నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎన్ఎస్ డిఎఫ్) మరియు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్ డిసి) ల పునర్ వ్యవస్థీకరణకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ రెండు సంస్థల పాలన సామర్థ్యం, అమలు మరియు పర్యవేక్షక వ్యవస్థ లను మరింత పటిష్టపరచడమే ఈ చర్య లోని ముఖ్యోద్దేశం.
ఈ పునర్‌వ్యవస్థీకరణ ఎన్ఎస్ డిసి కార్యకలాపాలు, ఎన్‌ఎస్ డిఎఫ్ పర్యవేక్షణ పాత్రకు వీలు కల్పించడంతో పాటు మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్ కు, పారదర్శకత కు, జవాబుదారుతనానికి వీలు కల్పిస్తుంది. ఈ ఆమోదం ఎన్‌ఎస్ డిఎఫ్ బోర్డు పునర్ వ్యవస్థీకరణకు, ఎన్‌ఎస్ డిసి పాలన, కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ బాధ్యతలను పటిష్టం చేయడానికి ఉపకరిస్తుంది.
పూర్వరంగం:
నైపుణ్యాభివృద్ధికి సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టి అమలు చేసేందుకు ఎన్ఎస్ డిసి ని 2008 జులై లో, ఎన్‌ఎస్ డిఎఫ్ ను 2009 జనవరి లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, రిజిస్టర్ చేసింది. ప్రభుత్వం నుండి ద్వైపాక్షిక/ బహుళపాక్షిక సంస్థలు మరియు ఇతర ఏజెన్సీల నుండి ఆర్థిక వనరులను అందుకొని నిల్వ ఉంచే వ్యవస్థగా ఎన్‌ఎస్ డిఎఫ్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. వివిధ రంగాలకు అవసరమైన విధంగా భారతీయ యువత లో నైపుణ్యాభివృద్ధిని వేగవంతం చేయడం, నైపుణ్యాలను పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం.
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ లక్ష్యాలను చేరుకొనేందుకు, అలాగే దేశంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఎన్‌ఎస్ డిసి కార్పస్ నిధులను వినియోగించేందుకు ఎన్‌ఎస్ డిసి తో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ అగ్రిమెంట్ (ఐఎమ్ఎ) ను ఎన్‌ఎస్ డిఎఫ్ కుదుర్చుకొంది. ఎన్‌ఎస్ డిసి, ఎన్‌ఎస్ డిఎఫ్ ల మధ్య కుదిరిన ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్ మెంట్ అగ్రిమెంట్ (ఐఎమ్ఎ) లో ఎన్‌ఎస్ డిసి కార్యకలాపాలపై ఎన్‌ఎస్ డిఎఫ్ పర్యవేక్షక పాత్ర కు కూడా వీలు కల్పించే అంశాన్ని చేర్చారు.
***