Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘పీఎం-కిసాన్’ కింద 8వ విడత నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి

‘పీఎం-కిసాన్’ కింద 8వ విడత నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి


   ‘‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’’ (పీఎం-కిసాన్) పథకం కింద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ 9,50,67,601 మంది రైతులకు 8వ విడతగా రూ.2,06,67,75,66,000 మేర నిధులు విడుదల చేశారు. దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి పలువురు రైతులతో కాసేపు ముచ్చటించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   రైతులతో ముచ్చటించిన సందర్భంగా- ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ‘ఉన్నావ్‌’ ప్రాంతంలో యువ రైతుల‌కు సేంద్రియ వ్య‌వ‌సాయంతోపాటు, కొత్త వ్యవసాయ పద్ధతులు పాటించడంలో శిక్ష‌ణ ఇస్తున్న రైతు అర‌వింద్‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శంసించారు. అలాగే అండమాన్-నికోబార్ దీవులలో భారీస్థాయిన సేంద్రియ వ్యవసాయం చేస్తున్న పాట్రిక్‌ను ఆయన కొనియాడారు. వీరితోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంతపురం జిల్లాలో 170 మంది ఆదివాసీ రైతులకు వ్యవసాయంలో మార్గదర్శనం చేస్తున్న ఎన్.వెన్నూరమ్మ కృషిని ప్రధాని అభినందించారు. మేఘాలయలోని కొండ ప్రాంతాల్లో అల్లం పొడి, పసుపు, దాల్చిన చెక్క తదితర సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్న రైతు ‘రెవిస్టర్’ నైపుణ్యాన్ని కూడా ఆయన మెచ్చుకున్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని శ్రీ‌న‌గ‌ర్‌ ప్రాంతంలో సేంద్రియ విధానాల ద్వారా క్యాప్సికం, పచ్చిమిరప, దోస వంటి పంటలు పండిస్తున్న రైతు ఖుర్షీద్ అహ్మ‌ద్‌తోనూ ప్రధానమంత్రి సంభాషించారు.

   ప్రధానమంత్రి రైతులతో మాట్లాడిన సందర్భంగా- ‘పీఎం-కిసాన్’ పథకం కింద పశ్చిమ బెంగాల్ రైతులు తొలిసారి లబ్ధి పొందనున్నారని వెల్లడించారు. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల్లో కూడా ఆహార ధాన్యాలు, ఉద్యాన పంటలను రికార్డు స్థాయిలో పండించిన రైతుల కృషిని ఆయన కొనియాడారు. వారికి శ్రమకు ఫలితం దక్కేవిధంగా ప్రభుత్వం కూడా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో పంటల కొనుగోళ్లలో ప్రభుత్వం కూడా ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తున్నదని  చెప్పారు. ఈ మేరకు ‘ఎంఎస్‌పీ’తో ధాన్యం సేకరణలో కొత్త రికార్డు నెలకొనగా, ప్రస్తుతం గోధుమ కొనుగోళ్లు కూడా కొత్త రికార్డుల దిశగా సాగుతున్నాయని వివరించారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటిదాకా ‘ఎంఎస్‌పీ’తో కొనుగోళ్లు 10 శాతం అదనంగా నమోదైనట్లు తెలిపారు. ఇందులో భాగంగా నేటివరకూ సేకరించిన గోధుమ పంటకు చెల్లింపుల కింద రూ.58,000 కోట్ల మేర రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయిందని వెల్లడించారు.

   వ్యవసాయంలో కొత్త సాధనాలు, సరికొత్త మార్గాలను రైతులకు చేరువ చేయడం కోసం ప్రభుత్వం నిరంతర ప్రయత్నిస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కూడా ఇందులో భాగంగా ఉందన్నారు. సేంద్రియ వ్యవసాయం మరింత లాభదాయకం కావడంతో దేశవ్యాప్తంగా యువరైతులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు. ఆ మేరకు గంగానదీ తీరంలో రెండువైపులా దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో సేంద్రియ వ్యవసాయం చురుగ్గా సాగుతున్నదని, తద్వారా పవిత్ర గంగానది పరిశుభ్రంగా ఉంటుందని ఆయన చెప్పారు.

   కోవిడ్-19 మహమ్మారి సమయంలో ‘కిసాన్ క్రెడిట్ కార్డు’ల గడువును పొడిగించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. తదనుగుణంగా వాయిదాల చెల్లింపు గడువును జూన్ 30దాకా నవీకరించే వీలుందని చెప్పారు. ఇటీవలి సంవత్సరాల్లో 2 కోట్లకుపైగా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

   శతాబ్దానికోసారి దాపురించే మహమ్మారి మన కళ్లకు కనిపించని శత్రువులా నేడు ప్రపంచానికి సవాళ్లు విసురుతున్నదని ప్రధానమంత్రి చెప్పారు. కోవిడ్-19 మహమ్మారిపై ప్రభుత్వం సర్వశక్తులూ కూడదీసుకుని పోరాడుతున్నదని ఆయన తెలిపారు. జాతి జనుల కష్టాలు తీర్చడానికి భరోసా ఇస్తూ ప్రభుత్వంలోని ప్రతి శాఖ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నదని చెప్పారు.

   దేశంలో మరింతమందికి వేగంగా టీకా వేసేదిశగా కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం సంయుక్తంగా కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మేరకు ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 18 కోట్ల టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు. అలాగే దేశమంతటా ప్రభుత్వ ఆస్పత్రులలో టీకాలు ఉచితంగానే ఇస్తున్నట్లు గుర్తుచేశారు. టీకా కోసం ప్రతి ఒక్కరూ నమోదు చేసుకుని, వేయించుకోవాలని, ఆ తర్వాత కూడా కోవిడ్ అనుగుణ ప్రవర్తన పద్ధతులను ఎల్లవేళలా పాటించాలని ప్రధానమంత్రి సూచించారు. కరోనాపై పోరాటంలో ఈ టీకా అత్యంత కీలక ఆయుధమని, దీనివల్ల తీవ్ర అనారోగ్యం ముప్పు తప్పుతుందని ఆయన వివరించారు.

   ప్రస్తుత కష్టకాలంలో ప్రాణవాయువు సరఫరాకు భరోసా ఇస్తూ దేశ సాయుధ బలగాలు సంపూర్ణ సామర్థ్యంతో కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే రైల్వేశాఖ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌ను నడుపుతున్నదని తెలిపారు. మరోవైపు దేశ ఔషధ రంగం భారీఎత్తున మందులు తయారీచేస్తూ సకాలంలో సరఫరా చేస్తున్నదని చెప్పారు. మందులు, ఇతర సరఫరాల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు కఠిన చట్టాలను ప్రయోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని కోరారు.

   అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనా భారత జాతి ఆత్మవిశ్వాసం కోల్పోదని ప్రధానమంత్రి దృఢంగా ప్రకటించారు. ఆ మేరకు సంపూర్ణ శక్తియుక్తులతోపాటు అకుంఠిత దీక్షతో ఈ సవాలును అధిగమించగలదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కోవిడ్-19 వ్యాప్తి గురించి ఆయన హెచ్చరిస్తూ- ఆయా పంచాయతీల్లో ప్రజలకు సరైన అవగాహన కల్పించడంతోపాటు పారిశుధ్యం, పరిశుభ్రత దిశగా పాలన మండళ్లు తగు చర్యలు చేపట్టాలని కోరారు.

 

***