ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలో ‘ప్రధాన కార్యదర్శుల నాలుగో జాతీయ సదస్సు’ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సదస్సును మూడు రోజుల పాటు 2024 డిసెంబరు 13 నుంచి 15 వరకు ఢిల్లీలో నిర్వహించారు.
‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం)ను ఆవిష్కరించడానికి టీమ్ ఇండియా ఎలాంటి అరమరికలకూ తావు ఇవ్వకుండా చర్చించుకోవడానికీ, కలిసికట్టుగా కృషి చేయాలనీ, ఇది ఈ సదస్సుతో లభించిన అతిపెద్ద ప్రయోజనమని ప్రధానమంత్రి అన్నారు.
ప్రజలకు అనుకూలమైన విధానాలతో, ఏదైనా ఒక సమస్య ఎదురవకముందే ఆ విషయాన్ని పట్టించుకొని తగిన జాగ్రత్తలు తీసుకొంటూ సుపరిపాలనను అందించడం (ప్రో–పీపుల్ ప్రో–యాక్టివ్ గుడ్ గవర్నెన్స్.. పీ2జీ2) మన కర్తవ్యపాలనలో కీలకమని, ఈ పద్ధతిలో మనం ‘వికసిత్ భారత్’ ఆశయాన్ని సాధించవచ్చని ప్రధానమంత్రి అన్నారు.
‘ఔత్సాహిక పారిశ్రామికత్వాన్ని, ఉపాధికల్పనను, నైపుణ్యాల సాధనను ప్రోత్సహించడం, దేశ జనాభాలో శ్రమించే వయోవర్గాల సంఖ్య అధికంగా ఉన్నందున ఆ ప్రయోజనాన్ని సద్వినియోగపరచుకోవడం’ ప్రధాన ఇతివృత్తంగా ఈ సదస్సు చర్చించింది.
అంకుర సంస్థలు రంగంలోకి ప్రవేశించడాన్ని, ప్రత్యేకించి ఇవి రెండో అంచెనగరాల్లోనూ మూడో అంచె నగరాల్లోనూ ఏర్పాటవుతుండడాన్ని ప్రధాని ప్రశంసించారు. ఆ తరహా నవకల్పనలను రాష్ట్రాలు ప్రోత్సహిస్తూ, అంకుర సంస్థలు వృద్ధి చెందడానికి అనువైన స్థితిగతుల్ని కల్పించే దిశలో కృషి చేయాలని ఆయన సూచించారు. చిన్న నగరాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే ప్రదేశాల్ని గుర్తించి, ఆయా ప్రదేశాలను బ్యాంకింగ్ వ్యవస్థతో జతపరిచడంతోపాటు ఆధునిక వస్తురవాణా వ్యవస్థను సమకూర్చాల్సిందిగా రాష్ట్రాలను ఆయన కోరారు.
కొన్ని నియమాలను పాటించడంలో పౌరులు తరచు ఇబ్బందులకు గురిఅవుతున్న కారణంగా, ఆయా నియమ నిబంధనలను సరళతరం చేయాల్సిందిగా కూడా రాష్ట్రాలను ప్రధాని కోరారు. పౌరుల ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించేటట్లు పాలన నమూనాను రాష్ట్రాలు సంస్కరించాలని సమావేశంలో పాల్గొన్న సభికులకు ఆయన సూచించారు. సంస్కరణలను తీసుకురావడం, వాటిని ఆచరణలో పెట్టడం, వీలైన మార్పుచేర్పులను చేపట్టడంపై దృష్టి సారించడం ముఖ్యం. అంతేకాదు, ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం కూడా అంతే ముఖ్యమని ప్రధాని అన్నారు.
చక్రభ్రమణ ఆర్థిక వ్యవస్థను (సర్క్యులర్ ఎకానమీ) ని ప్రధాని ప్రస్తావించి, గోబర్ధన్ (GOBARdhan) కార్యక్రమాన్ని ప్రస్తుతం ఒక ప్రధాన ఇంధన వనరుగా లెక్కలోకి తీసుకోవడాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమం వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తుందని, అంతేకాకుండా వయసు మీదపడిన పశువులను గుదిబండలుగా ఎంచకుండా వాటిని ఒక సంపత్తిగా ఉపయోగించుకొనే పద్ధతిని తెలియజేస్తుందని ఆయన అన్నారు.
ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఈ–వేస్ట్) తిరిగి ఉపయోగించడానికిగాను సముచిత వయబులిటీ గ్యాప్ ఫండింగ్ విధానాల్ని అన్వేషించాల్సిందిగా రాష్ట్రాలను ప్రధాని ఆదేశించారు. డేటా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీపైన సమాజం ఎక్కువగా ఆధారపడుతున్న ప్రస్తుత కాలంలో డిజిటల్ వ్యర్థాలు నానాటికీ పెరుగుతూంటాయని, ఈ సందర్భంలో ఇది ఎంతో ముఖ్యమైన అంశమని అన్నారు. ఈ–వేస్ట్‌ను ఉపయోగానికి అనువైన వనరుగా మార్చుకొనే ప్రక్రియనేది ఆ తరహా సామగ్రిని దిగుమతి చేసుకోవడంపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ఆయన అన్నారు.
ఆరోగ్య రంగాన్ని గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ… ఫిట్ ఇండియా ఉద్యమ దృష్టికోణంలో స్థూలకాయం సమస్యను భారత్‌లో ఒక ప్రధాన సవాలుగా తీసుకోవాలని సూచించారు. దృఢమైన, ఆరోగ్యప్రదమైన భారతదేశం మాత్రమే వికసిత్ భారత్ (అభివృద్ధిచెందిన భారత్) కాగలుగుతుందని ఆయన అన్నారు. భారత్‌ను 2025 చివరికల్లా టీబీకి చోటుండని దేశంగా తీర్చిదిద్దవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో ఆశా కార్యకర్తలు, ఆంగన్వాడీ కార్యకర్తలు ఒక ప్రధాన పాత్రను పోషించగలుగుతారని ఆయన అన్నారు.
ప్రాచీన రాత పుస్తకాలు భారత్ సంపదగా ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. వాటిని డిజిటలీకరించడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలన్నారు. ‘పీఎం గతిశక్తి’ సుపరిపాలనకు ఎంతగానో తోడ్పడుతోందని ఆయన ప్రశంసిస్తూ, పిఎమ్ గతిశక్తిలో ఎప్పటికప్పుడు అవసరమైన తాజా మార్పులను చేసుకొంటూ, పర్యావరణ ప్రభావాలతోపాటు విపత్తులను ఎదుర్కొనే ప్రాంతాలను కూడా దీని పరిధిలోకి చేర్చాలని ఆయన సూచించారు.
ఆకాంక్షా జిల్లాలు, బ్లాకుల కార్యక్రమాన్ని గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆయా జిల్లాల్లోనూ బ్లాకుల్లోనూ సమర్థులైన అధికారులను నియమించారని, వారు క్షేత్రస్థాయిలో పెనుమార్పులను తీసుకురాగలుగుతారని ప్రధాని అన్నారు. దీనితో విస్తృతస్థాయిలో సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయన్నారు.
నగరాల అభివృద్ధిని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ… నగరాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలంటే మానవ వనరుల వికాసాన్ని బాగా ప్రోత్సహించాలన్నారు. పట్టణ పరిపాలన, నీరు, పర్యావరణ నిర్వహణ రంగాలలో పట్టు సాధించడానికి ప్రత్యేక సంస్థలను ఏర్పాటుచేసేందుకు చొరవ తీసుకోవాలని ఆయన ప్రధానంగా చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో రాకపోకల సాధనాలు పెరిగిపోతూ ఉండడంతో, పట్టణ ప్రాంతాల్లో తగినంతగా వసతి సదుపాయాల్ని సమకూర్చడం ముఖ్యమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇది కొత్త పారిశ్రామిక కూడళ్ళలో (ఇండస్ట్రియల్ హబ్స్) తయారీ రంగంలో మెరుగైన ఉత్పాదకతకు దారితీస్తుందన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ప్రజాసేవకులందరికీ ఒక ప్రేరణ శక్తిగా అభివర్ణించారు. ఈరోజు సర్దార్ పటేల్ వర్ధంతి. ఆయన 150వ జయంతి కూడా ఈ సంవత్సరంలోనేనని ప్రధానమంత్రి శ్రీ మోదీ చెబుతూ, రాబోయే రెండు సంవత్సరాలను ఒక ఉత్సవం మాదిరిగా నిర్వహించుకోవాలి, అంతేకాకుండా భారతదేశం విషయంలో ఆయన కన్న కలను నెరవేర్చడానికి మనం శ్రమించాలన్నారు.
‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించడంలో భారతదేశంలో ప్రతిఒక్కరూ చురుకైన భాగస్వామ్యాన్ని పంచుకొనేటట్లు చూడాలని, ఈ సందర్భంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ముందుకు సాగాలని ప్రధాని కోరారు. మహిళలు, పురుషులు, బాలలు సహా జీవనంలో అన్ని రంగాలకు చెందినవారు సైద్ధాంతిక అభిప్రాయ బేధాలను పక్కనపెట్టి స్వాతంత్య్రపోరాటంలో పాలుపంచుకొన్నారని, అదే మాదిరిగా భారతదేశంలో ప్రతిఒక్కరూ 2047 కల్లా ‘వికసిత్ భారత్’ను ఆవిష్కరించే దిశలో పనిచేసి తీరాలని ఆయన అన్నారు. దండి యాత్ర తరువాత 25 ఏళ్ళకు భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిందని, ఆ ఘటన అప్పట్లో చాలా పెద్ద విప్లవంగా పేరు తెచ్చుకొందని ప్రధాని చెబుతూ అదే తరహాలో 2047 కల్లా మనం ‘వికసిత్ భారత్’గా మారాలని నిర్ణయించుకొంటే ఆ లక్ష్యాన్ని కూడా తప్పక సాధించగలుగుతామన్నారు.
మూడు రోజులపాటు జరిగిన సదస్సులో అనేక ప్రత్యేక ఇతివృత్తాలపై శ్రద్ధ తీసుకొన్నారు. వాటిలో తయారీ, సేవలు, గ్రామీణ వ్యవసాయేతర రంగాలు, పట్టణ ప్రాంతాలు, పునరుత్పాదక ఇంధనం, చక్రభ్రణ ఆర్థికవ్యవస్థ వంటివి భాగంగా ఉన్నాయి.
సదస్సులో జరిగిన చర్చలు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడం, నైపుణ్య సాధన కార్యక్రమాల సంఖ్యను పెంచడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాలవారికి స్థిరమైన ఉద్యోగావకాశాల్ని కల్పించడం వంటి మార్గాల్లో సహకారపూర్వక కార్యాచరణకు తోడ్పడే అనేక అంశాలపై పనిచేయాలని, తద్వారా భారతదేశం మధ్యాదాయ దేశం స్థాయి నుంచి అధికాదాయం కలిగిన ఉన్న దేశంగా మార్పుచెందడంలో సాయపడాలని ఈ సదస్సులలో చర్చోపచర్చలు చేశారు. ఈ కార్యక్రమాలు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడంలో దోహదం చేయనున్నాయి. ఈ కార్యక్రమాలకు మహిళల నేతృత్వంలో అభివృద్ధి సాధన కీలకం కానుంది.
మన దేశ సేవారంగానికి ఉన్న శక్తియుక్తుల్ని, ప్రత్యేకించి చిన్న నగరాల సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి బహుముఖీన విధానాన్ని అనుసరించాల్సి ఉందని సదస్సులో చర్చించారు. ఈ ప్రక్రియలో విధానపరమైన చర్యలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాలను ఇప్పటికన్నా ఎక్కువ స్థాయిలో తీర్చిదిద్దడం, వ్యాపారానికి అనుకూలంగా ఉండే వాతావరణాన్ని కల్పించడంపై దృష్టిని సారించడం.. ఇలా అనేక చర్యలు భాగంగా ఉన్నాయి. నైపుణ్యాల్ని పెంచడంపైన, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగం పరిధిలోకి తీసుకురావడంపైన కూడా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర రంగంలోనూ కొన్ని ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కోర్సుల్ని ప్రవేశపెట్టడం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే అంశం కూడా చర్చకు వచ్చింది. కొన్ని ప్రత్యేక ప్రోత్సాహకాల్ని అందిస్తూ వ్యవసాయేతర ఉపాధికల్పన ప్రక్రియలో మహిళలతోపాటు అణగారిన వర్గాలవారిని ప్రోత్సహించాలని సంకల్పించారు.
తరచుగా లోతైన సమీక్షలను నిర్వహిస్తూ, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు త్వరత్వరగా పూర్తయ్యేటట్లు వ్యవస్థలో ఒక పెనుమార్పును తీసుకురావాలన్న అంతిమ లక్ష్యంతో ఏర్పాటుచేసిన ‘ప్రగతి’ (‘పీఆర్ఏజీఏటీఐ’) ప్లాట్ఫార్మ్ను గురించి కూడా సదస్సులో చర్చించారు.
సదస్సులో కొన్ని ముఖ్య టెక్నాలజీలపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచస్థాయి సవాళ్ళకు పరిష్కారాల్ని అందించడంలో సాయపడగల దక్షత ఈ టెక్నాలజీలకుంది. ఇవి ఈ రంగంలో నాయకత్వం వహించడానికి భారతదేశానికి ఒక అవకాశాన్ని అందించగలుగుతాయి. అంతేకాకుండా సమ్మిళిత వృద్ధి, సుస్థిర వృద్ధిల మార్గంలో దూసుకుపోవడానికి తోడ్పడుతాయి. మరో కార్యక్రమంలో ‘కర్మయోగి’పై చర్చించారు. ఇది నేర్చుకొనే ప్రక్రియను అందరి అందుబాటులోకి తీసుకుపోవడానికి, పౌరులకు సేవలు ప్రధానంగా ఉండే కార్యక్రమాల్ని అమలుచేయడానికి రాష్ట్రాలకు సాయపడుతూ, సామర్థ్యాన్ని పెంపొందించే వ్యవస్థను నిర్మించడంలోనూ రాష్ట్రాలకు దన్నుగా నిలుస్తుందన్న అభిప్రాయానికి వచ్చారు.
ఈ సదస్సులో ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులు, ఆయా రంగాల నిపుణులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Attended the Chief Secretaries Conference, a vital platform for collaboration between the Centre and states to boost good governance. Discussions focused on furthering growth, ensuring effective governance, and enhancing service delivery to citizens.
— Narendra Modi (@narendramodi) December 15, 2024
We also focused on how to… pic.twitter.com/hQn0RRrbtG