Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) కింద లబ్ధిదారులకు ఆధార్ సమాచార నమోదు నుంచి సడలింపు ప్రతిపాదనపై కేంద్ర మంత్రిమండలి ఆమోదం


ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) కింద లబ్ధిదారులకు నిధులు విడుదలకు సంబంధించి వారు తమ ఆధార్ సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్న నిబంధనను సడలించే ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కొన్ని భూమిగల కుటుంబాలకు ఆదాయ మద్దతు కింద కొన్ని మినహాయింపులతో ఏటా రూ.6000 అందుతాయి. దీన్ని నాలుగు నెలలకొకసారి రూ.2000 వంతున ఏడాది వ్యవధిలో మూడుసార్లు ప్రత్యక్ష లబ్ధి బదిలీ (DBT) విధానంలో ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమచేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే 2018 డిసెంబరు-2019 మార్చి, 2019 ఏప్రిల్-జూలై నెలలకు సంబంధించి నమోదిత ఆధార్ సమాచారం ప్రాతిపదికన తొలి, మలి వాయిదాల సొమ్ము అందుకున్న లబ్ధిదారులకు 2019 ఆగస్టు 1 తర్వాత మూడో వాయిదా నుంచి ఈ సడలింపు అమలవుతుంది. అయితే, 2019 ఏప్రిల్-జూలై నెలలకు సంబంధించి తొలి వాయిదా అందుకున్నవారికి 2019 ఆగస్టు 1 తర్వాత రెండో వాయిదా నుంచి కూడా ఆధార్ సమాచారం ప్రాతిపదికనే విడుదలవుతుంది. అంతేకాకుండా 2019 ఆగస్టు 1 తర్వాత తొలి వాయిదాను అందుకున్న లబ్ధిదారులకు ఆ తర్వాతి వాయిదాలు ఆధార్ సమాచారం ప్రాతిపదికగానే విడుదలవుతాయి. ఇక అసోం, మేఘాలయ, జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఆధార్ నమోదు తగినమేర పూర్తికానందువల్ల ఆయా రాష్ట్రాల రైతులకు 31.03.2020 వరకూ ఈ నిబంధన నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.

అయితే, ఆధార్ సమాచార నమోదు ప్రక్రియ నిర్దేశించిన మేరకు 2019 ఆగస్టు 1నాటికి వందశాతం సాధ్యంకాలేదు. రబీ పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్న కారణంగా పొలం దున్నడానికి, నీరు పెట్టడానికి, పరికరాలు సమకూర్చుకోవడానికి, విత్తనాల కొనుగోలుతోపాటు ఇతరత్రా పొలం పనులకోసం వారికి ఈ సమయంలో డబ్బు అవసరం చాలా ఉంటుంది. దీనికితోడు ఇటీవలే పండుగల కాలం మొదలు కావడంతో అవసరాలు మరింత పెరిగాయి. ఫలితంగా రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆధార్ సమాచారం నమోదు కానందువల్ల అలాంటి లబ్ధిదారులకు నిధుల విడుదల ఆలస్యమై రైతులలో అసంతృప్తి, ఆందోళన పెరిగిపోతాయి. అందువల్ల 2019 ఆగస్టు 1నాటికి ఆధార్ నమోదు పూర్తికావాలన్న నిబంధనను 2019 నవంబరు 30వరకూ ప్రభుత్వం సడలించింది. దీంతో నిధులను సత్వరం విడుదల చేసి, పెద్ద సంఖ్యలో రైతు కుటుంబాల అవసరాలు తీర్చే వీలు కలుగుతుంది. ఆ మేరకు 2019 డిసెంబరు 1 నుంచి ఆధార్ సమాచారం నమోదైనవారికి మాత్రమే తదుపరి లబ్ధి అందుతుంది. తదనుగుణంగా ప్రభుత్వం ఆధార్ సమాచార నమోదుకు తగిన చర్యలు తీసుకుంటుంది.

నేపథ్యం:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) భూమిగల రైతులకు ఆదాయ మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడింది. దీనికింద కొన్ని మినహాయింపులకు లోబడి ఏటా రూ.6000 వంతున ప్రభుత్వం సాయం అందిస్తుంది. దీన్ని నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 వంతున మూడుసార్లు ప్రత్యక్ష లబ్ధి బదిలీ (DBT) విధానంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమచేస్తుంది. ఈ మేరకు తొలి వాయిదా కింద 6,76,76,073 మంది, రెండో వాయిదా కింద 5,14,27,195 మంది, మూడో వాయిదా కింద 1,74,20,230 మంది వంతున లబ్ధిదారుల కోసం రూ.27000 కోట్లకుపైగా నిధులను ఇప్పటికే విడుదల చేసింది.

**************