Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధాని

ప్రధానమంత్రి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధాని


   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ప్ర‌ధానమంత్రి కార్యాల‌యం (పిఎంఒ)లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ‘పిఎంఒ’ అధికారులు, సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ- ఈ కార్యాలయాన్ని ప్రజా ప్రాధాన్యంగల సేవా వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఆదినుంచీ శ్రమిస్తున్నట్లు శ్రీ మోదీ నొక్కిచెప్పారు. ‘‘ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఒక ఉత్ప్రేరక శక్తిగా రూపుదిద్దడాడనికే మనం మొదటినుంచీ కృషి చేస్తున్నాం. తద్వారా ఇది సరికొత్త శక్తికి, స్ఫూర్తికి మూలం కాగలదు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

   ప్రభుత్వం అంటే సరికొత్త శక్తికి, అంకితభావానికి, దృఢ సంకల్పానికి ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. అంకితభావంతో ప్రజలకు సేవ చేయడమే ‘పిఎంఒ’ ప్రధాన కర్తవ్యమన్నది తన విశ్వాసమని ఆయన ప్రకటించారు. ప్రభుత్వాన్ని నడిపేది మోదీ ఒక్కరే కాదని, వేలాది మేధావులు ఏకతాటిపైకి వచ్చి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, దాని శక్తిసామర్థ్యాల ఔన్నత్యానికి పౌరులే సాక్షులవుతారని ఆయన స్పష్టం చేశారు. తన జట్టులోని వ్యక్తులెవరికీ సమయం, ఆలోచన లేదా కృషి విషయంలో ఎలాంటి పరిమితులుగానీ, నిర్ణీత ప్రమాణాలుగానీ ఉండవని నొక్కిచెప్పారు. ‘‘ఈ జట్టుపై యావద్దేశం సంపూర్ణ విశ్వాసంతో ఉంది’’ అని ప్రధానమంత్రి అన్నారు.

   ఈ మేరకు తన జట్టు భాగస్వాములందరి సహకారానికి కృతజ్ఞతలు తెలపడం కోసం ఈ సందర్భాన్ని ప్రధానమంత్రి సద్వినియోగం చేసుకున్నారు. అలాగే రాబోయే ఐదేళ్లపాటు వికసిత భారత్ పయనంలో కలిసి రావాలని, దేశ నిర్మాణంలో భాగం కావాలని ఆకాంక్షించే వారు తమనుతాము ఆ లక్ష్యాలకు అంకితం చేసుకోవాలని ఉద్బోధించారు. ‘‘వికసిత భారత్-2047 గమ్యం దిశగా మనమంతా సమష్టి కృషితో ‘దేశమే ప్రథమం’ లక్ష్యాన్ని సాధిద్దాం’’ అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. తన జీవితంలో అనుక్షణం దేశానికే అంకితమని ఆయన పునరుద్ఘాటించారు.

   ఆకాంక్ష, స్థిరత్వాల సమ్మేళనమే సంకల్పానికి దారితీస్తుందని, ఈ సంకల్పానికి గట్టి కృషి తోడైతే విజయం సాధించగలమని ప్రధాని మోదీ వివరించారు. ప్రగాఢ ఆకాంక్ష అంటూ ఉంటే అది సంకల్పంగా మారుతుందని, నిరంతరం మారే సంకల్పాలు కేవలం విరిగిపడే అలలుగా మిగులుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చాలనే ఆకాంక్షను ప్రధానమంత్రి  వెలిబుచ్చారు. గడచిన పదేళ్లలో తమ విజయాలను భవిష్యత్తుల్లో తామే అధిగమిస్తూ ప్రపంచ ప్రమాణాలను బద్దలు కొట్టాలని తన జట్టుకు పిలుపునిచ్చారు. ‘‘ఏ దేశం సాధించని రీతిలో భారతదేశాన్ని మనం సరికొత్త శిఖరాలకు చేర్చాలి’’ అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

   విజయం సాధించాలంటే ఆలోచనల్లో స్పష్టత, కర్తవ్య నిర్వహణపై దృఢ విశ్వాసం, కార్యాచరణ సామర్థ్యం అత్యావశ్యకాలని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ‘‘మనలో ఈ మూడు లక్షణాలు దృఢంగా ఉన్నపుడు వైఫల్యం ఏ స్థాయిలోనూ మన దరిజేరే సాహసం చేయదన్నది నా విశ్వాసం’’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక స్పష్టమైన దార్శనికతకు తమనుతాము అంకితం చేసుకున్నారంటూ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సాధించే అన్ని విజయాలలో భారీ వాటాకు వారు అర్హులన్నారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగుల అవిరళ కృషికి ఈ ఎన్నికలు ఆమోదముద్ర వేశాయి’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని, ప్రస్తుత కృషిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని తన జట్టుకు స్ఫూర్తినిచ్చారు. ప్రతి వ్యక్తి తనలోగల నిత్య విద్యార్థిని సజీవంగా ఉంచితేనే విజయవంతం కాగలడని చెబుతూ- తన శక్తిసామర్థ్యాల రహస్యం ఇదేనంటూ ఆయన తన ప్రసంగం ముగించారు.

 

 

***

DS/VJ/TS