ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ.3,435.33 కోట్ల అంచనా వ్యయంతో ప్రజా రవాణా సంస్థ (పిటిఎ) ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణ కోసం “పిఎం-ఇ-బస్ సేవా-పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం (పిఎస్ఎమ్) పథకానికి” ఆమోదం తెలిపింది.
ఈ పథకం 2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు 38 వేలకు పైగా ఎలక్ట్రిక్ బస్సుల (ఇ-బస్సులు) కొనుగోలుకు అనుమతిస్తుంది. బస్సులను ప్రారంభించిన నాటి నుంచి 12 ఏళ్ల వరకు ఇ-బస్సుల నిర్వహణకు ఈ పథకం తోడ్పాటును అందిస్తుంది.
ప్రస్తుతం ప్రజా రవాణా సంస్థలు (పీటీఏ) నడుపుతున్న బస్సుల్లో ఎక్కువ శాతం డీజిల్, సీఎన్జీతోనే నడుస్తుండటం పర్యావరణానికి ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తోంది. ప్రస్తుత నిర్ణయం ద్వారా ప్రవేశపెట్టనున్న ఇ-బస్సులు పర్యావరణ హితమైనవి. నిర్వహణకు కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే, ఇ-బస్సులకు అధిక వ్యయం, వీటిని నడపడం ద్వారా తక్కువ ఆదాయం సమకూరుతున్నందున ప్రజా రవాణా అధికారులు (పిటిఎలు) ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడం, నడపడం సవాలుగా ఉంటుందని భావించారు.
పెట్టుబడి ఖర్చును తగ్గించుకునేందుకు, ప్రజా రవాణా సంస్థలు (పిటిఎలు) ఈ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జిసిసి) విధానంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ప్రవేశపెట్టనున్నాయి. ఇందులో భాగంగా పిటిఎలు జిసిసి విధానం కింద బస్సు ముందస్తు ఖర్చును చెల్లించాల్సిన అవసరం లేదు, దీనికి బదులుగా ఓఈఎంలు, ఆపరేటర్లు నెలవారీ చెల్లింపులు చేస్తూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీల కోసం ఇ-బస్సులను కొనుగోలు చేసి నడుపుతారు. అయితే, సరైన సమయంలో చెల్లింపులు చేయకపోవడం పట్ల ఆందోళనతో ఓఈఎంలు,ఆపరేటర్‌లు ఈ విధానంలో పాల్గొనడానికి వెనుకాడుతున్నారు.
దీనిని పరిష్కరించేందుకు ప్రత్యేక నిధి ద్వారా ఓఈఎంలు, ఆపరేటర్లకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడటం ద్వారా వీరి ఆందోళనకు ఈ పథకం పరిష్కరం చూపుతుంది. ఒకవేళ పిటిఎల ద్వారా చెల్లింపులు జరగనట్లయితే, అమలు చేస్తున్న ఏజెన్సీ అయిన సిఇఎస్ఎల్, పథకం నిధుల నుంచి అవసరమైన చెల్లింపులు చేస్తుంది, అనంతరం పిటిఎలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా తిరిగి పొందుతుంది.
ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ-బస్సుల స్వీకరణను సులభతరం చేయడానికి ఈ నిర్ణయం ప్రయత్నిస్తుంది. ఈ పథకం హరిత గృహ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించడానికి, శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి వీలు కల్పిస్తుంది. ఈ పథకాన్ని ఎంచుకున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న అన్ని ప్రజా రవాణా సంస్థలకు (పిటిఎలు) ఈ పథకం ప్రయోజనాలను అందిస్తుంది.
****