Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి-పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్‌ల సంభాషణ

ప్రధానమంత్రి-పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్‌ల సంభాషణ


ప్రధానమంత్రి: మీరు ఇప్పటివరకూ ఎన్ని పాడ్‌కాస్ట్ పోస్టులు చేశారు?

నిఖిల్‌ కామత్‌: 25 సర్‌…

ప్రధానమంత్రి: 25 చేశారా…

నిఖిల్‌ కామత్‌: అవును సర్‌… అయితే, మేము నెలకొకసారి మాత్రమే చేస్తుంటాం!

ప్రధానమంత్రి: అలాగా…

నిఖిల్‌ కామత్‌: ప్రతి నెలలో ఒక రోజు పాడ్‌ కాస్ట్‌ చేస్తాను. మిగిలిన రోజుల్లో ఏమీ ఉండదు.

ప్రధానమంత్రి: చూడండి… ఎవరు, ఎవరితో పాడ్‌కాస్ట్‌ చేస్తారో వారికి ఒక నెల సమయం ఇవ్వండి. దాంతోపాటు వారికి సౌకర్యంగా ఉండేలా చూసుకోండి.

నిఖిల్‌ కామత్‌: నిజమే సర్… మేము చేసిన లోతైన పాడ్‌కాస్ట్‌లలో అత్యధికం ఎంటర్ ప్రెన్యూర్షిప్ కు సంబంధించినవే. మా శ్రోతలు పూర్తిగా ఆ వర్గం వారే… వారిలో 15 నుంచి 40 మంది తొలిసారి ఔత్సాహిక పారిశ్రామికవేత్త కావాలని భావిస్తున్నావారు. అందువల్ల మేము కృత్రిమ మేధ (ఎఐ)పై ఒక ఎపిసోడ్, ‘మెటా’పై ఒక ఎపిసోడ్, ఔషధ రంగ సంబంధిత నిర్దిష్ట చర్చనీయాంశాలు తదితరాలపై చేస్తుంటాం. తాజాగా ‘పీపుల్’ పేరిట మరో అంశంపై చేయడం మొదలుపెట్టాం. ఇందులో బిల్ గేట్స్ వంటి కొందరు అంతర్జాతీయ ప్రముఖులతో మాట్లాడాం. అయితే, వారంతా కచ్చితంగా పారిశ్రామిక రంగంతో ముడిపడిన వారే.

ప్రధానమంత్రి: ముందుగా… పాడ్‌కాస్ట్‌లో మాటామంతీ నాకిదే తొలిసారి. అందుకే నా వరకూ ఇది పూర్తిగా ఓ కొత్త లోకం.

నిఖిల్‌ కామత్‌: అలాగా సర్… క్షమించండి, నాకు హిందీ అంత బాగా రాదు. నేను దక్షిణ భారత ప్రాంతీయుడిని. పైగా ఎక్కువ కాలం బెంగళూరులో పెరిగాను. మా అమ్మగారి స్వస్థలం మైసూరు నగరం కావడం వల్ల అక్కడ కన్నడ భాష మాట్లాడేవారే అధికం. అంతేగాక మా తండ్రిగారి స్వస్థలం కూడా మంగళూరు సమీప ప్రాంతం. నేను పాఠశాల స్థాయిలో హిందీ చదువుకున్నప్పటికీ అనర్గళంగా మాట్లాడలేను. అందుకే నాతో మాట్లాడినపుడు చాలామంది నా హిందీ పదప్రయోగం ఒక క్రమంలో లేదంటుంటారు. అయితే, పరస్పరం చూసుకుంటూ మాట్లాడతారు కాబట్టి భావాన్ని అర్థం చేసుకోగలరు! కనుక అంతా బాగేనని భావిస్తాను.

ప్రధానమంత్రి: చూడండి… నా మాతృభాష కూడా హిందీ కాదు… ఆ విధంగా చూస్తే మనమిద్దరం ఒకటే!

నిఖిల్‌ కామత్‌: మన ఇద్దరి మధ్య ఈ పాడ్‌కాస్ట్ సంప్రదాయపరమైన ఇంటర్వ్యూ కాదు. నేను పాత్రికేయుడిని కూడా కాదు. మేము ఎక్కువగా తొలిసారి పారిశ్రామికవేత్తలు కాదలచుకున్న వారితోనే మాట్లాడుతుంటాం. కాబట్టి, ఈ రంగంలో ప్రవేశించేందుకు అవసరమైనవి ఏమిటి.. వారికి తొలిసారి నిధులు ఎక్కడ లభిస్తాయి.. ఆనుపానులు తెలుసుకోవాలంటే ఆన్‌లైన్ సరంజామా ఎక్కడ దొరుకుతుంది.. ఇత్యాది సమాచారాన్ని మేము వారికిస్తాం. మేము సహజంగా ఆ రంగం నుంచి వచ్చిన నేపథ్యంలో ఈ రోజు రాజకీయాలు- ఎంటర్ ప్రెన్యూర్షిప్ మధ్య సహ సంబంధాన్ని చిత్రించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ రెండు రంగాల మధ్య అనేక సారూప్యాలు ఉన్నాయన్నది నా భావన. కానీ, వాటి గురించి ఇప్పటిదాకా మాట్లాడిన వారెవరూ లేరు. కాబట్టి మనం ఆ దిశలో ముందుకెళ్దాం. ఒకవేళ మీరు ఈ పాడ్‌కాస్ట్‌లో కొన్ని ప్రశ్నలు వేయదలిస్తే నా దగ్గర అంత మంచి జవాబులు లేవనే చెప్పాలి… అయినా మీరు అడగవచ్చు. ప్రస్తుత పాడ్‌కాస్ట్‌లో నేను మొదట ప్రస్తావించదలచింది మీ జీవితంలోని తొలినాళ్ల గురించి. అంటే- ప్రధాని, ముఖ్యమంత్రి కావడానికి ముందు సంగతులన్న మాట! మీరెక్కడ జన్మించారు.. తొలి పదేళ్ల వయసుదాకా ఏం చేశారు.. ఇలా మీరిప్పుడు మీ జీవితంలోని తొలి దశపై కొంత దృష్టి సారించాలి.

ప్రధానమంత్రి: అలాగే… నేను గుజరాత్‌లో జన్మించానని అందరికీ తెలిసిందే. మా స్వస్థలం ఉత్తర గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోగల చిన్న పట్టణం వడ్‌నగర్‌. నా చిన్నతనంలో మా ఊరి జనాభా కేవలం 15000 మాత్రమే. నేను ఈ ప్రాంతం వాడినే కాబట్టి, ఈ విషయం చూచాయగా గుర్తుంది. అయితే, ప్రతి ఒక్కరికీ సొంత ఊరనేది తప్పకుండా ఉంటుంది. ఆ విధంగా మాదీ అలాంటి గ్రామమే. ఇది గైక్వాడ్ రాజ్యంలో భాగం.. విద్యారంగంపై నిబద్ధతకు ఈ రాజ్యం ప్రసిద్ధి చెందింది. అక్కడ ఓ చెరువు, తపాలా కార్యాలయం, గ్రంథాలయం సహా అటువంటి నాలుగైదు ప్రత్యేకతలు ఉండేవి. గైక్వాడ్ రాజ్యంలోని ప్రతి గ్రామంలో ఇలాంటి సదుపాయాలు ఉండటం ఒక విధానం. బాల్యంలో ఆ ఊరిలో ఉండటం వల్ల గైక్వాడ్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. అక్కడ చెరువుంది కాబట్టి, అందులో ఈత నేర్చుకున్నాను. మా ఇంట్లో అందరి దుస్తులూ నేను ఉతికేవాణ్ని కాబట్టి చిన్నవాడినైనా చెరువుకు వెళ్లడానికి అనుమతించేవారు. భాగవతాచార్య నారాయణాచార్య ఉన్నత పాఠశాలలోనూ విద్యాభ్యాసం చేశాను. అది కూడా ఒక విధంగా ధార్మిక సంస్థ. నాటి విద్యావిధానం ఇప్పటిలా ఉండేది కాదు. కాబట్టే నేను నా పాఠశాల విద్య అక్కడే పూర్తి చేశాను. ఇప్పటిలాగా అది 10+2 పద్ధతి కాదు… 10వ తరగతి తర్వాత 11వ తరగతి ఉండేది. చైనా తత్త్వవేత్త షాన్‌జువాంగ్‌ మా గ్రామంలో చాలాకాలం బసచేశాడని నేను ఎక్కడో చదివాను. అప్పట్లో ఆయనపై ఒక చలనచిత్రం తీస్తున్నారని తెలిసి, చైనా రాయబార కార్యాలయంలోని ఒకరికి లేఖ రాశాను. సోదరా… మీరు షాన్‌జువాంగ్‌పై సినిమా తీస్తున్నారని నేనెక్కడో చదివాను. అందుకే ఆయన ఒకప్పుడు మా గ్రామంలో బసచేశాడు కాబట్టి, ఈ లేఖ ద్వారా ఆ సంగతి ప్రస్తావించే ప్రయత్నం చేశాను. అయితే, అది ఎన్నో ఏళ్లకిందటి మాట.

దీనికిముందు సంగతి… మా గ్రామంలో దవే అనే వ్యక్తి నాకెంతో ఆత్మీయుడైన సోదరుడిలా ఉండేవాడు. ఆయన కాంగ్రెస్ నాయకుడైనా, కాస్త సామ్యవాద భావాలు కూడా ఉన్నవాడు. ఆయన సౌరాష్ట్ర ప్రాంతీయుడైనా మా గ్రామంలో స్థిరపడ్డాడు. మేము పాఠశాల విద్యార్థులుగా ఉన్నపుడు “మీరెక్కడికైనా వెళ్తే, అక్కడ ఏదైనా రాసి ఉన్న లేదా అక్షరాలు చెక్కిన రాయి కనిపిస్తే దాన్ని తెచ్చి పాఠశాలలో ఈ మూల వేసి ఉంచండి” అని చెప్పేవాడు. ఆ విధంగా మేమంతా పట్టుకొచ్చిన రాళ్లతో కాలక్రమాన అక్కడో పెద్ద గుట్ట తయారైంది. అప్పుడు ఇదొక పురాతన గ్రామమని, ఇక్కడి ప్రతి రాయికీ ఓ కథ ఉందన్నది ఆయన ఉద్దేశమని నాకు అర్థమైంది. బహుశా అదొక ఊహ కావచ్చు గానీ, అందులో నేనొక భాగస్వామిని కాబట్టి నా దృష్టి కూడా దానివైపు మళ్లింది.

ఇక నేను 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినపుడు ప్రపంచ నాయకులంతా మర్యాదపూర్వకంగా ఫోన్‌ చేశారు. అదే తరహాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూడా నాకు ఫోన్‌ చేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో తాను భారత పర్యటనకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తనంతట తానే చెప్పారు. “తప్పకుండా రండి! మీకు సాదర స్వాగతం” అని ఆహ్వానం పలికాను. అయితే, తాను గుజరాత్‌ సందర్శించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పగా, అలాగైతే మరింత సంతోషిస్తానని బదులిచ్చాను. అంతలో- “నేను మీ స్వగ్రామం వడ్‌నగర్‌ వెళ్లాలనుకుంటున్నా” అన్నారు. దాంతో “మీ పర్యటన గమ్యం కూడా ముందే నిశ్చయించుకున్నారు… అసలు విషయమేమిటి?” అని అడిగాను. ఎందుకో తెలుసా అని ఆయన ప్రశ్నిస్తే, నాకు తెలియదన్నాను. అప్పుడాయన- “మన ఇద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది మీకు తెలుసా!” అన్నారు. అదేమిటో చెప్పండన్నాను… “చైనా తత్త్వవేత్త షాన్‌జువాంగ్‌ మీ గ్రామంలో చాలా కాలం బసచేశాడు. అక్కడి నుంచి చైనా తిరిగి వచ్చాక నివసించింది మా గ్రామంలోనే!” అంటూ “అదీ మనిద్దరి మధ్య ప్రత్యేకానుబంధం” అని జిన్‌పింగ్‌ ముక్తాయించారు.

నిఖిల్‌ కామత్‌: బాగుంది… మీ బాల్యం గురించి మీకు చాలా విషయాలు గుర్తున్నాయి. చిన్నతనంలో మీరు తెలివైన విద్యార్థిగా ఉండేవారా… అప్పట్లో మీ ఆసక్తులు ఎలాంటివి?

ప్రధానమంత్రి: నేను చాలా సాదాసీదా విద్యార్థినే… నన్నెవరూ.. ఏ విధంగానూ గుర్తుంచుకునేంత ప్రత్యేకలేవీ లేనివాణ్ని. అయితే, వెల్జీభాయ్ చౌధరి అనే ఉపాధ్యాయుడు నాపై ఎంతో శ్రద్ధ చూపేవారు. ఒకరోజు ఆయన మా నాన్నగారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంగా నేనెంతో తెలివిగల వాడినైనా దేనిమీదా దృష్టి కేంద్రీకరించనని, తోచినట్టల్లా చేస్తుంటానని చెప్పారు. అలాగే ఏ విషయాన్నైనా చాలా త్వరగా గ్రహించే సామర్థ్యం ఉన్నా, కాసేపటికి తన లోకంలో మునిగిపోతాడని మా నాన్నగారికి వివరించారు. దీన్నిబట్టి నా సామర్థ్యం మీద వెల్జీభాయ్కి చాలా అంచనాలున్నాయని నాకు అర్థమైంది. ఆ విధంగా మా ఉపాధ్యాయులందరికీ నా మీద మంచి అభిప్రాయమే ఉండేది కాబట్టి నేను బాగా చదువుకోవాలని వారు ఆకాంక్షించేవారు. కానీ, దేనిలోనైనా పోటీ అనే మాట వినిపిస్తే నేను దాన్నుంచి దూరంగా వెళ్లిపోయేవాణ్ని. నాకు అలాంటి విషయాల్లో ఆసక్తి ఉండేది కాదు. నా ధ్యాసంతా- ‘పాఠాలు చదివామా… పరీక్ష రాశామా… పాసయ్యామా.. అంతే!’ అన్నట్టే ఉండేది. అయితే, చదువు మినహా ఇతరత్రా అనేక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాణ్ని. కొత్త విషయం ఏదైనా ఇట్టే గ్రహించడం నా నైజం.

నిఖిల్‌ కామత్‌: సర్‌… మీ బాల్య మిత్రులలో ఎవరితోనైనా మీకిప్పటికీ సంబంధాలున్నాయా?

ప్రధానమంత్రి: నా జీవనోదంతం కాస్త విచిత్రంగా ఉంటుంది. చాలా చిన్న వయసులో ‘సర్వసంగ పరిత్యాగం’ తరహాలో అన్నిటినీ వదిలేసి ఇల్లొదిలి వెళ్లిపోయాను. ఏ ఒక్కరితోనూ నాకు సంబంధాల్లేవు కాబట్టి, చాలా అగాధం ఏర్పడింది. ఎవరితోనూ ఎలాంటి వ్యవహారాలు లేవు… నా జీవితం కూడా అజ్ఞాత లోకసంచారిలా గడిచింది. ఇక నన్ను పట్టించుకునేదెవరు? కాబట్టి అప్పట్లో నా జీవితం ఇప్పటిలా ఉండేది కాదు. కానీ, నేను ముఖ్యమంత్రినయ్యాక నాలోనూ కొన్ని కోరికలు తలెత్తాయి. నా పాత పాఠశాల మిత్రులందరినీ ముఖ్యమంత్రి నివాసానికి రప్పించాలని యోచించాను. నేనేదో గొప్పవాడినై పోయానని నా వాళ్లెవరూ భావించరాదన్నదే ఈ ఆలోచనలోని అంతరార్థం. నేను ఎన్నో ఏళ్ల కిందట గ్రామం వదిలి వెళ్లిన వ్యక్తినే.. నాలో ఏ మార్పూ లేదు. కాబట్టే నా చిన్ననాటి ఆనందక్షణాల అనుభూతిని తిరిగి ఆస్వాదించాలని భావించాను. అందుకు ఏకైక మార్గం మిత్రులతో కలసి జ్ఞాపకాలను పంచుకోవడమే. అయితే, ఎన్నో ఏళ్లు గడిచిపోవడంతో వారు ఎదురుపడినా ముఖకవళికలు గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. పిల్లలంతా ఇప్పుడు పెద్దవాళ్లైపోయారు.. వారి జుట్టు కూడా పండిపోయింది. అయినప్పటికీ వారందర్నీ ఆహ్వానించగా, సుమారు 30-35 మంది పోగయ్యారు. ఆ తర్వాత అందరూ నవ్వుతూ, తుళ్లుతూ బాల్య జ్ఞాపకాలను కలబోసుకుంటూ మదినిండా ఆనందానుభూతితో పొంగిపోయారు. అటుపైన షడ్రసోపేత విందు భోజనం కూడా చేశాం. కానీ… నేనాశించిన ఆనందం మాత్రం దక్కలేదు. నేను వారిని నా మిత్రులుగా చూడాలని భావిస్తే.. వారు మాత్రం నాలో ముఖ్యమంత్రినే చూశారు! వారిలో ఒక్కరు కూడా “నువ్వు” అంటూ ఏకవచనంలో సంబోధించే ప్రయత్నం చేయలేదు. అదీ పరిస్థితి! ఫలితంగా స్నేహంలో అగాధం అలాగే మిగిలిపోయింది. వాస్తవానికి వారంతా ఇప్పటికీ నాతో మాట్లాడుతారు.. కానీ, అదంతా అపార గౌరవంతో మాత్రమే. ఇలాంటి ఆత్మీయులలో ఒకరైన మా ఉపాధ్యాయుడు రాస్‌ బిహారీ మణిహార్‌ 93-94 ఏళ్ల వయసులో కొద్దికాలం కిందట కన్నుమూశారు. ఆయనొక్కరు మాత్రమే నన్ను ఏకవచనంలో సంబోధిస్తూ తరచూ లేఖలు రాస్తుండేవారు. ఇదీ ముఖ్యమంత్రినయ్యాక పాఠశాల మిత్రులందర్నీ కలవాలన్న నా మొదటి కోరిక ముచ్చట.

ఇక రెండో కోరిక- దేశ ప్రజలకు ఇది బహుశా వింతగా అనిపించవచ్చుగానీ, చిన్నతనంలో నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులందర్నీ బహిరంగంగా సత్కరించాలని భావించాను. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా పాఠశాల విద్య పూర్తయ్యేదాకా చదువు చెప్పిన వారందరినీ అన్వేషించి, వారిని సన్మానించడంతో నా కోరిక తీరింది. అప్పటి మా రాష్ట్ర గవర్నర్‌ శర్మగారు, గుజరాత్‌లోని పలువురు ప్రముఖులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా హోదా ఏమిటనే దానితో నిమిత్తం లేకుండా నేనీ రోజున ఈ స్థాయికి చేరానో అందుకు వారంతా ఏదో ఒక విధంగా దోహదం చేశారన్నది నా మదిలోని కృతజ్ఞతా భావన. వారిలో కొందరు బాల మందిర్ స్థాయి గురువులు కూడా కొందరున్నారు. అలాంటి వారిలో అందరికన్నా పెద్దవారైన ఉపాధ్యాయుడి వయసు 93 సంవత్సరాలు. మొత్తంమీద 30-32 మంది ఉపాధ్యాయులను ఆహ్వానించి, బహిరంగ సత్కారం చేశాను. నా జీవితంలో చిరస్మరణీయ మధుర జ్ఞాపకంగా మిగిలిన రెండో కోరిక అలా నెరవేరింది. అటుపైన నా జీవితంలో ఒకే ఒకసారి నా కుటుంబ సభ్యులను… సోదరీసోదరులు, వారి పిల్లలు సహా బంధుగణం మొత్తాన్నీ ఆహ్వానించాను. వారెవరినీ పట్టించుకోకుండా ఇల్లొదిలి వెళ్లిన నేను, ఆ రోజున ముఖ్యమంత్రి నివాసానికి అందర్నీ పిలిపించుకుని, ప్రతి ఒక్కరూ వరుసకు నాకేమవుతారో పరిచయం చేసుకున్నాను. వాళ్ల పెళ్లిళ్లు, పిల్లలు తదితర విశేషాలన్నీ అడిగి తెలుసుకున్నాను. చాలాకాలం కిందట వారితో బంధం తెగిపోయింది కాబట్టి అవన్నీ నాకు తెలియని విషయాలే. ఆ విధంగా నా మూడో కోరిక నెరవేర్చుకున్నాను. ఇక నాలుగోది… సంఘ్‌ పరివారంలో నా తొలినాళ్ల ముచ్చట. నన్ను కొన్ని కుటుంబాల వారు ఎంతో సమాదరించారు. జీవితంలో నాకంటూ వ్యక్తిగత ఏర్పాట్లేవీ చేసుకోలేదు కాబట్టి, నేను వాళ్ల ఇళ్లకు వెళ్లి భోజనం చేసి వచ్చేవాణ్ని. కాబట్టి, వారందరినీ కూడా ఓసారి ఆహ్వానించాను. ఈ నేపథ్యంలో నా అభీష్టానుసారం నేను ఏమేం చేశానన్న మీ ప్రశ్నకు- ఇప్పటికి 25 సంవత్సరాలకు ముందు నా కోసమంటూ చేసింది ఈ నాలుగు పనులే. తద్వారా నా పాఠశాల మిత్రులను, ఆదరించి అన్నం పెట్టిన దాతలను, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను, రక్త సంబంధీకులైన నా కుటుంబ సభ్యులను ఆహ్వానించి, గౌరవించాను.

నిఖిల్‌ కామత్‌: కొన్నేళ్ల కిందట మీరు బెంగళూరుకు వచ్చి మీ స్టార్టప్‌ సంబంధిత వ్యక్తులను కలవడం, గతంలో ఒకరోజు రాత్రి మీరు మాతో సమావేశం కావడం బహుశా మీకు గుర్తుండకపోవచ్చు. అప్పుడు మీతో ఓ 15 నిమిషాలు గడిపారని వారంటున్నారుగానీ, మీరు ఒక గంటపాటు మాతో ముచ్చటించారు. మీకు జ్ఞాపకం ఉందో లేదోగానీ, నేను మీకు ప్రశ్నలు వేస్తూనే వచ్చాను! జవాబివ్వడంకన్నా ప్రశ్నించడం చాలా సులువన్నది నా భావన. నేను మీతో మాట్లాడుతూ- అప్పటి పరిణామం బహుశా మంచిది కాదేమో అన్నాను. నేనేమంటున్నానో మీరు మౌనంగా విన్నారు. అదలా ఉంచితే… సమాజంలో కొన్ని వర్గాలవారు, ఏదైనా ఒక వయో వర్గంలోని ఎవరితోనైనా మీ అనుబంధం చాలా బలమైనదిగా మీరు భావిస్తుంటే, వారెవరన్నది చెప్పగలరా?

ప్రధానమంత్రి: నాతో పరిచయం ఉన్నవారు సాధారణంగా- నరేంద్ర భాయ్‌ని మీరు ఏ సమూహంలో వ్యక్తిగా పరిగణిస్తారు? ఓ 15-20 మంది యువకుల మధ్య కూడా ఆయన నవ్వుతూ, తుళ్లుతూ కనిపిస్తారని అంటుంటారు. వాస్తవానికి నా నైజం అలాంటిదే… బహుశా అందుకేనేమో ఏ ప్రాంతానికిగానీ, ఏ వయోవర్గానికిగానీ, ఈ రోజున దూరంగా ఉన్న అనుభూతి నాకుండదు. అనుబంధం అనే పదానికి బహుశా నా దగ్గర సరైన జవాబు లేకపోవచ్చుగానీ, దూరమమయ్యాననే భావన నాకెంత మాత్రం ఉండదు.

నిఖిల్‌ కామత్‌: పోటీ పడటమంటే నాకిష్టం ఉండదని మీరన్నట్లుగానే జీవితంలో పరిణతి సాధించిన జిడ్డు కృష్ణమూర్తి లాంటి తత్త్వవేత్తలు కూడా పోటీ మంచిది కాదంటారు. అటువంటి దృక్పథంగల మీరు విపరీతమైన పోటీ ఉన్న రాజకీయ రంగంలోకి వచ్చారు.. మరి ఆ భావజాలాన్ని రాజకీయాల్లోకి ఎలా తీసుకురాగలరు?

ప్రధానమంత్రి: చూడండి… బాల్యంలో పోటీ లేకపోతే అది సోమరితనం అవుతుంది. ఇందులో ఏదో గొప్ప సిద్ధాంతమో, మరేదో ఉండదు. నేను పిల్లల తరహాలోనే ఏదీ పెద్దగా పట్టించుకోను. ఏదో తాత్త్విక సిద్ధాంతం నన్ను నడిపించిందని విశ్వసించను. అంతా మంచిదే… నేను ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను అని ఒకటికి రెండుసార్లు దృఢంగా అనుకుంటాను. నా గురించి నేనెందుకు అంత ఆందోళనకు గురికావాలి? రెండోది… నా మనసుకు ఏదనిపిస్తే అది చేసే స్వభావం నాది. సమయ, సందర్భాలనుబట్టి ఎప్పుడేది తోస్తే అది చేసుకుపోతుంటాను. అంటే- ఏదైనా పోటీ ఉందంటే అందుకు నేను సిద్ధం. నాటకాల పోటీలుంటే అటు వెళ్తాను. ఇలాంటివన్నీ నా సహజ శైలిలో చేసుకుపోయేవాణ్ని. మా ఊళ్లో పర్మార్‌ అనే గురువుగారు… బహుశా వ్యాయామ ఉపాధ్యాయుడు ఒకరుండేవారు. మా ఇంటికి దగ్గరలోని ఒక భవనంలో ఒక చిన్న గోదా కూడా ఉండేది. ఆయన నాకెంతో స్ఫూర్తినిచ్చిన గురువు. నేను క్రమం తప్పకుండా అక్కడికి వెళ్లి ‘మల్లకంభం’ అభ్యసించేవాడిని. అలాగే కుస్తీలోనూ తర్ఫీదు పొందేవాణ్ని. మహారాష్ట్రలో మల్లకంభం ఒక ప్రాచుర్యంగల క్రీడ. దృఢమైన శరీరాకృతి కోసం ఒక పెద్ద కొయ్య స్తంభం మీద అద్భుతమనిపించే కసరత్తు చేస్తారు. ఒక్కమాటలో చెబితే- ఈ క్రీడ స్తంభంపై యోగావంటిది. ఈ విద్యనభ్యసించడం కోసం తెల్లవారుజామున 5:00 గంటలకే అక్కడికి వెళ్లేవాణ్ని. కసరత్తులు చేయడంలో కొందరు నాకు కాస్త సహకరించేవారు. అలా కొంతకాలం అభ్యాసం చేసినా, ఆ క్రీడలో నేనెక్కువ కాలం కొనసాగలేదు. అదంతా.. అలా గడిచిపోయిందంతే!

నిఖిల్‌ కామత్‌: రాజకీయాల్లో ఒక నాయకుడి ప్రతిభకు కొలబద్ద ఏదైనా ఉందని మీరు భావిస్తారా? ఎంటర్ ప్రెన్యూర్షిప్ తరహాలో ఎవరైనా ఒక కంపెనీని ప్రారంభించేటప్పుడు మార్కెటింగ్‌ నైపుణ్యం, అమ్మకాలలో చతురత, ఎంతోకొంత సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తుల ఆవిష్కరణ సామర్థ్యం వంటి మూడునాలుగు రకాల ప్రతిభ సహజంగానే అవసరం. మరి నేటి యువతరం రాజకీయాల్లోకి రావాలంటే వారిలో కచ్చితంగా ఉండాల్సిన ప్రతిభను పసిగట్టే పరీక్ష వంటిది ఏదైనా ఉందంటారా?

ప్రధానమంత్రి: ఇందులో రెండు భిన్న పార్శ్వాలున్నాయి. రాజకీయ నాయకుడు కావడం, రాజకీయాల్లో విజయం సాధించడం.. రెండూ వేర్వేరు అంశాలు. రాజకీయాల్లో విజయం సాధించాలంటే ప్రజల సుఖదుఃఖాల్లో పాలుపంచుకోవాలి. వారిపట్ల అంకితభావం, నిబద్ధతతోపాటు సానుభూతి అవసరమన్నది నా నమ్మకం. అలాగే ఆధిపత్యం చలాయించే నాయకుడిలా కాకుండా జట్టులో మంచి ఆటగాడిలా వ్యవహరించడం ప్రధానం. నేనో గొప్ప వీరుణ్ని, అందరిమీదా పెత్తనం చేస్తానంటే, చాలామంది మీకు విధేయులుగా ఉండొచ్చు. ఆ విధంగా మీ రాజకీయ చాణక్యం కొనసాగి ఎన్నికల్లో గెలవనూవచ్చు. అంతమాత్రాన మీరు విజయవంతమైన రాజకీయ నాయకుడు కాగలరనే భరోసా ఏదీ ఉండదు. అలాగే నా ఆలోచన దేశంలో వివాదాస్పదం కావచ్చునని నేను కొన్నిసార్లు అనుకుంటుంటాను. ఉదాహరణకు స్వాతంత్య్ర పోరాటం మొదలైనపుడు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ అందులో భాగస్వాములయ్యారు. కానీ, దేశం విముక్తమయ్యాక వారంతా రాజకీయాల్లోకి రాలేదు. కొందరు విద్యారంగం ప్రగతికి తమ జీవితాన్ని అంకితం చేశారు. మరికొందరు ఖాదీకి, ఇంకొందరు వయోజన విద్యకు అంకితమయ్యారు. కొందరు గిరిజన సంక్షేమం లక్ష్యంగా సృజనాత్మక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. ఏదేమైనా స్వాతంత్య్ర పోరాటమన్నది దేశభక్తి ప్రేరణగా ఎగసిన ఉద్యమం. పోరాటంలోపాల్గొన్న వారందరికీ భారత దాస్య విముక్తికి శక్తివంచన లేకుండా తన వంతు కృషి చేయాలన్న సంకల్పం ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత ఇలాంటి వారిలో చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. ఆదిలో రాజకీయ రంగంలో ఉన్నా, మన దేశంలోని ప్రముఖ నాయకులంతా స్వాతంత్ర్య పోరాటం నుంచి ఉద్భవించిన వారే. కాబట్టి, వారి ఆలోచన, పరిణతి, దాని స్వరూపం నేటితో పోలిస్తే పూర్తిగా భిన్నం. వారి వ్యవహార శైలి గురించి మనం విన్నది ఏదైనప్పటికీ సమాజంపై వారి అంకితభావం ఎంతో లోతైనది. అందువల్ల సమాజంలోని మంచి వ్యక్తులు ఏదో ఒక ఆశతో కాకుండా సదాశయంతో రాజకీయాల్లోకి రావాలన్నది నా అభిప్రాయం. మీరు ఒక లక్ష్యంతో రంగ ప్రవేశం చేస్తే, మీకు ఎక్కడో ఒకచోట ప్రాధాన్యం కచ్చితంగా లభిస్తుంది. మీ ఆకాంక్షకన్నా మీ లక్ష్యం మిన్న అయినపుడు అందుకు తగిన సామర్థ్యం కూడా మీకున్నట్టే!

ప్రస్తుత కాలపు నాయకుడికి నిర్వచనం రీత్యా మహాత్మా గాంధీ వంటివారు దాని పరిధిలోకి రారు. రూపం పరంగా బక్కపలచని వ్యక్తి… సన్నగా, రివటలా ఉండే ఆయనకు ప్రసంగ నైపుణ్యం కూడా అంతంత మాత్రమే. మనం ఈ దృక్కోణంలో చూస్తే ఆయన నాయకుడు కాజాలరు. కానీ, ఆయన జాతిని నడిపించిన నాయకుడు కావడానికి కారణమేమిటంటారు? గాంధీజీ చేతలే ఆనాడు నాయకుడిగా ఆయన సామర్థ్యాన్ని చాటిచెప్పాయి. అందుకే యావద్దేశం ఈ బక్కపలచని వ్యక్తికి వెన్నెముకగా నిలిచింది. కానీ, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి రూపం ఓ కీలక వృత్తి నిపుణుడి కేటగిరీలోకి చేరిపోయింది. అతడు తన వాక్చాతుర్యంతో, భాషా పటాటోపంతో ఆకట్టుకునే ప్రసంగం చేయగలగాలి. ప్రజలు కూడా కరతాళధ్వనులతో హర్షిస్తారు. కానీ, మాటలతో మాయ తాత్కాలికం… చివరిదాకా తోడు నిలిచేది మన చేతలు మాత్రమే. ఇక రెండోది- అనర్గళ ప్రసంగాలకన్నా సందేశాత్మక సంబంధం ఏర్పరచుకోగల సామర్థ్యం చాలా ముఖ్యమని నా అభిప్రాయం. మరి ఇందుకు మార్గమేమిటి? మహాత్మాగాంధీ రూపాన్ని ఒకసారి మననం చేసుకోండి. ఆయన తనకన్నా పొడవైన కర్రను చేబూని, అహింసను ప్రబోధించారు. ఇదొక పెను వైరుధ్యమే అయినా, అదీ ఆయన సందేశమిచ్చిన తీరు. ప్రపంచంలో చాలామంది ఇప్పుడు గాంధీ టోపీ పెట్టుకుంటున్నారు. కానీ, మహాత్మా గాంధీ ఏనాడూ టోపీ ధరించింది లేదు. ఆయన సందేశాత్మక సామర్థ్యం అనుపమానం. ఆయన రాజకీయ రంగంలో ఉన్నారు. కానీ, ఆయనో నాయకుడే తప్ప పాలకుడు కారు. ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు… అధికారం ఏనాడూ ఆయన చేతిలో లేదు. కానీ, ఆయన కన్నుమూశాక సమాధి చేసిన ప్రదేశాన్ని మనం ‘రాజ్‌ఘాట్‌’ అంటున్నాం!

 

నిఖిల్ కామత్: సర్, మీరిప్పుడు చెప్పిన దాని ప్రకారం… అంటే ఈ రోజు మన సంభాషణ ప్రధాన అంశం ఏమిటంటే, రాజకీయాలు కూడా ఎంటర్ ప్రెన్యూర్షిప్ వంటిదేనని చివరిగా చెప్పడమేనని నేను భావిస్తున్నాను. 10,000 మంది తెలివైన యువకులు మీ జీవితం నుంచి ప్రేరణ పొందడం, భారతదేశంలో రాజకీయవేత్తగా మారడం…

ప్రధాన మంత్రి: నేను ఎర్ర కోట నుండి చెప్పిన విషయం ఏమిటంటే, దేశానికి ఒక లక్ష మంది ఇటువంటి యువకులు అవసరం. వారు రాజకీయాల్లోకి రావాలి. నేను నమ్ముతున్నది ఏమిటంటే, లక్ష్యం తీసుకోవడం, పొందడం, లేదా కేవలం రాజకీయ నాయకుడిగా మారడమే అయితే, అది ఎక్కువ కాలం కొనసాగదు. ఒక వ్యాపారవేత్తకు మొదటి శిక్షణ ఎదుగుదలను సాధించడం, కానీ ఇక్కడ మొదటి శిక్షణ మనసంతా సమర్పించడంలో ఉంటుంది. ఎవరికైతే ఏమి ఉందో అది ఇచ్చేయడంలో ఉంటుంది. “నా కంపెనీని లేదా నా వృత్తిని నంబర్ వన్ ఎలా చేయగలనో” అనేది వ్యాపార ప్రపంచానికి లక్ష్యం. కానీ ఇక్కడ “ ముందు దేశం” అనే భావన ఉండాలి. ఇది చాలా పెద్ద తేడా. సమాజం కూడా ‘‘దేశమే ముందు’’ అని ఆలోచించే వారిని మాత్రమే అంగీకరిస్తుంది. ఈ రాజకీయ జీవితం సులభం కాదు. కొంతమంది అనుకుంటారు ఇది కేవలం కొందరి అదృష్టం మాత్రమే అని, వారికేం చేయవలసిన అవసరం ఉండదని, వారికి సమయానుసారం అన్నీ వచ్చేస్తాయని. . కానీ ఇది ఎందుకు జరుగుతుందో ఏమో, ఆ వివరాల్లోకి నేను వెళ్లదలుచుకోలేదు. కానీ నాకు తెలుసు. మా వద్ద ఒక కార్యకర్త ఉన్నారు. ఆయన పేరు అశోక్ భట్. ఆయన తన జీవితాంతం చిన్న ఇంట్లోనే జీవించారు. ఆయన అనేకసార్లు మంత్రి అయ్యారు. కానీ ఆయనకంటూ సొంత కారు కూడా లేదు. అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు. కేవలం ల్యాండ్‌ లైను ఫోన్లు మాత్రమే ఉండేవి. రాత్రి 3:00 గంటలకు మీరు ఆయనకు కాల్ చేస్తే, పూర్తిగా రింగ్‌ అవకుండానే ఫోన్ ఎత్తేవారు. అప్పుడు నేను రాజకీయాల్లో లేను. అహ్మదాబాద్-రాజ్‌కోట్ రహదారిపై చాలా ప్రమాదాలు జరిగేవి. బగోద్రా అనే ప్రదేశం ఉంది. అక్కడ వారానికి రెండుసార్లు పెద్ద ప్రమాదం జరిగినట్లు నాకు కాల్స్ వచ్చేవి. అప్పుడు నేను అశోక్ భట్‌కు ఫోన్ చేస్తే, ఆయన “సరే” అని చెప్పేవారు. ఆ వెంటనే బయలుదేరి వెళ్ళేవారు. సొంత వాహనం లేకపోయినా, ఏ ట్రక్కు లోనో లిఫ్ట్ అడిగి వెళ్లేవారు. ఆయన తన మొత్తం జీవితాన్ని ఇలానే గడిపారు.

నిఖిల్ కామత్: యువత ఎవరైనా రాజకీయ నాయకుడిగా మారాలనే ఆలోచనతో కాకుండా, రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత ఏమి చేస్తాడనే ఆలోచనతో రావాలని మీరు చెబుతున్నారా?

ప్రధానమంత్రి: అంతే మరి. ఎక్కువ మంది రాజకీయ నాయకులుగా మారాలని అనుకోరు. కానీ “నేను ఎమ్మెల్యే అవ్వాలి,” “నేను కార్పొరేటర్ అవ్వాలి,” “నేను ఎంపీ అవ్వాలి” అని అనుకుంటారు. ఇది వేరే కోవకు చెందిన విషయం. రాజకీయాల్లోకి రావడానికి తప్పనిసరిగా ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ. అవకాశం దొరికితే పోటీ చేయండి. కానీ అసలు ఉద్దేశం సాధారణ ప్రజల హృదయాలను గెలుచుకోవడం కావాలి. ఎన్నికలు తర్వాత గెలుస్తారు, కానీ ప్రజల హృదయాలను గెలవాలంటే, వారి మధ్య జీవించాలి, జీవితాన్ని వారికి అనుసంధానించాలి. ఇటువంటి వ్యక్తులు ఇప్పటికీ దేశంలో ఉన్నారు.

నిఖిల్ కామత్: ఈ రోజు యువ రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే, వారిలో సమర్థులు ఎవరైనా ఉన్నారని మీరు చెప్పగలరా?

ప్రధానమంత్రి: చాలా మంది ఉన్నారు, చాలా మంది- వారు తమ అన్ని ప్రయత్నాలు చేస్తారు. రాత్రింబవళ్లు కష్టపడతారు, ఒక లక్ష్యంతో పనిచేస్తారు.

నిఖిల్ కామత్: మీ మనసులో ఉన్న అలాంటి ఒకరి గురించి చెప్పండి…

ప్రధానమంత్రి: నేను పేర్లు చెబితే ఎందరికో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎవరికీ అన్యాయం చేయకుండా ఉండటం నా బాధ్యత, చూడండి, నా ముందు చాలా పేర్లు ఉన్నాయి. చాలా ముఖాలు ఉన్నాయి. నాకు చాలా మంది వివరాలు తెలుసు.

నిఖిల్ కామత్: మీరు ఇంతకు ముందు ప్రజలతో ఉండడం, వారి కోసం అనుభూతి చెందడం, ఆ సహానుభూతి, కరుణ గురించి చెప్పారు. మీ చిన్నప్పుడు మీలో ఈ లక్షణాలను రూపుదిద్దుకునేలా చేసిన అనుభవాలు ఏవైనా ఉన్నాయా?

ప్రధాన మంత్రి: అంటే !

నిఖిల్ కామత్: నా ఉద్దేశ్యం ఏమిటంటే, మీరు మొదట్లో చెప్పినట్లుగా, మీరు రాజకీయ నాయకుడిగా మారాలనుకున్నప్పుడు అది మీ గురించి కాదు, మీరు మొదటి ప్రాధాన్యం కాకుండా రాజకీయ నాయకులుగా ఉన్న వ్యక్తులే మీ మొదటి ప్రాధాన్యత అని నా ఉద్దేశ్యం. మీ చిన్నతనంలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా?

ప్రధానమంత్రి: ఇది నిజమే, నేను నా జీవితాన్ని తయారు చేసుకోలేదు. పరిస్థితులు అలా చేశాయి. నేను చిన్నప్పటి నుండి గడిపిన జీవితాన్ని లోతుగా చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే నా బాల్యం బలమైనది కాదు. కానీ ఆ జీవితమే నాకు చాలా నేర్పించింది. ఒక విధంగా అదే నా అతి పెద్ద విశ్వవిద్యాలయం అయిందేమో. ఇబ్బందులే ఒక విశ్వవిద్యాలయం మాదిరి నాకు చాలా నేర్పింది. అది కూడా నిజమే. తల్లులు, అక్కాచెల్లెళ్లు తలపై కుండలు మోస్తూ రెండు మూడు కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకోవలసిన దుస్థితి ఉండే రాష్ట్రానికి చెందిన వాడిని నేను. అప్పుడు నేను 75 ఏళ్ల స్వాతంత్య్రం నాటికి నేను నీరు ఇవ్వగలనా అని భావించాను. అలా నా ఈ కార్యక్రమం ఆ భావాల నుండి పుట్టింది. ముందు కూడా పథకాలు ఉండవచ్చు. నేను పథకాల గురించి వాదించట్లేదు. ప్రజలు ముందు కూడా స్వప్నాలు చూసే ఉంటారు. కానీ నేను ఆ స్వప్నాల కోసం నా జీవితాన్ని అర్పించాను. అది ఎవరి కల అయినా సరే, ఆ కల సరైనది అయితే దేశం కోసం ఏదో ఒకటి రావడానికి నన్ను నేను త్యాగం చేసుకోవడం నా కర్తవ్యం. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఉపన్యాసం ఇచ్చాను. కష్టపడి పనిచేయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయనని చెప్పాను. రెండోది నేను నా కోసం ఏమీ చేయనని. మూడోది నేనూ మనిషినే. నేనూ తప్పులు చేయొచ్చు, కానీ చెడు ఉద్దేశాలతో తప్పు చేయను. వీటిని నా జీవిత మంత్రాలుగా చేసుకున్నాను. తప్పులు జరుగుతాయి. నేను కూడా తప్పులు చేస్తాను. నేను కూడా మనిషినే, నేను దేవుడిని కాదు. మీరూ మనిషి అయితే తప్పులు జరుగుతాయి. చెడు ఉద్దేశాలతో నేను తప్పు చేయను, ఇది ఎల్లప్పుడూ నా నమ్మకం.

నిఖిల్ కామత్: మీ నమ్మకం మీకు అత్యంత ముఖ్యమైనది, 20 సంవత్సరాల క్రితం మీరు పెట్టుకున్న నమ్మకాలు నేడు మారితే, అది మంచిదా లేక చెడ్డదా ?

ప్రధాన మంత్రి: ఎలాంటివి?

నిఖిల్ కామత్: ఉదాహరణకు, ఈ రోజు నాకు 38 ఏళ్లు, బహుశా నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు, పెట్టుబడిదారీ విధానం ప్రపంచానికి సరైన మార్గం అని నేను భావించాను. ఇప్పుడు నాకు 38 ఏళ్లు వచ్చాయి, బహుశా నేను నా మనసు మార్చుకోవాలనుకుంటున్నాను. 20 సంవత్సరాల క్రితం మీరు చెప్పిన దానిని ఇప్పుడు పరిణామం లేదా మరింత సమాచారంతో మార్పుగా అనుకోవచ్చు. నేను ఇప్పటికీ పెట్టుబడిదారీ విధానాన్ని నమ్ముతున్నాను. నేను ఈ ఉదాహరణను అలాగే ఇస్తున్నాను. కానీ 10 లేదా 20 సంవత్సరాల క్రితం మీరు పెట్టుకున్న నమ్మకాలు ఏవైనా ఇప్పుడు మార్చుకున్నారా?

ప్రధానమంత్రి: రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, కొంతమంది నడిచే వాహనంలా రంగును మారుస్తూ ఉంటారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను ఒకే ఆలోచనతో పెరిగాను. నా భావజాలాన్ని చాలా తక్కువ పదాల్లో వ్యక్తీకరించాలంటే అది దేశమే తొలి ప్రాధాన్యం (నేషన్ ఫస్ట్) . నా ట్యాగ్ లైన్ నేషన్ ఫస్ట్ అయితే, అందులో ఏది సరిపోతుందో, అది నన్ను భావజాల సంకెళ్లలో బంధించదు. సంప్రదాయాల సంకెళ్లలో బంధించదు. నేను ముందుకు వెళ్ళడానికి అవసరమైనది చేస్తాను. నేను పాత వస్తువులను విడిచిపెట్టాల్సి వస్తే, నేను వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్త విషయాలను అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ కొలమానం నేషన్ ఫస్ట్. నా గమ్యం ఒకటే. నేను గమ్యం మార్చను.

నిఖిల్ కామత్: నేను ఒక అడుగు ముందుకు వేసి అడుగుతున్నాను. రాజకీయ నాయకుడు అనుసరించే భావజాలం కారణంగా అతడికి అనుచరులు ఉంటారా లేక రాజకీయ నాయకుడు సమాజ భావజాలాన్ని అనుకరించి, దాంతో అనుచరులను పొందుతాడా?

ప్రధానమంత్రి: భావజాలం కంటే సిద్ధాంతం ముఖ్యం. భావజాలం లేకుండా రాజకీయాలు ఉండగలవని నేను చెప్పడం లేదు, కానీ ఆదర్శవాదం చాలా అవసరం. ఉదాహరణకు స్వాతంత్య్రానికి పూర్వం భావజాలం ఏమిటి, స్వాతంత్ర్యం కోసం ఉద్యమం జరిగింది. స్వాతంత్ర్యం ఒక్కటే భావజాలం. గాంధీజీ మార్గం వేరు, సిద్ధాంతం వేరు. సావర్కర్ మార్గం వేరు.

నిఖిల్ కామత్: రాజకీయ నాయకుడు కావడానికి మందపాటి చర్మం అవసరమని ప్రజలు చెబుతుంటారు. దీన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి? ప్రజలు మీ గురించి విమర్శలు చేస్తారు, బహిరంగంగా చెడుగా మాట్లాడతారు, మీ గురించి కథలు అల్లుతారు. మామూలు మనిషికి ఇదొక కొత్త అనుభవం. దీన్ని ఎలా నేర్చుకోవాలి?

ప్రధానమంత్రి: రాజకీయాలకు సున్నితమైన వ్యక్తులు కావాలి. ఎవరికైనా మంచి జరిగితే సంతోషించే వ్యక్తులు కావాలి. రెండో అంశం ఆరోపణలు, ప్రత్యారోపణలు. ప్రజాస్వామ్యంలో, ఆరోపణలు రావచ్చని మీరు అంగీకరించాలి, అనేక రకాల ఆరోపణలు ఉంటాయి. కానీ మీరు సరిగ్గా ఉన్నట్లయితే, మీరు ఎలాంటి తప్పు చేయలేదని తెలుసుకుంటే, మీకు ఎప్పుడూ ఎలాంటి సమస్య ఎదురుకాదు.

నిఖిల్ కామత్: సర్, మీరు సోషల్ మీడియా ముందటి రాజకీయాలలో సీఎంగా, సోషల్ మీడియా తరువాతి రాజకీయాలలో పీఎంగా ఉన్నారు. సోషల్ మీడియా అంతగా ప్రాముఖ్యత లేని నాటి రోజుల్లో, అది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రస్తుత కాలంలో రాజకీయాలు ఎలా మారిపోయాయో మీరు చూశారు. రాజకీయ నాయకుడు కావాలనుకునే యువతకు దానిని ఎలా ఉపయోగించుకోవాలో సలహా ఇస్తారా?

ప్రధానమంత్రి: కొన్నిసార్లు ప్రజలు నన్ను అడుగుతారు, నేను చిన్న పిల్లలను కలిసినప్పుడు వారు నన్ను ఈ ప్రశ్న అడుగుతారు, వారితో చాట్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం, కొన్నిసార్లు 8-9 తరగతి పిల్లలు నన్ను కలవడానికి వస్తారు, వారు అంటారు- సర్, కొన్నిసార్లు టీవీలో మిమ్మల్ని మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అని. మరి కొంతమంది పిల్లలు – మీరు రాత్రింబవళ్లు నిందలను ఎదుర్కొంటారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుందని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఒక జోక్ చెబుతాను. “నేను అహ్మదాబాద్ నుండి వచ్చాను, మా అహ్మదాబాదీ ప్రజలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వారు వద్ద గొప్ప జోక్స్ కూడా ఉంటాయి. అహ్మదాబాద్ కు చెందిన ఓ వ్యక్తి స్కూటర్ పై వెళ్తుండగా అతను ఒకరిని ఢీకొట్టాడు. ఎదురుగా ఉన్న వ్యక్తికి కోపం వచ్చింది. వాగ్వాదం మొదలైంది. అతను తిట్టడం మొదలెట్టాడు. ఈ అహ్మదాబాద్ వ్యక్తి తన స్కూటర్ తో నిల్చొని ఉన్నాడు. అవతలి వ్యక్తి తిడుతూనే ఉన్నాడు. ఇంతలో ఎవరో వచ్చి ఏం మనిషండి మీరు- అతను తిడుతుంటే అలా నిలబడిపోయారు అని అన్నాడు. అప్పుడు అహ్మదాబాద్ వ్యక్తి తనను తిట్టిపోస్తున్న అవతలి వ్యక్తి తన నుంచి ఏమీ తీసుకోవడం లేదుగా అని జవాబిచ్చాడు. ఇది అహమ్మదాబాదీల విలక్షణ శైలి’’ అని చెబుతాను. కాబట్టి నేను కూడా నా మనస్సు లో నిశ్చయించుకున్నాను. అతను తిట్టాలనుకున్నవన్నీ ఎలాగైనా తిడతాడు. నేను నా వరకు చేయగలిగింది అంతా చేస్తాను. కానీ మీరు సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. హృదయంలో ఎటువంటి పాపం ఉండకూడదు.

లేకపోతే చెప్పండి. మీరు రాజకీయాల్లో లేరు. మీరు ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు. ఇది ఆ కార్యాలయంలో జరగదా? ఒక పెద్ద కుటుంబంలో కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య కొంత ఉద్రిక్తత ఉంటే అది జరుగుతుందా లేదా? ఇది జీవితంలోని ప్రతి రంగంలోనూ, ఎక్కువ లేదా తక్కువలో జరుగుతుంది. ఇది జరుగుతుంది, కాబట్టి, దాని ఆధారంగా మందపాటి చర్మం గురించి మనం ఆలోచించకూడదు. చాలా సున్నితంగా ఉండాలి. ప్రజాజీవితంలో సున్నితత్వం లేకపోతే ప్రజలకు మేలు చేయలేరు. సామాజిక మాధ్యమాలు ప్రజాస్వామ్యానికి గొప్ప శక్తి అని నేను నమ్ముతాను. ఇంతకు ముందు, కొంతమంది మాత్రమే మీకు సమాచారం తెలియజేసేవారు, అది నిజం అని మీరు నమ్మేవారు, అప్పుడు కూడా మీరు అలా తప్పుదారి పట్టేవారు. లక్ష మంది చనిపోయారని ఎవరైనా చెబితే లక్ష మంది చనిపోయారని నమ్మే సమయం మీకు లేదు. ఈ రోజు మీకు ప్రత్యామ్నాయం ఉంది. ఈ వార్త వచ్చిందంటే, అది ఎక్కడి నుండి వచ్చింది అని మీరు ధృవీకరించవచ్చు. మీ మొబైల్ ఫోన్లో అన్నీ లభిస్తాయి. కొంచెం శ్రద్ధ వహించండి, మీరు సత్యాన్ని చాలా సులభంగా చేరుకోవచ్చు. అందుకే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే పని సోషల్ మీడియా ద్వారా చేయవచ్చు. వక్రీకరణల కారణంగా ఈ రోజు తప్పు చేస్తున్న వారు ఉన్నారు. సమాజంలో ఇలాంటి సాధారణ పరిస్థితుల్లో కూడా నేను సంస్థాగత పనులు చేసినప్పుడు, జనసంఘ్ కు చెందిన మేము ఆ టైంలో రాజకీయాల్లో లేను… ఏమీ చేయకపోయినా వేధింపులకు గురయ్యేవాడిని. కరవు వచ్చినప్పుడు కూడా రాజకీయ నాయకులను దూషించేవారు. అప్పుడు కూడా అలానే జరిగేది. కానీ అప్పట్లో ప్రింట్ మీడియా శక్తిమంతంగా ఉండేది. అలాగే సోషల్ మీడియా ప్రభావం కూడా కొంత ఉంది. ఇంకా ఇప్పటికీ ఉంది, కానీ ఈ రోజు మీరు చాలా పెద్ద వేదికలో నిజాన్ని వెతక గలుగుతున్నారు. అనేక ప్రత్యామ్నాయ మార్గాలు తెరుచుకున్నాయి ఈ రోజు యువత ఎక్కువగా ఈ విషయాలను గమనిస్తోంది. చూడండి. నేను ఈ రోజు పిల్లలను కలిసినప్పుడు, వారు అంతరిక్షం గురించి ఎంతో ఆసక్తి చూపించడం నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. చంద్రయాన్ విజయం నా దేశం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నేను అనేక మంది పిల్లలను కలిసాను. వారు గగనయాన్ టైమ్‌టేబుల్ గురించి తెలుసుకుంటున్నారు. నేను సోషల్ మీడియా శక్తిని చూశాను. వారు గగనయాన్‌తో ఉన్నది ఏమిటి, ఆస్ట్రోనాట్స్‌తో ఏమి జరుగుతున్నది, ఎవరి శిక్షణ ఎక్కడ జరుగుతోంది మొదలైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. 8వ,9వ తరగతి పిల్లలకు దాని గురించి తెలుసు. దీని అర్థం సోషల్ మీడియా కొత్త తరానికి చాలా పెద్ద శక్తిగా మారుతోంది. నేను దానిని ఉపయోగకరంగా భావిస్తాను. నేను రాజకీయాలలోకి ప్రవేశించినప్పుడు నేను యువకుడిని. కాబట్టి నన్ను నిందించడం అనే ప్రశ్నే లేదు. కానీ నేను పూర్తి అవాస్తవమైన మాటలు వినేవాడిని. అప్పుడు నేను ఆలోచించేవాడిని, “ప్రజలు ఈ విధంగా ఎందుకు మాట్లాడతారు? వారు ఇలా ఎందుకు చేస్తారు?” అని. అప్పుడు క్రమంగా నాకు అర్థమైంది, ఈ రంగం ఇలాగే ఉంటుంది. దీనిలో జీవించాలి అనుకున్నాను.

నిఖిల్ కామత్: ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తమకు ఆందోళన ఉందని అంటారు. నాకు కూడా ఉంది. నేను మీతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను ఆందోళన చెందుతున్నాను. నేను ఏమి చెబుతానో నాకు తెలియదు, మీరు ఎలా అనిపిస్తారో తెలియదు. అది నాకు కష్టమైన సంభాషణ అవుతుంది. చాలా పిల్లలు ఆందోళన గురించి మాట్లాడుతున్నారు. ఇది మీ జీవితంలో కూడా ఉంటే, అలాగే మీ చిన్నప్పుడు ఆందోళన పడి ఉంటే మీరు ఏమి చేసారు?

ప్రధానమంత్రి: అది ఉండాలి, దేవుడు నా కోసం కొన్ని తలుపులు మూసి ఉంచాడని కాదు. అందరికీ ఏం ఇచ్చినా అది నాకు కూడా ఇచ్చి ఉంటాడు. చూడండి, ఇలాంటివి అధిగమించడానికి ప్రతి ఒక్కరికీ వేర్వేరు సామర్థ్యాలు, విభిన్న శైలులు ఉన్నాయి.

నిఖిల్ కామత్: నేను ఇది మీ నుంచి నేర్చుకోవాలనుకుంటే ఎలా చేయాలి.

ప్రధానమంత్రి: ఏదైనా థీసిస్ రూపంలో చెప్పడం చాలా కష్టం. కానీ నేను భావోద్వేగాలకు, నా సహజమైన మానవ ధోరణికి దూరంగా ఉండాల్సిన స్థితిలో ఉన్నాను. నేను వీటన్నింటికీ అతీతంగా ఉండాలి. 2002 గుజరాత్ ఎన్నికలు నా జీవితంలో అతి పెద్ద పరీక్షగా నిలిచినట్లే, నా జీవితంలో నేను పోటీ చేసినప్పుడు, ఇతరులను పోరాడేలా చేసినప్పుడు కూడా ఎన్నికల్లో గెలవడానికి నాకు చాలా అవకాశాలు లభించాయి. కాబట్టి నా జీవితంలో నేనెప్పుడూ టీవీ చూడలేదు. ఫలితం రావడం లేదు. రాత్రి 11-12 గంటలకు నా ఇంటి వెలుపల డ్రమ్ముల శబ్దం వినిపించింది. రాత్రి 12:00 గంటల వరకు నాకు ఎటువంటి సమాచారం ఇవ్వవద్దని నేను ప్రజలకు చెప్పాను. అప్పుడు మా ఆపరేటర్, సార్, మీరు మూడింట రెండు వంతుల మెజారిటీతో ముందంజలో ఉన్నారని ఒక లేఖ పంపారు. కాబట్టి నాలో ఏమీ జరగదని నేను నమ్మను. కానీ నేను దానిని అధిగమించే కొంత ఆలోచనను కలిగి ఉన్నాను కాబట్టి దీనిని అసహనం అని పిలవండి, ఆందోళన అని పిలవండి, అది భిన్నంగా మారింది. అదేవిధంగా మా ప్రాంతంలో ఐదు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయంటే ముఖ్యమంత్రిగా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పోలీస్ కంట్రోల్ రూమ్ కి వెళ్లాలని చెప్పాను కానీ నా భద్రతా సిబ్బంది “సార్, ఎక్కడ ఏమి ఉందో తెలియదు, మీరు వెళ్ళవద్దు” అంటూ తిరస్కరించారు. ఏం జరిగినా నేను వెళ్తాను అన్నాను, వాళ్ళు చాలా కంగారుపడ్డారు, చివరికి నేను వచ్చి కారులో కూర్చున్నాను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ముందు హాస్పిటల్ కి వెళతానని చెప్పాను, ‘లేదు సార్, హాస్పిటల్ లో కూడా బాంబులు పేలుతున్నాయని చెప్పాడు. ఏం జరిగినా వెళ్తానని చెప్పాను. కాబట్టి నాలో అసహనం, ఆందోళన ఉంటుందని మీరు చెప్పగలరు. కాని నా మార్గం ఏమిటంటే, నేను నా లక్ష్యంలో లీనమైపోయాను, కాబట్టి నేను దానిని వేరే రూపంలో అనుభవిస్తాను. బహుశా, నేను దానిలో బాధ్యతను పొందుతాను.

2002 ఫిబ్రవరి 24న నా జీవితంలో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాను. ఫిబ్రవరి 27న తొలిసారి అసెంబ్లీకి వెళ్లాను. నేను మూడు రోజులు ఎమ్మెల్యేగా ఉన్నాను. అకస్మాత్తుగా గోద్రాలో పెద్ద సంఘటన గురించి వార్తలు రావడం ప్రారంభించాయి. ఒక రైలుకు మంటలు అంటుకున్నాయి. క్రమక్రమంగా వార్తలు వచ్చాయి, నేను ఆందోళన చెందుతున్నా , చాలా సహజంగా చెప్పాను. నేను సభలో ఉన్నాను. బయటకు వచ్చిన వెంటనే నేను గోద్రాకు వెళ్లాలనుకుంటున్నాను అని చెప్పాను. ఇక్కడ నుండి బరోడాకు వెళతామని, బరోడా నుండి హెలికాప్టర్ తీసుకుంటామని చెప్పాను. అప్పుడు వారు తమ వద్ద హెలికాప్టర్ లేదని చెప్పారు. కాబట్టి మరో హెలికాప్టర్ కోసం చూడండి. బహుశా ఓఎన్జిసి వద్ద ఉండవచ్చు అని చెప్పాను. అది ఒకే ఇంజిన్ కాబట్టి విఐపిని తీసుకు వెళ్ళలేమని తిరస్కరించారు. నేను విఐపిని కాదని, నేను సామాన్యుడిని అని చెప్పాను. నేను వెళ్లినప్పుడు పెద్ద గొడవ జరిగింది. ఏది జరిగినా అది నా బాధ్యత అని లిఖిత పూర్వకంగా ఇచ్చాను. సింగిల్ ఇంజిన్ హెలికాఫ్టర్ లో వెళ్ళాను. నేను గోద్రా చేరుకున్నాను. అక్కడ బాధాకరమైన సన్నివేశం, ఎన్నో మృతదేహాలు, మీరు ఊహించగలరు. నేను కూడా ఒక మనిషిని, అయినా నాకు తెలుసు. నేను నా భావోద్వేగాలను, మానవ సహజమైన ధోరణిని దూరం పెట్టే పదవిలో ఉన్నానని. నేను అన్నింటికీ అతీతంగా ఉండాలి. నేను చేయగలిగినదంతా చేయడం ద్వారా నన్ను నేను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాను. కానీ నేను పరీక్షా పే చర్చాలో విద్యార్థులతో మాట్లాడినప్పుడు, నేను వారి పాఠాన్ని అర్థం చేసుకున్నాను. ఆ సోదరా, మీరు ఏదో ప్రత్యేకమైన పని చేయబోతున్నారనే భావనను మీ మనస్సు నుండి తొలగించండి. ఇది మీ దినచర్యలో భాగంగానే చేస్తున్నారనుకుంటూ వెళ్ళండి. ఆ రోజు ప్రత్యేకమైన కొత్త బట్టలు ధరించే ప్రయత్నం చేయకండి. చేయవద్దు.

నిఖిల్ కామత్: ఏది పనికిరాని విషయం – అంటే ఏదైనా చెడు పరిణామం ఉంటుందా అనే విధంగా మీరు ఆలోచిస్తారా-

ప్రధానమంత్రి: లేదు. నేను ఎప్పుడూ జీవన్మరణాల గురించి ఆలోచించలేదు. చూడండి, ఇది రికార్డు కోసం జీవితాన్ని గడిపే వారి కోసం కావచ్చు. కాబట్టి నేను దీనికి సమాధానం ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి, నేను ఈ రోజు ఇక్కడికి చేరుకోవాలని అనుకోలేదు. అక్కడికి చేరుకోవాలని బయలుదేరలేదు. అందుకే నాకేమీ తెలియదు. నేను సీఎం అయ్యాక ఎలా సీఎం అయ్యానో అని ఆశ్చర్యపోయాను. కాబట్టి ఇది నా జీవిత మార్గం కాదు. నాకు ఒక బాధ్యత ఉంది, కాబట్టి నేను దానిని నెరవేరుస్తున్నాను. నా లక్ష్యం దానిని బాగా చేయడమే. కానీ నేను ఈ పని కోసం బయలుదేరినట్లు కాదు. అందుకే ఆ లెక్కలు వేసుకోలేకపోతున్నాను. సాధారణ జీవితంలో జరిగే వాటికి నేను మినహాయింపు కావచ్చు ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలా ఆలోచించకపోవడం నా నేపథ్యం. ఒకసారి ఎవరో నన్ను ఇలా అడిగారు… నేను ప్రైమరీ స్కూల్ టీచర్ అయి ఉంటే మా అమ్మ చుట్టుపక్కల బెల్లం అమ్మేది. మా అబ్బాయి టీచర్ అయ్యాడని అందరికీ బెల్లం తినిపించేది. కాబట్టి, నాకు ఆ నేపథ్యం ఉంది, అందుకే నాకు అలాంటి ఆలోచనలు ఎప్పుడూ లేవు. ఇది జరగకపోతే ఏమి జరుగుతుందన్న ఆలోచనలు నా మనస్సులోకి పెద్దగా రావు.

నిఖిల్ కామత్: విజయం కంటే వైఫల్యం నుంచి ఎక్కువ నేర్చుకుంటామని మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా కొన్ని వైఫల్యాల గురించి గురించి మాట్లాడాలనుకుంటున్నారా?

ప్రధానమంత్రి: చంద్రయాన్ -2 ప్రయోగించిన రోజు చాలా మంది సార్, మీరు వెళ్లకూడదని చెప్పారు. ఎందుకని అడిగాను. సార్, ఇది అనిశ్చితం. ప్రపంచంలోని ప్రతి దేశం విఫలమవుతుంది. ఇది నాలుగైదు సార్లు ప్రయత్నించిన తర్వాత జరుగుతుంది. మీరు వెళ్లిన తర్వాత ఏదైనా జరిగితే అంటే.. అప్పుడు నేను చెప్పాను, “అది ఏమిటి? నేను బాధ్యత వహించలేనా?” నేను వెళ్లాను. చంద్రయాన్ ప్రయోగం చివరి నిమిషంలో విఫలమైంది. బయట కూర్చున్న వారంతా ఆందోళనపడ్డారు. విషయం చెప్పేందుకు ఎవరికీ ధైర్యం చాల్లేదు. టెక్నాలజీ విఫలంకావచ్చన్న అవగాహన నాకుంది. చివరికి అత్యంత సీనియర్ వ్యక్తి వచ్చి చెప్పారు. కంగారు పడొద్దంటూ ధైర్యం చెప్పాను. నమస్తే అంటూ అందరినీ పలకరించాను. నేను రాత్రి గెస్ట్ హౌస్ కి వెళ్ళాను కాని నాకు నిద్ర పట్టలేదు. దాదాపు అరగంట తర్వాత మళ్ళీ అందరికీ ఫోన్ చేసి, వీళ్ళు అలసిపోకపోతే… నేను బయలుదేరే ముందు ఉదయం 7:00 గంటలకు వారిని కలవాలనుకుంటున్నాను. ఎందుకంటే దేశం పెద్ద వైఫల్యాన్ని ఎదుర్కొంది. కానీ నేను అందుకు జీవితాంతం బాధపడే వారిలో లేను. ఉదయం వెళ్లి, నేను శాస్త్రవేత్తలందరినీ కలిసాను. ఏదైనా వైఫల్యం ఉంటే బాధ్యత నాదేనని చెప్పాను. నిరాశ వద్దని వారిలో వీలైనంత ఆత్మవిశ్వాసాన్ని నింపాను. తరువాత చంద్రయాన్ -3 విజయవంతమైంది.

నిఖిల్ కామత్: ఈ సంఘటన నుంచి ప్రస్తుతం ఉపయోగపడేలా… రాజకీయాల్లో వాడుకోగలిగేలా నేర్చుకున్న పాఠాలు ఏమైనా ఉన్నాయా?

ప్రధానమంత్రి: చూడండి… రాజకీయాల్లో రిస్క్ తీసుకోవడానికి చాలా సంసిద్ధత అవసరం. ప్రతి క్షణం రిస్క్ తీసుకోవడమంటే లక్ష మంది యువతను రమ్మని అడగడం లాంటిది. వారు ఆశించే దాని కోసం నేను నా సమయాన్ని వారికి ఇవ్వాలనుకుంటున్నాను. దేశానికి అలాంటి యువత లభిస్తే… 2047 కోసం నా మనస్సులో ఉన్న కలను వారు నెరవేరుస్తారని అనుకుంటున్నాను. నేను వారిని నా కోసం పనిచేయమని పిలవడం లేదు, దేశం కోసం పనిచేయమని అడుగుతున్నాను.

నిఖిల్ కామత్: రాజకీయాల్లోకి రమ్మంటున్నారా?

ప్రధానమంత్రి: అవును. కానీ వారికి తెలియని వాటి గురించి భయం ఉండకూడదు. అందుకే నేను వారి పక్కన నిలబడాలనుకుంటున్నాను. భయపడకండి మిత్రులారా.. రండి, ఏదైనా వివాదంలో చిక్కుకుంటామనే ఉద్దేశంతో మాత్రం రావద్దు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చాలా ముఖ్యం. దానికి గౌరవం ఇవ్వండి. రాజకీయాలకు ఎంత ఎక్కువ గౌరవం లభిస్తే అంత రాజకీయ స్వచ్ఛత చేకూరుతుంది. మనం దాన్ని పనికి రానిదిగా, చెత్తగా భావిస్తాం. చెత్తగా పరిగణిస్తే అది చెత్తగానే మిగులుతుంది. దానికి మనం గౌరవం ఇవ్వాలి. మంచివాళ్లు రాజకీయాల్లోకి రావాలి. అందుకే ఈ నా ప్రయత్నం.

నిఖిల్ కామత్: ఈ రోజు నేను చెబుతున్నది ఒక్కటే. యువత రాజకీయాల్లోకి రావాలి. నేను నా గురించి మాట్లాడేటప్పుడు, రెండు విషయాలు చెప్పాలి. మొదటి విషయం ఏమిటంటే, నాకు నా ఉద్యోగమంటే ఇష్టం. నేను కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతాను. నేను 20 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా స్టాక్ మార్కెట్లో పని చేస్తున్నాను. నేను నా ఉద్యోగాన్ని నిజంగా ప్రేమిస్తాను, ఆస్వాదిస్తాను. రెండో విషయం ఏంటంటే దక్షిణ భారత మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన వ్యక్తిగా నా ముందున్న ఆప్షన్లు డాక్టర్, ఇంజినీర్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అని చిన్నప్పటి నుంచి చెప్పేవారు. ఇప్పుడు నేను బహుశా దీనికి స్టార్టప్ ను జోడించగలననుకుంటా. కానీ మనందరికీ రాజకీయాలు ఒక మురికి ప్రదేశం. అది మన మనసుల్లో ఎంతగా పాతుకుపోయిందంటే దాన్ని మార్చడం చాలా కష్టం. ఈ విషయం గురించి కొంచెం నిజాయితీగా చెప్పాలంటే రాజకీయ నాయకుడిగా అవతరించిన తర్వాత కూడా నేను మార్చదలచుకున్న ఆ విషయం ఏమిటో కూడా నాకు స్పష్టంగా తెలియదు. మరి మాలాంటి వాళ్లకు మీరేం చెబుతారు?

ప్రధానమంత్రి: నేను దీన్ని వేరే విధంగా చూస్తాను. మీరు చేసిన విశ్లేషణ సంపూర్ణంగా లేదు. ఇది అసంపూర్ణమైనది. ఎందుకంటే మీరు చెప్పిన విధంగానే మీ నడవడిక ఉండి ఉంటే, మీరు ఈ రోజు ఇక్కడ ఉండేవారు కాదు. మీకు ప్రతి నిమిషం డబ్బుతో సమానం. ఐనా అవన్నీ పక్కన పెట్టి, మీరు ఢిల్లీ చలిలో నాతో మనస్పూర్తిగా గడుపుతున్నారంటే మీరు ప్రజాస్వామ్య రాజకీయాలతో ముడిపడి ఉన్నట్టే. రాజకీయం అంటే ఎన్నికలు కాదు, గెలుపు ఓటములు కాదు, అధికారమూ కాదు. అది ఒక కోణం మాత్రమే. దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఎంతమంది ఉండవచ్చు? ఉదాహరణకి 10000 మంది ఎమ్మెల్యేలు ఉంటారనుకుందాం. పోనీ 1000 కావచ్చు లేదా 2000 కావచ్చు, ఐనా ఇక్కడున్న అందరూ కాదు, కానీ రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ అవసరమే. రెండోది, మీరు విధాన రూపకల్పనలో ఉంటే, మీరు చాలా పెద్ద మార్పును తీసుకురావచ్చు. మంచి పనులు చేయడం ద్వారా మీ చిన్న కంపెనీలోనే మీరు మార్పును తీసుకురాగలిగినపుడు, మీరు రాజకీయాల్లో విధాన నిర్ణేత స్థానంలో ఉంటే, మొత్తం దేశంలో ఆ మార్పును తీసుకురావచ్చు. కాబట్టి పాలనలో అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు విధానాలను రూపొందించగలరు. విధానాలను అమలు చేయడం ద్వారా పరిస్థితులను మార్చగలరు. మీరు సరైన దిశలో నిజాయితీగా పనిచేస్తే, ఆశించిన ఫలితాలను చూడగలరు. నేను మీతో అన్నట్లు, మన దేశంలోని ప్రతి ప్రభుత్వం గిరిజనుల కోసం పనిచేస్తోంది. కానీ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సమాజంలోని ఆ వర్గం నుండే వచ్చినవారు అవడం వల్ల నేను ఆమెను కలిసినప్పుడల్లా, ఆమె చాలా భావోద్వేగానికి గురయ్యేవారు. గిరిజన సమాజంలో కూడా అత్యంత వెనుకబడిన వారిని ఆదరించే వారు లేకపోవడంతో చిన్న చిన్న సమూహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. వారి కోసం ఏదో ఒకటి చేయాలని ఆమె నాకు చాలాసార్లు చెప్పింది. నాకు మార్గనిర్దేశం చేయమని నేను ఆమెను అడిగాను. అందుకు అనుగుణంగానే ఆమె మార్గదర్శకత్వంలో నేను పిఎం జన్ మన్ యోజన అనే పథకాన్ని రూపొందించాను. ప్రస్తుతం వీరు గరిష్టంగా 25 లక్షల మంది… అది కూడా 250 ప్రదేశాల్లో ఉన్నారు. రాజకీయ నాయకులకు ఇది అనవసరం. ఎందుకంటే వారి ఓట్లతో నాయకులకు పనిలేదు. గెలుపు ఓటముల మీద ప్రభావం లేదు. కానీ వాళ్ళ జీవితానికి అది చాలా ముఖ్యమైనది. ద్రౌపది గారికి ఆ సమాజం గురించి పూర్తిగా తెలుసు కాబట్టే, నేను ప్రధాని అయ్యాక ఆమె నన్ను అభ్యర్థించింది. సార్, ఇది ఇంతకు ముందు జరగలేదు ఇప్పుడు జరిగింది, ఇంతకు ముందు అది లేదు, ఇప్పుడు ఏర్పడింది అని ఈ రోజు నేను ఆవిడ నోట వింటున్నప్పుడు ఇంతకుముందు ఎవరూ పట్టించుకోని ఒక ప్రాంతాన్ని ఆరాధ్య స్థలంగా మార్చే అవకాశం నాకు లభించిందని నేను గొప్ప సంతృప్తిని పొందాను. కాబట్టి సరైన సమయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటే రాజకీయాల్లో ఎంత పెద్ద మార్పు తీసుకురావొచ్చో చెప్పడానికి ఇదో చక్కని ఉదాహరణ.

నిఖిల్ కామత్: సర్ నేను జర్నలిస్టుని కాదు. రాజకీయ నిపుణుడిని కూడా కాదు. నేను పాలసీల గురించి మాట్లాడితే మూర్ఖత్వమే అవుతుంది. బహుశా ఈ విషయంలో మాట్లాడేందుకు ఇంకా చాలా మంది అనుభవజ్ఞులు ఉండే ఉంటారు. కానీ నేను వైఫల్యం అంశం మీద మరోసారి దృష్టి సారిస్తే, మీరు వైఫల్యాల నుండి ఏమి నేర్చుకున్నారు, అది బాల్యంలో కావచ్చు, గత పదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కావచ్చు.

ప్రధానమంత్రి: నాకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. నా చిన్నప్పుడు బహుశా ఒక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడనుకుంటా… నాకు సరిగ్గా గుర్తు లేదుగానీ, మన రాష్ట్రంలో బహుశా ఒక సైనిక పాఠశాల ప్రారంభం అయినకాలం. నాకు వార్తా పత్రికలు చదివే అలవాటు ఉంది. వార్తాపత్రికలు చదవడం అంటే ప్రకటనలు కూడా చదవడం కదా. మా గ్రామంలో ఒక గ్రంధాలయం ఉండేది. నేను ఆ గ్రంధాలయానికి వెళ్ళేవాడిని కాబట్టి నేను సైనిక స్కూల్ గురించి అందులో చదివాను. వెంటనే నేను ఒక రూపాయి మనీ ఆర్డరు చేసి మొత్తం వివరాలు తెప్పించుకున్నాను. కానీ అదంతా కఠినమైన ఆంగ్లంలో ఉంది. నాకు ఏమీ అర్థం కాలేదు. ఐతే ఒక ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ గా పనిచేసే రాష్ బిహారి మణియార్ మా ఇంటికి 300-400 మీటర్ల దూరంలో నివసించేవారు. నేను ఆ దారివెంట వెళ్ళేటప్పుడు అతని ఇంటిని చూసే వాడిని… నా చిన్నతనంలో అతను నాకు చాలా గొప్పవాడుగా అనిపించేవాడు. అందుకే ఒక రోజు నేను అతని ఇంటికి వెళ్లాను. ఇది నాకు అర్థం కావడంలేదని, ఎవరైనా నాకు వివరిస్తే బాగుంటుందని అన్నప్పుడు అతను చాలా దయ చూపాడు. నువ్వు కంగారు పడకు బాబూ, నేను వివరిస్తాను అని అన్నాడు. మొత్తం చదివి ఇది సైనిక స్కూల్ ప్రకటన అని, ఇందులో ప్రవేశం కోసం ఇంటర్వ్యూ, రాత పరీక్ష ఉంటాయని, వాటిలో ఉత్తీర్ణత సాధించాలని చెప్పాడు. తరువాత నేను మా నాన్నతో ఇదే విషయం చెప్పినపుడు, లేదు లేదు మనకు డబ్బు లేదు.. మనం ఎక్కడికీ వెళ్ళడం కుదరదు… మన గ్రామంలోనే ఉండాలి అన్నాడు. సైనిక స్కూలు అంటే దేశానికి సంబంధించి చాలా గొప్ప విషయం, కాని నేను వెళ్ళలేను.. వెళ్ళడానికి వీలు లేదు. బహుశా ఇది నేను చేయాలనుకున్న పనుల్లో నాకు తగిలిన మొదటి ఎదురుదెబ్బ అని అనుకుంటాను. అప్పటి నుండి జీవితంలో ప్రతిదానినీ ఇలాగే చూడటం అలవాటైంది. నాకు ఒక సాధువులా జీవితాన్ని గడపాలనే బలమైన కోరిక ఉండేది. కాని నేను దానిని చేయలేకపోయాను. నా మొదటి ప్రయత్నంలో రామకృష్ణ మిషనుతో సహవాసం చేద్దామని అనుకున్నాను. 100 సంవత్సరాలు జీవించి ఇటీవలే కన్నుమూసిన స్వామి ఆత్మస్థానంద గారితో కలిసి ఉన్నప్పుడు నా కోసం ఆయన చాలా చెప్పారు. కానీ రామకృష్ణ మిషను నియమాల అనుసారం నాకు ఆ అర్హత లేకపోవడం వల్ల, నేను సరిపోనని నిర్ధారించి తిరస్కరణకు గురయ్యాను. కానీ నేను నిరాశ పడలేదు. నా కల నెరవేరలేదు. ఐనా నేను నిరాశ చెందలేదు. నా జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నేను ఇలా ముందుకు వెళుతూనే ఉన్నాను. తరువాత కొంతమంది సాధువులు, మహంతుల కోసం వెతికాను. అక్కడ కూడా నాకు ఎటువంటి విజయం లభించలేదు. ఒక విధంగా నేను వెనక్కి వచ్చానని చెప్పగలను. బహుశా విధి నేను నడుస్తున్న దారి ఒకటి ఆలోచించి నన్ను ఈ మార్గంలో తీసుకువచ్చి ఉండవచ్చు. కాబట్టి జీవితంలో ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవని గుర్తించాలి.

నిఖిల్ కామత్: ఈ ఎదురుదెబ్బలు ఈనాటి మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలకమైన పాత్ర పోషించి ఉంటాయి కదూ… మరి వాటి నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

ప్రధానమంత్రి: మీకొక విషయం చెబుతాను. నేను ఆరెస్సెస్ లో పనిచేస్తున్న సమయంలో ఆరెస్సెస్ వారు ఒక సరికొత్త పాత జీపును కొనుగోలు చేశారు. నాకు డ్రైవింగ్ తెలుసు, అంటే, నేను అప్పుడప్పుడే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాను. అప్పుడు నేను ఒక ఆరెస్సెస్ అధికారితో కలిసి గిరిజన ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉకై డ్యామ్ నుండి తిరిగి వస్తున్నాను. అక్కడ ఒక లోతైన పల్లం ఉండడంతో నేను పెట్రోల్ ఆదా చేద్దామనుకుని వాహనాన్ని స్విచ్ ఆఫ్ చేశాను. కానీ అలా కిందకు వెళితే, వాహనం జారిపోతుందని, ఇది నాకు ఇబ్బంది కలిగిస్తుందని నాకు తెలియదు. అది ఉన్నపళంగా అధిక వేగం పుంజుకోవడంతో నేను బ్రేకులు వేసినప్పటికీ వాహనం అదుపు తప్పింది. ఇబ్బంది ఏర్పడింది. ఇంజన్ ఆపడం వల్ల నియంత్రణ పోయింది. నేను ప్రమాదం నుండి ఎలాగో బయటపడ్డానుగానీ, నేను అలాంటి తప్పు చేసానని నా పక్కన కూర్చున్న వారికి కూడా తెలియదు. కానీ సోదరా ఇలాంటి ఆటలను ఆపేయాలని ఆ తరువాత తెలుసుకున్నాను. ఇలా మనం ప్రతి తప్పు నుండి నేర్చుకుంటూనే ఉంటాము… కాబట్టి జీవితం మెరుగుపడాలంటే, అది అనుభవాల ద్వారానే జరుగుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతాను. నేను నా జీవితాన్ని కంఫర్ట్ జోన్లో గడపకపోవడం నా అదృష్టం. నేను ఎల్లప్పుడూ కంఫర్ట్ జోన్ వెలుపల ఉండడం వల్లే ఏ పనిని ఎలా చేయాలో, ఎలా బతకాలో గ్రహించాను.

నిఖిల్ కామత్: సౌకర్యవంతమైన స్థితిలో ఉండాల్సిన అవసరం లేదని ఈ రోజు కూడా మీరు అనుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా?

ప్రధానమంత్రి: సౌకర్యవంతమైన స్థితికి అనర్హుడనని నేను అనుకుంటున్నాను.

నిఖిల్ కామత్: ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? సౌకర్యానికి అనర్హులని మీరు ఎందుకు అనుకుంటున్నారు?

ప్రధానమంత్రి: నా జీవితాన్ని అనుభవించి వచ్చాను. కాబట్టి ఈ విషయాలన్ని నాకు చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు కూడా నాకు తృప్తిని ఇస్తాయి. నా చిన్నతనంలో ఏర్పడ్డ వ్యక్తితం వల్ల మొత్తం మీద జీవితంలో నేను సంతృప్తి చెందానని అనుకుంటాను.

నిఖిల్ కామత్: అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి సౌకర్యవంతమైన జీవితం కూడా అడ్డంకిగా మారుతుందని మీరు భావిస్తున్నారా?

ప్రధానమంత్రి: చాలా మంది తమ సౌకర్యవంతమైన స్థితికి అలవాటు పడటం వల్ల జీవితంలో విఫలం అవుతుంటారని నేను విశ్వసిస్తాను. సౌకర్యవంతమైన స్థాయి వేరుగా ఉండొచ్చు కానీ ఒక పెద్ద పారిశ్రామిక వేత్త అయినా రిస్క్ తీసుకోకపోతే, ఆ స్థితి నుంచి బయటకు రాకపోతే అతని పని అయిపోతుంది. ఆయన ఆ సౌకర్యవంతమైన స్థాయి నుంచి బయటకు రావాలి. జీవితంలో ఏ రంగంలోనైనా పురోగతి సాధించాలనుకునే వారు తన సౌకర్యవంతమైన స్థితికి అలవాటు పడకూడదు. రిస్క్ తీసుకునే మనస్తత్వం ఎల్లప్పుడూ ఒకరికి చోదక శక్తిగా పనిచేస్తుంది.

నిఖిల్ కామత్: ఎంటర్ ప్రెన్యూర్షిప్ లోనూ ఇదే పరిస్థితి. ఎక్కువ రిస్క్ తీసుకోగలిగినవాడు మెరుగ్గా రాణిస్తాడు… సర్, మీ జీవితంలో సమయంతో పాటు మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరుగుతోందా?

ప్రధానమంత్రి: నా రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని ఇంకా పూర్తిగా వినియోగించుకోలేదని, చాలా తక్కువగా మాత్రమే వాడుకున్నాని నేను భావిస్తున్నాను. నా రిస్క్ తీసుకునే సామర్థ్యం బహుశా చాలా రెట్లు ఎక్కువ. దీనికి గల కారణాన్ని నేను పట్టించుకోను. నేనెప్పుడూ నా గురించి ఆలోచించలేదు. తన కోసం ఆలోచించని వ్యక్తికి అపరిమితమైన రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటుంది. నా పరిస్థితి కూడా అదే.

నిఖిల్ కామత్: ఈ రోజుల్లో కూడా మీరు..

ప్రధానమంత్రి: ఈ రోజు నేను ఈ హోదాలో లేను. రేపు కూడా ఉండకపోవచ్చు.. అప్పుడు నాకు ఏం జరుగుతుంది? ఇలాంటి విషయాల గురించి నేను పట్టించుకోను.
నిఖిల్ కామత్: సాధారణంగా ప్రభుత్వం, వ్యవస్థ ఇతర అంశాల వల్ల తీసుకోలేని నిర్ణయాన్ని ఈ రోజు దేని గురించీ ఆలోచించకుండా, దేనికీ భయపడకుండా తీసుకోవాలంటే…?

ప్రధానమంత్రి: బహుశా నేను ఇతర పనులు చేయటం అనేది ఆగిపోయింది. ఒక జీవితం ఒకే విజన్‌లా మారింది. కానీ నేను ఇంతకు ముందు చేసే ఒక పని ఉంది. కొన్నిసార్లు నాకు ఇప్పటికీ అది చేయాలని అనిపిస్తుంది. నాకు ఒక కార్యక్రమం ఉండేది. దానికి నేను పేరు కూడా పెట్టాను. ‘నన్ను నేను కలవడానికి వెళతాను’. నన్ను నేను కలవడానికి వెళతాను అంటే, కొన్నిసార్లు మనల్ని మనం కలుసుకోం… ప్రపంచాన్ని కలుస్తాం, మనల్ని మనం కలుసుకోవడానికి మనకు సమయం లేదు. అందుకని నేను చేసేదేమిటంటే… ఏడాదిలో కొంత సమయం తీసుకుని మూడు నాలుగు రోజులు నాకు కావలసిన వాటితో బయలుదేరే వాణ్ణి. ఎలాంటి చోటుకు వెళ్లేవాడినంటే అది పూర్తిగా జనం లేనిదై ఉండాలి. కేవలం నీరు మాత్రం దొరికితే చాలు. అడవుల్లో ఏదో ఒక చోట అలాంటి ప్రాంతం వెతికే వాడిని. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు లేవు. వార్తాపత్రికలు వగైరాల ప్రసక్తే లేదు. కాబట్టి అప్పుడు జీవితం వైవిధ్యంగా ఉండేది. ఆ జీవితాన్ని కోల్పోయినట్లు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

నిఖిల్ కామత్: ఆ సమయంలో మీరు మీతో ఒంటరిగా ఉన్నప్పుడు, మీ గురించి మీరు ఏమైనా నేర్చుకున్నారా? తత్త్వశాస్త్రంలో చాలా మంది చెప్పినట్లు.. జీవితంలో అతి ముఖ్యమైన ఆసక్తికరమైన ప్రశ్న ‘‘నేను ఇప్పుడున్న విధంగా ఎందుకు ఉన్నాను?’’ మీరు ఎందుకు ఇలా ఉన్నారో ఆ సమయంలో మీ గురించి మీరు ఏదైనా నేర్చుకున్నారా?

ప్రధానమంత్రి: తనలో తనను కోల్పోవటం ఒక విషయం మాత్రమే. ఏం జరిగిందో ఒక ఉదాహరణ చెబుతాను. అది 80వ దశకం అనుకుంటా. అప్పుడు నేను ఎడారిలో నివసించాలని నిర్ణయించుకున్నాను. నేను ప్రయాణం ప్రారంభించాను. ఎడారిలో తిరుగుతూనే ఉన్నాను. ఒక వెలుతురు కనిపిస్తోంది కానీ నేను దానిని చేరుకోలేకపోయాను. అప్పుడు ఒంటెతో పాటు ఉన్న ఒకరిని కలిశాను. ‘‘సోదరా ఇక్కడ ఏం చేస్తున్నారు’’ అని అడిగాడు. నేను ఎడారిలోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాను. ఒక పని చేయండి..ఇప్పుడు నాతో రండి.. ముందు కనిపించే వెలుతురు చివరి గ్రామంలోనిది.. నేను మిమ్మల్ని అక్కడ దింపుతాను.. రాత్రి అక్కడే ఉండి ఉదయం ఎవరైనా వస్తే వారితో కలిసి వెళ్లండి అని చెప్పి అక్కడికి తీసుకెళ్లాడు. గుల్బెక్ అనే ముస్లిం పెద్దమనిషి తన ఇంటికి తీసుకెళ్లాడు. పాకిస్తాన్ సరిహద్దులో భారత చివరి గ్రామం ధోర్డో. అక్కడ 20-25 ఇళ్లు ఉన్నాయి. అన్ని ముస్లిం కుటుంబాలే. ఆతిథ్యం ఇవ్వటం అనేది మన దేశంలో ఉండనే ఉంది. వారి సోదరులు, పిల్లలు నన్ను రమ్మని ఆహ్వానించారు. కానీ నేను ప్రయాణం కొనసాగించాలని చెప్పాను. ఎడారిలో ఈ సమయంలో వెళల్లేవు. సున్న డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందన్న విషయం తెలుసా? ఎలా ఉంటావు అక్కడ?.. రాత్రి ఇక్కడే ఉండి ఉదయం వెళ్లండి అని అన్నారు. ఆ రాత్రి నేను వారి ఇంట్లోనే ఉన్నాను. వాళ్లిచ్చిన భోజనం చేశాను. నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. నాకు ఏది అవసరం లేదన్నాను. మీరు ఒంటరిగా ఉండలేరు… మాకు అక్కడ ఒక చిన్న గుడిసె ఉంది. మీరు అక్కడే ఉండండి. మీరు పగలు రణ్‌కు వెళ్లి రాత్రికి తిరిగి రావచ్చనని వాళ్లు చెప్పారు. నేను అక్కడికి వెళ్లాను. రణ్‌ తెలుపు రంగు పూసుకొని ఉంది. నేను ఊహించిన దానికంటే బాగుంది. ఈ ఒక్క సంఘటన నా హృదయాన్ని ఏ స్థాయిలో చేరుకుందో ఊహించండి. నా హిమాలయ జీవితంలో నేను అనుభవించిన విషయాలు, మంచు మధ్య జీవితాన్ని గడపటం గుర్తుంది. ఇక్కడ కూడా నేను అదే దృశ్యాన్ని చూశాను. ఆధ్యాత్మిక భావనలు మదిలో మెదిలేవి. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు రణ్‌ ఉత్సవ్ అనే పెద్ద కార్యక్రమాన్ని చేశాను. నేడు ఇది పర్యాటకానికి చాలా పెద్ద గమ్యస్థానంగా మారింది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లుగా ఒక అవార్డును అందుకుంది.

నిఖిల్ కామత్: రేపు మీ జీవితంలో మీకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే ఒక కార్యక్రమం జరుగుతుందని అనుకోండి. అప్పుడు మీ మొదటి కాల్ ఎవరికి వెళ్తుంది?

ప్రధానమంత్రి: శ్రీనగర్ లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి నేను వెళ్లినప్పుడు పంజాబ్‌లోని భాగ్వారా సమీపంలో మా ఊరేగింపుపై దాడి జరిగింది. కాల్పులు జరిగాయి, చాలా మంది చనిపోయారు, ఐదారుగురు గాయపడ్డారు. కాబట్టి శ్రీనగర్ లాల్ చౌక్‌కు వెళితే ఏమవుతుందోనన్న భయం. దేశమంతా ఘర్షణ వాతావారణం ఉండేది. ఇలాంటి స్థితిలో లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం చాలా కష్టం. అక్కడ జెండాను దహనం చేస్తూ ఉండేవారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత మేము జమ్మూకు వచ్చాం. అక్కడ నా మొదటి కాల్ మా అమ్మకు చేశాను. ఇది నాకు సంతోషకరమైన క్షణం. కాల్పులు జరిగాయని తల్లి ఆందోళన చెంది ఉండొచ్చు. కాల్పులు జరిగే ప్రాంతానికి ఎందుకు వెళ్లాడని అనుకోవచ్చు. కాబట్టి నేను మా అమ్మకు మొదటి ఫోన్ చేశాను. ఇప్పుడు నాకు ఆ ఫోన్ ప్రాముఖ్యత అర్థమైంది. నాకు మరెక్కడా అలాంటి భావన కలగలేదు.

నిఖిల్ కామత్: తల్లిదండ్రులను కోల్పోవడం… మీరు ఇటీవల తల్లిని కోల్పోయారు. నేను ఇటీవల మా నాన్నను కోల్పోయాను. మీరు నాకు లేఖ కూడా రాశారు. ధన్యవాదాలు. మీ మదిలో మెదిలే మొదటి విషయం ఏంటి? నేను నా ఉదాహరణ ఇస్తాను. నా తండ్రిని కోల్పోయినప్పుడు.. నేను ఎందుకు ఇలా చేయలేదు? నేను ఎందుకు వెళ్లి ఆయనతో ఎక్కువ సమయం గడపలేదు? నేను పనిని ఎందుకు ఎంచుకున్నాను?.. బహుశా ఆయన కంటే అది, ఇది ఎక్కువ అని తిరిగాను. మీ జీవితంలో ఈ సంఘటన జరిగినప్పుడు, మీరు ఏమి అనుకున్నారు?

ప్రధానమంత్రి: అలాంటి భావన నా జీవితంలో లేదు. ఎందుకంటే నేను చిన్నతనంలోనే ఇంటిని విడిచిపెట్టాను. కాబట్టి నేను ఇంటి కోసం ఉండే వాడిని కానని ఇంట్లో వాళ్లు కూడా అంగీకరించారు. నేను కుటుంబం కోసం పని చేసే వాడిని కానని నేను కూడా ఒప్పుకున్నాను. అలా.. నా జీవితం ఉండిపోయింది. ఎవరికీ ఆ విధమైన అనుబంధం కలిగేందుకు కారణం లేకుండా పోయింది. కానీ మా అమ్మకు 100 ఏళ్లు నిండగానే అమ్మ కాళ్లు మొక్కేందుకు వెళ్లాను. మా అమ్మ చదువుకోలేదు. ఆమె ఏమీ చదవలేదు. ఆమెకు అక్షర పరిజ్ఞానం లేదు. తిరిగి వెళ్లేటప్పుడు నేను ‘అమ్మా.. నాకు పని ఉంది. నేను వెళ్లాలి.. నాకోసం ఏమన్న ఉంటే చెప్పండి’ అని అన్నాను. మా అమ్మ రెండు మాటలు చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. చాలా పెద్ద విషయాలు అవి. అంటే పాఠశాల తలుపులు కూడా చూడని ఆ తల్లి “తెలివితేటలతో పనిచేయి… స్వచ్ఛతతో జీవితాన్ని గడుపు” అని చెప్పింది. ఇప్పుడు ఆమె నోటి నుంచి వచ్చిన ఈ మాటలు నాకు చాలా పెద్దవి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద నిధి అనుకోవచ్చు. గుజరాతీలో ఆమె చెప్పింది. కానీ ఆమె ఉద్దేశ్యం తెలివితేటలతో పనిచేయడం, స్వచ్ఛతతో జీవితాన్ని గడపడం. కాబట్టి దేవుడు ఈ తల్లికి అన్ని ఇచ్చి ఉండొచ్చు. ఆమెలో ఎలాంటి ప్రత్యేకతలు ఉండొచ్చు అని నేను ఆలోచించేవాడిని. నేను ఎప్పుడైనా ఆమెతో ఉన్నట్లయితే ఇలాంటి విషయాలు చాలా నేర్చుకునేవాడిని అని అనుకుంటుంటాను. అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది. ఆమెతో నేను చాలా తక్కువసార్లు మాట్లాడాను. నేను సంవత్సరంలో ఒకటి, రెండు సార్లు మాత్రమే ఆమె దగ్గరికి వెళ్లేవాడిని. ఆ తల్లి ఎప్పుడూ వ్యాధుల బారిన పడలేదు. నేను వెళ్లినప్పుడు కూడా ‘నీకు పని ఉండి ఉంటుంది. త్వరగా వెళ్లు’ అని చెప్పేది. ఇది ఆమె స్వభావం.

నిఖిల్ కామత్: రాజకీయలకు మళ్లీ వస్తున్నాను. ఇంతకుముందు మీరు రాజకీయాలు నీచమైనవి కావని అన్నారు. రాజకీయ నాయకులు రాజకీయాలను నీచంగా చేసి ఉండొచ్చు అని చరిత్ర చెబుతోంది. వ్యవస్థను మార్చాలనుకునే, మార్పు తీసుకురావాలనే ఆదర్శవంతమైన వాళ్లకి రాజకీయాలు ఒక మార్గామా? రెండో ప్రశ్న ఏంటంటే.. రాజకీయాల్లో డబ్బు ప్రభావం. దేశ యువతకు రాజకీయాల్లో చేరండి అని చెబితే.. వారికి వచ్చే రెండో ప్రశ్న.. రాజకీయాలంటే ఎక్కువ డబ్బు కావాలి, ఎలా? మన వద్ద లేదు కదా! అనేది. దీని గురించి మీరు ఏమైనా చెప్పాలకుంటున్నారా? నా జీవితంలో అంకురాల వ్యవస్థలో నేను పనిచేస్తుంటాను. మాకు ఎప్పుడైతే ఒక ఆలోచన వచ్చిందో అప్పుడు మేం స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు తీసుకుంటాం. దీన్ని మేం సీడ్ రౌండ్‌ అంటాం. రాజకీయాల్లో ఇది ఎలా జరుగుతుంది?

ప్రధానమంత్రి: నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. మా ఊళ్లో వసంత్ భాయ్ పరిక్ అనే డాక్టర్ ఉండేవాడు. ఆయన మంచి కంటి వైద్యుడు. సేవాభావం కలవారు. మంచి వక్త కూడా. ఆయన హిందీ బాగా మాట్లాడేవారు. గుజరాతీ కూడా బాగా మాట్లాడేవాడు. ఆయన ఒకసారి స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బాల సేన అని కూడా పిలిచే వానర సేన జెండాలతో తిరిగేది. నాకు మొత్తంగా గుర్తుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజల నుంచి ఒక్కో రూపాయి తీసుకున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో తనకు ఎంత డబ్బు వచ్చిందో చెప్పారు. బహుశా రెండు వందల యాభై రూపాయలు ఖర్చు చేశారనుకుంటా. దానికి సంబంధించిన లెక్కలు చూపించారు. ఆ ఎన్నికల్లో ఆయన చాలా తక్కువ ఓట్ల తేడాతో గెలిచారు. అలాగని సమాజానికి నిజం తెలియదని కాదు. ఓర్పు కావాలి. అంకితభావం కావాలి. రెండోది.. ఒప్పంద భావన ఉండకూడదు. నేను అంత చేస్తే, నాకు ఇన్ని ఓట్లు రావాలని అనుకోకూడదు. ఇలా భావిస్తూ మీరు విజయం సాధించలేరు. అందుకే రాజకీయాలు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు మాత్రమే పరిమితం చేయకూడదు.. దీని నుంచి బయటకు తీసుకురావాలని అన్నాను.

సామాజిక జీవితానికి సంబంధించి మనం చేసే ఏ పని అయినా రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఎవరైనా చిన్న ఆశ్రమం నడిపినా, ఆడపిల్లల చదువుల కోసం పనిచేసినా.. స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆ పనికి రాజకీయ ఫలితాలపై ప్రభావం ఉంటుంది. అందుకే రాజకీయాలను చాలా దీర్ఘ దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యంలో ఓటరు ఒక రకంగా రాజకీయ నాయకుడని అప్పుడప్పుడు చెబుతుంటాను. ఆయన ఓటు వేసినప్పుడు అతను ఆలోచిస్తాడు. ఫలానా వ్యక్తికి ఓటు వేయాలా వద్దా అనేది ఆలోచిస్తాడు. ఆ వ్యక్తి పట్ల అతనికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో నా విషయం తీసుకుంటే నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ నేను రాజకీయ నాయకున్ని కాదని నేను భావిస్తాను. నేను ఈ రాజకీయ ప్రసంగాలు ఎన్నికల సమయంలో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. నాకు నచ్చదు కానీ బలవంతంగా చేయాల్సి ఉంటుంది. ఇది ఎంత బలవంతం అంటే ఎన్నికలప్పుడు మా టీం పూర్తి సమయం దీనిపైనే వెచ్చించాల్సి వస్తుంది. ఎన్నికలు లేనప్పుడు పూర్తి బృందం మొత్తం సమయాన్ని పరిపాలనకే కేటాయిస్తారు. నేను అధికారంలో లేనప్పుడు, నా మొత్తం సమయాన్ని సంస్థాగత, మానవ వనరుల అభివృద్ధి కోసం గడుపుతాను. నా కింద పని చేసే వాళ్ల జీవితాలను రూపుదిద్దే పనిలో గడిపేవాణ్ణి. ఎలా ప్రసంగించాలి? ప్రెస్ నోట్స్ ఎలా రాయాలి? జనసమీకరణ ఎలా చేయాలి… ఇలా ప్రతి పనిలోనూ నిమగ్నమై ఉండేవాడిని. ఇలా చెప్పేందుకు సమయాన్ని వెచ్చించలేదు. నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు కూడా మీరు చూసి ఉంటారు. నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు.. భూకంపం వచ్చింది. నా ముందు ఉన్న పనులలో ఒకటి భూకంపం కాబట్టి నేను భూకంప ప్రభావిత ప్రాంతానికి వెళ్లాను. నేను అధికారులతో ఒక సమావేశం నిర్వహించాను. అప్పటికి భూకంపం వచ్చి తొమ్మిది నెలలైంది. నేను అక్టోబర్ నెలలో వెళ్లాను. కాబట్టి వారు సర్, ఈ పనులు మార్చి నెల నాటికి పూర్తవుతాయని చెప్పారు. సోదరా, మార్చి నెల గురించి ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ సంవత్సర భావన నుంచి బయటపడండి అని చెప్పాను. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని ఆ ఆర్థిక సంవత్సరం జనవరి 26 లోపు మీరు ఏమి చేస్తారో నాకు చెప్పండి. ఎందుకంటే ఒక సంవత్సరంలో ఏమి జరిగిందో జనవరి 26‌న దేశం వచ్చి చూస్తుంది. ఇదే మా లక్ష్యం. కాబట్టి నాకు డిసెంబర్ చివరి ఎంత లక్ష్యాన్ని చేరుకుంటారో చెప్పండి అని అధికారులకు ఆదేశించాను. 43 తాలూకాలు ఉన్నాయి. ప్రతి అధికారీ, ఇన్చార్జీ… ఆ బ్లాకు వరకూ మీరే ముఖ్యమంత్రి.. అక్కడికి వెళ్లి ఎంతవరకు పనులయ్యాయో నాకు తెలియజేయండి అని చెప్పాను. మీరు శుక్రవారం వెళ్లండి. మీరు ఏం చేశారో నేను సోమవారం అడుగుతాను. అందరూ వెళ్లి తిరిగి వచ్చారు. మొదటి సమావేశం జరిగింది. ఈ పనులు పూర్తి కావని ఆ సమావేశంలో చెప్పారు. ఎందుకని అడిగాను. సర్, ఈ నిబంధన అలాంటిది అన్నారు. వీటిని ఎవరు తయారు చేశారని అడిగాను. మేమే తయారు చేశామని చెప్పారు. ఇప్పుడు మీరు క్షేత్రస్థాయికి వెళ్లారు. అక్కడ సామాన్యుల సమస్య ఏంటో మీకు తెలిసింది కదా.. ఇప్పుడు నిబంధనలు మార్చండి అని అన్నాను. ఆ అధికారులు నిబంధనలు మార్చారు. పనులు శరవేగంగా జరిగాయి.. జనవరి నెలలో దేశం, ప్రపంచ నలుమూలల నుంచి మీడియా అక్కడికి వెళ్లినప్పుడు నేను అక్కడ రాజకీయాలు చేయడం లేదని వారు గమనించారు. బృంద స్ఫూర్తితో అందరినీ ఉత్తేజపరిచి ఫలితం వైపు తీసుకెళ్తున్నాను. నేను అనుభవజ్ఞుడిని కాదు.. నేను కొత్తవాడిని. ప్రభుత్వాన్ని నడపడంలో నాకు పరిజ్ఞానం లేదు.

నేను దిల్లీకి వచ్చినప్పుడు ఒకరోజు నా కార్యదర్శులకు ఫోన్ చేశాను. నాకు ఒక ఆలోచన ఉంది. మీరు చేస్తారా అని అడిగాను. హా చెప్పండి సార్ అన్నారు. సెలవు పెట్టి, మీరంతా రెండు మూడు రోజులు కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లాలని చెప్పాను. ఇంతకీ ఇదేమిటని అనుకున్నారు. సెలవులో ఒక పని ఉంది అని చెప్పాను. మీరు ఐఏఎస్ అధికారి అయినప్పుడు… మీరు మీ మొదటి ఉద్యోగం చేసిన గ్రామానికి వెళ్లండి. మీ కుటుంబంతో రెండు రాత్రులు అక్కడే ఉండండి. మీ భార్యాపిల్లలకు చెప్పండి. మీరు ఈ ఆఫీసులో కూర్చునే వారనీ, అప్పట్లో ఫ్యాన్ లేదనీ, ఒకే అంబాసిడర్ కారు ఉండేదనీ.. ఇలా వారికి చెప్పండి. ఓ నలుగురు మాత్రమే ఉండేవారనీ… ఇలా అన్నీ చూపించి రండి… ఆ తర్వాత మాట్లాడుకుందాం అన్నాను. అందరూ చెప్పినట్లుగా వెళ్లి తిరిగి వచ్చారు. నేను వారిని వచ్చారా అని అడిగాను. అవునని చెప్పారు. మీరు వృద్ధులను కలుసుకున్నారా అని అడగ్గా, కలిశామని చెప్పారు. మీ కోసం చాలా లోతైన ఒక ప్రశ్న నా దగ్గర ఉందన్నాను. మీరు 25 లేదా 30 సంవత్సరాల కిందట మీ ఉద్యోగాన్ని ఎక్కడ ప్రారంభించారో అక్కడి వెళ్లారు. 25 సంవత్సరాల క్రితం ఉన్న గ్రామం అదేనా లేదా మారిందా? అని అడిగాను. ఈ ప్రశ్న వారందరి మనస్సును గాయపరిచింది. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని వారు సమాధానం ఇచ్చారు. దీనికి ఎవరు బాధ్యులు అని అడిగాను. వారికి చెడుగా ఏం చెప్పలేదు… కానీ వాస్తవికతను తెలియజేశాను. 25 సంవత్సరాల కిందటి ప్రపంచానికి వారిని తీసుకెళ్లాను. నా పని తీరు ఏంటంటే.. నేను ఎవరిని నొప్పించను. నేను ఎవరిపై దూర్భాషలాడను. ఈ విధంగా పని చేస్తాను.

నిఖిల్ కామత్: కార్పొరేట్ సంస్థల గురించి మాట్లాడితే అంకురాలకు సంబంధించి వ్యాపారం బాగునప్పుడు చాలా మందిని నియమించుకుంటారు. అప్పుడు మార్కెట్ నెమ్మదిస్తుంది లేదా వ్యాపార చక్రం మారుతుంది. వారు చాలా మందిని తొలగించాల్సి ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ కనిష్ఠ ప్రభుత్వం గరిష్ట పాలన అని అంటుంటారు. ఈ విషయంలో మన ప్రభుత్వం ఒక నిర్దిష్ట స్థాయిని చేరుకున్నదా? ఏ విధంగా ముందుకు సాగుతోంది?

ప్రధానమంత్రి: మీకు సరిగ్గా అర్థం చేసుకున్నారు! అవగాహనా రాహిత్యం కారణంగా మన దేశంలో కొందరు కనిష్ఠ ప్రభుత్వం గరిష్ట పాలనను తమదైన శైలిలో అర్థం చేసుకున్నారు. మంత్రుల సంఖ్య తక్కువగా ఉండటం అంటే కనీస ప్రభుత్వం అని కొందరు, తక్కువ మంది ఉద్యోగులు అంటే కనీస ప్రభుత్వం అని కొందరు భావించారు. నేను ఇలా ఆలోచించలేదు. దానికితోడు నేను ప్రత్యేకంగా నైపుణ్య మంత్రిత్వ శాఖ, సహకార మంత్రిత్వ శాఖ, మత్స్య మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాను. కాబట్టి దేశంలోని అన్ని దృష్టి సారించే అంశాల్లో కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అని నేను చెప్పినప్పుడు ఇక్కడ జరిగే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. మీరు అనుమతులు పొందాలంటే, ఆరు నెలలు పడుతుంది. కోర్టు కేసు ఉంటుంది. వందేళ్ల నాటి కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి మేము ఏం చేశామంటే సుమారు 40000 నిబంధనలను తొలగించాం. లేకపోతే ఈ ప్రభుత్వ విభాగం మిమ్మల్ని ఈ విషయం అడుగుతుంది. ఆ పక్కన ఉన్న సోదర అధికారి అదే విషయాన్ని అడుగుతాడు. మూడో వ్యక్తి మళ్లీ అదే కావాలి అని చెబుతాడు. మొదటి వ్యక్తి దగ్గర ఉన్న దానిని ఉపయోగించుకోవాలి! 40,000 నిబంధనలు..దేశంలో ఒక సామాన్యుడు ఎంత ప్రయాస పడాల్సి వస్తుందో మీరు ఊహించవచ్చు. దాదాపు 1500 చట్టాలను రద్దు చేశాను. క్రిమినల్ అంశాలకు సంబంధించిన చట్టాలను మార్చాను. కాబట్టి ఇదే కనిష్ఠ ప్రభుత్వం గరిష్ట పాలనకు సంంధించి నా దార్శనికత. ఈ రోజు ఇవన్నీ జరగటాన్ని నేను చూస్తున్నాను.

నిఖిల్ కామత్: సర్, ఇండియా స్టాక్.. యూపీఐ, ఈకేవైసీ, ఆధార్‌కు సంంధించి ప్రత్యక్ష లబ్ధిదారులం మనమే. వీటిని తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా పనిచేస్తాయని మీరు భావించారా?

ప్రధానమంత్రి: ఈ రోజు నేను 30 సెకన్లలో 10 కోట్ల మంది రైతుల ఖాతాలకు నేరుగా డబ్బు పంపగలను. ఈ రోజు నేను 13 కోట్ల మంది గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఒక్క క్లిక్‌తో 30 సెకన్లలో సబ్సిడీ డబ్బును పంపగలను. ఎందువల్ల? జన్ ధన్ ఖాతాల కారణంగా. దేశంలో కోట్లాది రూపాయల లీకేజీ. గతంలో జరిగిన అవినీతి పోయి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోకి వచ్చింది. ఇప్పుడు మీరు యూపీఐని చూశారు. ఇది యావత్ ప్రపంచానికే ఒక అద్భుతం. ప్రపంచ దేశాల నుంచి అతిథులు వచ్చినప్పుడు, వారు యూపీఐ ఎలా పనిచేస్తుందని అడుగుతారు? విక్రేత వద్దకు వెళ్లమని నేను వారికి చెబుతాను! ఫిన్‌టెక్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తేవటంలో భారత్ ‌ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. నేటి యువత జేబులో మొబైల్ ఫోన్ ఉంటే వారికి ఏమీ అక్కర్లేదు. ప్రపంచం మొత్తం నా జేబులో నా మొబైల్‌లో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం ఉండేదని మన దేశ యువతకు ఏదో ఒక రోజు గుర్తుచేసుకుంటారు. ఇది సాంకేతికత ఆధారిత శతాబ్దం. దేశం ప్రత్యేక ఆవిష్కరణల కోసం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నకవల్పనల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశాను. యువత రిస్క్ తీసుకోవాలి. నేను విఫలమైనా, నేను ఆకలితో చనిపోను…ఎవరో ఒకరు నన్ను చూసుకుంటారని వారు భావించాలి.

ఒకసారి నేను తైవాన్ వెళ్లాను! నా స్వభావం ఒక విద్యార్థి స్వభావం. నాలో ఆ లక్షణం ఉంది. కాబట్టి ఒక విద్యార్థి నాలో సజీవంగా ఉన్నాడని నేను చెప్పగలను. కాబట్టి నేను అక్కడ నాయకులందరినీ కలిశాను. వారిలో ఒక రవాణా మంత్రి ఉన్నారు. ఆయన ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయం నుంచి రవాణాలో పీహెచ్‌డీ చేశారని తెలిసి నేను చాలా సంతోషపడ్డాను. ఆయన మంత్రిగా ఉన్న అంశంపై పీహెచ్‌డీ. అది కూడా అత్యున్నత విశ్వవిద్యాలయం నుంచి చేసి వచ్చారు. ఈ విషయం నాపైన భారీ ప్రభావాన్ని చూపించింది. నా దేశంలో కూడా దేశాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లగల యువత కావాలి. నేను తైవాన్ వెళ్ళినప్పుడు… నాకు ఒక అనువాదకుడు ఉన్నాడు. అతను అర్హత కలిగిన ఇంజనీర్. బాగా చదువుకున్నాడు. కాబట్టి అక్కడి ప్రభుత్వం ఆయన్ని నాకు దుబాసీగా నియమించింది. నేను తైవాన్‌లో 10 రోజుల పర్యటించాను. నేను ఆ ప్రభుత్వ అతిథిని. ఇది కూడా నేను ముఖ్యమంత్రి కాకముందు జరిగింది. కొన్ని రోజులుగా ఆయన నన్ను అడుగుతున్నాడు. సార్, నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను… మీకు అభ్యంతరం లేకపోతే? అన్నాడు. సోదరా.. ఇన్ని రోజులు కలిసి ఉంటున్నాం. నీ మనస్సులో ఏముందో అడుగు అంటే, లేదు లేదు మీరు ఇబ్బంది పడతారంటూ దాటవేస్తున్నాడు. ఇలా చేయకు… నీ మనస్సులో ఏముందో అడుగు అన్నాను. అప్పుడు అడిగాడు. భారత్‌లో చేతబడులు ఇంకా చేస్తున్నారా? పాములు ఆడించే వాళ్లు ఇంకా ఉన్నారా? అని అడిగాడు. భారత్ అంటే ఇలా ఉంటుందనే భావనలో అతను ఉన్నాడు. అతనితో చాలా రోజులు ఉన్నాను. మేం సాంకేతికత గురించి మాట్లాడుకునే వాళ్లం. కానీ అతని ఆలోచన ఈ విధంగా ఉంది. అతన్ని ఒక తమాషాగా తీసుకున్నాను. నేను ఈ విధంగా చెప్పాను. చూడు సోదరా.. మా పూర్వీకులు పాములతో ఆడుకునే వారు. మేం వాటితో ఆడుకోవట్లేదు. మేం ప్రస్తుతం మౌజ్‌తో ఆడుకుంటున్నాం. ప్రతి పిల్లవాడు మౌజ్‌తో ఆడుకుంటున్నాడు అని చెప్పాను. దేశ సామర్థ్యం మౌజ్‌లో ఉందని చెప్పాను. ఆ పాములు ఆడించే భారత్‌ వేరేది.

నిఖిల్ కామత్: ఒక కంపెనీ నిర్మాణంలో మార్కెటింగ్ అతి పెద్ద భాగమనే భారతీయ దృక్పథం వ్యాపార

రంగంలోనూ ఉందని అందరికీ తెలిసిందే. అయితే మీరు భారతదేశం వెలుపల కూడా ఆ దృక్పథాన్ని

మార్చేశారు. వ్యాపారవేత్తల కోసం మీరు దీని గురించి ఏవైనా చిట్కాలు చెప్పగలరా?

ప్రధానమంత్రి: ముందుగా నేను చెప్పేదేంటంటే, అది నేను మార్చాను అని అనడం సరైంది కాదు. ప్రపంచంలో

ఎవరు ఎక్కడికెళ్లినా… భారత ప్రభుత్వం పంపిన వారు భారత రాయబారి అవుతారన్నదే నా అభిప్రాయం.

ఖచ్చితంగా వారు మన జాతీయ రాయబారి అవుతారు. మనం వారిని మనలో భాగంగా భావిస్తే, మన శక్తి

అనేక రేట్లు పెరుగుతుంది. మీకు తెలిసే ఉంటుంది. మేము నీతి ఆయోగ్‌ను రూపొందించాం. దాని ప్రారంభంలో

పేర్కొన్న మా లక్ష్యాల్లో ఒకటి ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరినీ ఐక్యం చేయాలి. ఇదే

దానిలో రాశారు. రెండోది, నేను ముఖ్యమంత్రి కావడానికి ముందే అనేకసార్లు విదేశాలకు వెళ్లాను. అక్కడ

నేను ఎక్కువగా ఆయా సంస్థలకు చెందిన వ్యక్తుల మధ్యే గడిపేవాడిని. వారి మధ్యన ఉండడం వల్ల వారి

బలమేంటో నాకు తెలిసింది. అలాగే వారిలో నాకు పరిచయస్థులు కూడా ఉన్నారు. అటల్ జీ ఆదేశాలతో ఒక

పనిమీద నేను విదేశాలకు వెళ్లిన సందర్భంలో నేను ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశాను. ఈ బలాన్ని

గతంలో ఉపయోగించుకోలేదు. అయితే నేను వీరిని ఐక్యం చేయడం ప్రారంభించగానే, అప్పుడు విదేశీ

నేతలకు ఇది చాలా పెద్ద బలమనే విషయం తెలిసివచ్చింది. రెండో విషయం ఏమిటంటే, అతి తక్కువ నేరాలు

ఉన్నది భారతీయుల్లోనే. బాగా చదువుకున్న వారు భారతీయులే. చట్టాలను గౌరవించే వారు కూడా

భారతీయులే. దీంతో భారతీయుల పట్ల గౌరవభావం పెరగడం మొదలైంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావం

కారణంగానే నేడు భారతదేశ ప్రతిష్ట పెరుగుతూ వస్తోంది.

నిఖిల్ కామత్: సర్, నేను ఆ ఉద్దేశంతో అనడం లేదు కానీ, నేను 14, 15, 16, 20 ఏళ్లు, 25 ఏళ్ల

వయస్సులో బెంగళూరులో చదువుకుంటున్న సమయంలో, ఎవరైతే కాలేజీ చదువులు పూర్తి చేసి, అమెరికా

వెళ్లి, అక్కడే పీహెచ్‌డీ చేసి, మైక్రోసాఫ్ట్ లేదా అలాంటి ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేయడం చాలా గొప్ప

గౌరవంగా భావించేవాళ్లం. అంతకుమించిన విజయం ఉంటుందని కూడా మాకు అప్పుడు తెలియదు. కానీ

ఇప్పుడు నేను 18 ఏళ్ల వయస్సులో ఉన్న భారత యువతతో మాట్లాడినప్పుడు నాకు తెలిసిందేంటంటే, వారు

అలా ఆలోచించడం లేదు. వీరంతా భారతదేశంలో ఎదగడం గురించి మాట్లాడుతున్నారు. వీరు విదేశాలకు వెళ్లి

కళాశాల చదువులు చదవడం గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. కాబట్టి గతంతో పోలిస్తే ఇది

చాలా పెద్ద మార్పు. అలాగే సర్ వ్యాపార, రాజకీయ రంగాల మధ్య చూస్తే, వ్యాపార రంగంలో పోటీ ఉండడం

చాలా మంచిది అవుతుంది. మరి మీ రాజకీయ రంగంలోనూ పోటీ మంచిదే అంటారా?

ప్రధానమంత్రి: దీని గురించి నేను మీకు రెండు, మూడు వేర్వేరు విషయాలు చెప్తాను. నేను ఒక విషయం బహిరంగంగా చెప్పాను. విదేశాల్లో ఉన్న భారతీయులంతా వెంటనే భారత్‌కు తిరిగి రావాలని నేను పిలుపునిచ్చాను. సాధ్యమైనంత త్వరగా భారత చేరుకోవాలని లేకుంటే బాధపడతారని కూడా చెప్పాను. ఎందుకంటే భారత్‌లో పరిస్థితులు చాలా సానుకూలంగా మారుతున్నాయని చెప్పాను. అలాగే నాకు ఒక విషయం గుర్తుంది.. మీరు మధ్యలో నన్ను ఎదురుదెబ్బల గురించి ఒక ప్రశ్న అడిగారు కదా.. గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిగా ఉన్న నాకు అప్పట్లో అమెరికా ప్రభుత్వం వీసా ఇవ్వడానికి నిరాకరించింది. వ్యక్తిగతంగా అయితే నాకు అమెరికా వెళ్లడం పెద్ద విషయం కాదు. అప్పటికే నేను పలుసార్లు అక్కడికి వెళ్లాను. అక్కడ పెద్దగా ఎవరూ నాతో మాట్లాడలేదు. అయితే ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి, ఒక రాష్ట్రానికి, మన దేశానికి కూడా ఆ నిర్ణయం అవమానకరం అని నేను భావించాను. కొంతమంది అసత్యాలు ప్రచారం చేస్తే వారు ఇలా చేయడం సరైనదేనా, ఏం జరుగుతోంది ఈ ప్రపంచంలో అని నేను బాధపడ్డాను. ఆ బాధను నా మనస్సులో దాచి ఉంచుకున్నా. కానీ ఆ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ‘‘నాకు అమెరికా ప్రభుత్వం వీసా నిరాకరించింది’’ అని చెప్పాను. నేను చెప్పాల్సినదంతా చెప్పేశాను. పాత్రికేయులు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు వాటికి సమాధానమిస్తూ ఆనాడు నేను ఒకే మాట చెప్పాను, చూడండీ! ప్రపంచమంతా భారతదేశ వీసాల కోసం వరుసలో నిలబడి వేచి ఉండే రోజు నాకు కనిపిస్తోంది అన్నాను. అది 2005లో నేను చెప్పిన మాట… నేడు మనం 2025కి చేరుకున్నాం. చూడండి, ఇప్పుడు అదే జరుగుతోంది. నాకు కనిపిస్తోంది… ఇది ఖచ్చితంగా మన సమయం. ఇటీవలే నేను కువైట్ వెళ్లాను. అక్కడ కార్మికుల కాలనీకి వెళ్లి కార్మికుల కుటుంబాలతో మాట్లాడాను. ఈ కార్మికులంతా 10-15 ఏళ్ల కిందటే అక్కడికి వలస వెళ్లినవారు. ఏదో వివాహ వేడుక కోసం భారత్‌కు వచ్చి వెళ్లిపోతుంటారు. అంతేతప్ప మన దేశంతో వారికి ప్రస్తుతం పెద్దగా సంబంధాలు లేవు. అక్కడ ఒక కార్మికుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. అతను మన దేశంలో ఒక మారుమూల ప్రాంతానికి చెందినవాడు. ఆయన మా ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడు ఏర్పాటవుతుందని అడిగాడు. చూడండి, పదిహేనేళ్ల క్రితం భారత్ విడిచి వెళ్లిన వ్యక్తి కూడా తన జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రం కావాలని కోరుకుంటున్నాడు. నిజంగా ఈ ఆకాంక్ష చాలా గొప్పది. ఇటువంటి ఆకాంక్షలతోనే 2047 నాటికి మన లక్ష్యమైన వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) సాధ్యమవుతుంది. నా దేశంలో యువత, సామాన్య ప్రజలు అందరిలోనూ ఇలాంటి ఆకాంక్ష ఉంది.

నిఖిల్ కామత్: నేడు ప్రపంచదేశాలన్నీ యుద్ధంవైపు అడుగులేస్తున్నాయి. ఉదాహరణకు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది, అలాంటి అన్ని దేశాల్లోనూ భారతీయులు ఉన్నారు, మీరు భారత ప్రధాని హోదాలో వారిని రక్షించే బాధ్యత కలిగి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం జరుగుతుందని అనుకుంటున్నారు. ఏం జరుగుతున్నదని భావిస్తున్నారు.. ప్రపంచంలో జరుగుతున్న వాటి గురించి మనం ఆందోళన చెందాలా? దీని గురించి మీరు ఏం చెబుతారు..

ప్రధానమంత్రి: ప్రపంచానికి మన పట్ల విశ్వాసం ఉంది. దీనికి కారణం మనం కపటంతో వ్యవహరించడం లేదు. మనం మన వైఖరిని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ సంక్షోభ సమయంలో, మనం తటస్థంగా లేమని చెబుతూనే ఉన్నాం. మేము తటస్థ వైఖరిని అవలంబించడం లేదని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. మనం తటస్థంగా ఉన్నామనే వారికి నేను ఒకటే చెబుతున్నాను, నేను తటస్థంగా లేను. నేను శాంతి పక్షం వహిస్తున్నాను. నేను శాంతికి కట్టుబడి ఉన్నాను. దానికోసం చేసే ఎలాంటి ప్రయత్నానికైనా నేను మద్దతిస్తాను. నేను రష్యాకు ఇదే విషయం చెబుతున్నాను. ఉక్రెయిన్‌కు కూడా ఇదే విషయం చెబుతున్నాను. నేను ఇదే విషయం ఇరాన్‌కు చెబుతున్నాను. ఇదే విషయాన్ని పాలస్తీనాకు కూడా చెబుతున్నాను. అలాగే ఇజ్రాయిల్‌కు కూడా నేను ఇదే మాట చెబుతున్నాను. నేను చెప్పేది నిజమని వారు నమ్ముతున్నారు. దాని వల్ల భారత్ విశ్వసనీయత పెరిగింది. ఎలాగైతే దేశవాసులందరూ ఏదైనా సంక్షోభం తలెత్తితే తమ దేశం తమకు అండగా ఉంటుందని నమ్ముతారో అలాగే ప్రపంచ దేశాలు కూడా నేడు భారత్ పట్ల అదే నమ్మకంతో ఉన్నాయి. చూడండీ, కరోనా వంటి ఒక పెద్ద సంక్షోభం తలెత్తినప్పుడు, మొదటిసారిగా కేసులు వెలుగుచూసిన దేశంలో మన దేశ పౌరులు ఉన్నారు, అప్పుడు నేను భారత వైమానిక దళంతో ఒకే మాట చెప్పాను. చూడండీ ఇది చాలా క్లిష్టమైన పని. మీలో స్వచ్ఛందంగా ముందుకువచ్చే వారినే ఈ పని కోసం పంపిస్తానని చెప్పాను. అయితే వారంతా కూడా మేం సిద్ధమంటూ ముందుకు వచ్చారు. వారికి కూడా తెలుసు. ఇది మరణంతో చెలగాటమని, అయినా వీరు అక్కడికి వెళ్లి మనవారిని క్షేమంగా తీసుకువచ్చారు. దేవుని దయతో వారికి ఎలాంటి హాని జరగలేదు. వారు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ పౌరులను కూడా తీసుకువచ్చారు. చూడండీ, నా దేశ ప్రజలు కష్టంలో ఉంటే, వారి గురించి ఎవరు ఆందోళన చెందుతారు? ఈ సంఘటన నాకు బాగా గుర్తుంది. నేపాల్‌లో భూకంపం వచ్చిందని నాకు తెలిసింది, భూకంప ప్రాంతంలో సహాయక చర్యల కోసం మన దేశం నుంచి సిబ్బందిని అక్కడికి పంపాం. మూడు-నాలుగు రోజుల తరువాత నేపాల్ నుంచి భారతీయులను తీసుకువచ్చే విమానం మన దేశానికి బయలుదేరినప్పుడు నాతో ఒకరు అన్నారు. సాధారణంగా ఈ విమానం సరుకులతో వెళ్లి ప్రయాణికులతో తిరిగి వస్తుంది. ప్రయాణికులతో నిండిన ఆ విమానంలో ఉన్న ఒక వ్యక్తి ఇలా అన్నారు. నేను ఒక వైద్యున్ని, నేను ఇంతకాలం ప్రభుత్వాలను విమర్శిస్తూ ఉన్నాను. ఆ ప్రభుత్వం ఏదైనా, ప్రభుత్వం పన్నులు తీసుకుంటుంది, ఆదాయ పన్ను తీసుకుంటుంది, ఇంకా ఇదీ, అదీ అని చాలా పన్నులు వసూలు చేస్తుందని నాకు అవకాశం దొరికినప్పుడల్లా నేను విమర్శలు చేస్తూ ఉండేవాడిని. కాని ఈరోజు నాకు ఆ పన్నుల విలువ ఏమిటో అర్థమైంది. ఇప్పుడు నేను ప్రాణాలతో తిరిగి వెళ్తున్నాను. మన దేశ ప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా సేవలందించినప్పుడు… అక్కడి వారి హృదయాల్లో కూడా మంచితనం మేల్కొంటుంది. వారు కూడా ఏదైనా మంచి చేయాలని భావిస్తారు. అలాగే అది నాకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను అబుదాబికి వెళ్లినప్పుడు, అక్కడ యువరాజును ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తే బాగుంటుందని అడిగాను. క్షణం ఆలస్యం చేయకుండా ఆయన ఒక ముస్లిం దేశంలో హిందూ ఆలయ నిర్మాణం కోసం అనుమతి మంజూరు చేశారు. ఈరోజు కోట్లాదిమంది హిందువులు చాలా సంతోషంగా ఉన్నారు…

నిఖిల్ కామత్: మనం ఇతర దేశాల గురించి మాట్లాడుకుంటున్నట్లుగానే… నేను ఇప్పుడు కొంచెం మన చర్చకు సంబంధం లేని విషయం మాట్లాడుతున్నాను. నన్ను మీరు నాకు బాగా ఇష్టమైన ఆహారం ఏదని అడిగితే నేను పిజ్జా అని చెబుతాను. ఈ పిజ్జా ఇటలీకి చెందింది. ఇంటర్నెట్‌లో చాలామంది చెబుతుంటారు. మీకు ఇటలీ గురించి చాలా తెలుసు అని. దీని గురించి మీరు ఏమైనా చెబుతారా? మీరు మీ గురించిన మీమ్స్ చూసి ఉంటారు కదా?

ప్రధానమంత్రి: లేదు. అలాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటి గురించి నేను సమయం వృధా చేయను. నేను ఆహారం గురించి అంతగా ఆలోచించే వ్యక్తిని కాదు.

నిఖిల్ కామత్: అస్సలు ఆలోచించరా?

ప్రధానమంత్రి: ఖచ్చితంగా కాదు! అందుకే ఏ దేశానికి వెళ్లినా కూడా అక్కడ ఏది వడ్డిస్తే దానినే నేను చాలా ఇష్టంగా తింటాను. కాని నా దురదృష్టం ఏమిటంటే.. మీరు ఈరోజు నన్ను రెస్టారెంట్ కి తీసుకెళ్లి, మెనూ ఇచ్చి ఏదైనా ఎంపిక చేయమని చెబితే, నేను అది కూడా చేయలేను.

నిఖిల్ కామత్: సర్, మీరు రెస్టారెంట్‌కు వెళ్లగలరా?

ప్రధానమంత్రి: నాకు వెళ్లడం వీలుపడదు. ఇప్పటిదాకా నేను వెళ్లలేదు.

నిఖిల్ కామత్: మీరు వెళ్లి ఎంతకాలమైంది?

ప్రధానమంత్రి: చాలా ఏళ్లయింది!

నిఖిల్ కామత్: మరి మీరు బయటకి వెళ్లినప్పుడు..

ప్రధానమంత్రి: గతంలో నేను సంస్థ కోసం పనిచేస్తున్నప్పుడు, మా అరుణ్ జైట్లీ బాగా ఆహార ప్రియులు. భారతదేశంలో ఏ నగరంలోని ఏ రెస్టారెంట్‌లో ఏ ఆహారం బాగుంటుందనే విషయంలో ఆయన ఒక ఎన్‌సైక్లోపీడియా వంటివారు. కాబట్టి మేము ఎప్పుడైనా బయటకి వెళితే, మేము అతనితో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేసేవాళ్లం. కాని ఈరోజు నాకెవరైనా మెనూ ఇచ్చి ఏదైనా ఎంపిక చేయమంటే మాత్రం నేను చేయలేను ఎందుకంటే నేను మెనూలో చదివే పేరు, తెచ్చిన వంటకం ఒకటేనా అనేది కూడా నాకు తెలియదు. ఆ విషయంలో నాకు పరిజ్ఞానం లేదు… నాకు అది అర్థం కాదు. కాబట్టి నేను ఎప్పుడూ ‘‘అరుణ్ జీ ఆర్డర్ మీరే చేయండి’’ అనే వాడిని. నాకు శాఖాహారం అయితే చాలని చెప్పేవాడిని.

నిఖిల్ కామత్: నేను మీ స్నేహితులు కొంతమందితో మాట్లాడాను.. స్నేహితులు అంటే 10-20 సంవత్సరాలుగా మీకు తెలిసినవారితో నేను మాట్లాడాను. నేను వారిని పబ్లిక్ డొమైన్‌లో లేని విషయాలు ఏమైనా చెప్పమని అడిగాను. నేను వారి పేర్లు చెప్పడం లేదు. వారు నాకు ఒక ఫోటో పంపించారు, దానిలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతున్న దృశ్యం ఉంది. కొందరు సీనియర్ రాజకీయ నాయకులు కుర్చీలో కూర్చున్నారు. మీరు కింద నేలపై కూర్చుని ఉన్నారు. నాకు 38 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు నేను కూడా ఆ ఫోటో చూశాను. నాకు మాత్రం మీరు ప్రధానమంత్రిగా ఉన్న విషయం లేదా మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి విషయాలు మాత్రమే గుర్తున్నాయి. అంతకుముందు మీ గురించి నాకు ఏమీ చూసిన గుర్తులేదు. అలా ఆ ఫోటోను నేను చూడగానే, నేను దాన్ని మళ్లీ మళ్లీ చూస్తుండిపోయాను. అక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ వరకు అంటే ఇప్పుడు ఎవరూ మిమ్మల్ని ‘నువ్వు’ అని సంభోదించలేని అంటే మీరు ఇంతకుముందు చెప్పిన మీ గురువులు కూడా మిమ్మల్ని ‘నువ్వు’ అని సంభోదించలేని ఈ స్థాయి వరకు వచ్చిన ఈ మార్పు గురించి మీరు మాట్లాడాలనుకుంటే, దాని గురించి మీరు ఏమి చెబుతారు?

ప్రధానమంత్రి: ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, నన్ను ఎవరూ ‘నువ్వు’ అని సంభోదించలేరు అని నేను చెప్పడం లేదు.

నిఖిల్ కామత్: ఎవరూ అలా పిలవడం లేదు, కాని..

ప్రధానమంత్రి: హా, అలా పిలవడం వినలేకపోతున్నాను, కాని దాని అర్థం ఎవరూ నన్ను ‘నువ్వు’ అని సంభోదించలేరు అని మాత్రం కాదు.

నిఖిల్ కామత్: కరెక్ట్! కరెక్ట్!

ప్రధానమంత్రి: అలా పిలవడం నేను వినలేకపోతున్నాను ఎందుకంటే, జీవితం అలాంటి పరిస్థితిలో ఉంది. రెండో విషయం, హోదా మారిపోవచ్చు. పరిస్థితులు మారవచ్చు అలాగే వ్యవస్థలు మారవచ్చు, మోదీ మాత్రం ఎప్పుడూ వారితో కలిసి కింద కూర్చున్న వ్యక్తిగానే ఉన్నారు. కాబట్టి అది నాకు పెద్ద విషయం కాదు. నేను ఊరికే అలా చెప్పడం లేదు, నిజంగా అది నాకు అంత ముఖ్యమైన విషయం కాదు. నిఖిల్ కామత్: అలాగే, సర్ మీకు గుర్తుండే ఉంటుంది, గత సంవత్సరం వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమంలో నేను మీ సమక్షంలో ప్రసంగించాను. కాని ఆ ప్రసంగం నాకు అస్సలు నచ్చలేదు, దాంతో నేను దాని కోసం ఒక శిక్షకుడిని నియమించుకున్నాను, అలాగే ఏడాది కాలంగా నేను బాగా మాట్లాడగలగడం గురించి శిక్షణ

తీసుకుంటున్నాను, దానికోసం ఓ గురువు కూడా నాకు ఉన్నారు. కాని మీరు అంత బాగా ఎలా మాట్లాడగలుగుతారు? మీరు నాకు ఏవైనా చిట్కాలు చెప్పగలరా? దీని గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనుకుంటున్నారు.

ప్రధానమంత్రి: ఇక్కడ రెండు-మూడు వేర్వేరు విషయాలు ఉన్నాయి. ఒకటి, నన్ను ఎప్పుడూ

అడుగుతుంటారు, మీరు గుజరాతీ కదా, మరి ఇంతబాగా హిందీ ఎలా మాట్లాడగలుగుతున్నారు అని… గతంలో నేను సంఘ్ కోసం పనిచేస్తున్న సమయంలో చాలామంది నేను ఉత్తర భారతదేశానికి చెందినవాడినని, ఇక్కడ గుజరాత్‌లో పనికోసం వచ్చి ఉంటున్నానని అనుకునేవారు. దానికి కారణం ఏమిటంటే మేము రైల్వే స్టేషన్ దగ్గర టీ అమ్మేవాళ్లం. అలాగే మా ఊరి పేరు మెహసానా, మెహ్ అంటే గేదె, మెహసానా అంటే గేదె! కాబట్టి నా గ్రామానికి చెందిన గేదెల పాలు ఇవ్వడం ప్రారంభించగానే, కొంతమంది వాటిని ముంబయికి తీసుకెళ్లి, అక్కడ ముంబయిలో వ్యాపారం చేసేవారు. ఆ తరువాత గ్రామానికి తిరిగి వచ్చేవారు. ఇలాంటి వ్యాపారం ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన వ్యక్తులు చేసేవారు. ఇలా ఈ వ్యాపారం చేసుకునే వాళ్లు 30-40 మంది రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ మీద గూడ్స్ బండి కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. నేనేమో అక్కడ

టీ అమ్ముతూ ఉండేది. వారు ఇలా వచ్చిన ప్రతిసారి గూడ్స్ బండి కోసం వేచి చూస్తూ ఉండేవారు. బండి రాగానే వారు దానిలో గడ్డి నింపి, నాలుగు గేదెలను దానిలోకి ఎక్కించే ఏర్పాట్లు చేసేవారు. చిన్నతనంలో నేను వారికి టీ ఇవ్వడానికి వెళ్లి వారితో మాట్లాడుతూ ఉండేవాడిని. వారితో మాట్లాడుతూనే నేను హిందీ నేర్చుకున్నాను. ఇలా గేదెల వ్యాపారం చేసుకునేందుకు వచ్చే వారంతా కూలీలే, వారు సాయంకాలం వేళల్లో భజనలు, కీర్తనలు పాడేవారు. వాళ్లు టీ అడుగుతుండేవారు, నేను వాళ్లకు టీ అమ్మడానికి వెళ్లినప్పుడు, వారితో హిందీలో మాట్లాడాల్సి వచ్చేది, దాంతో నేను కూడా హిందీలో మాట్లాడటం నేర్చుకున్నా.

నిఖిల్ కామత్: ఇది చాలా కష్టం సర్! మీరు గుజరాత్‌లో పుట్టి పెరిగారు. ఇప్పుడు మీరు ఢిల్లీలో

ఉంటున్నారు. ఈ రెండు నగరాల్లో ఉండడం వ్యక్తిగతంగా మీకు చాలా విభిన్నంగా అనిపిస్తుందా?

ప్రధానమంత్రి: మనం నగరంలో ఎక్కడ ఉంటున్నాం? మనం ఇంట్లో ఒక మూలన ఉంటున్నాం. ఇంటి

నుంచి ఆఫీస్‌కు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ మనం బయటి ప్రపంచానికి దూరమయ్యాం. ప్రభుత్వ వ్యవస్థ

ఈ విధంగా ఉన్నప్పుడు, నగరానికి అలాగే మరో దానికి తేడా చెప్పడం కష్టం.

నిఖిల్ కామత్: అలాగే ఇది నా చివరి ప్రశ్న సర్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాను…

ప్రధానమంత్రి: కానీ దీనికి ముందు మీరు అడిగిన ప్రశ్న ప్రసంగం గురించినది కదా…

నిఖిల్ కామత్: అవును సర్, దాని గురించి నేను నేర్చుకోవాలనుకుంటున్నా!

ప్రధానమంత్రి: చూడండి, ఇప్పుడు ఎక్కడైనా ఒక గొడవ జరిగింది అనుకోండి. ఏదో జరిగింది అలాగే

అక్కడ నలుగురు పూర్తి నిరక్షరాస్యులు ఉన్నారనుకుందాం. వారు ఆడవాళ్లు కావచ్చు, ముసలి వాళ్లు

కావచ్చు అయితే మీరు మైక్ పట్టుకుని వారి ఎదుట నిలబడి ఏమైందని అడిగారనుకోండి. వారు వెంటనే

చెప్పడం మొదలుపెడతారు. ఇలా జరిగింది, ఇది జరిగింది, వాళ్లు ఒక్కసారిగా ఉద్వేగంగా మట్లాడుతుంటారు..

ఇలా జరిగిందని చెబుతుంటారు.. వారు ఎంతో చక్కని పదాలు ఉపయోగించడం, చక్కని వ్యక్తీకరణలు

ప్రదర్శించడం, చక్కగా జరిగిన విషయాన్ని వివరించడం మీరు చూడవచ్చు. ఎందుకు? అది స్వీయ

వ్యక్తీకరణ. మీ నుంచి ఆ మాటలు వస్తున్నాయి. మీరు ఎలా చెబుతున్నారు.. చెప్పే విధానం ఎలా ఉందనేది

ముఖ్యం కాదు. మీరు చెప్పే దానిలో మీ అనుభవం అనే బలం ఉందా లేదా అనేది ముఖ్యం. మీరు చెప్పే

దానితో స్వయంగా మీరు అంగీకరిస్తున్నారా లేదా అనేది ముఖ్యం.

నిఖిల్ కామత్: మీరు ఏదైనా విచారకరమైన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మీ మనసులో ఆ

అనుభూతి కలుగుతుందా… మీకు ఆ విషయం గురించి బాధగా అనిపిస్తుందా?

ప్రధానమంత్రి: అవును! మీరు చూసే ఉంటారు, చాలా మంది నా గురించి తప్పుగా అనుకుంటారు.. కానీ నేను ఎక్కువగా పేదవారితో మాట్లాడే సమయంలో నన్ను నేను నియంత్రించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను భావోద్వేగానికి లోనవుతాను. వార్తాపత్రికల్లో దీని గురించి నన్ను విమర్శిస్తుంటారు, కాని నన్ను నేను నియంత్రించుకోలేను. సమాజంలో అలాంటి పరిస్థితులను నేను చూసినప్పుడు, వాటిని నేను గుర్తుచేసుకున్నప్పుడు, అలాంటి అనుభూతి సహజంగానే నాకు కలుగుతుంది.

నిఖిల్ కామత్: అలాగే సర్ మీ జీవితంలో మీరు నేర్చుకున్న వాటి ఆధారంగా, మీకున్న ఇంత అనుభవం ఆధారంగా, మీ పరిజ్ఞానం ఆధారంగా.. 20 ఏళ్ల వయస్సు గల వారి కోసం ఏదైనా చెప్పాలంటే మీరు ఏమి చెబుతారు?

ప్రధానమంత్రి: యువతకు ఉపదేశం ఇచ్చే అర్హత నాకుందని నేను ఎప్పుడూ భావించను. అలాగే వారికి ఆదేశాలు ఇచ్చే హక్కు కూడా నాకు లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, నాకు నా దేశ యువత పట్ల చాలా విశ్వాసం ఉంది. ఒక గ్రామానికి చెందిన యువకుడు అంటాడు…‘‘ నేను ఉద్యోగం చేయను స్టార్టప్ ప్రారంభిస్తాను’’ అని, మూడు స్టార్టప్స్ విఫలమైనా పర్వాలేదు కాని అదే చేస్తానని చెబుతాడు. మన దేశంలో స్టార్టప్ అనే పదం కొత్తగా వినిపిస్తున్న సందర్భంలో నాకు గుర్తుంది నేను మొదటి స్టార్టప్ సదస్సు నిర్వహించాను. కానీ నాకు తెలుసు దాని బలమేంటో. అక్కడ స్టార్టప్‌లను ఏర్పాటు చేసిన కొంతమంది ఆడబిడ్డలను వారి అనుభవాలు చెప్పమని నేను అడిగాను. అప్పుడు ఒక అమ్మాయి లేచి తన అనుభవాన్ని చెప్పింది. తాను కలకత్తా నుంచి వచ్చిన బెంగాలీ అమ్మాయినని ఆమె చెప్పింది. ఆమె ఒక స్టార్టప్ ప్రారంభించింది. ఒకసారి తన తల్లిని కలవడానికి వెళ్లినప్పుడు తాను ఉద్యోగం మానేశానని తల్లితో చెప్పింది. అప్పుడు మరి ఏం చేద్దామనుకుంటున్నావ్ అని అడిగితే… స్టార్టప్ ప్రారంభించాననీ, అది విఫలం అయిందని చెప్పింది. ఈ విషయాన్ని చాలా నాటకీయంగా వర్ణించి మరీ చెప్పింది. అప్పట్లో అలా ఉండేది. స్టార్టప్ అంటేనే సర్వనాశనం అని భావించేవారు. ఇప్పుడు స్టార్టప్ ప్రతిష్టను, విశ్వసనీయతను సంపాదించుకుంది. నా అభిప్రాయంలో నేడు, ఒక చిన్న గ్రామంలో అయినా ఎవరైనా స్టార్టప్ ప్రారంభించి విఫలమైనా కూడా, అక్కడి ప్రజలు అతనిని సామర్థ్యం ఉన్న ఆదర్శవంతమైన వ్యక్తిగా గుర్తిండమే కాకుండా, అతను తెలివైనవాడని, ఏదో చేస్తున్నాడని గౌరవిస్తున్నారు.

నిఖిల్ కామత్: అలాగే సర్ నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. ప్రధానమంత్రిగా మీ మొదటి హాయాంతో

పోల్చితే రెండో హాయాం ఎలా ఉంది? రెండో దానితో పోల్చితే మూడో హాయాం ఎలా భిన్నంగా ఉంది?

ప్రధానమంత్రి: మొదటి హాయాంలో అయితే ప్రజలు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అలాగే నేను కూడా ఢిల్లీని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. మొదటి, రెండో హాయాంలలో నేను రేపటి గురించి ఆలోచిస్తూ పాలన సాగించాను. ఈరోజు ఇక్కడ ఉన్నాం, రేపు ఎక్కడ ఉండాలి, ఇంతకుముందు ఇంత అయ్యేది, ఇప్పుడు ఇంత చేయాలి అని ఆలోచించేది. మూడో హాయాంలో నా ఆలోచనా విధానం మారిపోయింది. నా ధైర్యం మరింత బలపడింది. నా కలలు మరింత విస్తరించాయి. నా లక్ష్యాలు పెరుగుతూనే ఉన్నాయి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, 2047 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) సాధించాలి, ఇది కేవలం మాటల్లోనే కాదు, ప్రతి విషయంలోనూ సమస్యల నుంచి ముక్తి లభించాలి. అన్ని సమస్యలకు పరిష్కారం కల్పించాలి. మరుగుదొడ్లు 100 శాతం ఉండాలి. విద్యుత్ 100 శాతం

ఉండాలి. అలాగే కుళాయి నీరు 100 శాతం ఉండాలి. సామాన్య ప్రజలు వారికి దక్కాల్సిన ప్రయోజనాల కోసం అడుక్కోవాల్సిన అవసరం ఉండకూడదు. ఇది ఆంగ్లేయుల రాజ్యం కాదు కదా… అది వారి హక్కు, కాబట్టి

దేశంలో అందరికీ 100 శాతం లబ్ది కలగాలి. లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు 100 శాతం అందించాలి.

వారందరికీ వాటి ప్రయోజనం 100 శాతం దక్కాలి. ఎలాంటి భేదభావాలు ఉండకూడదు. అదే నిజమైన

సామాజిక న్యాయం. అదే నిజమైన సెక్యులరిజం. కాబట్టి ఆ అంశాలను నేను ప్రాధాన్యం ఇస్తుంటాను. అలాగే

వాటి కోసం చోదక శక్తి ఆస్పిరేషనల్ ఇండియా (ఆకాంక్షాత్మక భారతదేశం), నా ఉద్దేశ్యంలో ఏఐ అంటే

ఆస్పిరేషనల్ ఇండియా (ఆకాంక్షాత్మక భారత్). కాబట్టి నేను ఒకటే ఆలోచిస్తాను. నేను 2047లో ఇక్కడ

ఉండాలంటే, ఇప్పుడు 2025లో నేను ఇక్కడ ఉన్నాను, అంటే నేను ఇంకా ఎంత ముందుకు వెళ్లాలి అని

ఆలోచిస్తాను. మొదట్లో అయితే మొదటి నుంచి నేను ఇప్పటి వరకు ఎంత ముందుకు వచ్చాను అని ఆలోచించేది. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే రేపు ఎక్కడ వరకు వెళ్లగలనని ఆలోచిస్తున్నాను, కాబట్టి నా మనస్సులో నా ఆలోచనలన్నీ 2047 గురించే నడుస్తుంటాయి. కాబట్టి నా మూడవ హాయాం మొదటి రెండు హాయాంల కంటే అనేక రేట్లు విభిన్నమైనది. పూర్తిగా మారిపోయింది. అలాగే అత్యంత పెద్ద స్వప్నం కలిగి ఉంది.

నిఖిల్ కామత్: అలాగే సర్, మీ తరువాత ఇంకా ఏదైనా ప్రణాళిక ఉందా? ఈరోజు కోసం కాదు, కాని 20 ఏళ్లు, 30 ఏళ్ల తరువాత కోసం, మీరు నమ్మకం కలిగి ఉన్న, మీరు శిక్షణ ఇచ్చిన, బోధిస్తున్న యువత ఉన్నారా?

ప్రధానమంత్రి: నేను చూస్తున్నాను. సామర్థ్యం కలిగిన వారు ఎందరో ఉన్నారు. నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు చెబుతూ ఉండేవాడిని. నాతో అయినంత కాలం నేను ప్రభుత్వాన్ని నడుపుతాను. కాని తరువాతి 20 ఏళ్ల కోసం కొంత మందిని సన్నద్ధం చేసి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను, అలాగే నేను చేశాను, నా విజయం దీనిలోనే ఉంది, ఈ విషయాలను చక్కగా నిర్వహించగలిగే నా బృందాన్ని నేను సన్నద్ధం చేస్తున్నాననే దానిలోనే నా విజయం ఉంటుంది, నాకు అదే ప్రమాణం.

నిఖిల్ కామత్: సర్ అలాగే నా చివరి ప్రశ్న ఏమిటంటే, రాజకీయ నాయకునిగా మారేందుకు కనీస

అవసరాలు అంత ఎక్కువగా ఏమీ లేవు. వారు 25 ఏళ్లు పైబడిన వయస్సు కలిగి ఉండాలి. రెండేళ్లకు మించి

జైలు శిక్షపడిన వారు కాకూడదు. ఓటరు ఐడి కలిగి ఉండాలి లాంటి చాలా చిన్న అవసరాలు దాని కోసం ఉన్నాయి. అయితే సర్, ఇంతసేపు మీతో మాట్లాడిన తరువాత నేను ఒకటి కోరుకుంటున్నాను, ఒకవేళ అలాంటి ఒక పదివేల మంది యువకులు ఎక్కడి నుంచైనా రావాలి. వారు రాజకీయాల్లో చేరాలి, వారికి మీరు సహాయం అందిస్తారు.. ఇది నాకు తెలుసు, దీని గురించి మీరు ఏమైనా చెప్పగలరా…

ప్రధానమంత్రి: చూడండీ, మీరు అభ్యర్థి కోసం కావాల్సిన అర్హతలు చెబుతున్నారు.

నిఖిల్ కామత్: అవును సర్!

ప్రధానమంత్రి: మీరు రాజకీయ నాయకునిగా అవడం గురించి అడగడం లేదు

నిఖిల్ కామత్: అవును సర్!

ప్రధానమంత్రి: రాజకీయ నాయకులు కావాలంటే చాలా అర్హతలు కావాలి. నిరంతరం వేలాది కళ్లు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాయి. మీరు మాట్లాడే ఒక్క మాట అటూ ఇటూ అయితే మీ పదేళ్ల ప్రయత్నం నాశనం అవుతుంది. మీరు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మీరు దానితో పాటుగా జీవించాలి. మీకు అద్భుతమైన గుణం ఉండాలి. అదే మీ అర్హత అవుతుంది అయితే ఇది ఏ యూనివర్సిటీ సర్టిఫికెట్ ద్వారా లభించదు.

నిఖిల్ కామత్: చివరగా మీరు ఈ షో చూస్తున్న యువతరం కోసం ఒక పార్టీ సందేశంగా వారికి ఏమైనా

చెప్పాలనుకుంటే, మీరు వారికి ఏమి చెబుతారు…

ప్రధానమంత్రి: మొదటగా నేను దేశంలోని నేటి మాతృమూర్తులకు, సోదరీమణులకు, ఆడబిడ్డలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దాదాపుగా ప్రతి రాష్ట్రంలో మహిళల కోసం పంచాయతీ, గ్రామ్ ప్రధాన్, నగర పాలిక, మహానగర పాలికల్లో 50 శాతం రిజర్వేషన్ అమలు అవుతోంది, కాబట్టి నిజమైన నాయకులుగా నిలిచేందుకు వారు ప్రయత్నించాలి, ఇక్కడ మహిళ అవసరం కాబట్టి తమను కూర్చోబెట్టారని భావించకూడదు, అలా కాకుండా మీరు సమాజాన్ని ముందుండి నడిపించాలి. పురుషులకు మార్గదర్శకం చేయాల్సి ఉన్నా మీరు దానిని కొనసాగించాలి. దేశంలోని మాతృమూర్తులు అలాగే నా ఆడబిడ్డలు ఇదేవిధమైన నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగాలి. సమీప భవిష్యత్తులోనే ఎమ్ఎల్ఏ, ఎంపీ స్థానాల కోసం కూడా 30 శాతం రిజర్వేషన్ అమల్లోకి రానుంది. ఇలాంటి సమయంలో ఇలాంటి నాయకత్వ లక్షణాలు గల మహిళల అవసరం చాలా ఉంటుంది. ఇంకా రెండు నుంచి నాలుగేళ్ల సమయం ఉంది, కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరంతా ఇప్పుడే రంగంలోకి దిగండి, మిమ్మల్ని మీరు మరింత యోగ్యులుగా మలచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేయండి. సమయం ఉంది, ఈ సమయం మీది, దీనిని అర్థం చేసుకోండి.

రెండోది, నేను దేశంలోని యువతకు చెబుతున్నాను. రాజకీయాలు మంచివి కాదని మీరు భావించకండి. అలాగే రాజకీయాలు అంటే ఎన్నికలు మాత్రమే అని భావించవద్దు, గౌరవప్రదమైన రీతిలో ఓటు హక్కును వినియోగించుకోండి. అలాగే జీవితంలో ఒక్కసారి రాజకీయ ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టండి. ఏరూపంలోనైనా ఒకసారి రాజకీయాల్లోకి రావాలి. నేడు దేశానికి సృజనాత్మకత నుంచి రూపుదిద్దుకున్న నాయకత్వం అవసరం ఉంది. ఉద్యమం ద్వారా నాయకులుగా మారిన వారు వేరొక రకం నాయకులు. స్వాతంత్య్రోద్యమంలో కూడా సృజనాత్మకత ఉంది అందుకే ఆ ఉద్యమం నుంచి ఒక రకం నాయకులు వచ్చారు. నేడు దేశానికి సృజనాత్మకత ఆలోచన గల, వినూత్నంగా పనిచేయగల, తమను తాము సన్నద్ధం చేసుకోగల, సుఖదుఃఖాలను అర్థం చేసుకోగల, దేశానికి దారిచూపగల అంటే ఇతరులను అడ్డుతొలగించి కాదు, దేశాన్ని

ముందుకు తీసుకెళ్లే దారిని కనుగొనగల అనేక మంది మంచి నాయకుల అవసరం ఎంతగానో ఉంది. అయితే ఇప్పుడు అలాంటి వారు లేరని నేను చెప్పడం లేదు. నవతరం అవసరం ఉంది. ఇప్పుడు 20-25 ఏళ్ల యువత ముందుకువస్తే, 2047 నాటికి వారికి 40-50 ఏళ్ల వయస్సు ఉంటుంది, అప్పుడు వారు దేశాన్ని నడిపించే తగిన సామర్థ్యం కలిగి ఉంటారు. నేను దేశంలోని యువతను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తే, కొంతమంది నేను బిజెపి జెండాను ఎగురవేయాలనుకుంటున్నాను అని అనుకుంటారు. నేను దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. నేను ఎవరినీ భారతీయ జనతా పార్టీలో చేరమని గానీ లేదా ఏదైనా ఒక నిర్దిష్ట పార్టీకి వెళ్లమని గానీ లేదా ఒక నిర్దిష్ట పార్టీకి వెళ్లవద్దని గానీ చెప్పడం లేదు. నేను అన్ని పార్టీల్లోకి నవతరం రావాలని నేను కోరుకుంటున్నాను, అన్ని పార్టీల్లోకి కొత్తవారు రావాలి. ఇలాంటి యువత ఖచ్చితంగా బిజెపిలోకి రావాలి అలాగే అన్ని పార్టీల్లోకి కూడా రావాలి. కాబట్టి దేశయువత ముందుకువస్తే కొత్త మార్పు ప్రారంభమవుతుంది.

నిఖిల్ కామత్: మోదీజీ, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీకు ధన్యవాదాలు..

ప్రధానమంత్రి: బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది. ఇది నా మొదటి పాడ్‌కాస్ట్.

నిఖిల్ కామత్: మీరు చాలా సమయం మా కోసం కేటాయించారు, మీకు చాలా ధన్యవాదాలు!

ప్రధానమంత్రి: ఇది మీకు, మీ ప్రేక్షకులకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు!

నిఖిల్ కామత్: మీరు ఎప్పటిలాగే చాలా బాగా మాట్లాడారు. అలాగే మీరు మాకు ఇంత సమయం ఇవ్వడం

చాలా సంతోషంగా ఉంది.

ప్రధానమంత్రి: సరేనండీ! మీ టీమ్ కూడా చాలా అలసిపోయి ఉంటారు! ఇక్కడ చాలా చల్లగా ఉంది, ఈ

వాతావరణంలో జాగ్రత్తగా ఉండండి.

నిఖిల్ కామత్: సరే సర్!

గమనిక: ఇది ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ కామత్‌తో ప్రధానమంత్రి సంభాషణకు దాదాపు అనువాదం

మాత్రమే. వాస్తవానికి సంభాషణ హిందీలో జరిగింది.