Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పి ఆర్ ఎ జి ఎ టి ఐ ద్వారా ప్రధాన మంత్రి ముఖాముఖి సంభాషణ

పి ఆర్ ఎ జి ఎ టి ఐ ద్వారా ప్రధాన మంత్రి ముఖాముఖి సంభాషణ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఐ సి టి ఆధారిత మల్టి-మాడల్ ప్లాట్ ఫామ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేషన్ (పి ఆర్ ఎ జి ఎ టి ఐ..’ప్రగతి’) ద్వారా జరిగిన పన్నెండో ముఖాముఖి సమావేశానికి అధ్యక్షత వహించారు.

విద్యార్థులకు ఉపకార వేతనాలు/ ఫెలోషిప్ ల వితరణకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడంలో పురోగతిని ప్రధాన మంత్రి సమీక్షించారు. జాప్యానికి గల కారణాలను ఆయన తెలుసుకోగోరారు. విద్యార్థులకు ప్రయోజనాల వితరణ ప్రక్రియను ఆధార్ తో అనుసంధానించడం ఎంత వరకు వచ్చిందీ ఆయన అడిగి తెలుసుకొన్నారు కూడా. ఫిర్యాదులను పరిష్కరించడంలో వేగాన్ని పెంచాలని, స్కాలర్ షిప్ లు మరియు ఫెలోషిప్ లకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరిత గతిన, సమర్థంగా పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేయాలని సంబంధిత అధికారులకు ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.

త్రిపుర, మిజోరమ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ ఇంకా మహారాష్ట్ర లతో సహా అనేక రాష్ట్రాలలో అమలవుతున్న రహదారులు, ఉక్కు మరియు విద్యుత్తు రంగాలలోని కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన పథకాల తాలూకు పురోగతిని ప్రధాన మంత్రి సమీక్షించారు. సమీక్షించిన రైల్వే ప్రాజెక్టులలో భారతదేశం మరియు బంగ్లాదేశ్ ల మధ్య ముఖ్యమైన లంకె కాగల అఖౌరా-అగర్తల రైలు మార్గం కూడా ఉంది.

భిలాయ్ ఉక్కు కర్మాగారం ఆధునికీకరణ, విస్తరణ పనులు ఎలా సాగుతున్నదీ ప్రధాన మంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు పనులలో జరుగుతున్న జాప్యాన్ని గమనించి ఆయన దానిని తీవ్రంగా పరిగణించారు. అన్ని సమస్యలను పరిష్కరించి, వీలయినంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయవలసిందని ఉక్కు, భారీ ఇంజినీరింగ్ మంత్రిత్వ శాఖలను ఆయన ఆదేశించారు.

స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా ఉన్న వ్యర్థాల నుంచి సంపద (“waste to wealth”) కార్యక్రమం పురోగతిని శ్రీ న‌రేంద్ర మోదీ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యర్థాల నుంచి కంపోస్టు, ఇంకా వ్యర్థాల నుంచి శక్తి అనే అంశాలు కూడా కలసి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో చేపట్టిన పనులు ఎంతవరకు వచ్చిందన్న దానిపై వివరాలను వివిధ రాష్ట్రాలు తెలియజేశాయి.

క్షయ వ్యాధి వ్యాప్తిని, ఈ వ్యాధి కారణంగా సంభవించే మరణాల సంఖ్యను మరింతగా తగ్గించడమే ధ్యేయంగా ఆరోగ్య రంగం లో అమలు చేస్తున్న రివైజ్ డ్ నేషనల్ ట్యుబర్ క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ తాలూకు పురోగతిని ప్రధాన మంత్రి సమీక్షించారు. మల్టి-డ్రగ్ రెసిస్టెంట్ ట్యుబర్ క్యులోసిస్ ను సకాలంలో గుర్తించడానికి అవసరమైన వైద్య పరికరాలను జిల్లాలలో ప్రాధాన్య ప్రాతిపదికన అమర్చవలసిందని ఆయన ఆదేశించారు. ఈ వ్యాధిని అరికట్టడానికి జిల్లాల స్థాయిలో చేపట్టదగిన చర్యలకు సంబంధించిన పురోగతిని సమీక్షిస్తుండాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

శిశు మరణాల సంఖ్యను, ఇంకా మాతా మరణాల సంఖ్య (ఐ ఎమ్ ఆర్ అండ్ ఎమ్ ఎమ్ ఆర్)ను మరింతగా తగ్గించే దిశగా చోటు చేసుకొంటున్న పురోగతిని, ఈ విషయంలో వివిధ రాష్ట్రాలలో అమలుచేస్తున్న కార్యక్రమాలను గురించి ప్రధాన మంత్రి సమీక్షించారు.