయస్సు డెబ్భైమూడేళ్లు, నా భార్య, నా కోడలు, నా మనవడు… నామనవడి వయస్సు పదహారేళ్లు మా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది.  డాక్టర్లు ఆరుగురిని ఢిల్లీకి పంపిస్తామని చెప్పారు.

మోదీ : ఓ మై గాడ్.

అశోక్ కపూర్ :సార్.. అయితే మేమెవరమూ భయపడలేదు. సరే మంచిది అన్నాం. మంచిదే కదా.. ముందే తెలిసిపోయింది. మేం ఢిల్లీ సఫ్ధర్ జంగ్ ఆస్పత్రికి వెళ్లాం. ఈ ఆగ్రా ఆస్పత్రి వాళ్లే అంబులెన్స్ ఏర్పాటు చేసి మమ్మల్ని అక్కడికి పంపించారు. ఈ ఆస్పత్రి వాళ్లు ఎటువంటి ఛార్జీలు మమ్మల్ని అడగలేదు. ఆగ్రా డాక్టర్లు, ఆస్పత్రి యాజమాన్యం దయతో మేం ఢిల్లీ వెళ్లాం.

మోదీ : మీరు అంబులెన్స్ లో వచ్చారా.

అశోక్ కపూర్ : అవును సార్. అంబులెన్స్ లోనే వచ్చాం. అంబులెన్స్ లో కూర్చుని కూర్చునే వచ్చాం. మాకు ఆస్పత్రి వాళ్లు రెండు అంబులెన్స్ లు ఇచ్చారు. మాతోపాటు డాక్టర్లు కూడా ఉన్నారు. మమ్మల్ని సప్ధర్ జంగ్ ఆస్పత్రిలో విడిచి పెట్టారు. మేము వచ్చేటప్పటికే సప్థర్ జంగ్ ఆస్పత్రి డాక్టర్లు గేటుముందే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి నిలబడి ఉన్నారు. డాక్టర్లు మమ్మల్ని అక్కడి వార్డులోకి తరలించారు. మా ఆరుగురిని వేరు వేరు గదుల్లో ఉంచారు. గదులు బాగున్నాయి. అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. సార్ మేము 14 రోజులు అక్కడ ఆస్పత్రిలో ఒంటరిగా ఉన్నాం.  అక్కడి డాక్టర్లు మాకు ఎంతో సహకరించారు. మంచి చికిత్స అందించారు. అక్కడి సిబ్బంది కూడా ఎంతో సహకరించారు. అక్కడ అందరూ ఓకేరకమైన దుస్తులు వేసుకొని ఉండడంతో ఎవరు డాక్టర్లో, ఎవరు వార్డు బాయో, ఎవరు నర్సో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. వారు ఏది చెబితే దానిని మేం పాటించేవాళ్లం. మాకు ఎటువంటి కష్టం కలుగలేదు. ఒక్కశాతం సమస్యకూడా ఎదురుకాలేదు.

మోదీ : మీ ఆత్మవిశ్వాసం ఎంతో ప్రబలంగా కనిపిస్తోంది.

అశోక్ కపూర్ : అవును సార్. నేను ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్నాను. నిజానికి సార్ నాకు మోకాలి చిప్పల ఆపరేషన్ జరిగింది సార్. అయినప్పటికీ నేను ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్నాను సార్.

మోదీ :అది కాదు… ఇంత పెద్ద కష్టం మీ కుటుంబ సభ్యులను ముంచెత్తినా అందులోనూ పదహారేళ్ల పిల్లాడికి కూడా వచ్చినా…

అశోక్ కపూర్ :అతనికి పరీక్షలు జరుగుతున్నాయి సార్. ఐ.సీ.ఎస్.ఈ. పరీక్ష ఉండింది సార్. అయితే పరీక్ష రాయలేదు సార్. తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పాను సార్. ముందు ప్రాణం నిలబడితే ఆతర్వాత పరీక్ష. ఏం ఫర్వాలేదు.

మోదీ : నిజమే. మీ అనుభవం మీకు ఎంతగానో పనికి వచ్చింది. యావత్ కుటుంబానికీఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది. ధైర్యాన్నీ, ఓర్పునీ సమకూర్చింది.

అశోక్ కపూర్ : అవును సార్. మా కుటుంబ సభ్యులమందరం వెళ్లాం. ఒకరికి ఒకరు తోడుగా నిలిచాం. అయితే కలుస్తూ ఉండేవాళ్లం కాదు. కేవలం ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. మేం కలుసుకునేవాళ్లం కాదు కానీ. డాక్టర్లు శాయశక్తుల మాపట్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మేం ఎప్పటికీ వారికి కృతజ్ఞులమై ఉంటాం. వారు మాకు ఎంతో సహకరించారు. ఆస్పత్రి సిబ్బంది, నర్సులు మాకు తోడుగా నిలిచారు సార్.

మోదీ :సరే.. మీకూ మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఎన్నెన్నో శుభాకాంక్షలు.

అశోక్ కపూర్ : థ్యాంక్యూ సార్.. ధన్యవాదాలు. మాకెంతో సంతోషంగా ఉంది. మీతో మాట్లాడగలిగాం.

మోదీ :మీకే కాదు. నాకు కూడా…

అశోక్ కపూర్ : సార్.. ఆతర్వాత.. ఎప్పటికీ ప్రజల్లో జాగరూకత పెంచడానికి గానీ, ఏదైన సహాయం చేయడానికి గానీ, మేమంతా సిద్ధంగా ఉంటాం సర్.

మోదీ :అంత అవసరం లేదు. మీరు మీ పద్ధతిలో ఆగ్రాలో ఆ పని చేయండి. ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెట్టండి. నిరుపేదల గురించి ఆలోచించండి. ప్రజలు నియమనిబంధనలు పాటించేలా చూడండి. మీకుటుంబం ఈమహమ్మారిలో చిక్కిఎలా బయటపడిందో తెలియజేయండి. మీరు ఏవిధంగా అయితే.. నియమాలను పాటిస్తూ.. మీ కుటుంబాన్ని కాపాడారో, అదేవిధంగా ప్రజలందరూ కూడా నియమాలను పాటిస్తే దేశాన్ని కాపాడొచ్చు.

అశోక్ కపూర్ :మోదీ సర్ మేం ఒక మీడియో లాంటివి తయారు చేసి ఛానల్స్ కు అందజేశాం సార్.

మోదీ :చాలా మంచిది.

అశోక్ కపూర్ :ఛానల్స్ వాళ్లు. ప్రజల్లో అవగాహన పెంచడానికి ఆ వీడియోను ప్రసారం కూడా చేశారు.

మోదీ : సామాజిక మాధ్యమాల్లో మరింత పాపులర్ చేయాలి.

అశోక్ కపూర్ :అవును సార్. మేం మా కాలనీలో అందరికీ చెప్పాం. శుచీ శుభ్రత ఉన్న కాలనీ మాది. అందరికీ చెప్పాం. ఇదిగో మేం వచ్చేశాం. భయపడాల్సిన పనేలేదు. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెళ్లి పరీక్షలు చేయించుకోండి. మాతో కలిసి మెలిసి ఉన్న వారందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి. భగవంతుడి దయతో అందరూ చల్లగా ఉండాలి. ఇంతే సార్.

మోదీ : సరే. మీ అందరికీ శుభాకాంక్షలు.

అశోక్ కపూర్ :సరే సార్. మీ దయ. మేమైతే ఎంతో సంతృప్తిగా ఉన్నాం. మీతో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. మిమ్మల్ని అహ్మదాబాద్ లో ఒకసారి చూశాను సార్. ఇప్పటికి మీతో మాట్లాడగలిగాను. మా ఇల్లు మణినగర్ లోనే ఉంది సర్.

మోదీ :ఓహో.. అలాగా…

అశోక్ కపూర్ :అక్కడ మిమ్మల్ని ఒకసారి చూశాం సార్. మా పెద్దన్నయ్యగారు అక్కడ ఉంటారు సార్.

మోదీ : ఇప్పుడు మీరు ఆగ్రాలో ఉంటున్నారు కదా.

అశోక్ కపూర్ : అవును సార్. మేము ఆగ్రాలో ఉంటున్నాం. మేం ఇద్దరు సోదరులం సర్. ఒక సోదరుడు అహ్మదాబాద్ లో మణినగర్ లో ఉంటారు.

మోదీ :సరే.. మంచిది.

అశోక్ కపూర్ :సార్.. అది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గం కదా.

మోదీ : అవును. అక్కడ శాసన సభ్యుడిగా ఉండేవాణ్ని.

అశోక్ కపూర్ :మీ పాలన సాగుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను సార్. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఎంతో బాగుంది సార్.

మోదీ :సరే మంచిది. ధన్యవాదాలు… ఎన్నెన్నో శుభాకాంక్షలు.

అశోక్ కపూర్ : ధన్యవాదాలు… ధన్యవాదాలు.

సహచరులారా… అశోక్ గారు, వారి కుటుంబ సభ్యులు దీర్ఘాయుస్సుతో జీవించాలని కోరుకుందాం. వారు చెప్పినట్లుగా ఎటువంటి ఆందోళనకు గురికాకుండా భయపడకుండా తగిన సమయంలో.. తగిన చర్యలు తీసుకుంటూ.. అవసరమైనప్పుడు డాక్టర్లను సంప్రదిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనం ఈ మహమ్మారిని ఓడించగలుగుతాం. సహచరులారా.. వైద్య శాస్త్ర స్థాయిలో మహమ్మారితో పోరాడుతున్నాం. వారి అనుభవాలను తెలుసుకోవడం కోసం నేను కొంత మంది డాక్టర్లతో మాట్లాడాను కరోనా వైరస్ తో జరుగుతున్న ఈ యుద్ధంలో మొదటి వరుసలో నిలబడి ఆ డాక్టర్లు పోరాడుతున్నారు. వారి దైనందిన జీవితంలో భాగంగా ఎప్పటికీ ఇటువంటి రోగులతోనే వారు గడపాల్సి వస్తుంది. రండి మనతో కలవడానికి ఢిల్లీకి చెందిన డాక్టర్ నీతేష్ గుప్త వచ్చారు.

మోదీ : నమస్తే డాక్టర్ గారూ.

నీతేష్ గుప్త :నమస్తే సార్.

మోదీ : నమస్తే నీతేష్ గారు, మీరైతే ఏకంగా యుద్ధరంగంలో ముందు వరుసలో

         ఉన్నారు. ఆస్పత్రులలో మీ సహచరుల మూడ్ ఎలా ఉంది. కొద్దిగా

          తెలియచేస్తారా..

నీతేష్ గుప్త :అందరి మూడ్ బ్రహ్మాండంగా ఉంది. అంతా మీ ఆశీర్వాద బలమే.

           మీరు ఇచ్చిన ఆదేశాలను అందరూ సమర్థిస్తున్నారు. మేము

           అడిగనవన్నీ మీరు సమకూరుస్తున్నారు. అందుకే మేమందరం

          సరిహద్దులో నిలబడ్డ సైనికులలాగా యుద్ధం చేస్తున్నాం. మా కర్తవ్యం, మా బాధ్యతా ఒక్కటే. రోగి ఆరోగ్యవంతుడై ఇంటికి       వెళ్లేలా చూడడం.

మోదీ : మీరు చెప్పేది నిజమే. ఇది యుద్ధం లాంటి పరిస్థితే. మీరందరూ

          అగ్రభాగాన నిలబడి యుద్ధం చేస్తున్నారు.

నీతేష్ గుప్త : ఔను సార్

మోదీ :  చికిత్స తోపాటు రోగికి కౌన్సిలింగ్ కూడా చేయాల్సి వస్తుంది కదా.

నీతేష్ గుప్త : ఔను సార్. ఇది చాలా అవసరం. ఎందుకంటే.. రోగి విషయం

          వినగానే ఏమైపోతుందోనని విపరీతంగా భయపడతాడు.  అతనికి

          అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. ఏం లేదు కేవలం 14 రోజుల్లో మీకు

         నయమవుతుంది.  మీరు హాయిగా ఇంటికి వెళతారు. ఇప్పటికీ మేం

         16మంది రోగుల్ని ఆరోగ్యవంతుల్ని చేసి ఇంటికి పంపించాం.

మోదీ : సరే మంచిది. అయితే..ఓవరాల్ గా భయభీతులైన రోగుల విషయంలో

         వారిని బాధించేది ఏమిటి. మీకేం కనిపించింది.

నీతేష్ గుప్త : వారికి ఏం జరగబోతోందోనన్న భయం ఉండేది. ఇప్పుడెట్లా..

         బయట ప్రపంచంలో ఎంతోమంది చనిపోతున్నారు కదా. మాకు అలాగే

         జరుగుతుందా అని వారు విపరీతంగా భయపడే వారు. మేం వారికి

        అర్థమయ్యేలా చెప్పేవాళ్లం. వారికి ఉన్న ఇబ్బంది ఏమిటో ఆ సమస్య

        ఎన్ని రోజుల్లో తీరుతుందో స్పష్టంగా చెప్పేవాళ్లం. మీకున్న ఇబ్బంది

        చాలా చిన్నది. మామూలు జలుబు,జ్వరం లాంటిదే. అంతే..

        అంతకుముంచి ఏమీ లేదని చెప్పేవాళ్లం. ఐదారు రోజుల్లో నయం

        అయిపోతుందని అర్థమయ్యేలా తెలియజేసే వాళ్లం. మీకు పరీక్షలు

        చేస్తాం. నెగిటివ్ వస్తే వెంటనే ఇళ్లకు పంపిస్తాం. అందుకే రోజూ రెండు

        మూడు సార్లు రోగుల దగ్గరకు వెళ్లేవాళ్లం. కలిసే వాళ్లం.  వారికి రోజంతా       సౌకర్యంగా ఉంటే బాగుంటుంది. అందుకే.. ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ ఉండేవాళ్లం.

మోదీ:  వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేది కదా.  మొదట్లో భయపడే వాళ్లు కదా. నీతేష్ గుప్తా : ఔను. మొదట్లో భయపడే వాళ్లు. కానీ.. మేము వారికి

        అర్థమయ్యేలా చెప్పేవాళ్లం. రెండు మూడురోజుల్లో క్రమంగా

        మెరుగవుతున్నట్లు కనిపిస్తే వారికి కూడా పూర్తిగా కోలుకుంటామన్న

        నమ్మకం కలిగేది.

మోదీ: అయితే చాలామంది డాక్టర్లు వారి జీవితంలో ఎంతో సేవ చేసే బాధ్యత

        ఇప్పుడు తమకు లభించిందని భావిస్తున్నారు. మీరు కూడా అలాగే

        భావిస్తున్నారా..

నీతేష్ గుప్తా : నిజమే సార్. నిజంగా ఇది ఎంతో గొప్ప బాధ్యత. మేము మా

        బృందంలోని సహచరులను ఎప్పటికీ ప్రోత్సహిస్తూ ఉంటాం. ముందు

        జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. మంచి జాగ్రత్తలు

        తీసుకుంటే దేనినైనా నయం చేయవచ్చని రోగులకు చెబుతూ ఉంటాం.

మోదీ:  మంచిది డాక్టర్ గారు.  మీ దగ్గరికి పెద్దసంఖ్యలో రోగులు వస్తూ

        ఉంటారు.  వారికి చికిత్స చేయడంలో మీరు ప్రాణాలు ఒడ్డడానికి కూడా

        సిద్ధపడి పనిచేస్తున్నారు. మీతో మాట్లాడడం ఎంతో బాగుంది. ఈ

        యుద్ధంలో నేను మీకు తోడుగా ఉన్నాను. యుద్ధం చేస్తూనే ఉందాం.

నీతేష్ గుప్తా : మీ ఆశీర్వాదముంటే చాలు. అంతే మేము కోరుకునేది.

మోదీ:  ఎన్నెన్నో శుభాకాంక్షలు సోదరా.

నీతేష్ గుప్తా : ధన్యవాదాలు సార్.

మోదీ: ధన్యవాదాలు నీతేష్ గారూ. నమస్కారాలు. మీలాంటి వారి

        ప్రయత్నాలతో భారతదేశం కొరోనా పై జరుగుతున్న ఈ యుద్ధంలో

        విజయాన్ని సాధిస్తుంది. మీకు ఓ విన్నపం. మీరు జాగ్రత్తగా ఉండండి.

        మీ సహచరులను జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా

        చూసుకోండి. ప్రపంచ దేశాలలో కొనసాగుతున్న పరిణామాలను

        చూస్తుంటే ఈ కొరోనా వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య ఒక్కసారిగా

        పెరిగిపోతోంది. ఈ విధంగ పెరిగిపోతున్న మహమ్మారిని అరికట్టడానికి

        ఉత్కృష్టమైన ఆరోగ్యసేవలు అందజేయడం జరుగుతోంది. భారతదేశంలో

        అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి. అందుకోసం అవిశ్రాంతంగా

        ప్రయత్నించాలి. మరో డాక్టర్ బోర్సే గారు మనతో మాట్లాడబోతున్నారు..

మోదీ : నమస్తే డాక్టర్ గారు

బోర్సే : నమస్తే.. నమస్తే.

మోదీ : మీరు మానవసేవే మాధవసేవగా భావిస్తూ పనిచేస్తున్నారు. మీతో

         ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. దేశప్రజలకు మీ సందేశం కావాలి.

         చాలామంది మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తోంది. ఎప్పుడు డాక్టర్లను

        సంప్రదించాలి. ఎప్పుడు కరోనా పరీక్ష చేయించుకోవాలి? ఒక డాక్టరుగా

        మిమ్మల్ని మీరు పూర్తిగా ఈ కొరోనా రోగుల కోసం జీవితాన్ని అంకితం

        చేసుకున్నారు.  మీరు చెప్పే విషయాలు ఎంతో లోతుగా ఉంటాయి.

        ఎంతో ప్రాధాన్యముంటుంది. మీరు చెప్పే విషయాలను

        వినాలనుకుంటున్నాను.

బోర్సే :సార్ నేను ఇక్కడ బి.జె. మెడికల్ కాలేజ్ పూణేలో ఉంటాను.

        ఇక్కడ ప్రొఫెసర్ గా చేస్తున్నాను. ఇక్కడ పూణే మున్సిపల్ కార్పోరేషన్

        హాస్పటల్ ఉంది.  దానిపేరు నాయుడు హాస్పటల్. ఇక్కడ జనవరి

        2020 నుంచి స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభమైంది. ఇక్కడ ఇప్పటివరకు

        16 కోవిడ్-19 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ 16 మంది కొరోనా

        రోగులలో మేము చికిత్స చేసి, క్వారంటైన చేసి, ఐసోలేషన్ లో ఉంచి,

        ఇప్పటివరకు ఏడుగురిని డిశ్చార్జి చేశాం సార్.  మిగతా 9 మంది

        రోగుల పరిస్థితి కూడా స్థిరంగా ఉంది. వారు కూడా క్రమంగా

        కోలుకుంటున్నారు సార్. వారి శరీరాల్లో వైరస్ ఉన్నప్పటికీ..  పరిస్థితి

        మెరుగుపడుతోంది సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న శాంపిల్ సైజ్ చాలా

        తక్కువే కేవలం 16 కేసులే సార్. అయితే… యువకులకు

        కూడా ఇది సోకుతోంది సార్. అయినా.. ఇది అంత ప్రమాదకరమైనది

        కాదు సార్.  ఇప్పుడు కేవలం 9మందే ఉన్నారు సార్.  వారు

        కూడా కోలుకుంటారు సార్. వారి పరిస్థితి ఇంకా క్షీణించదు సార్.

        రోజువారీ పరిస్థితిని పరీక్షిస్తున్నాం సార్. ఒక నాలుగైదు రోజుల్లో వారికి

        పూర్తిగా నయమవుతుంది. ఇక్కడికి వచ్చిన కొరోనా అనుమానితు

        లందరూ అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వాళ్లే. అందుకే వారు వైరస్

        బారిన పడ్డారు. ఇటువంటి వారికి శ్వాబ్ చేస్తున్నాం. ఇది ప్రొఫా

        రేంజియల్ శ్వాబ్. మస్కల్ శ్వాబ్   తీసుకుంటున్నారు. మస్కల్ శ్వాబ్ నివేదిక అందిన తర్వాత పాజిటివ్

        వస్తే వారిని పాజిటివ్ వార్డులో చేరుస్తాం. ఒకవేళ నెగిటివ్ వస్తే వారిని

        హోం క్వారంటైన్ సందేశంతో ఏ విధంగా వ్యవహరించాలో సలహాలు ఇస్తూ       ఇళ్లకు పంపిస్తాం.

మోదీ :డాక్టర్ గారూ, మీరు ఏమనుకుంటున్నారో. ఇళ్లలో ఏ విధంగా

         వ్యవహరించాలో వారికి ఏ ఏ సలహాలు ఇస్తారో తెలియచేస్తారా..

బోర్సే : సార్. ఒకవేళ ఇంట్లో ఉంటే.. ఇంట్లోనే క్వారంటైన్ చేసుకోవాలి.

         కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటించాలి. ఇది మొదటి విషయం.

         రెండోది మాస్క్ ఉపయోగించాలి. మాటిమాటికీ చేతులు శుభ్రం

         చేసుకోవాలి. వారి దగ్గర శానిటైజేషన్ లేకపోతే వారి దగ్గర ఉన్న

        మాములు సబ్బుతో చేతులను మాటిమాటికి శుభ్రం చేసుకోవాలి.

        ఒకవేళ దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా చేతి రుమాలు అడ్డం

        పెట్టుకోవాలి. దీనివల్ల దగ్గు, తుమ్ములతో బయటకు వచ్చే

        తుంపరలు దూరంగా పడకుండా చూసుకోవచ్చు. నేల మీద పడకుండా

        మిగతా చోట్ల పడకుండా ఉండడం కోసం రుమాలును అడ్డం

        పెట్టుకుని దగ్గాలి.. లేదా తుమ్మాలి. ఈ విధంగా చేయడం వల్ల వైరస్

        విస్తరించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ విషయాలను అందరికీ

        అర్థమయ్యేలా చెబుతున్నాం. వారు ఇంటివద్దే క్వారంటైన్ లో ఉండాలి. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి బయటకు రాకూడాదు. ఇప్పుడైతే లాక్     డౌన్ కొనసాగుతోంది. నిజానికి ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా లాక్ డౌన్

        లో ఇంటివద్దే క్వారంటైన్ లో ఉండాలి. కనీసం 14 రోజులు క్వారంటైన్ లో

        ఉండాలని వారికి సూచిస్తున్నాం.సలహాలు కూడా ఇస్తున్నాం.

మోదీ : మంచిది డాక్టర్ గారూ. మీరు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. అది

         కూడా అంకిత భావంతో చేస్తున్నారు.  మీ సహచర బృందం కూడా

         ఈ సేవలో నిమగ్నమైంది. మీ దగ్గురకు వచ్చిన రోగులందరూ కూడా

         క్షేమంగా, హాయిగా ఇళ్లకు వెళతారన్న నమ్మకం నాకుంది. యావత్

దేశంలోనూ ఈ విధంగానే మీ అందరి మద్దతుతో వైరస్ తో పోరాడి గెలుస్తాం.

బోర్సే : సార్. మాకు కూడా నమ్మకముంది. మనం గెలుస్తాం. ఈ యుద్ధంలో

        విజయం సాధిస్తాం.

మోదీ : డాక్టర్ గారూ మీ అందరికీ ఎన్నెన్నో శుభాకాంక్షలు. ధన్యవాదాలు

        బోర్సే : ధన్యవాదాలు సార్.

సహచరులారా.. మన ఈ సహచరులందరూ.. మిమ్మల్నీ యావత్ దేశాన్నీపెను విపత్తు నుంచి కాపాడే ప్రయత్నంలో నిమ్మగ్నులై ఉన్నారు. వీరు చెప్పిన విషయాలను కేవలం వినడమే కాదు. వాటిని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఈరోజు డాక్టర్ల త్యాగం, తపస్సు, అంకితభావాన్ని చూస్తుంటే నాకు ఆచార్య చరకుడు చెప్పిన విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆచార్య చరకుడు చెప్పిన విషయం డాక్టర్లకు సరిగ్గా సరిపోతుంది. డాక్టర్ల జీవనంలో ఈ విషయాలను స్పష్టంగా చూస్తున్నాం. ఆచార్య చరకుడు ఏమన్నారంటే    “న ఆత్మార్థం న అపి కామార్థం అతభూతదయామ్ ప్రతి వర్తతే యత్ చికిత్సాయాం స సవర్మేతి వర్తతే”.  అంటే ధనము లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన కోరికతో కాకుండా కేవలం నిరుపేదల సేవ కోసం జాలి, దయ, కరుణతో పని చేయాలి. అలా చేసిన వారే అత్యుత్తమ చికిత్సకులు అవుతారు.

సహచరులారా… మానవత్వం మూర్తీభవించిన నర్సులందరికీ ఈరోజు నేను నమస్కరిస్తున్నాను. మీరు ఏ సేవాభావంతో పని చేస్తున్నారో అది నిరుపమానం. మరో విశేషమేమిటంటే 2020 సంవత్సరాన్ని యావత్ ప్రపంచం నర్సులు, దాయీల అంతర్జాతీయ సంవత్సరంగా జరుపుకుంటోంది. 200 సంవత్సరాల క్రితం 1820 లో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ తో ముడిపడివున్న విషయమిది. సేవాభావంతో నర్సింగ్ వృత్తిని కొత్త శిఖరాలకు చేర్చిన వ్యక్తి ఆమె. ప్రపంచంలో సేవాభావానికి అంకితమైన ప్రతీ నర్సుకూ సమర్పితమైన ఈసంవత్సరం నిజంగా నర్సింగ్ వృత్తికి పెద్ద పరీక్షలాగా ఎదురు నిల్చింది. మీరందరూ ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అవడమే కాకుండా, ఎంతో మంది జీవితాలను కాపాడగలరన్న నమ్మకం నాకుంది.

మీవంటి సహచరులందరీ ధైర్యసహసాల కారణంగానే ఇంతపెద్ద యుద్ధం చేయగలుగుతున్నాం. మీవంటి సహచరులు డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ఇతర వైద్య సహాయక సిబ్బంది కావచ్చు,ఆశా, ఏఎన్ఎం కార్యకర్తలు కావచ్చు, సఫాయీ కర్మచారులు కావచ్చు మీ అందరి ఆరోగ్యం గురించి కూడా దేశం ఆందోళన చెందుతోంది. అందుకే సుమారు 20 లక్షల సహచరుల కోసం 50 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ యుద్ధంలో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో దేశానికి నాయకత్వం వహించగలుగుతారు.

నా ప్రియతమ దేశవాసులారా

కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో మన చుట్టుపక్కల ఉన్నవారు ఎంతోమంది నిజమైన హీరోలుగా అగ్రభాగాన నిలిచి పోరాడుతున్నారు. నరేంద్రమోదీ యాప్ పైన, నమో యాప్ పైన బెంగుళూరుకు చెందిన నిరంజన్ సుధాకర్ హెబ్బాలే గారు ఇటువంటి వారే నిజజీవితంలో హీరోలని పేర్కొన్నారు. ఇది నిజంగా వాస్తవం. వారి కారణంగానే మన రోజూవారీ జీవితం ఎంతో హాయిగా సాగుతూ ఉంటుంది. ఒక్కసారి ఊహించండి. ఒకరోజు మీ ఇంట్లో పంపులో, నీళ్లు ఆగిపోతేనో లేదా మీ ఇంట్లో ఒక్కసారిగా కరంట్ పోతేనో ఆయా సమయాల్లో నిజంగా మన రోజువారి జీవన నాయకులే ఆకష్టాలను దూరం చేస్తారు. ఒకసారి మీరు మీఇంటి ప్రక్కన ఉన్న చిన్న పచారి కొట్టు గురించి ఆలోచించండి. ఈ క్లిష్ట సమయంలో ఆదుకాణందారు కూడా ఎంతో సాహసం చేస్తున్నాడు. ఎందుకోసం? ఎవరికోసం? ఆలోచించండి. మీకూ, మీ అవసరాలకూ తగిన సామాగ్రి అందక మీరు ఇబ్బంది పడతారేమోనని తను సాహసిస్తున్నాడు. సరిగ్గా ఇదే విధంగా మీ నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా చూడడానికి సరఫరా ఆగిపోకుండా చేయడానికీ, అవిశ్రాంతంగా తమపని తాము చేసుకుపోతున్న  డ్రైవర్లు,  శ్రామికుల గురించి కూడా ఆలోచించండి.ప్రభుత్వం బ్యాంకింగ్ సేవలను యధాతధంగా కొనసాగిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ యుద్ధానికి నేతృత్వం వహిస్తూ.. బ్యాంకుల్లో సేవలు చేస్తున్నారు. మీ సేవలో నిమగ్నమయి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవ చిన్నదేమీ కాదు. బ్యాంకుల్లో పని చేసే వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేమీ కాదు. ఈ కామర్స్ రంగంలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న వారు ఆయా కంపెనీల్లో, డెలివరీ పని చూస్తున్నవారూ కూడా ఎంతో శ్రమిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. లాక్ డౌన్ సమయంలో టి.వి. చూడగలుగుతున్నారు, ఇంట్లోనే ఉండి ఏదో ఫోన్ ద్వారా ఇంటర్నెట్ ఉపయోగించుకోగలుగుతున్నారు. వీటన్నింటినీ సక్రమంగా పని చేయించడానికి ఎవరో ఒకరు తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. ఈసమయంలో మీలో చాలా మంది డిజిటల్ పేమెంట్ సులభంగా చేయగలుగుతున్నారు. దీని వెనక కూడా ఎంతో మంది పని చేస్తున్నారు.         లాక్ డౌన్ సమయంలో, దేశంలో అన్ని కార్యకలాపాలను సక్రమంగా నిర్వహిస్తున్నది వాళ్లే. ఈరోజు దేశ ప్రజలందరీ తరఫున వీళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. మిమ్మల్నీ, మీ కుటుంబ సభ్యులను మీరు క్షేమంగా ఉండేలా చూడండి.

నా ప్రియతమ దేశవాసులారా…

కరోనా వైరస్ అనుమానితులపట్ల, ఇంటి దగ్గర క్వారంటైన్ లో ఉన్న వాళ్ల పట్లా కొంతమంది వ్యవహరిస్తున్నతీరు ఏమాత్రం బాగాలేదు. ఇటువంటి సంఘటనలు నా దృష్టికి వచ్చాయి. ఇది ఎంతో దురదృష్టకరమైన విషయం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ సామాజిక దూరం పాటించాలి అంతేకానీ, భావోద్రేకాలతో, మానవత్వానికే దూరంగా ఉండడం సరియైన పద్ధతికాదు. వైరస్ సోకిన వారు లేదా అనుమానితులు నేరస్థులు కాదు. వారు కేవలం వైరస్ బాధితులు మాత్రమే. వీరందరూ ఇతరులకు అది సోకకుండా ఉండేందుకు తమకుతాము దూరంగా ఉండాలి.క్వారంటైన్ లో ఉండాలి. కొన్ని చోట్ల ప్రజలు తమ బాధ్యతలను సీరియస్ గా తీసుకున్నారు. ఎంత తీవ్రంగా అంటే వైరస్ లక్షణాలేవీ లేకపోయినా తమకు తాము క్వారంటైన్ చేసుకున్నారు. ఎందుకంటే వారు విదేశాల నుంచి తిరిగి వచ్చినవాళ్ళు అందుకే రెండింతలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంకొకరికి సోకకుండా ఉండేందుకు ఆజాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇంత బాధ్యతతో వారు వ్యవహరిస్తున్నప్పుడు వారి పట్ల మనం మరో రకంగా వ్యవహరించడం న్యాయం కాదు. వారి పట్ల సానుభూతితో, సహకార భావనతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

కరోనా వైరస్ తో పోరాడడానికి అన్నింటికంటే మంచి పద్ధతి. సామాజిక దూరాన్ని పాటించడం. అయితేసామాజిక దూరం అంటే సామాజిక సంప్రదింపులకు పూర్తిగా స్వస్తి పలకడం కాదు. నిజానికి మన ప్రాచీన సామాజిక సంబంధాలకు కొత్త ఊపిరులూ దాల్చిన సమయమిది. మన పాత సంబంధాలకు కొత్త మెరుగులు అద్దాలి. ఒకవిధంగా చెప్పాలంటే సామాజిక దూరం పెరగాలి. సానుభూతి పూర్వక దూరం తగ్గాలి. నేను మరొకసారి చెబుతున్నాను. సామాజిక దూరాన్ని పెంచాలి. మనోభావాలకు సంబంధించిన దూరాన్ని తగ్గించాలి. రాజస్థాన్ లోని కోటా నుంచి యశ్ వర్ధన్ గారు నరేంద్రమోదీ యాప్ పైన రాసిన విషయమేమిటంటే లాక్ డౌన్ వల్ల కుటుంబ సంబంధాలు మరింత ప్రగాఢమవుతున్నాయి. పిల్లలతో కలిసి బోర్డ్ గేమ్స్, క్రికెట్ ఆడుతున్నారు. వంటిళ్లలో కొత్త కొత్త ఆహార పదార్ధాలు తయారవుతున్నాయి.  జబల్ పూర్ నుంచి నిరుపమా హర్షేయ్ నరేంద్రమోదీ యాప్ పై రాస్తూ మొట్టమొదటి సారిగా తనకు రజాయీ తయారు చేయాలన్న కోరిక నెరవేర్చుకొనే అవకాశం లభించిందని అన్నారు. అంతేకాదు, ఆమె రజాయీ పనితోపాటు మొక్కల పెంపకానికి సంబంధించిన కోరికను కూడా హాయిగా తీర్చుకుంటున్నారు. అదే విధంగా రాయ్ పూర్ కు చెందిన పరీక్షిత్, గురుగావ్ కు చెందిన ఆర్యమన్, ఉత్తరాఖండ్ కు చెందిన సూరజ్ రాసిన పోస్టు కూడా చదివే అవకాశం లభించింది.అతను తన స్కూలుదోస్తులతో    ఈ-రీయూనియన్ జరిపే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అతనికి వచ్చిన ఐడియా చాలా బాగుంది. మీకు కూడా దశాబ్దాల క్రితం స్కూలు, కాలేజీల్లో ఉన్న మిత్రులతో మాట్లాడే అవకాశం ఈ మధ్యకాలంలో లభించి ఉండకపోవచ్చు. మీరు కూడా ఈ ఐడియాను అమలు చేసి చూడవచ్చు.ఇప్పటి వరకు చదవలేకపోయిన పుస్తకాలను ఇప్పుడు చదువుతున్నామని భువనేశ్వర్ కు చెందిన ప్రత్యూష్, కోల్ కతాకు చెందిన వసుధ తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లోనేను చూశాను – కొంతమంది ఏళ్ల తరబడీ వాడక మూలనపడి ఉన్న తబలా, వీణా వంటి సంగీత పరికరాలకు దుమ్ము దులిపి కొంతమంది అభ్యాసం చేయడం ప్రారంభించారు. మీరు కూడా ఇలా చేయవచ్చు. తద్వారా మీరు సంగీతమిచ్చే ఆనందాన్ని పొందడమే కాక.. మీ పాత జ్ఞాపకాలను కూడా తాజా చేసుకోవచ్చు. అంటే ఎంతో అమూల్యమైన సమయం ఇప్పుడు దొరికింది.  ఈ సమయాన్ని, మిమ్మల్ని, మీరు, మీతో జోడించుకోవడమే గాక, మీరు మీ హాబీలతో కూడా జోడించుకోవచ్చు. మీరు మీ పాత స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మమేకం అయ్యే అవకాశం లభించింది. ఈలాక్ డౌన్ సమయంలో మీరు మీ ఫిట్ నెస్ కోసం ఏం చేస్తున్నారని రూర్ కీ నుంచి రాశీ ప్రశ్నించారు. ప్రస్తుత సమయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఏవిధంగా ఉపవాసముంటున్నారని అని కూడా ప్రశ్నించారు. నేను మరొకసారి మీఅందరికీ తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి రావద్దని మాత్రమే కోరాను. అంతా గానీ మీలోపలికి మీరు వెళ్లకూడదని ఆజ్ఞాపించలేదు. ఇదో మంచి అవకాశం బయటకు వెళ్లకండి. మీలోపలికి మీరు వెళ్లండి. మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే నవరాత్రి ఉపవాసాల విషయానికి వస్తే ఇది నా శక్తికీ, నా భక్తికీ సంబంధించిన విషయం. ఫిట్ నెస్ విషయానికి వస్తే విషయం మరీ సుదీర్ఘమైపోతుంది. అందుకే సామాజిక మాధ్యమాల్లో నేను ఏం చేస్తానో. ఏం చేస్తున్నానో, వాటికి సంబంధించిన వీడియోలను అప్ లోడ్ చేస్తాను. నరేంద్రమోదీ యాప్ పై ఈవీడియోను తప్పని సరిగా చూడండి. నేను ఆచరించే విషయాల్లో బహుశా కొన్ని మీకు పనికి రావచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. నేను ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ ని కాదు. అంతేకాదు యోగా అధ్యాపకున్ని కూడా కాదు. నేను కేవలం ఆచరించే వాడిని మాత్రమే. అయితే యోగాకు సంబంధించి కొన్ని ఆసనాల ద్వారా నాకు ప్రయోజనం చేకూరిందన్న విషయం మాత్రం వాస్తవం. లాక్ డౌన్ సమయంలో, మీకు కూడా కొన్ని విషయాలు పనికి రావచ్చు, ఉపయోగపడవచ్చు.

సహచరులారా… కరోనాపై సాగిస్తున్న ఈ యుద్ధం గతంలో ఎన్నడూ జరగనిది అంతేకాదు.. ఎంతో సవాళ్లతో కూడింది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు కూడా అటువంటివే. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ చూడని, వినని చర్యలు ఇవి. కరోనాను నివారించడానికి భారతీయులందరూ… తీసుకుంటున్న ఈచర్యలూ, చేస్తున్న ప్రయత్నాలూ ఇదే కరోనా మహమ్మారిపై భారతదేశానికి విజయాన్ని చేకూరుస్తాయి. ప్రతిఒక్క భారతీయుడి ఓర్పూ, సహనం, సంకల్పం.. ఇవే మనల్ని ఈ కష్టాల నుంచి బయట పడవేయగల్గుతాయి. అదే విధంగా నిరుపేదల పట్ల సానుభూతి, దయ, కరుణాభావాలు మరింతగా పెంపొందాలి. ఎక్కడ నిరుపేద కన్పించినా, ఎక్కడ బాధపడుతున్నవారు కన్పించినా, ఎక్కడ ఆకలితో అలమటించేవారు కన్పించినా ఈ క్లిష్ట సమయంలో మనం ముందుగా వారి గురించి ఆలోచిస్తూ, వారి కడుపు నింపడంలోనే మానవత్వం వెల్లివిరుస్తుంది. ఈపని భారతదేశమే చేయగలదు. మన సంస్కారాలు, మన సంస్కృతి అటువంటివి.

నా ప్రియతమ దేశవాసులారా…

ఈరోజు ప్రతి భారతీయుడు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం నాలుగు గోడలమధ్య బందీ అయ్యాడు. అయితే రాబోయే సకాలంలో దేశం ప్రగతి కోసం ఈ భారతీయుడే అంతెత్తు గోడలను కూడా అధికమించి ముందుకుసాగుతాడు. దేశాన్ని మున్మందుకు తీసుకుపోతాడు. మీరు, మీ కుటుంబంతో కలిసి ఇంటి దగ్గరే ఉండండి. క్షేమంగా, జాగ్రత్తగా ఉండండి. ఈ యుద్ధాన్ని మనం గెలిచి తీరాలి, తప్పని సరిగా గెలుస్తాం. మన్ కీ బాత్ కోసం మళ్లీ వచ్చే నెల కలుద్దాం. ఈలోపల ఈకష్టాలను అధిగమించడంలో మనం సఫలమవుతామన్న నమ్మకంతో ఆశతో, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ఎన్నెన్నో కృతజ్ఞతలు.