Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూణేలోని దేహులో జగద్గురు శ్రీ సంత్ తుకారాం మహారాజ్ శిలా మందిర్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం – తెలుగు అనువాదం

పూణేలోని దేహులో జగద్గురు శ్రీ సంత్ తుకారాం మహారాజ్ శిలా మందిర్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం – తెలుగు అనువాదం


శ్రీ విఠలాయ నమః

నమో సద్గురు, తుకాయ జ్ఞానదీప ।  

నమో సదగురు, సచ్చిదానంద రూపా॥

నమో సద్గురు, భక్త-కళ్యాణ మూర్తి ।  

నమో సద్గురు,   భాస్కర పూర్ణ కీర్తి॥

మస్తక్ హే పాయావరీ  ।   

యా వారకరీ సంతాంచ్యా॥

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్ గారూ, 

ప్రతిపక్ష నాయకులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారూ, 

మాజీ మంత్రి శ్రీ చంద్రకాంత్ పాటిల్ గారూ, 

వార్కారీ సాధువు  శ్రీ మురళీ బాబా కురేకర్ గారూ, 

జగద్గురు శ్రీశాంత్ తుకారాం మహారాజ్ సంస్థాన్  చైర్మన్ నితిన్ మోర్ గారూ ,

ఆధ్యాత్మిక అఘాడీ అధ్యక్షుడు ఆచార్య శ్రీ తుషార్ భోసలే గారూ, 

ఇక్కడ హాజరైన సాధువులు, సదరు, సోదరీమణులారా, 

విఠల్ ప్రభువు మరియు వార్కారీ సాధువులందరి పాదాలకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను!  సాధువుల ‘సత్సంగం’ (పవిత్ర సమ్మేళనం) మానవ జన్మలో అత్యంత అరుదైన భాగ్యం అని మన గ్రంథాలలో పేర్కొనబడింది.  సాధువుల అనుగ్రహం లభిస్తే స్వయంభువుగా భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.  ఈ రోజు దేహూ అనే ఈ పవిత్ర తీర్థయాత్రకు వచ్చిన తర్వాత నేను అదే అనుభూతిని పొందుతున్నాను.   దేహు అనేది సంత్ శిరోమణి జగద్గురు తుకారాం జీ జన్మస్థలం మరియు అతని కార్యకలాపాల క్షేత్రం. 

ధన్య దేహూంగావ్, పుణ్యభూమి ఠావ్ । 

తేథే నాందే దేవ పాండురంగ ।

ధన్య క్షేత్రవాసీ లోక తే దైవాచే । 

ఉచ్చారితి వాచే, నామ ఘోష్ । 

దేహు కూడా భగవాన్ పాండురంగ యొక్క శాశ్వతమైన నివాసం; ఇక్కడ ప్రజలు సాధు స్వరూపులు, భక్తి తో నిండి ఉన్నారు.  ఈ స్ఫూర్తితో, దేహూ పౌరులైన నా మాతృమూర్తులు, సోదరీమణులందరికీ, నేను గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను.  కొద్ది నెలల క్రితమే పాల్కీ మార్గ్‌ లో రెండు జాతీయ రహదారుల నాలుగు లైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం విశేషం.  శ్రీశాంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ పాల్కీ మార్గ్ నిర్మాణం 5 దశల్లోనూ, సంత్ తుకారాం మహారాజ్ పాల్కీ మార్గ్ నిర్మాణం 3 దశల్లోనూ పూర్తి కానున్నాయి.   వీటిలో, 11,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించే 350 కి.మీ. కంటే ఎక్కువ పొడవైన రహదారులు ఉన్నాయి.  ఈ ప్రాంత అభివృద్ధికి ఈ కార్యక్రమాలు మరింత ఊతం ఇవ్వనున్నాయి.   ఈ రోజు, పవిత్ర శిలా మందిర ప్రారంభోత్సవం కోసం నేను దేహు లో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను.  సంత్ తుకారాం జీ 13 రోజుల పాటు తపస్సు చేసిన శిల, సంత్ తుకారాం జీ సాక్షాత్కారానికి, సన్యాస దీక్ష కి సాక్షిగా నిలిచింది.  ఇది కేవలం శిల మాత్రమే కాదు, భక్తి కి, జ్ఞానానికి మూల స్తంభమని నేను నమ్ముతున్నాను.  దేహు లోని ఈ శిలా మందిరం భక్తి కి సంబంధించిన శక్తి కేంద్రంగా మాత్రమే కాకుండా,  భారతదేశ సాంస్కృతిక భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది.  ఈ పవిత్ర స్థలాన్ని పునర్నిర్మించినందుకు ఆలయ ట్రస్టు తో పాటు భక్తులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  జగత్గురు సంత్ తుకారాం జీ యొక్క గాథను వివరించినందుకు సమీపంలోని సదుంబేరేకు చెందిన శాంతాజీ మహారాజ్ జగ్నాడేజీ కి కూడా నేను అభివందనాలు తెలియజేస్తున్నాను. 

మిత్రులారా, 

భారతదేశం, దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాన్ని జరుపుకుంటోంది.  ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటిగా మనం గర్విస్తున్నాము.  దీని ఘనత భారతదేశ సాధు సంప్రదాయానికి, భారతదేశ ఋషుల కే చెందుతుంది.  భారతదేశం శాశ్వతమైనది, ఎందుకంటే భారతదేశం సాధువుల భూమి.  ప్రతి యుగంలో, మన దేశానికి, మన సమాజానికి దిశానిర్దేశం చేయడానికి ఏదో ఒక గొప్ప ఆత్మ కనిపిస్తూ ఉంటుంది.  ఈ రోజు దేశం సంత్ కబీర్ దాస్ జయంతిని జరుపుకుంటోంది.   సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్, సంత్ నివృత్తి నాథ్ మహారాజ్, సంత్ సోపాందేవ్, ఆదిశక్తి ముక్తాబాయి వంటి సాధువుల 725వ వార్షికోత్సవం కూడా ఈరోజే.  అటువంటి గొప్ప వ్యక్తులు మన శాశ్వతత్వాన్ని కాపాడుతూ భారతదేశాన్ని చైతన్యవంతంగా ఉంచారు.  సంత్ తుకారాం జీ ని సాధువుల దేవాలయ కలశంగా సంత్ బహినాబాయి అభివర్ణించారు.  ఆయన అనేక ఇబ్బందులు, కష్టాలతో కూడిన జీవితాన్ని గడిపారు.  కరువు లాంటి పరిస్థితులను సైతం కూడా ఆయన ఎదుర్కొన్నారు.  ఆయన ప్రపంచంలోని ఆకలితో పాటు, ఆకలి తీరక పోవడాన్ని కూడా చూశారు.   అటువంటి దుఃఖం, బాధల చక్రంలో ప్రజలు ఆశలు వదులుకున్నప్పుడు, సంత్ తుకారాం జీ ప్రస్తుత సమాజం పాటు, భవిష్యత్తు తరాలకు కూడా ఆశాకిరణంగా నిలిచారు.   తమ కుటుంబ సంపద మొత్తాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు.  ఈ శిల ఆయన త్యాగానికి, నిర్లిప్తత కు నిదర్శనం. 

మిత్రులారా, 

సంత్ తుకారాం జీ యొక్క ‘అభంగాలు’ (భక్తి గీతాలు) రూపంలో ఆయన దయ, కరుణ, సేవ గురించి మనకు ఇప్పటికీ ఆ అవగాహన ఉంది.  ఈ ‘అభంగాలు’ మన తరాలకు స్ఫూర్తినిచ్చాయి.  ఈ ‘అభంగాలు’ – కరగకుండా, శాశ్వతంగా ఉండి, కాలానికి సంబంధించి ఉంటాయి.   నేటికీ, దేశం దాని సాంస్కృతిక విలువల ఆధారంగా పురోగమిస్తున్నప్పుడు, సంత్ తుకారాం జీ యొక్క ‘అభంగాలు’ మనకు శక్తిని ఇస్తూ, మార్గాన్ని చూపుతున్నాయి.  సంత్ నామ్‌దేవ్, సంత్ ఏకనాథ్, సంత్ సవతా మహారాజ్, సంత్ నరహరి మహారాజ్, సంత్ సేన మహారాజ్, సంత్ గోరోబా-కాకా, సంత్ చోఖమేల యొక్క పురాతన ‘అభంగాల’ నుండి మేము ఎల్లప్పుడూ కొత్త స్ఫూర్తిని పొందుతాము.  సంత్ చోఖమేలా మరియు అతని కుటుంబ సభ్యులు స్వరపరిచిన ‘సార్థ్ అభంగగాథ’ని ఈరోజు విడుదల చేసే అవకాశం కూడా నాకు లభించింది. ఈ సాధువు కుటుంబం యొక్క 500 కంటే ఎక్కువ ‘అభంగ’ కూర్పులు ‘అభంగథ’లో చాలా సులభమైన భాషలో వివరించబడ్డాయి.

సోదర, సోదరీమణులారా,  

సంత్ తుకారాం జీ ఇలా చెప్పారు: ఉంచ్ నీచ్ కహీ నేణే భగవంత్॥  అంటే, సమాజంలోని వ్యక్తుల పట్ల వివక్ష చూపడం పెద్ద పాపం అని అర్ధం.  భగవంతుని పట్ల భక్తికి ఈ బోధన ఎంత అవసరమో, దేశభక్తికి, సమాజ భక్తికి కూడా అంతే ముఖ్యం.  ఈ సందేశంతోనే, మన వార్కారీ సోదరులు, సోదరీమణులు ప్రతి సంవత్సరం పంధర్ పూర్ సందర్శిస్తారు.  అందుకే “సబ్‌-కా-సాథ్, సబ్‌-కా-వికాస్, సబ్‌-కా-విశ్వాస్, సబ్‌-కా-ప్రయాస్” అనే మంత్రంతో దేశం ముందుకు సాగుతోంది.  

వివక్షకు తావులేకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు.  వార్కారీ ఉద్యమ భావాలను శక్తివంతం చేస్తూ, దేశం మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తోంది.   పురుషులతో సమానమైన శక్తి తో వారీగా నడిచే మన సోదరీమణులు అవకాశాల సమానత్వానికి ప్రతీకగా నిలిచారు.

మిత్రులారా, 

సంత్ తుకారాం జీ ఇలా చెప్పారు:   

జే కా రంజలే గాంజలే, త్యాంసీ మహ్ ణే జో ఆపులే ।  

తోచి సాధూ ఓలఖావా, దేవ తేథే-చి-జాణావా॥  

అంటే, సమాజంలో చివరి వరుసలో కూర్చున్న వ్యక్తిని ఆలింగనం చేసుకోవడం, అతని క్షేమం సాధువుల లక్షణం. అని అర్ధం.   ఇప్పుడు దేశం అమలుచేస్తున్న అంత్యోదయ తీర్మానం ఇదే.  దళిత, అణగారిన, వెనుకబడిన, గిరిజన, పేద, కార్మికుల సంక్షేమమే నేడు దేశంలో మొదటి ప్రాధాన్యతగా ఉంది. 

సోదర, సోదరీమణులారా, 

సమాజానికి ఊపునిచ్చే శక్తిని  ఇవ్వవలసిన విభిన్న సందర్భాల్లో సాధువులు ఉద్భవిస్తారు.   మీరు ఒకసారి చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి జాతీయ నాయకుడు జీవితంలో కూడా తుకారాం జీ వంటి సాధువులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు.  స్వాతంత్య్ర పోరాటంలో వీర్ సావర్కర్ జీ కి శిక్ష పడినప్పుడు, జైలులో ‘చిప్లీ’ లను వాయించినట్లు సంకెళ్లతో తాళం వేస్తూ, తుకారాం జీ ‘అభంగాలు’ పాడేవారు.  సంత్ తుకారాం జీ ప్రసంగాలు మరియు శక్తి వివిధ యుగాలలో, విభిన్న వ్యక్తులకు సమానంగా స్ఫూర్తిదాయకంగా నిలిచాయి!  ఇది సాధువుల మహిమ, దీనికి ‘నీతి-నీతి’ అని పేరు పెట్టారు.

మిత్రులారా,

పండర్‌పూర్ జీ ప్రయాణం కూడా ఆషాఢ మాసం (జూన్) లో ప్రారంభం కానుంది.  అది మహారాష్ట్రలోని పంధర్‌ పూర్ యాత్ర కావచ్చు;   లేదా ఒడిశాలో జగన్నాథుని యాత్ర;  మధురలోని వ్రజ పరిక్రమ;  లేదా కాశీలో పంచకోశి పరిక్రమ;  చార్ ధామ్ యాత్ర లేదా అమర్‌ నాథ్ యాత్ర;  ఈ ‘యాత్రలు’ (ప్రయాణాలు) మన సామాజిక, ఆధ్యాత్మిక చైతన్యానికి శక్తి వనరుల్లాంటివి.  ఈ ‘యాత్రల’ ద్వారా మన సాధువులు ‘ఏక్-భారత్-శ్రేష్ఠ-భారత్’ స్ఫూర్తిని సజీవంగా ఉంచారు.  వైవిధ్యాలు ఉన్నప్పటికీ భారతదేశం వేల సంవత్సరాలుగా ఒక దేశంగా నిలబడింది. అలాంటి ‘యాత్రలు’ మన వైవిధ్యాలకు వారధిగా ఉన్నాయి.

సోదర, సోదరీమణులారా, 

ఈ రోజు మన జాతీయ ఐక్యత బలోపేతానికి  మన ప్రాచీన గుర్తింపు, సంప్రదాయాలను సజీవంగా ఉంచుకోవడం మన బాధ్యత.  అందువల్ల, ఆధునిక సాంకేతికత మరియు మౌలిక సదుపాయాలు భారతదేశ అభివృద్ధికి పర్యాయపదాలుగా మారుతున్న నేపథ్యంలో, అభివృద్ధి మరియు వారసత్వం రెండూ కలిసి ఉండాలని మనం నిర్ధారించుకున్నాము.  నేడు పంధర్‌ పూర్ పాల్కీ మార్గ్‌ ను ఆధునీకరించడంతోపాటు చార్ ధామ్ యాత్ర కోసం కొత్త రహదారులను కూడా నిర్మించడం జరుగుతోంది.   నేడు అయోధ్యలో గొప్ప రామ మందిరం కూడా నిర్మించబడుతోంది;  కాశీ విశ్వనాథ్ ధామ్ కాంప్లెక్స్ కూడా దాని కొత్త రూపంలో ఉంది; అదేవిధంగా, సోమనాథ్ జీ లో కూడా  గొప్ప అభివృద్ధి పనులు జరిగాయి.  

రామాయణంలో వాల్మీకి మహర్షి పేర్కొన్న శ్రీరాముడికి సంబంధించిన స్థలాలను కూడా రామాయణ సర్క్యూట్ రూపంలో అభివృద్ధి చేయడం జరుగుతోంది. 

ఈ ఎనిమిదేళ్లలో బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన ఐదు తీర్థయాత్రలు కూడా అభివృద్ధి చెందాయి.  మోవ్‌లోని బాబాసాహెబ్ జన్మస్థలం అభివృద్ధి అయినా,  లండన్‌ లో ఆయన చదువుకున్న ఇంటిని స్మారక చిహ్నంగా మార్చడం లేదా  ముంబైలోని చైత్య భూమి యొక్క కృషి, నాగ్‌పూర్‌ లో అంతర్జాతీయ స్థాయిలో దీక్షాభూమి అభివృద్ధి లేదా ఢిల్లీలోని మహా పరి నిర్వాణ ప్రదేశంలో స్మారక చిహ్నం –  ఈ పంచ తీర్థాలు నిరంతరం కొత్త తరానికి బాబాసాహెబ్ జ్ఞాపకాలతో పరిచయం చేస్తూనే ఉన్నాయి.

మిత్రులారా, 

సంత్ తుకారాం జీ ఎప్పుడూ ఇలా చెబుతారు: 

అసాధ్య తే సాధ్య కరీతా సాయాస్। 

కరణ్ అభ్యాస్, తుకాహ్మణే॥ 

అంటే, అందరి ప్రయత్నాలు సరైన దిశలో జరిగితే, అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుందని అర్ధం. 

స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా ఇప్పుడు దేశం 100 శాతం లక్ష్యాలను నెరవేర్చుకోవాలని సంకల్పించింది.  పేదల కోసం కనీస అవసరాలైన విద్యుత్, నీరు, ఇల్లు, చికిత్స వంటి పథకాలు వంద శాతం ప్రజల కు చేరవేయాలి.  అదేవిధంగా, పర్యావరణ పరిరక్షణ, నీటి-సంరక్షణ, నదులను కాపాడుకోవడం వంటి ప్రచారాలను దేశం ప్రారంభించింది.  ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం మనం ప్రతిజ్ఞ చేసాము.  మనం కూడా ఈ తీర్మానాలను 100 శాతం నెరవేర్చాలి.  ఈ విషయంలో అందరి కృషి, అందరి భాగస్వామ్యం అవసరం.  మనమందరం దేశానికి సేవ చేయాలనే ఈ బాధ్యతలను మన ఆధ్యాత్మిక తీర్మానాలలో భాగంగా చేసుకుంటే, దేశం సమానంగా ప్రయోజనం పొందుతుంది.  ప్లాస్టిక్ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని, మన చుట్టూ ఉన్న చెరువులు, కుంటలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేస్తే పర్యావరణం పరిరక్షించబడుతుంది.  అమృత్ మహోత్సవ్‌ లో, భాగంగా ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలు (చెరువులు) నిర్మించాలని దేశం నిర్ణయించింది.  ఈ అమృత సరోవరాలకు సాధువుల ఆశీస్సులు, సహకారం లభిస్తే ఈ పనుల్లో వేగం పుంజుకుంటుంది.  సహజ వ్యవసాయాన్ని కూడా దేశం ఇప్పుడు ఒక ప్రచారంగా ముందుకు తీసుకు వెళుతోంది.  ఈ ప్రయత్నం వార్కారీ సాధువుల ఆదర్శాలతో ముడిపడి ఉంది.  ప్రతి పొలానికి సహజ వ్యవసాయాన్ని ఎలా అమలు చేయాలో మనం కలిసి పని చేయాలి.  మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా రాబోతోంది.  యోగా నేడు కేవలం మన సాధువుల వల్ల నే ప్రపంచంలో విరాజిల్లుతోంది.   యోగా దినోత్సవాన్ని మీరందరూ పూర్తి ఉత్సాహం తో జరుపుకుంటారని, దేశం పట్ల ఈ బాధ్యతలు  నెరవేర్చడం ద్వారా నవ భారత కలను సాకారం చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

ఈ స్ఫూర్తితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. 

మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశం, ఈ గౌరవానికి నా శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

జై-జై రామకృష్ణ హరి, జై-జై రామకృష్ణ హరి, హర్ హర్ మహాదేవ్!

గమనిక:  ప్రధానమంత్రి హిందీలో చేసిన అసలు  ప్రసంగానికి ఇది స్వేచ్చానువాదం మాత్రమే.  

 

*****