1. భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధికారిక పర్యటన కు వెళ్లారు. పారిస్ నగరంలో 2019 ఆగస్టు 22, 23 తేదీల లో ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సు కు రావాల్సిందిగా గణతంత్ర ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రాన్ ఆయన ను అంతకుముందు ఆహ్వానించారు. అదేవిధం గా జి7 దేశాల కూటమి కి నేతృత్వం వహిస్తున్న ఫ్రాన్స్ 2019 ఆగస్టు 25, 26 తేదీల లో బియారిట్జ్ లో నిర్వహించే జి7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాల్సింది గానూ మేక్రాన్ కోరారు.
2. భారతదేశం-ఫ్రాన్స్ 1998లో వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పుకున్నాయి. ఈ సంప్రదాయ బాంధవ్యం శాశ్వతమైనదే గాక విశ్వసనీయత, ఏకమనస్కత తదితరాలన్నిటితోను కూడినది. రెండు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు గా సదా పరస్పర ఆలంబన తో ముందుకు వెళుతున్న భారత్-ఫ్రాన్స్ సంబంధాలు పరస్పర విశ్వాసం తో కూడుకుని ఉన్నాయి. ఈ స్నేహ బంధం అటు ద్వైపాక్షిక స్థాయి లోనే గాక అంతర్జాతీయ సంస్థల స్థాయి లోనూ నిర్మాణాత్మక భాగస్వామ్యం గా దృఢపడింది. మరిన్ని కొత్త రంగాల్లో సహకార విస్తృతి కి వీలు కల్పించడం ద్వారా ఈ భాగస్వామ్యాని కి కొత్త లక్ష్యాన్ని నిర్దేశించాలని ఫ్రాన్స్-భారత్ నిర్ణయించుకున్నాయి.
3. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాల లో సానుకూల ప్రగతి ని ఉభయపక్షాలూ గుర్తించాయి. ఈ నేపథ్యం లో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల ను మరింత ప్రోత్సహించగల అవకాశాల అంచనా, మార్గాన్వేషణ దిశ గా భారత-ఫ్రాన్స్ పాలనాత్మక-ఆర్థిక-వాణిజ్య కమిటి (ఎఇటిసి) సముచిత చట్రాన్ని రూపొందిస్తుందని రెండు దేశాల అధినేతలూ పునరుద్ఘాటించారు. దీంతోపాటు, రెండు దేశాల ఆర్థిక వ్యవహార ఆదాన ప్రదాతల లబ్ధి కి తగిన విపణి లభ్యత సమస్యల పరిష్కారాన్ని కూడా అన్వేషిస్తుందని పేర్కొన్నారు. తదనుగుణం గా భారత్, ఫ్రాన్స్ కంపెనీలు ఎదుర్కొంటున్న వాణిజ్య, పెట్టుబడుల సంబంధిత సమస్యల పరిష్కారం కోసం సాగుతున్న సంయుక్త కృషి ని అదనపు మార్గాలు, యంత్రాంగాల తో మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించారు. వీటన్నిటితోపాటు, భారత్-ఫ్రాన్స్ ల మధ్య ఆర్థిక-ద్రవ్య వ్యవహారాలపై వీలైనంత త్వరగా ఉన్నత స్థాయి చర్చల పునరుద్ధరణ కు సంయుక్తం గా అంగీకరించారు.
4. అధ్యక్షుడు మేక్రాన్ 2018 మార్చి నెల లో భారత్ పర్యటన కు వచ్చిన సందర్భం గా భారత్-ఫ్రాన్స్ సంయుక్తం గా అంగీకరించిన మేరకు అంతరిక్ష సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని ఆకాంక్షించాయి. గ్రహాంతర అన్వేషణ, మానవసహిత అంతరిక్ష యాత్ర తదితరాలన్నీ ఈ సంయుక్త కృషి లో భాగం గా ఉంటాయి. దీని కి అనుగుణం గా 2022 లో భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర కు వెళ్లే వ్యోమగాముల కోసం నియమితులైన వైద్య సహాయ సిబ్బంది కి శిక్షణ ఇవ్వాలన్న నిర్ణయాన్ని భారత్-ఫ్రాన్స్ స్వాగతించాయి. ఫ్రాన్స్ తోపాటు భారత్ లోనూ ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే సముద్రయాన రంగం లో ఉమ్మడి అవగాహన కార్యక్రమం సాకారమయ్యే దిశగా ఒక చట్రం ఏర్పాటుకు సంబంధించిన ‘అమలు ఒప్పందం’ పై సంతకాలు పూర్తయిన సందర్భం గా దేశాధినేతలు హర్షం వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల ను ఎదుర్కొనడంలో భారత్-ఫ్రాన్స్ సహకారాన్ని మరింత విస్తృతం చేయగల ‘అంతరిక్ష వాతావరణ పరిశోధన శాల’ ప్రయోగాన్ని వారు కొనియాడారు. అంతేకాకుండా సంయుక్త అంతరిక్ష కార్యక్రమం ‘తృష్ణ’ సహా ‘ఓషన్’ శాట్-3 ఉపగ్రహంలో ‘అర్గోస్’ వ్యవస్థ కు చోటు కల్పించడాన్ని కూడా స్వాగతించారు. రకరకాల ముప్పులు పెరుగుతున్న నేటి పరిస్థితుల నడుమ అంతరిక్ష ప్రయోగాల భద్రత కు భరోసా ఇవ్వగల నిబంధనలు, ఉత్తమ విధానాల ను అంతర్జాతీయ స్థాయి లో సంయుక్తం గా ప్రోత్సహించాలని వారు నిర్ణయించారు.
5. డిజిటల్ రంగాని కి సంబంధించి అంతర్జాతీయ చట్టాలు వర్తించే సార్వత్రిక, సురక్షిత, శాంతియుత సైబర్ క్షేత్రం ద్వారా ఆర్థిక-సామాజిక ప్రగతి కి మద్దతుగా నిలవాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. తదనుగుణంగా సైబర్ భద్రత, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాల మార్గ ప్రణాళిక కు దేశాధినేతలిద్దరూ అంగీకారం తెలిపారు. ఈ రంగాల్లోనే కాకుండా ప్రత్యేకించి వ్యూహాత్మక కృత్రిమ మేధస్సు, అత్యున్నత కంప్యూటర్ పరిజ్ఞాన రంగాల్లో అంకుర పర్యావరణ వ్యవస్థల ను పరస్పర సన్నిహితం చేయడం ధ్యేయం గా భారత్-ఫ్రాన్స్ ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. ‘క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్సాస్కేల్ సూపర్ కంప్యూటింగ్’ రంగాల్లో సహకారాభివృద్ధి లక్ష్యంగా ‘సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్’, ‘అటో’ల మధ్య ఒప్పందం కుదరడాన్ని కూడా దేశాధినేతలిద్దరూ స్వాగతించారు.
6. భారత్ లోని మహారాష్ట్ర లో గల జైతాపూర్ లో ఆరు అణు ఇంధన రియాక్టర్ల నిర్మాణాని కి 2018లో ఎన్ పీసీఐఎల్ (NPCIL), ఈడీఎఫ్ (EDF)ల మధ్య కుదిరిన ‘పారిశ్రామిక ముందడుగు ఒప్పందం’ మేరకు ఆ రెండు సంస్థల మధ్య సంప్రదింపులు ముందుకు సాగడంపై దేశాధినేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే దీనికి సంబంధించి సాంకేతిక-వాణిజ్య ప్రతిపాదనలు, ప్రాజెక్టు కోసం నిధుల సమీకరణపై సాగుతున్న చర్చల మీద, దాంతోపాటు భారతదేశం లో తయారీ ద్వారా స్థానికీకరణ సాధన మార్గాలు, ఉభయ పక్షాల మధ్య సీఎల్ఎన్ డి చట్టం అమలు లో ఉమ్మడి అవగాహన పెంపుల మీద కూడా సంతృప్తి వెలిబుచ్చారు. వీటి ని త్వరగా పూర్తి చేయడం లో భాగం గా చర్చల ను చురుగ్గా వేగిరపరచాలన్న సంకల్పాన్ని ఉభయ పక్షాలు పునరుద్ఘాటించాయి. అంతర్జాతీయ అణుఇంధన భాగస్వామ్య కేంద్రం (GCNEP)తో సహకారాని కి సంబంధించి భారత అణుఇంధన శాఖ (DAE), ఫ్రాన్స్ ప్రత్యామ్నాయ ఇంధనాలు-అణు ఇంధన కమిషన్ల (CEA) మధ్య 2019 జనవరి లో అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే లఘు జల రియాక్టర్ల (LWR) భద్రత పై 2018 సెప్టెంబరు లో బాబా అణు పరిశోధన కేంద్రం (BARC), సిఇఎ (CEA)ల మధ్య కుదిరిన ‘అమలు ఒప్పందా’లను మరో ఐదేళ్లు పొడిగించడాన్ని కూడా వారు స్వాగతించారు. అంతేకాకుండా ‘అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్‘పెరిమెంటల్ రియాక్టర్లు’ (ITER), యూరోపియన్ కౌన్సిల్ ఫర్ న్యూక్లియక్ రీసెర్చ్ (CERN) ప్రాజెక్టుల కు సంబంధించి సంయుక్త భాగస్వామ్యాన్ని కూడా వారు ప్రశంసించారు.
7. రక్షణ రంగంలో ప్రతిష్టాత్మక భాగస్వామ్యంపై ద్వైపాక్షిక సహకారం గణనీయంగా ముందడుగు వేసింది. ఆ మేరకు 2019లో ‘వరుణ, గరుడ’ పేరిట నావికాదళ, వాయుసేన కసరత్తులను విజయవంతం గా నిర్వహించడాన్ని, భారతదేశం లో ఈ శరత్కాలంలో ‘శక్తి’ పేరిట నిర్వహించబోయే కసరత్తు కు జరుగుతున్న ఏర్పాట్లను దేశాధినేతలిద్దరూ కొనియాడారు. రెండు దేశాల సాయుధ బలగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత-ఫ్రాన్స్ నిశ్చయించాయి. తదనుగుణం గా పరస్పర కార్యాచరణ పెంపు, సంయుక్త సహకారాభివృద్ధి కి కృషి దిశ గా చర్చలు సాగించాలని నిర్ణయించాయి. ప్రతిస్పందనాత్మక రవాణా మద్దతు కల్పన ఒప్పందం పై సంతకాలు పూర్తి కావడాన్ని ఇందుకు ఒక నిదర్శనం గా పేర్కొన్నాయి.
8. భారత-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం లో రక్షణ పారిశ్రామిక సహకారం కూడా ఒక ప్రధానాంశం. దీనికి సంబంధించి సంతకాలు పూర్తయిన ఒప్పందాల అమలు ప్రగతి… ప్రత్యేకించి ఈ ఏడాది నుంచి రఫేల్ యుద్ధ విమానాల తొలివిడత అప్పగింతపై భారత ప్రధానమంత్రి, గణతంత్ర ఫ్రాన్స్ అధ్యక్షుడు సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ పారిశ్రామిక రంగం లో సహకారం బలోపేతం పై తమ కట్టుబాటును వారు పునరుద్ఘాటించారు. అలాగే ఉభయపక్షాల పరస్పర ప్రయోజనాలకు గల ప్రాధాన్యంతోపాటు ‘మేక్ ఇన్ ఇండియా’’ స్ఫూర్తి నేపథ్యం లో రెండు దేశాల రక్షణరంగ పరిశ్రమల మధ్య ప్రస్తుత, భవిష్యత్ భాగస్వామ్యాల కు తమ మద్దతు ప్రకటించారు. ఫ్రాన్స్ రక్షణరంగ, అంతరిక్ష వ్యవస్థల ఉత్పత్తి పరిశ్రమల సరఫరా శృంఖలం లో భారత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (MSME)ల భాగస్వామ్యం పెరుగుతుండటం పై ఉభయపక్షాలు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ ధోరణి కి మరింత ఉత్తేజమిస్తామని పునరుద్ఘాటించాయి. అలాగే భారత్-ఫ్రాన్స్ దేశాల అంతరిక్ష, పారిశ్రామిక సంస్థల సంఘాల (SIDM, GIFAS) మధ్య కొనసాగుతున్న సహకారాన్ని స్వాగతించాయి.
9. రెండు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక-స్నేహ సంబంధాల ఆదాన ప్రదానాన్ని గణనీయం గా పెంచుకోవాలని ఫ్రాన్స్, భారత్ అంగీకారాని కి వచ్చాయి. అలాగే దౌత్యపరమైన అంశాల లో ఆదాన ప్రదానంతోపాటు రాకపోకల కు వీలుగా నిరంతర చర్చలు సాగించాలని నిర్ణయించాయి. రెండు దేశాలకు పరస్పర పర్యాటక ప్రాధాన్యం లభించడాన్ని స్వాగతించాయి. ఆ మేరకు 2017తో పోలిస్తే 2018లో 17 శాతం అధికంగా 7,00,000 మంది భారతీయులు ఫ్రాన్స్ పర్యటన కు వెళ్లారు. అలాగే 2,50,000 మంది కి పైగా ఫ్రాన్స్ దేశీయులు భారతదేశం లో పర్యటించారు.
10. రెండు దేశాలు విద్యారంగ సహకారానికి ప్రముఖ స్థానం ఇస్తున్న నేపథ్యం లో విద్యార్థుల పరస్పర రాకపోకల పరిస్థితి పై ఉభయపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. భారతదేశం లో ఫ్రెంచి భాష బోధన తోపాటు ఆ భాష పై పట్టు సాధించేందుకు తగిన బోధన సంస్థల చట్రం సృష్టి ఇందుకు దోహదపడింది. ఏటా 10,000 మంది విద్యార్థుల పరస్పర ఆదాన ప్రదానం సాగాలన్న 2018నాటి లక్ష్యాన్ని ఈ ఏడాది లోనే అందుకోగలమని ఉభయపక్షాలు భావిస్తున్నాయి. తదనుగుణం గా 2025 నాటికి ఈ సంఖ్య ను 20,000 కు పెంచుకోవాలని నిర్ణయించాయి.
11. ఫ్రాన్స్‘లోని లియాన్‘లో 2019 అక్టోబరులో రెండో విజ్ఞాన సదస్సు నిర్వహణను ఉభయపక్షాలూ స్వాగతించాయి. అంతరిక్షం, పునరుపయోగ ఇంధనం, హరిత రసాయన శాస్త్రం, అత్యాధునిక నగరాలు, వ్యవసాయం, సముద్ర శాస్త్రాలు, కృత్రిమ మేధస్సు వంటి కీలకాంశాలపై విద్యా, శాస్త్రవిజ్ఞానరంగాల్లో కార్పొరేట్ సంస్థలతో భాగస్వామ్య నిర్మాణానికి ఈ సదస్సు దోహదపడుతుంది. అలాగే నైపుణ్యాభివృద్ధిపై సహకార విస్తృతికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందంపైన కూడా భారత్-ఫ్రాన్స్ సంతకాలు చేశాయి.
12. ఉభయ దేశాల ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాల లో పరస్పరం పాల్గొనడం ద్వారా సాంస్కృతిక రంగం లో భారత్-ఫ్రాన్స్ సహకారం దృఢం అయ్యేందుకుగల బలమైన అవకాశాల గురించి దేశాధినేతలిద్దరూ వివరించారు. ప్యారిస్ అంతర్జాతీయ పుస్తక మహోత్సవం-2020 ‘‘లివ్రీ ప్యారిస్’’ లో భారత్‘కు ‘మాననీయ దేశం’ హోదా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందు లో భాగం గా ఢిల్లీ లోని జాతీయ ఆధునిక చిత్రకళా ప్రదర్శన శాల (NGMA) ప్రసిద్ధ ఫ్రాన్స్ చిత్రకారుడు జెరార్డ్ గ్యారూస్త్ తొలి చిత్రకళా ప్రదర్శన ను 2020 జనవరి లో నిర్వహిస్తుంది. అలాగే, ప్రముఖ భారత చిత్రకారుడు సయ్యద్ హైదర్ రజా చిత్రించిన కళా ఖండాల తో ఫ్రాన్స్ ఆధునిక చిత్రకళా కేంద్రం ‘‘మ్యూసీ జాతీయ చిత్రకళా ప్రదర్శనశాల’’ (సెంటర్ జార్జెస్ పాంపిడూ) 2021లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనుంది. అటుపైన 2021-22లో ‘నమస్తే ఫ్రాన్స్’ పేరిట భారత్ ప్రదర్శన ను నిర్వహిస్తుంది. సినిమా, వీడియో గేమ్స్, వర్చ్యువల్ రియాల్టీ రంగాల్లో సంయుక్తం గా రూపొందించిన ప్రాజెక్టులు, భాగస్వామ్య వితరణ, శిక్షణ ల పెంపునకు సంబంధించి 2019 చివరి నాటికి రెండు దేశాలు ఒక కార్యాచరణ ప్రణాళికను అనుసరించనున్నాయి. అంతేకాకుండా, రెండు దేశాల్లోనూ సినిమాల చిత్రీకరణ కు సహకరించాలని ఉభయపక్షాలు అంగీకారానికి వచ్చాయి.
13. వాతావరణ మార్పుల తోపాటు జీవవైవిధ్య నష్టాల సవాళ్లను ఎదుర్కొనడం లో భూగోళం కోసం భాగస్వామ్య చట్రం కింద తమ సంయుక్త కట్టుబాటును ఫ్రాన్స్, భారత్ పునరుద్ఘాటించాయి.
14. వాతావరణ మార్పుల ను ఎదుర్కొనడం లో ప్రపంచం చేస్తున్న కృషి ని ప్రోత్సహించాలని భారత్, ఫ్రాన్స్ అన్ని భాగస్వామ్య దేశాలకు విజ్ఞప్తి చేశాయి. ఆ మేరకు స్థానిక, జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయం గా బహుళస్థాయి కార్యాచరణ అవసరాన్ని నొక్కి చెప్పాయి. తదనుగుణం గా 2019 సెప్టెంబరు 23న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి నిర్వహించబోయే ‘వాతావరణ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సు’ను జయప్రదం చేయడం లో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చాయి. వాతావరణ మార్పులపై ‘ఐక్యరాజ్య సమితి సదస్సు తీర్మాన చట్రం’(UNFCCC)తోపాటు ‘పారిస్ ఒప్పందం’, ‘సార్వత్రిక-విభిన్న బాధ్యతలు, సామర్థ్యాలు’ (CBDR-RC) సహా సమానత్వ సూత్రం ప్రాతిపదికగా జాతీయం గా నిర్దేశించుకున్న పాత్ర పోషణ, దాని ప్రస్తుత అమలుపై సమీక్ష, ఆ స్థాయి కి మించి బాధ్యతల నిర్వహణ, ఆధునికీకరణల కు తమ కట్టుబాటు ను ఉభయదేశాలు పునరుద్ఘాటించాయి.
15. వాతావరణ మార్పులపై ‘ఐక్యరాజ్య సమితి సదస్సు తీర్మాన చట్రం’(UNFCCC) తోపాటు ‘ప్యారిస్ ఒప్పందం’ కింద అంగీకరించిన కర్తవ్యాల ను నెరవేర్చడానికి గల ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ ఆ దిశ గా తమ కట్టుబాటును భారత్, ఫ్రాన్స్ పునరుద్ఘాటించాయి. అంతేకాకుండా, ‘హరిత వాతావరణ నిధి’కి తొలి భర్తీ చక్రాన్ని పూర్తి చేయడం లో భాగం గా సంపన్న దేశాలు తమ హామీలకు అనుగుణం గా విరాళాలను పెంచాలని భారత్ విజ్ఞప్తి చేసింది. భూ తాపం ఏటా 1.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతున్న నేపథ్యం లో అంతర్జాతీయం గా భూమి, వాతావరణ మార్పులపై ప్రభావం తోపాటు వాతావరణ మార్పుల పై పారిశ్రామిక పూర్వ స్థాయులను ప్రస్తావిస్తూ అంతర ప్రభుత్వ సంఘం కూడా ప్రత్యేక నివేదిక ఇచ్చింది. మరోవైపు పారిస్ ఒప్పందం కొన్ని కర్తవ్యాల ను నిర్దేశించింది. భారత్-ఫ్రాన్స్ ఈ రెండింటినీ పరిగణన లోకి తీసుకున్నాయి. వీటన్నిటి కీ అనుగుణంగా యూరోపియన్ యూనియన్ నేతృత్వం లో హరిత వాయు ఉద్గారాల (జిహెచ్ జి)ను కనీస స్థాయి కి తేవడంపై భారత్, ఫ్రాన్స్ 2020నాటికి దీర్ఘకాలిక వ్యూహాల ను అభివృద్ధి చేస్తాయి. అదే సమయం లో ‘సార్వత్రిక-విభిన్న బాధ్యతలు, సామర్థ్యాల’(సిబిడిఆర్-ఆర్ సి) ను కూడా పరిగణన లోకి తీసుకుంటామని ప్రకటించాయి. జాతీయ స్థాయుల లో చోటు చేసుకుంటున్న విభిన్న పరిస్థితుల నడుమ ప్యారిస్ ఒప్పందం లో అంగీకరించిన మేరకు వీలైనంత అధికస్థాయిలో కర్తవ్య నిర్వహణ నిబద్ధతను స్పష్టం చేశాయి.
16. బియారిట్జ్‌లో జి-7 దేశాల శిఖరాగ్ర సదస్సు ఫ్రేమ్ వర్క్, 2019 సెప్టెంబర్ 23 ఐక్య రాజ్యస మితి సెక్రటరీ జనరల్ వాతావరణ మార్పు శిఖరాగ్ర సమ్మేళనాని కి అనుగుణం గా ఫ్రాన్స్, ఇండియాలు వాతావరణ మార్పుల వల్ల తక్కువ అభివృద్ధి ని తట్టుకునే విధం గా చేపట్టే కొత్త చర్యల కు మద్దతు పలకనున్నాయి. ప్రత్యేకించి పారిస్ ఒప్పంద లక్ష్యాల కు అనుగుణం గా ఆర్థిక వనరుల ను అనుసంధానం చేయడం ద్వారా అలాగే ఎక్కువ కార్బన్ ఉద్గారాల ను విడుదల చేసే పరిశ్రమల ను తక్కువ ఉద్గారాల విడుదల దిశ గా పరివర్తన చెందించేందుకు మద్దతు పలుకుతాయి.
హైడ్రో ఫ్లూరో కార్బన్ల ను తగ్గించాలంటున్న మాంట్రియల్ ప్రొటోకాల్‌కు చేసిన కిగాలి సవరణ అమలు , రాటిఫికేషన్ను ప్రోత్సహించే దిశ గా కలిసి పనిచేసేందుకు ఉభయ దేశాలూ కట్టుబడి ఉన్నాయి. అలాగే రిఫ్రిజిరేషన్ రంగం లో ఇంధన సామర్ధ్య ప్రమాణాల ను మెరుగు పరిచేందుకు, సమర్థ కూలింగ్ కు సత్వర చర్యల కు సంబంధించి చేపట్టనున్న బియారిట్జ్ ప్రతిజ్ఞ కు మద్దతు పలకడానికి ఉభయ దేశాలూ కట్టుబడి ఉన్నాయి.
అసమర్థ శిలాజ ఇంధన సబ్సిడీల ను దశల వారీగా తొలగించడం, మధ్యంతర హేతుబద్దీకరణ కు సంబంధించి జి-20 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భం గా ప్రకటించిన చిత్త శుద్ధిని ఫ్రాన్స్ ఇండియాలు పునరుద్ఘాటిస్తున్నాయి. అలాగే అత్యంత బలహీన వర్గాలకు లక్షిత మద్దతు కల్పించడంతోపాటు , ఉభయదేశాలూ ఇందుకు సంబంధించిన సమీక్షలో పాలుపంచుకుంటాయి.
17. అభివృద్ధి ని , పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని వేగవంతం చేయడానికి ఉభయదేశాలు తమ ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. సౌర విద్యుత్ కు సంబంధించి సభ్య దేశాల లో సౌర విద్యుత్ పెంపున కు సామర్థ్యాల పెంపు, ఉత్తమ విధానాల కు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం వంటి వాటి విషయం లో అంతర్జాతీయ సౌర కూటమి సాదించి ప్రగతిపై ఉభయదేశాలూ సంతృప్తిని వ్యక్తం చేశాయి.
సోలార్ ఎనర్జీ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా (ఎస్ఇసిఐ) ద్వారా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం అమలును ఇరు దేశాలు అభినందించాయి. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించేందుకు సోలర్ రిస్క్ మిటిగేశన్ ఇనిశియేటివ్ (ఎస్ఆర్ఎంఐ) ప్రాజెక్టుల లో ప్రపంచ బ్యాంకు, ఫ్రెంచ్ డివెలప్‌మెంట్ ఏజెన్సీ సాదించిన ప్రగతి ని ఇరు దేశాలు స్వాగతించాయి.
హైడ్రో కార్బన్ ఇంధన రంగం లో ఎన్ఐఎస్ఇ, సిఇఎ ల మధ్య ఒప్పందం పై సంతకాలు జరగడాన్ని స్వాగతిస్తూ, పునరుత్పాదక ఇంధన వనరుల రంగం లో వారు తమ సాంకేతిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఉభయపక్షాలూ అంగీకరించాయి.
ఈ నిర్ణయాని కి అనుగుణంగా, ఆఫ్రికా సుస్థిరాభివృద్ధి కి తమ వంతు సహకారం అందిస్తున్న ఇండియా, ఫ్రాన్స్‌లు ఆఫ్రికా ఖండం లో సంయుక్త ప్రాజెక్టుల అమలు లో సహకరించాలని ఆకాంక్షిస్తున్నాయి. త్రైపాక్షిక ప్రాజెక్టుల కు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి ఆఫ్రికా దేశాల లో సౌర విద్యుత్ తో నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి అలాగే వృత్తి విద్యా శిక్షణ ద్వారా చాద్‌లో సోలార్ ఫోటోవోల్టాయిక్ రంగం లో నైపుణ్యాల అభివృద్ధి నిలదొక్కుకునేలా చేయడానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి.
18. జీవ వైవిద్య క్షీణత జరుగుతున్న దశ లో, జీవ వైవిధ్య చార్టర్ కు అనుగుణం గా ఇండియా , ఫ్రాన్సులు చురుకుగా కలిసి పని చేయనున్నాయి. ఈ చార్టర్ ను బియారిట్జ్ జి-7 శిఖరాగ్ర సమ్మేళనం లో ధృవీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ఉభయ దేశాలు, 2020లో జరగనున్న ప్రముఖ అంతర్జాతీయ సమావేశాలను దృష్టి లో ఉంచుకుని అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ, స్థానిక అవసరాలకు మరింత ప్రాధాన్యత ఇచ్చే దిశగా చురుకు గా చర్యలు చేపట్టనున్నాయి. ముఖ్యం గా ఐయుసిఎన్ ప్రపంచ కన్సర్వేశన్ కాంగ్రెస్ సమావేశం మార్సియిల్లీ లో , జీవ వైవిధ్యం పై కాప్ -15 సదస్సు జరగనున్నాయి.
సదస్సు మూడు ముఖ్యమై లక్ష్యాల సాధనకు వీలు కల్పించే భవిష్యత్ అంతర్జాతీయ జీవవైవిధ్య వ్యూహం అమలు విజయవంతంగా అమలు చేయడమనేది నిధుల సమీకరణపై ఆధారపడి ఉంటుంది. ఇవి వర్థమానదేశాలలో జీవవైవిధ్యానికి కేటాయించిన అంతర్జాతీయ నిధుల ప్రవాహం పెరగాలంటూ 2012 హైదరాబాద్ సమావేశం నిర్ణయించిన లక్ష్యానికి , సవాళ్లకు అనుగుణంగా నిధులు ఉండాలని వారు ఆకాంక్షించడం జరిగింది.
19. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడడానికి, అభివృద్ధికి సముద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని ఇండియా, ఫ్రాన్స్ అంగీకరించాయి. పర్యావరణానికి, భద్రతకు మధ్యగల సంబంధాన్ని గుర్తిస్తూ, ఈ అంశాలను పరిష్కరించడానికి సముద్రయాన సహకార పరిధిని మరింత విస్తృతపరచాలని ఉభయదేశాలూ నిర్ణయించాయి.
ఇక, సముద్ర వనరులను నిరంతరాయంగా వినియోగించుకోవడానికి ఉభయ పక్షాలూ సముద్రపాలన దిశగా కలిసి పనిచేయనున్నాయి. అలాగే సంబంధిత అంతర్జాతీయ సంస్థలలో సమన్వయంతో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.
నీలి ఆర్థిక వ్యవస్థ, కోస్తా ప్రాంత సమృద్ధి అనేవి ఇండియా, ఫ్రాన్స్‌లకు ఉమ్మడి ప్రాధాన్యతా అంశాలుగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఉభయ దేశాలు సముద్ర శాస్ర్త విజ్ఞాన పరిశోధనలో గల అవకాశాలను అందిపుచ్చుకోవాలని, హిందూ మహా సముద్రం తోపాటు సముద్రాలపై మరింత అవగాహన పెంచుకునేందుకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి.
20. పారిస్‌లో 1994 జూన్‌లో సంతకాలు జరిగిన శిఖరాగ్ర సదస్సు 25 వ వార్షికోత్సవం , ఎడారీకరణను ఎదుర్కొనేందుకు యునైటెడ్ నేశన్స్ కన్వెన్షన్ భాగస్వామ్య పక్షాల 14 వ సదస్సు 2019 సెప్టెంబర్ 2 నుంచి 13 వరకు న్యూఢిల్లీలో జరగనున్న నేపథ్యంలో , ఫ్రాన్స్, ఇండియా లు ధరిత్రి వినియోగం లో సుస్థిర పరివర్తన తక్షణావశ్యకత ను గుర్తు చేసుకున్నాయి.
పేదరికంపై పోరాటం, అసమానతలు, ఆహార అభద్రతల పై ఒకవైపు పోరాటం చేస్తూ, మరోవైపు వాతావరణ మార్పుల ను నిరోధించడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించి దానిని పునరుద్ధరించడానికి భూ పునరుద్ధరణకు దోహదపడాలని ఉభయదేశాలు ఆకాంక్షించాయి.
ఇందుకు సంబంధించిన చర్యలు భూక్షీణత, పునరుద్ధరణపై ఐపిబిఇఎస్ ప్రత్యేక నివేదిక , జీవవైవిద్యంపై అంతర్జాతీయ ప్రత్యేక పరిశీలన, జీవవైవిధ్యం,ధరిత్రికి సంబంధించి 2019 ఆగస్టులో జెనీవాలో ఆమోదించిన ఐపిసిసి ప్రత్యేక నివేదిక కు అనుగుణంగా ఉండనున్నాయి.
21. ఈ స్ఫూర్తితో ఇండియా, ఫ్రాన్స్‌లు గుర్తింపు పొందిన సర్టిఫికేశన్ ద్వారా పర్యావరణ దృష్టి కోణంలోంచి ఎడారీకరణను ఎదుర్కోవడానికి సుస్థిరాభివృద్ధి నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయడానికి, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు జి-7 పర్యావరణ మంత్రులు మెట్జ్‌లో తీసుకున్న చొరవను మరింత ముందుకు తీసుకుపోవడానికి ఉభయదేశాలు నిర్ణయించాయి.
22. ఇండియా, ఫ్రాన్స్ లలో ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు, సీమాంతర ఉగ్రవాదం తో సహా అన్ని రూపాల లోని ఉగ్రవాద కార్యకలాపాలను ఉభయ దేశాల నాయకులు ఖండిస్తున్నట్టు పునరుద్ఘాటించారు. ఏ రూపంలోనూ , ఏ రకంగానూ ఉగ్రవాదాన్ని సమర్ధించరాదని, ఉగ్రవాదాన్ని మతం , జాతి, జాతీయత, వర్గం తో కలపరాదని కూడా వారు పునరుద్ఘాటించారు.
23. ఉభయ దేశాలు 2016 జనవరి లో ఉగ్రవాదాని కి వ్యతిరేకం గా చేసిన సంయుక్త ప్రకటన ను గుర్తు చేసుకుంటూ, ఏ రూపం లో ఉగ్రవాదం ఉన్నా దానిని రూపుమాపేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు ఇరువురు నాయకులు ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందకుండా నిరోధించేందుకు జరిగే ప్రయత్నాలకు అంతర్జాతీయ సమాజం గట్టి మద్దతు నివ్వాలని వీరు పిలుపునిచ్చారు. ఉగ్రవాద నిధుల సమస్యపై పోరాటానికి సంబంధించి గత ఏడాది మార్చి 28న యుఎన్ఎస్సి చేసిన 2462 తీర్మానాన్ని అమలు చేయాల్సిందిగా ఐక్య రాజ్య సమితి అన్ని సభ్య దేశాల ను వారు కోరారు. అలాగే ఉగ్రవాద నిధుల పై పోరాటానికి సంబంధించి నవంబర్ 7-8 తేదీల లో జరిగిన కొత్త – నో మనీ ఫర్ టెర్రర్ అంతర్జాతీయ సదస్సు ను ఉభయదేశాలు స్వాగతించాయి. ఇది 2018 ఏప్రిల్ లో ఫ్రెంచ్ ప్రభుత్వం పారిస్ లో జరిగిన సదస్సు ఆధారం గా, అలాగే పారిస్ అజెండా ఆధారంగా రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తం గా పొంచిఉన్న ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు ఇండియా ప్రతిపాదించిన విధంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు ఇరువురు నాయకులు అంగీకరించారు.
24. ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలను, వారి కి గల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడంతోపాటు ఉగ్రవాద నెట్ వర్క్ ను విచ్ఛిన్నం చేసి వారికి నిధులు అందే మార్గాలను రూపుమాపడం వంటి చర్యలను అన్ని దేశాలూ చేపట్టాల్సిందిగా కూడా ఉభయ నాయకులూ పిలుపునిచ్చారు. అల్‌ఖాయిదా, డాయిష్, ఐఎస్ఎస్, జైష్ ఎ మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తయ్యబా,వాటి అనుబంధ సంస్థలు, దక్షిణాసియా, సహేల్ ప్రాంతంలో శాంతి, భద్రతకు విఘాతం కలిగించే ఉగ్రవాద శక్తులు సరిహద్దులు దాటి తమ కార్యకలాపాలను నిర్వహించకుండా నిరోధించడం అవసరమని వారు అన్ని దేశాలకూ పిలుపునిచ్చారు.
25. ఇరు దేశాలకు చెందిన నోడల్ ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థల మధ్య గల అద్భుత సహకారాన్ని పరిశీలించడంతోపాటు, ఉభయ దేశాల మధ్య కార్యాచరణకు సంబంధించిన సహకారాన్ని మరింత పెంపొందించేందుకు రాడికలైజేశన్ను ప్రత్యేకించి ఆన్లైన్ రాడికలైజేశన్ను అడ్డుకునేందుకు, దానిపై పోరాటం చేసేందుకు కృషి చేయాలని తాజా గా నిర్ణయించారు.
26. ఆన్లైన్లో హింసాత్మక తీవ్రవాద సమాచారం, ఉగ్రవాద ప్రేరిత సమాచారాన్ని తొలగించాల్సిందిగా క్రీస్ట్ చర్చ్కాల్ టు యాక్షన్, గత ఏడాది మే 15న పారిస్ లో ఇచ్చిన పిలుపును అమలు చేసేందుకు ఉభయ నాయకులూ తమ మద్దతును పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి, జిసిటిఎఫ్, ఎఫ్ఎటిఎఫ్, జి-20 తదితర బహుళపక్ష సంస్థల వేదికలపై ఉగ్రవాద వ్యతిరేక చర్యలను బలోపేతం చేసేందుకు ఉబయనాయకులూ. యుఎన్ఎస్సి తీర్మానం 1267ను, ఉగ్రవాద సంస్థలను గుర్తిస్తూ ఇప్పటికే చేసిన తీర్మానాలను అమలు చేయాల్సింది గా ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలన్నింటినీ వారు కోరారు. ఐక్య రాజ్య సమితి లో సమగ్ర తీర్మానాన్ని తీసుకు వచ్చేందుకు కలిసికట్టుగా కృషి చేసేందుకు ఇరువురు నాయకులు అంగీకరించారు.
27. ఉభయ దేశాలు నావిగేశన్ స్వేచ్ఛ కు ప్రకటించిన తమ చిత్తశుద్ధి కి అనుగుణం గా, ప్రత్యేకించి ఇండో పసిఫిక్ జోన్లో సముద్రరవాణా భద్రతలో ఇండియా, ఫ్రాన్స్‌ల మధ్య సహకారం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం లో అద్భుతమైనదిగా చెప్పుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా 2018 మార్చి ప్రాంతంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇండియాలో అధికారికం గా పర్యటించిన సందర్భం లో హిందూ మహాసముద్ర ప్రాంతం లో ఇండియా- ఫ్రాన్స్‌ల సంయుక్త వ్యూహాత్మక దార్శనిక పత్రం తీర్మానాల ను సత్వరం అమలు చేయడాన్ని ఉభయదేశాలు స్వాగతించాయి.
28. ఇక వైట్ శిప్పింగ్ ఒప్పందం అమలుకు సంబంధించి . ఫ్రెంచ్ లైజాన్ అధికారిని గురుగ్రామ్ లోని ఇన్ఫర్మేశన్ ఫ్యుజన్ సెంటర్, ఇండియన్ ఓషన్ రీజియన్ (ఐఎఫ్సి- ఐఒఆర్) లోని యమించడాన్ని ఉభయ దేశాలు స్వాగతించాయి.
29. ఇండియా , ఫ్రాన్స్‌లు హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ (ఐ.ఒ.ఆర్.ఎ) లో తమ కార్యకలాపాలను సమన్వయం చేసుకోవాలని భావిస్తున్నాయి. అలాగే, ఆసక్తి కగల దేశాలతో కలసి పైరసీని ఎదుర్కోవడానికి, దక్షిణ హిందూ మహాసముద్రంలో అన్ని రకాల సముద్రమార్గ అక్రమ రవాణాను అరికట్టడానికి సంయుక్త ప్రాజెక్టును చేపట్టాలని ఉభయదేశాలూ భావిస్తున్నాయి.
హిందూ మహాసముద్ర నావల్ సింపోజిం (ఐఒఎన్ఎస్)లో ఇండియాతో కలిసి పనిచేయాలని ఫ్రాన్స్ భావిస్తున్నది. 2020 నుంచి 2022 వరకు ఫ్రాన్స్ దీనికి అధ్యక్షత వహించనుంది.
30. ఫ్రాన్స్, ఇండియాలు ప్రజాస్వామ్య సమాజాలు. ఇవి బహుళపక్ష అభిప్రాయాలను గౌరవించేందుకు కట్టుబడినవి. 21 వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోవడానికి సంస్కరింపబడిన, మరింత సమర్ధమైన అంతర్జాతీయ వ్యవస్థ ఇంతకుమున్నెన్నటి కంటే అవశ్యకమని ఇవి భావిస్తాయి. అందువల్ల ఫ్రాన్స్, ఇండియాతో జి-7 శిఖరాగ్ర సమ్మేళనంలో కలసి నడవాలని, డిజిటల్ పరివర్తన, వాతావరణ ఎమర్జెన్సీ, జీవవైవిధ్య క్షీణత వంటి సవాళ్లకు మరింత మెరుగ్గా స్పందించేందుకు ఇది అవసరమని భావించింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి లో సంస్కరణలు తీసుకు రావాలని ఫ్రాన్సు, ఇండియా పిలుపునిస్తున్నాయి. ఇది ఇండియాకు శాస్వత సభ్యత్వం పొందేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధునీకరణ దిశగా ఇతర దేశాలతో కలిసి వేగంగా, నిర్మాణాత్మకంగా పనిచేయాలని ఇరు దేశాలూ పునరుద్ఘాటించాయి. అలాగే 2020 జూన్‌లో జరగనున్న 12 వ మినిస్టీరియల్ కాన్ఫరెన్సు కు ముందస్తు కార్యకలాపాల లో కలసినడవాలన నిర్ణయించారు. ఎంతో కాలంగా ప్రగతి, అభివృద్ధికి చెప్పుకోదగిన చోదకశక్తిగా ఉన్న ప్రపంచ వాణిజ్య సంస్థ కార్యకలాపాలను , నిబంధనలను అప్డేట్ చేసే అంశం, సంస్థ కార్యకలాపాలను మరింత మెరుగుపరచడానికి వీరు అంగీకరించారు. అలాగే ప్రత్యేకించి వివాదాల పరిష్కార వ్యవస్థపై దృష్టి పెట్టాలి. ఇది నిష్పాక్షికమైనదిగా, పారదర్శరకత తో , నిబంధనల ఆధారంగా నడిచే బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థ గా ఉండాలని ఉభయపక్షాలూ అంగీకరించాయి. నాణ్యమైన మౌలిక సదుపాయాలకు సంబంధంచి జి-20 సూత్రాలను అమలు చేసేందుకు వారు మద్దతు పలికారు. అలాగే , వారు పారిస్ క్లబ్ కింద పరస్పరం సహకరించుకుంటారు. ఇది ప్రధానంగా అధికారిక ద్వైపాక్షిక రుణాలను పునర్ వ్యవస్థీకరించడాని కి ప్రధాన అంతర్జాతీయ వేదికగా ఉంటుంది.
31. యూరోపియన్ యూనియన్ ఈ ద్వైపాక్షిక సంబంధాల కు అదనపు విలువను కల్పించగలవన్నది గ్రహించిన ఫ్రాన్స్, ఇండియా లు , యూరోపియన్ యూనియన్- ఇండియాల మధ్య గల వ్యూహాత్మక, బహుళపక్ష అంశాలు, అలాగే వాణిజ్యం, పెట్టుబడులు, నవకల్పనల విషయంలో సంబంధాల ను మరింత ముందుకు తీసుకుపోయేందుకు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి.
32. ఫ్రాన్స్, ఇండియా లు తమకు ముప్పు గా పరిణమించిన ప్రాంతీయ సంక్షోభం తోపాటు అంతర్జాతీయ శాంతి, భద్రత విషయంలో పరస్పరం సహకరించుకోనున్నాయి. అఫ్ఘానిస్థాన్‌లో అన్ని వర్గాల ప్రజలతో కూడిన శాంతి, పునర్నిర్మాణ ప్రక్రియ ఆఫ్ఘన్ల నాయకత్వంలో, ఆఫ్ఘన్ యాజమాన్యం లో , ఆప్ఘన్ నియంత్రణ లో చిరకాలం ఉండగల రాజకీయ పరిష్కారాని కి వీరు మద్దతు నిస్తున్నారు. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియ, మానవ హక్కులు, ప్రత్యేకించి మహిళల హక్కులు, స్వేచ్ఛ కు సంబంధించి గత 18 సంవత్సరాల లో పొందిన హక్కుల ను కాపాడే విధంగా ఉండాలి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి, భద్రత, సుస్థిర, సుస్థిరత ఏర్పడాలంటే సకాలంలో దేశాధ్యక్షుడి ఎన్నిక జరగాలి, అలాగే ఉగ్రవాద హింసను తొలగించాలి, ఉగ్రవాదుల కు సురక్షిత స్థావరాలు గా ఉన్న వాటని తొలగించాలి.
33. ఇరాన్ అణు కార్యక్రమం పైన, సంయుక్త సమగ్ర ప్రణాళికా కార్యాచరణ (జెసిపిఒఎ) ని పూర్తిగా అమలు చేయాలన్న విషయాన్ని ఇండియా, ఫ్రాన్స్ లు అంగీకరించాయి. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి , సుస్థిరతలు కాపాడడానికి ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2231 అవసరం. ప్రస్తుత అంశాలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవలసి ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల ను సద్దుమణిగేలా చేసే దిశలో ప్రయత్నం జరగాలి.
34. ప్రస్తుత స్థాయి లో చర్చల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉభయ పక్షాలూ , ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై తమ విధానాలను సమ్మిళితం చేస్తూ తమ మధ్య భాగస్వామ్యాన్ని ముందు ముందు మరింత బలోపేతం చేయనున్నట్టు ప్రకటించాయి.
***