క్రియాశీల పరిపాలన, సకాలంలో ప్రాజెక్టుల అమలుతోపాటు కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండే ఐసీటీ ఆధారిత బహువిధ వేదిక అయిన ప్రగతి 45వ ఎడిషన్ గురువారం జరిగింది. దీనికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎనిమిది ముఖ్యమైన ప్రాజెక్టులను సమీక్షించారు. వీటిలో పట్టణ రవాణాకు సంబంధించి ఆరు మెట్రో ప్రాజెక్టులతోపాటు రోడ్డు అనుసంధానత, థర్మల్ విద్యుత్తుకు సంబంధించి ఒక్కో ప్రాజెక్టు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాజెక్టులన్నింటి విలువ రూ. లక్ష కోట్లకు పైమాటే.
ప్రాజెక్టుల్లో జాప్యం వల్ల వ్యయం పెరగడమే కాకుండా, అవి ఉద్దేశించిన ప్రయోజనాలను ప్రజలకు అందకుండా చేస్తుందన్న విషయాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని ప్రభుత్వ అధికారులంతా తప్పకుండా గుర్తించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
సమావేశం సందర్భంగా బ్యాంకింగ్, బీమా రంగాలకు సంబంధించి ప్రజల ఫిర్యాదులపై కూడా ప్రధానమంత్రి సమీక్షించారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించిన ప్రధానమంత్రి.. నాణ్యమైన పరిష్కారాలను అందించాలని స్పష్టంచేశారు.
అనేక నగరాలు ప్రజా రవాణా వ్యవస్థగా మెట్రో ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా.. అవి అమలవుతున్న లేదా వివిధ దశల్లో ఉన్న నగరాల కోసం వాటి అనుభవాలను పంచుకునేందుకు వీలుగా సదస్సులను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. ఆ అనుభవాల ద్వారా ఉత్తమ విధానాలను, అభ్యాసాలను సంగ్రహించడానికి వీలవుతుంది.
ప్రాజెక్టుల అమలు సమయంలో ప్రభావిత కుటుంబాలకు సకాలంలో పునరావాసం కల్పించాల్సిన ఆవశ్యకతను ఈ సమీక్ష సందర్భంగా ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. కొత్త ప్రాంతంలో నాణ్యమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆ కుటుంబాలకు జీవన సౌలభ్యం కల్పించాలని ఆయన కోరారు.
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను కూడా ప్రధానమంత్రి సమీక్షించారు. నాణ్యమైన విక్రయ వ్యవస్థను రూపొందించడం ద్వారా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసాల పైకప్పులపై వ్యవస్థాపన సామర్థ్యాన్ని మెరుగుపరచాలని ఆయన సూచించారు. పైకప్పు సౌర వ్యవస్థలకు సంబంధించి ప్రారంభం నుంచి అవి పనిచేయడం మొదలయ్యే వరకూ అవసరమైన ప్రక్రియ సమయాన్ని తగ్గించాలని ఆయన ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలకు సంబంధించి దశల వారీగా సంపూర్ణతా విధానాన్ని అవలంబించాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు.
ప్రగతి సమావేశాల 45వ ఎడిషన్ వరకు దాదాపు రూ.19.12 లక్షల కోట్ల విలువైన 363 ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహించారు.
***