Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజా పరిపాలన, పాలనాపరమైన సంస్కరణల్లో భారతదేశం, యునైటెడ్ కింగ్ డమ్ ల మధ్య అవగాహన ఒప్పందం


ప్రజా పరిపాలన, పాలనాపరమైన సంస్కరణల్లో భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల మధ్య 2015 నవంబర్ లో కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఓయూ)కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

ఈ ఒప్పందం ప్రకారం.. ప్రజా పరిపాలన, వినియోగదారులకు అనుకూలంగా ఉండే సేవల డిజైన్, సేవలు అందించటంలో అధికారుల ప్రమేయాన్ని తగ్గించటం, ప్రభుత్వ వ్యవస్థను పునర్నిర్మించటం, ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంపొందించటం, ప్రజా ఫిర్యాదులను పరిష్కరించే విధానం, స్థానిక ప్రభుత్వాల్లో సంస్కరణలు, సామాజిక భద్రతను బలోపేతం చేయటంలో సంస్కరణలు, పాలనలో నైతికతను ఇనుమడింపచేసే వ్యూహాల అనుసరణలో సమన్వయం, ఉద్యోగుల నిర్వహణలో ప్రభుత్వానికి- పరిశ్రమలకు మధ్య సమన్వయం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే యంత్రాంగాల ఏర్పాటు, సంక్షోభాల‌, విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ కార్యకలాపాల్లో డిజిటల్ మార్పులు తీసుకురావడం వంటి రంగాలలో ఇరుపక్షాలు సహకారం ఇచ్చి పుచ్చుకోనున్నాయి.

ప్రజా పరిపాలనపైన, పాలనపైన నియమించే ఓ సంయుక్త కార్యాచరణ బృందానికి ఈ ఒప్పందం అమలు బాధ్యతను అప్పగిస్తారు.

ప్రస్తుతం యూకేలో వినియోగదారుల ప్రయోజనాలు పరమావధిగా అందిస్తున్న సేవల వ్యవస్థను ప్రజా సేవల రంగంలో శరవేగంగా మారుతున్న వాతావరణానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి, భారతదేశంలో ఎప్పటికప్పుడు అమలలోకి వచ్చే మంచి విధానాలను అనుసరిస్తూ.. కొత్తగా ప్రజాసేవల పద్ధతిని ప్రవేశపెట్టడం ఈ ఒప్పందం లక్ష్యాల్లో ఒకటి. ఇదే రకమైన విధానాన్ని భారతదేశంలో కూడా అవలంబించడం ద్వారా ఇండియాలోనూ ప్రజా సేవల అందజేతను మెరుగుపరుస్తారు.

ఈ ఒప్పందం ప్రకారం మొదటి సంయుక్త కార్యనిర్వాహక బృందం సమావేశం త్వరలో లండన్‌లో జరగనుంది.

పూర్వరంగం:

సమర్థవంతమైన ప్రజాపాలన వ్యవస్థ కోసం పౌరులు కేంద్రంగా ఆన్ లైన్ సేవల వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. పాలనలో అందరికీ సమన్యాయం జరిగేలా పారదర్శకమైన, జవాబుదారీ వ్యవస్థకు ఇది దారి తీస్తుంది.

దేశవ్యాప్తంగా ఆన్ లైన్ సేవలను ప్రజలకు అందించాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రజా పరిపాలన వ్యవస్థను తిరిగి గాడిలో పెటట్టడం, ఈ‍-గవర్నెన్స్, డిజిటల్ ఇండియా, తదితర కార్యక్రమాలను ప్రవేశపెట్టడం వగైరా రూపాలలో ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది మరింత ఊతాన్ని అందించగలదు. దీని ద్వారా భవిష్యత్తులో ప్రజలు కేంద్రంగా అన్ని సేవలు ఒకే చోటుకు తెచ్చేందుకు కనీస స్థాయి ప్రభుత్వంతో గరిష్ఠ స్థాయి పాలన (మినిమమ్ గవర్నమెంట్-మ్యాగ్జిమమ్ గవర్నెన్స్)ను అందించాలనేది కేంద్రం లక్ష్యం.

సుపరిపాలన, పరిపాలన సంబంధిత సంస్కరణలలో అంతర్జాతీయ సమన్వయం కోసం డీఏఆర్‌పీజీ చేస్తున్న ప్రయత్నాలలో ఇంతవరకు చైనా, మలేషియా, సింగపూర్ లతో ద్వైపాక్షిక అవగాహనపూర్వక ఒప్పందాలు (ఎంఓయూ లు), బ్రెజిల్, దక్షిణాఫ్రికాలతో త్రైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐక్యరాజ్యసమితి ఈ-గవర్నమెంట్ సర్వేలో ముందువరసలో ఉన్న యునైటెడ్ కింగ్ డమ్ తో ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం ఆ దిశగా ఒక కొత్త అడుగు అని చెప్పాలి.