పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అన్వేషణ కోసం గతంలో కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖకు, ఇంటర్ నేషనల్ సీబెడ్ అథారిటీ (ఐ ఎస్ ఎ) కు మధ్య ఒప్పందం పొడిగింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఫలితంగా మరో 5 సంవత్సరాల పాటు (2017-22) పాలీమెటాలిక్ నాడ్యుల్స్ అన్వేషణ కొనసాగనుంది. ఇదివరకు కుదుర్చుకున్న ఒప్పందం గడువు 2017 మార్చి 24 నాడు తీరిపోనుంది.
ఒప్పందం గడువును పొడిగించినందువల్ల హిందూ మహాసముద్రంలోని సెంట్రల్ బేసిన్లో కేటాయించిన ప్రాంతంలో పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అన్వేషణ కోసం భారతదేశానికే గల ప్రత్యేకమైన హక్కులు కొనసాగనున్నాయి. అంతే కాక జాతీయ పరిధికి మించిన ప్రాంతంలో వ్యాపారాత్మక, వ్యూహాత్మక విలువ గల వనరుల కోసం నూతన అవకాశాలు అందిరానున్నాయి కూడాను. అలాగే, హిందూ మహాసముద్రంలో భారతదేశ కార్యకలాపాల పెంపుదల కారణంగా దేశానికి వ్యూహాత్మకమైన ప్రాధాన్యం ఏర్పడనున్నది; ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇతర అంతర్జాతీయ సంస్థలు చురుకుగా పని చేస్తున్నాయి.
పూర్వ రంగం:
పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ( మాంగనీస్ నాడ్యూల్స్ అని కూడా వీటికి మరో పేరు ఉంది) బంగాళాదుంప ఆకారంలో వుంటాయి. ఇవి ఎక్కువగా పోరస్ నాడ్యూల్స్. సముద్రం అడుగున నేలను కప్పుతూ అత్యధికంగా కనిపిస్తుంటాయి. వీటిలో మాంగనీస్, ఇనుముతో పాటు నికెల్, కాపర్, కోబాల్ట్, లెడ్, మాలిబ్దినమ్, కాడ్మియమ్, వనాడియమ్, టైటానియమ్ లు ఉంటాయి. వీటిలో నికెల్, కోబాల్ట్, కాపర్ పదార్థాలకు ఆర్ధికంగాను, వ్యూహాత్మకంగాను ప్రాధాన్యం వుంది. హిందూ మహాసముద్ర సెంట్రల్ బేసిన్లో పాలీమెటాలిక్ నాడ్యూల్స్ (పి ఎం ఎన్) అన్వేషణ కోసం గతంలో భారతదేశం ఇంటర్ నేషనల్ సీ బెడ్ అథారిటీ (ఐ ఎస్ ఎ)తో 15 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. సముద్ర చట్టాల సమావేశం ప్రకారం ఏర్పడ్డ సంస్థ ఐ ఎస్ ఎ. ఈ సమావేశంలో భారతదేశం కూడా పాల్గొంది.) మంత్రివర్గ ఆమోదంతో 2002 మార్చి 25న భారతదేశం ఈ ఒప్పందం చేసుకుంది. భారతదేశం తన దక్షిణ ప్రాంత కొస నుండి 2000 కి.మీ. దూరంలో హిందూ మహాసముద్రంలో 75,000 చ.కి.మీ. ప్రాంతంలో పాలీమెటాలిక్ నాడ్యూల్స్ కోసం అన్వేషణ జరుపుతోంది.
కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పలు జాతీయ స్థాయి సంస్థల ద్వారా సర్వే, అన్వేషణ, పర్యావరణ ప్రభావ అంచనా, సాంకేతిక అభివృద్ధి (మైనింగ్ అండ్ ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ) కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఒప్పందంలోని నియమాల ప్రకారమే ఈ కార్యక్రమాలను చేపట్టారు. నేషనల్ ఇన్ స్టిస్టిట్యూట్ ఆప్ ఓషనోగ్రఫీ (ఎన్ ఐ ఒ), ఇన్ స్టిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ ( ఐ ఎమ్ ఎమ్ టి), నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ (ఎన్ ఎం ఎల్), నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటికా అండ్ ఓషన్ రిసర్చ్ (ఎన్ సి ఎ ఒ ఆర్), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ( ఎన్ ఐ ఒ టి) మొదలైన సంస్థల ద్వారా కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఒప్పందంలో గల నియమాలన్నిటినీ భారతదేశం అమలు చేస్తోంది.