శ్రేష్ఠులైన అధ్యక్షులు శ్రీ శీ జిన్ పింగ్, గౌరవనీయులైన నా బ్రిక్స్ సహచరులు, మాననీయ నేతలారా,
ఈ రోజు మీ అందరితో కలసి ఇక్కడ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. మీ దేశాలు భారత్ కు సన్నిహితమైన మరియు విలువైన భాగస్వామ్య దేశాలు. పెంచి పోషించగలిగే సమగ్రమైన అభివృద్ధిని సాధించాలన్న మన అందరి ప్రాథమ్యం గురించిన అభిప్రాయాలను మీతో పంచుకోవడం నాకు ఆనందాన్నిస్తోంది. ఈ సంభాషణ కోసం మనల్నందరినీ ఒక చోటుకు తీసుకు వచ్చినందుకుగాను అధ్యక్షుల వారు శ్రీ శీ జిన్ పింగ్ కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
శ్రేష్ఠులారా,
ఐక్య రాజ్య సమితి లో 2030 అజెండాను మరియు ఆ అజెండా యొక్క 17 పెంచి పోషించగలిగే అభివృద్ధి లక్ష్యాలను (ఎస్ డి జి స్ ను) ఆమోదించిన నాటి నుండి రెండు సంవత్సరాలు గడచిపోయాయి. ఈ లక్ష్యాలను సాధించడానికి సమన్వయపూర్వకమైన చర్యలు తీసుకోవలసిన అనివార్యత మరింత బలపడింది. భారతదేశం తన ఎస్ డి జి స్ యొక్క తొలి స్వచ్ఛంద జాతీయ సమీక్షను ఇటీవలే జులై లో పూర్తి చేసింది. మా అభివృద్ధి కార్యక్రమ పట్టికకు ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’’ సంకల్పమే కీలకంగా ఉన్నది. ఈ మాటలకు- సమష్టి ప్రయత్నం, సమ్మిళిత వృద్ధి అని – అర్థం. మేము ఎస్ డి జిలలో ప్రతి ఒక్క లక్ష్యాన్ని సమాఖ్య మరియు రాష్ట్రాల స్థాయిలలోని మా అభివృద్ధి కార్యక్రమాలతో ముడి వేసుకొన్నాము. మా పార్లమెంట్ కూడా ఎస్ డిజిల పై పార్లమెంటరీ చర్చలను నిర్వహించేందుకు చొరవ తీసుకున్నది. ఈ ప్రాధాన్యపూర్వక లక్ష్యాలను నెరవేర్చేందుకు మా కార్యక్రమాలు నిర్ణీత కాలబద్ధతతో సన్నద్ధంగా ఉన్నాయి. కేవలం ఒక ఉదాహరణను ఇవ్వాలంటే గనక, బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి బ్యాంకు ఖాతాను సమకూర్చడం కోసం మేము మూడు విధాలతో కూడిన ఒక పద్ధతిని పాటిస్తున్నాము. అందరికీ బయోమెట్రిక్ గుర్తింపును అందజేయడం, వినూత్నమైనటువంటి మొబైల్ గవర్నెన్స్ సొల్యూషన్స్ ను వినియోగించుకోవడం ద్వారా మొట్టమొదటి సారిగా దాదాపు 360 మిలియన్ మంది ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపులకు వీలు కలిగింది.
శ్రేష్ఠులారా,
మేము ఈ కోవకు చెందిన దేశీయ ప్రయాసలకు శక్తిమంతమైన అంతర్జాతీయ భాగస్వామ్యాలు సాయపడాలని ఆశిస్తున్నాము. మరి, ఇందుకోసం, మా వంతుగా చేయాల్సింది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము మా వృద్ధి సంబంధిత ఆకాంక్షలను నెరవేర్చుకొనే క్రమంలో అభివృద్ధి చెందుతున్న సాటి దేశాలతో భాగస్వామ్యాలను నెలకొల్పుకోవడంలో సుదీర్ఘ సంప్రదాయాన్ని కలిగివున్నాము. ప్రజాస్వామిక సంస్థలను పటిష్టపరచడం నుండి ప్రజాహితం కోసం అత్యధునాతన సాంకేతిక విజ్ఞాన సంబంధ సేవలను ఉపయోగించడం వరకు- వివిధ రంగాలలో వనరులను మరియు మా అనుభవాన్ని ప్రతి అడుగు లోనూ మేము పంచుకొన్నాము. ఈ సంవత్సరం ఆరంభంలో మేము విద్య, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్ మరియు విపత్తుల నిర్వహణ రంగాలలో ప్రాంతీయ భాగస్వామ్య దేశాలు వాటి అభివృద్ధి లక్ష్యాలను అందుకొనేందుకుగాను చొరవ తీసుకొని ముందుకు వచ్చిన వాటి వరకు మేలు కలిగే విధంగా దక్షిణ ఆసియా శాటిలైట్ ను ప్రయోగించాము. భారతదేశపు ఇండియన్ టెక్నికల్ అండ్ ఇకనామిక్ కోఆపరేషన్ (ఐటిఇసి.. ITEC) ఆసియా, ఆఫ్రికా, తూర్పు యూరోప్, ల్యాటిన్ అమెరికా, కరీబియన్ మరియు పసిఫిక్ దీవులలోని దేశాలకు చెందిన 161 భాగస్వామ్య దేశాలకు శిక్షణను, నైపుణ్యాల అభివృద్ధిని అందజేసింది. ఒక్క ఆఫ్రికాలోనే గడచిన దశాబ్ద కాలానికి పైగా 25,000కు పైగా విద్యార్థులు ఐటిఇసి ఉపకార వేతనాల అండతో భారతదేశంలో శిక్షణను పొందారు. 2015 లో 54 ఆఫ్రికన్ దేశాలు పాలుపంచుకొన్న మూడవ ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమిట్ లో ఐటిఇసి ఉపకార వేతనాల సంఖ్యను కేవలం అయిదు సంవత్సరాల కాలంలో రెట్టింపు చేసి 50,000కు చేర్చాలని మేము నిర్ణయించాము. ఆఫ్రికాకు చెందిన, భారతదేశంలో శిక్షణను పొందిన ‘‘సోలార్ మామాస్’’ ఆఫ్రికా ఖండం అంతటా వేలాది గృహాలను ప్రకాశవంతం చేస్తున్నాయి. ఆఫ్రికాతో విస్తరిస్తున్న మా అనుబంధం, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు తన వార్షిక సమావేశాన్ని ప్రప్రథమంగా ఆఫ్రికాకు వెలుపల- భారతదేశంలో- ఈ సంవత్సరం ఆరంభంలో నిర్వహించేందుకు తోడ్పడింది. మా అభివృద్ధి భాగస్వామ్య పథకాలు ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ దేశాలలో ప్రజానీకానికి నీరు, విద్య, రహదారులు, ఆరోగ్య సంరక్షణ, టెలి- మెడిసిన్ లతో పాటు మౌలిక సదుపాయాలను అందిస్తున్నాయి. ఈ చొరవలు అన్నింటిలో కూడా మా భాగస్వామ్య దేశాల వాస్తవిక అవసరాలు మరియు ప్రాధాన్యాల ప్రాతిపదిక మీదనే మేము ఏ షరతులు లేనటువంటి సహకారాన్ని అందిస్తూవస్తున్నాము.
శ్రేష్ఠులారా,
ఇక్కడ గుమికూడిన దేశాలు మానవ జాతిలో దాదాపు సగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మనం ఏమి చేసినప్పటికీ, అది ప్రపంచంపై గణనీయ ప్రభావాన్ని ప్రసరింపచేస్తుంది. కాబట్టి, ఒక్కొక్క ఇటుకను పేర్చడం ద్వారానో, లేదా బ్రిక్స్ (BRICS) ద్వారానో మరింత మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం మన పవిత్ర కర్తవ్యం. నిన్నటి రోజున, నేను రానున్న పది సంవత్సరాల కాలం స్వర్ణ దశాబ్దం అవడం కోసమని ప్రపంచ పరివర్తనకు చోదకంగా నిలచేది బ్రిక్స్ యే అని మీకు వివరించాను. ఈ దిగువన ప్రస్తావించినటువంటి పది పవిత్రమైన అంశాలలో వచనబద్ధులమయ్యి సకారాత్మక వైఖరిని, విధానాలను మరియు చర్యలను చేపట్టడం ద్వారా మనం ఈ పనిని పూర్తి చేయగలమని నేను భావిస్తున్నాను:
1. ఒక భద్రమైన ప్రపంచాన్ని ఆవిష్కరించడం: వ్యవస్థీకృతమైన, ఇంకా సమన్వయభరితమైన చర్యల ద్వారా కనీసం మూడు సమస్యలను.. ఉగ్రవాదాన్ని, సైబర్ సెక్యూరిటీని మరియు విపత్తుల నిర్వహణను ఎదుర్కోవాలి.
2. హరిత ప్రపంచాన్ని ఆవిష్కరించడం: ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ వంటి ఉమ్మడి కార్యక్రమాల ద్వారా జల వాయు పరివర్తనను ఎదుర్కోవాలి.
3. శక్తి/ సమర్ధత కలిగిన ప్రపంచాన్ని ఆవిష్కరించడం: సామర్ధ్యాన్ని, ఆర్థిక వ్యవస్థలను, దక్షతలను పెంపొందించుకొనేందుకు తగిన సాంకేతిక విజ్ఞానాన్ని పరస్పరం పంచుకొంటూ ఆ సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి.
4. సమ్మిళిత ప్రపంచాన్ని ఆవిష్కరించడం: ఇందుకోసం మన బ్యాంకింగ్ మరియు ఆర్థిక వ్యవస్థలతో పాటు మన దేశాల ప్రజలను ఆర్థిక ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలి.
5. డిజిటల్ ప్రపంచాన్ని ఆవిష్కరించడం: ఇందుకోసం మన ఆర్థిక రంగాల లోపల మరియు వెలుపల డిజిటల్ అంతరాన్ని పూడ్చడానికి తగిన సేతువులను నిర్మించాలి.
6. నైపుణ్యవంతమైన ప్రపంచాన్ని ఆవిష్కరించడం: ఇందుకోసం మన దేశాలలోని మిలియన్ ల కొద్దీ యువతీయువకులకు భవిష్యత్తులో అవసరపడే నైపుణ్యాలను వారికి అందజేయాల్సివుంటుంది.
7. ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని ఆవిష్కరించడం: ఇందుకోసం వ్యాధులను నిర్మూలించడం మరియు తక్కువ వ్యయమయ్యే ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూడటానికి పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో సహకరించుకోవాలి.
8. న్యాయబద్ధమైన ప్రపంచాన్ని ఆవిష్కరించడం: ఇందుకోసం అందరికీ సమానమైన అవకాశాలు- మరీ ముఖ్యంగా పురుషులు, మహిళల సమానత్వ సాధన దిశగా కృషి చేయడం ద్వారా- ఆ అవకాశాలు లభించేటట్లు చూడాలి.
9. అనుసంధానితమైన ప్రపంచాన్ని ఆవిష్కరించడం: ఇందుకోసం వస్తువులు, సేవలు మరియు వ్యక్తుల రాకపోకలు ఎటువంటి ఆంక్షలు లేకుండా సాధ్యపడేలా చూడాలి.
10. సామరస్యపూర్వకమైనటువంటి ప్రపంచాన్ని ఆవిష్కరించడం: ఇందుకోసం శాంతియుత సహజీవనం మరియు ప్రకృతితో మైత్రి కలిగి జీవించడం ప్రధానంగా ఉండేటటువంటి పద్ధతులను, సిద్ధాంతాలను, వారసత్వాన్ని పెంపొందించుకోవాలి.
ఈ చర్చనీయాంశాలు, వాటిపై తగు కార్యాచరణ చేపట్టడం ద్వారా మనం మన సొంత ప్రజల సంక్షేమానికి తోడు ప్రపంచ సముదాయపు సంక్షేమానికి నేరుగా దోహదం చేయగలుగుతాము. ఈ విషయంలో, భారతదేశం ఇతర దేశాలలో ప్రతి ఒక్క దేశపు జాతీయ ప్రయాసలకు మద్దతివ్వడానికి, ఇప్పటికన్నా ఎక్కువ సహకారాన్ని అందించడానికి సుముఖతను ప్రదర్శించే, మాటకు కట్టుబడినటువంటి భాగస్వామ్యదేశంగా నిలబడటానికి సన్నద్ధురాలయి ఉంటుంది. ఈ దారిలో మనం ముందుకు సాగిపోవడానికి నేను నిరీక్షిస్తున్నాను. 2017 సంవత్సరపు బ్రిక్స్ అధ్యక్ష పదవని సమర్థంగా నిర్వహించినందుకు, ఈ సుందరమైన జియామెన్ నగరానికి ఆయన సాదరంగా ఆహ్వానించడంతో పాటు చక్కటి ఆతిథ్యాన్ని అందించినందుకు అధ్యక్షుల వారు శ్రీ శీ ని నేను శ్లాఘిస్తున్నాను. అంతేకాకుండా, అధ్యక్షులు శ్రీ జుమాను నేను స్వాగతిస్తున్నాను; వచ్చే సంవత్సరంలో జోహాన్స్ బర్గ్ శిఖర సమ్మేళనం కోసం భారతదేశం సంపూర్ణమైనటువంటి తోడ్పాటును అందిస్తుందని మాట ఇస్తున్నాను.
మీకందరికీ ఇవే నా ధన్యవాదాలు.
Addressed the BRICS Emerging Markets and Developing Countries Dialogue. Sharing my speech. https://t.co/0Oed2c4igl
— Narendra Modi (@narendramodi) September 5, 2017
Emphasised on India’s commitment & endeavours towards expanding developmental cooperation with other nations, particularly Africa.
— Narendra Modi (@narendramodi) September 5, 2017