Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పుదుచ్చేరిలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం… శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

పుదుచ్చేరిలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం… శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం


పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, విశిష్ట అతిథులు… నా ప్రియ మిత్రులారా!

   పవిత్ర పుదుచ్చేరి దివ్యత్వం నన్ను మరోసారి ఈ పుణ్యభూమికి తీసుకొచ్చింది. సరిగ్గా మూడేళ్ల కింద నేను ఇక్కడే ఉన్నాను. ఈ నేల ఎందరో రుషులు, జ్ఞానులు, కవులకు నిలయం. అలాగే భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు ఎందరో విప్లవకారులకు జన్మనిచ్చిన భూమి. మహాకవి సుబ్రమణియ భారతి ఇక్కడే ఉండేవారు. శ్రీ అరబిందో ఈ తీరాన పాదం మోపారు. భారత తూర్పు-పశ్చిమ తీరాల్లో పుదుచ్చేరి ఉనికి కనిపిస్తుంది. ఈ భూమి వైవిధ్యానికి చిహ్నం. ప్రజలు ఐదు వేర్వేరు భాషలను మాట్లాడతారు, విభిన్న విశ్వాసాలను పాటిస్తారు, కానీ ఒకటిగా జీవిస్తారు. ఈ నేల వైవిధ్యానికి ప్రతీక. ఐదు భాషలు మాట్లాడే, వివిధ విశ్వాసాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఒక్కటిగా నివసిస్తున్నారు.

మిత్రులారా!

   పుదుచ్చేరి జనజీవనాన్ని మెరుగుపరిచే వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం నేపథ్యంలో ఇదెంతో సుదినం. ఇవన్నీ విభిన్న రంగాలకు చెందిన పనులు కాగా, పునర్నిర్మిత మెయిరీ సౌధాన్ని ప్రారంభించడం నాకు ఎనలేని సంతోషం కలిగిస్తోంది. ప్రాచీన వారసత్వ విలువను నిలబెడుతూ ఈ భవనం తిరిగి నిర్మించబడింది. ఇది ప్రోమెనేడ్‌ బీచ్‌ అందాలను ఇనుమడింపజేస్తూ మరింతగా పర్యాటకులను ఆకర్షిస్తుంది.

మిత్రులారా!

   భారత అభివృద్ధి అవసరాలను తీర్చాలంటే దేశానికి అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు అవసరం. ఆ మేరకు నాలుగు వరుసల జాతీయ రహదారి ‘45-ఎ’కి శంకుస్థాపన చేయడం మీకు చాలా ఆనందాన్నిస్తుంది. ఇది సత్తనాథపురం నుంచి కరైకల్‌ జిల్లా మీదుగా నాగపట్టణం వరకూ 56 కిలోమీటర్ల పొడవున నిర్మించబడుతుంది. దీనివల్ల అనుసంధానం కచ్చితంగా మెరుగుపడుతుంది. ఆర్థిక కార్యపలాపాలు ఊపందుకుంటాయి. అదే సమయంలో పవిత్ర శనీశ్వర ఆలయ మార్గం సుగమం అవుతుంది. మన ఆరోగ్య దేవత నిలయం బసిలికా-నాగూర్‌ దర్గాల మధ్య అంతర్రాష్ట్ర సంధానం కూడా సులభమవుతుంది.

మిత్రులారా!

   గ్రామీణ-తీర ప్రాంతాల అనుసంధానం మెరుగుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తోంది. దీనివల్ల వ్యవసాయ రంగానికి లబ్ధి కలుగుతుంది. దేశవ్యాప్తంగా రైతులు వినూత్న మార్గంలో సాగుతున్నారు. వారు పండించే పంటలకు మార్కెట్‌లో మంచి ధర లభించేందుకు భరోసా ఇవ్వడం మన కర్తవ్యం. ఈ దిశగా చక్కని రహదారులు ఎంతగానో దోహదం చేస్తాయి. నాలుగు వరుసల రోడ్డువల్ల ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా వస్తాయి. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

మిత్రులారా!

   ఆరోగ్యంతోనే సౌభాగ్యం సన్నిహితంగా ముడిపడి ఉంటుంది.  ప్రజారోగ్యం, దృఢత్వం మెరుగు కోసం గడచిన ఏడేళ్లలో భారత్‌ ఎంతగానో కృషిచేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడి క్రీడా ప్రాంగణంలో 400 మీటర్ల సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది. ‘ఖేలో ఇండియా’ పథకంలో ఇదొక భాగం. యువభారతం క్రీడా ప్రతిభకు ఇది మెరుగులు దిద్దుతుంది. క్రీడలు మనకు సమష్టి కృషిని, నైతికతను, అన్నిటికీ మించి క్రీడాస్ఫూర్తిని బోధిస్తాయి. పుదుచ్చేరిలో చక్కని క్రీడా సదుపాయాలు అందుబాటులోకి రానుండటంతో ఈ రాష్ట్ర యువత జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించగలరు. ఇక క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంలో లాస్‌పేట్‌లో ఇవాళ ప్రారంభించిన 100 పడకల బాలికల హాస్టల్‌ మరో కీలక ముందడుగు. ఈ హాస్టల్‌లో హాకీ, వాలీబాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, కబడ్డీ, హ్యండ్‌బాల్‌ క్రీడాకారులకు వసతి కల్పిస్తారు. ఇక్కడి విద్యార్థులందరికీ భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌- SAI) శిక్షకులు శిక్షణ ఇస్తారు.

మిత్రులారా !

   భవిష్యత్తులో కీలకపాత్ర పోషించబోయే మరో రంగం- ఆరోగ్య  సంరక్షణ. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిచ్చే దేశాలే ఇకపై ఉజ్వలంగా ప్రకాశిస్తాయి. ఆ మేరకు అందరికీ నాణ్యమైన ఆరోగ్య రక్షణ కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా నేను ‘జిప్మెర్‌’ (JIPMER)లో దాదాపు రూ.28 కోట్ల వ్యయంతో నిర్మించిన రక్తనిధి కేంద్రం ప్రాజెక్టును నేను ప్రారంభిస్తున్నాను. దీనివల్ల రక్తం, రక్తసంబంధిత ఇతర ఉత్పత్తులు, మూలకణాల దీర్ఘకాలిక నిల్వకు వీలైన సదుపాయాలు ఇక్కడ ఏర్పడతాయి. అంతేకాకుండా ఇది పరిశోధనతోపాటు రక్తమార్పిడికి సంబంధించిన అంశాల్లో సిబ్బందికి శిక్షణ కేంద్రంగానూ ఉపయోగపడుతుంది. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ కేటాయింపులకు అధిక పాధాన్యం ఇచ్చిన సంగతి మీకందరికీ తెలిసిందే.

మిత్రులారా !

   మహనీయులైన తిరువళ్లువర్‌ ఇలా అన్నారు:-

கேடில் விழுச்செல்வம் கல்வி ஒருவற்கு (కేడిల్ విలుచ్చెళ్వం కల్వి ఒరువరుక్కు

மாடல்ல மற்றை யவை మాడల్ల మట్ర యవై)…

అంటే- “విజ్ఞానం, విద్య కలకాలం నిలిచే నిజమైన సంపద… మిగిలినవేవీ స్థిరమైనవి కావు” అని అర్థం. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు ప్రోత్సాహా దిశగా మనకు నాణ్యమైన ఆరోగ్య నిపుణుల అవసరం ఎంతయినా ఉంది. కరైకల్‌లోని కొత్త ప్రాంగణంలో వైద్య కళాశాల తొలిదశ భవన నిర్మాణం ఈ దిశగా ఒక ముందడుగు. ఈ సరికొత్త పర్యావరణహిత ప్రాంగణంలో ఎంబీబీఎస్‌ విద్యార్థులకు అవసరమైన అత్యాధునిక బోధన సదుపాయాలన్నీ అందుబాటులో ఉంటాయి.

మిత్రులారా !

   పుదుచ్చేరి ఆత్మ సముద్ర తీరంలోనే ఉంది. ఆ మేరకు రేవు, నౌకాయానం, మత్స్య రంగం తదితర నీలి ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. ఈ కృషిలో భాగంగా ‘సాగరమాల’ పథకం కింద పుదుచ్చేరి రేవు అభివృద్ధికి శంకుస్థాపన చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది పూర్తయితే, చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు ఎంతగానో తోడ్పడుతుంది. ఈ రేవుద్వారా చెన్నై నగరంతో అత్యంత అవసరమైన అనుసంధానం ఏర్పడుతుంది. పుదుచ్చేరిలోని పరిశ్రమల సరకు రవాణాకు, చెన్నై రేవులో ఓడలలోకి ఎక్కించడానికి వీలు కలుగుతుంది. తీర నగరాల మధ్య ప్రయాణికుల రాకపోకలకూ అవకాశాలు ఏర్పడతాయి.

మిత్రులారా !

   వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించే ‘ప్రత్యక్ష లబ్ధి బదిలీ’ (DBT) అమలులో పుదుచ్చేరి చక్కని పనితీరు కనబరచింది. దీంతో ప్రజలకు తమదైన ఎంపికకు సాధికారత లభించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక విద్యాసంస్థలు ఉండటంవల్ల పుదుచ్చేరికి సుసంపన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అలాగే పారిశ్రామిక, పర్యాటకరంగ అభివృద్ధి సామర్థ్యం మెండుగా ఉన్నందున తద్వారా ఉపాధి కల్పన, అవకాశాల సృష్టి సాధ్యం కాగలదు. పుదుచ్చేరి ప్రజలు ప్రతిభావంతులు… ఈ నేల ఎంతో సుందరమైనది… ఈ నేపథ్యంలో పుదుచ్చేరి ప్రగతికి మా ప్రభుత్వంద్వారా అన్నివిధాలా మద్దతు లభించేలా నేను వ్యక్తిగతంగా కృషిచేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఇవాళ పలు అభివృద్ధి పనులు ప్రారంభం కావడంపై పుదుచ్చేరి ప్రజలకు అభినందనలు తెలుపుతున్నాను.

ధన్యవాదాలు… థ్యాంక్యూ వెరీమచ్‌,

వణక్కం!

 

***