ఆయుష్ రంగంపై సమీక్షించేందుకు నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. అందరి శ్రేయం, ఆరోగ్యసంరక్షణ, సాంప్రదాయిక జ్ఞానాన్ని పరిరక్షిస్తూ దేశంలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)కు తోడ్పాటును అందించడంలో ఆయుష్ రంగానికున్న కీలక పాత్రను దీని ద్వారా స్పష్టం చేసినట్లయింది.
ఆయుష్ మంత్రిత్వ శాఖను 2014లో ఏర్పాటు చేసినప్పటి నుంచి, ఆయుష్ రంగ విస్తృత శక్తిని వినియోగించుకోవడానికి ఒక స్పష్టమైన మార్గసూచీని ప్రధానమంత్రి రూపొందించారు. ఈ రంగంలో చోటుచేసుకొన్న పురోగతిని సమగ్రంగా సమీక్షించిన సందర్భంగా, ఈ రంగానికున్న శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి వ్యూహాత్మక ఆలోచనలను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని స్పష్టంచేశారు. ఈ సమీక్షలో విభిన్న కార్యక్రమాలకు పటిష్ట రూపును ఇవ్వడం, వనరులను గరిష్ఠంగా వాడుకోవడం, ఆయుష్‌ను ప్రపంచ దేశాల్లో వేళ్లూనుకొనే స్థాయికి చేర్చడానికి ఒక దూరదర్శి మార్గాన్ని సిద్ధం చేయడం.. ఈ అంశాలపై సమీక్షా సమావేశంలో దృష్టిని కేంద్రీకరించారు.
సమీక్షలో, నివారణపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఆరోగ్యసంరక్షణ సేవలను ప్రోత్సహించడంలోనూ, ఔషధ మొక్కలను సాగుచేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికవ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇవ్వడంలోనూ, సాంప్రదాయక వైద్యచికిత్స అంశంలో ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా భారత్ స్థానాన్ని మెరుగుపరచడంలోనూ ఆయుష్ రంగం పోషించాల్సిన భూమిక సహా ఈ రంగం అందించదగ్గ ముఖ్య తోడ్పాటులను ప్రధాని వివరించారు. ప్రపంచ దేశాలన్నిటా ఈ రంగానికి ఆదరణ పెరుగుతోందని, నిరంతరం వృద్ధి చెందుతూ ఉండడం, ఉపాధి అవకాశాల కల్పనలో ఈ రంగానికున్న అవకాశాలను గురించి ఆయన చెబుతూ, ఈ రంగానికున్న సుదృఢత్వం, ఈ రంగం పురోగమించడానికి ఉన్న అనేక అవకాశాలను తెలియజేశారు.
విధానాలను అమల్లోకి తీసుకురావడం ద్వారానూ, పరిశోధనల ద్వారానూ, నవకల్పనల ద్వారానూ ఆయుష్ రంగాన్ని బలపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. యోగా, నేచరోపతి, ఫార్మసీ రంగాలకు సంబంధించిన సమగ్ర, ఏకీకృత ఆరోగ్య, ప్రామాణిక ప్రోటోకాల్స్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వంలో అన్ని రంగాలతో ముడిపడి ఉన్న పనులలో పారదర్శకత్వాన్ని అనుసరించాలని ప్రధాని ప్రధానంగా చెప్పారు. నిజాయతీ పరంగా అత్యున్నత ప్రమాణాలను పరిరక్షించాలని, వారు చేసే పని పూర్తి స్థాయిలో చట్టాలను అమలు చేయడం ద్వారా ప్రజలకు మంచి చేయడానికే నిర్దేశించిందన్న సంగతిని ఆసక్తిదారులు (స్టేక్‌హోల్డర్స్) దృష్టిలో పెట్టుకోవాలని ఆయన ఆదేశాంచారు.
భారత్ ఆరోగ్యసంరక్షణ రంగంలో ఆయుష్ శరవేగంగా ఒక ప్రేరక శక్తిగా మారిపోయింది. ఈ రంగం విద్య, పరిశోధన, ప్రజారోగ్యం, అంతర్జాతీయ సహకారం, వ్యాపారం, డిజిటలీకరణ, ప్రపంచదేశాల్లో విస్తరణ వంటి అంశాలలో కీలక విజయాలను సాధించింది. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో, ఈ రంగం సాధించిన అనేక విజయాలను ఈ సమీక్ష సమావేశం సందర్భంగా ప్రధాని దృష్టికి అధికారులు తీసుకువచ్చారు.
• ఆయుష్ రంగం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తోంది. దీని తయారీ మార్కెటు పరిమాణం 2014లో 2.85 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా, 2013లో 23 బిలియన్ అమెరికన్ డాలర్లకు ఎగబాకింది.
• రుజువులపై ఆధారపడ్డ సాంప్రదాయక వైద్యచికిత్సలలో ఇండియా తనను తాను ప్రపంచ స్థాయిలో ఒక అగ్రగామి దేశంగా రూపొందించుకొంది. ఆయుష్ రిసర్చ్ పోర్టల్ ఇప్పుడు 43,000కు పైగా అధ్యయనాలను హోస్ట్ చేస్తోంది.
• గత పది సంవత్సరాల్లో పరిశోధనల సంబంధిత ఫలితాల ప్రచురణ, అంతకు వెనుకటి అరవై సంవత్సరాలలో జరిగిన ఈ తరహా ప్రచురణలను మించిపోయింది.
• వైద్య ప్రధాన పర్యాటకానికి ఆయుష్ వీజాలు ఊతాన్ని ఇవ్వనున్నాయి. ఇవి సంపూర్ణ ఆరోగ్యసంరక్షణకు దోహదపడే పరిష్కారాల వైపు మొగ్గుచూపే విదేశీ రోగులను ఆకట్టుకోనున్నాయి.
• జాతీయ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిష్ఠాత్మక సంస్థలతో సహకారాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా ఆయుష్ రంగం ఘనమైన విజయాల్ని నమోదు చేసింది.
• ఆయుష్ గ్రిడ్‌లో భాగంగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు కృత్రిమ మేధ (ఏఐ) ఏకీకరణపై సరికొత్తగా దృష్టిని సారిస్తున్నారు.
• యోగాను ప్రోత్సహించడానికి డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించుకొంటారు.
• వై–బ్రేక్ యోగా వంటి మరింత సమగ్ర కంటెంటును అందించడానికిగాను ఐజీఓటీ (iGot) ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేశారు.
• ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కు చెందిన గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటరును గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేయడం ఒక ప్రధాన విజయం. ఇది సాంప్రదాయక వైద్యచికిత్స రంగంలో భారత్ నాయకత్వాన్ని పటిష్టం చేసింది.
• ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ (ఐసీడీ) -11 లో సాంప్రదాయక వైద్యాన్ని చేర్చారు.
• ఈ రంగంలో మౌలిక సదుపాయాలు, ప్రవేశ యోగ్యతను (ఏక్సెసబులిటీ) విస్తరించడంలో జాతీయ ఆయుష్ మిషన్ ప్రధాన పాత్రను పోషించింది.
• అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) ప్రస్తుతం ఒక ప్రపంచవ్యాప్తంగా జరిగే ఘట్టంగా మారిపోయింది. గత సంవత్సరం ఐడీవైలో 24.52 కోట్ల కన్నా ఎక్కువ మంది పాల్గొన్నారు.
• ఈ ఏడాదిలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) ఈ శ్రేణిలో పదోది. ప్రపంచవ్యాప్తంగా మరింత మంది పాలుపంచుకోనున్న కారణంగా ఈ ఘట్టం మరో గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతోంది.
ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా, ఆయుష్ శాఖలో సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్యం– కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్, ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్ర, రెండో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శక్తికాంత దాస్, ప్రధానమంత్రికి సలహాదారు శ్రీ అమిత్ ఖరేలతోపాటు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
***
Yoga, Ayurveda, and traditional medicine are integral to our heritage and the world’s future. Deliberated on ways to enhance digital outreach, boost research and increase accessibility.
— Narendra Modi (@narendramodi) February 27, 2025
In the last decade, the Ayush sector has grown exponentially in India. With initiatives like Ayush Visa, AI-driven research, and the WHO Global Traditional Medicine Centre in Jamnagar, India is leading the way in evidence-based traditional medicine.
— Narendra Modi (@narendramodi) February 27, 2025
The Ayush sector has played a pivotal role in promoting holistic well-being and good health. Today, chaired a review meeting to further strengthen its impact through research, innovation and global collaborations. India remains committed to making traditional medicine a key…
— Narendra Modi (@narendramodi) February 27, 2025