Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంలో ప్రధానమంత్రి ప్రసంగం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంలో ప్రధానమంత్రి ప్రసంగం


మిత్రులారా,

ఈరోజు, బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా, శ్రేయస్సును ప్రసాదించే దేవత అయిన లక్ష్మీదేవికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఇలాంటి సందర్భాల్లో, శతాబ్దాలుగా మనం లక్ష్మీదేవిని స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది:

సిద్ధిబుద్ధిప్రదే దేవీ భుక్తిముక్తిప్రదాయినీ । మంత్రపూతే సదా దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే.

లక్ష్మీదేవి మనకు విజయాన్ని, జ్ఞానాన్ని, సంపదలను, శ్రేయస్సును ఇస్తుంది. దేశంలోని ప్రతి పేద, మధ్యతరగతి ప్రజలందరికీ దేవి ప్రత్యేక ఆశీస్సులు ఇవ్వాలని నేను లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాను.

మిత్రులారా,

మన దేశం 75 ఏళ్ల గణతంత్రాన్ని పూర్తి చేసుకుంది, ఇది దేశంలోని ప్రతి పౌరునికి చాలా గర్వకారణం, మన దేశం ఈ బలంతో ప్రజాస్వామ్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరరుచుకుంది.

మిత్రులారా,

దేశ ప్ర‌జ‌లు మూడోసారి ప్రధానిగా ఈ బాధ్య‌త‌ను నాకు అప్ప‌గించారు, ఈ మూడో
హయాంలో ఇదే మొద‌టి పూర్తి బ‌డ్జెట్, ఈ సందర్భంగా నేను నమ్మకంగా చెబుతున్నాను, 2047లో మన దేశం వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొనే నాటికి, అభివృద్ది చెందిన భారత్ కచ్చితంగా సాకారం అవుతుంది. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ కొత్త విశ్వాసాన్ని సృష్టిస్తుంది, కొత్త శక్తిని ఇస్తుంది, దేశం వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొనే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది. 140 కోట్ల మంది దేశప్రజలు తమ సమిష్టి కృషితో ఈ లక్ష్యాన్ని సాకారం చేయనున్నారు. మా మూడో హయాంలో, భౌగోళికంగా, సామాజికంగా లేదా వివిధ ఆర్థిక స్థాయిల్లో దేశ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా మనం దూసుకెళ్తున్నాం. ఆవిష్కరణలు, కలయిక, పెట్టుబడులు నిరంతరం మన ఆర్థిక కార్యకలాపాల ప్రణాళికలో మనకు మార్గనిర్దేశం చేస్తున్నాయి.

ఎప్పటిలాగే ఈ సమావేశాలు ఎన్నో చారిత్రాత్మక సందర్భాలతో ముడిపడి ఉంటాయి. రేపు సభలో చర్చలు జరుగుతాయి, చాలా చర్చల తరువాత, దేశ బలాన్ని పెంపొందించే చట్టాలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యంగా నారీశక్తి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, ప్రతి మహిళ కుల, మత వివక్ష లేకుండా గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు, సమాన హక్కులు పొందేందుకు ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నాం. సంస్కరణ, పనితీరు, గణనీయ మార్పు మూడు ముఖ్యమైన అంశాలు. మనం వేగవంతమైన అభివృద్ధిని సాధించవలసి వచ్చినప్పుడు సంస్కరణలకు గరిష్ట ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బాగా పనిచేయాల్సి ఉంటుంది, ప్రజల భాగస్వామ్యంతోనే వ్యవస్థలో గణనీయమైన మార్పు సాధ్యమవుతుంది.

మనది యువ దేశం, యువశక్తి, ఈరోజు 20-25 ఏళ్ల వయస్సులో ఉన్న యువతకు 45-50 ఏళ్లు వచ్చే నాటికి, అభివృద్ధి చెందిన భారత్ అందించే ప్రయోజనాలకు వారు అతిపెద్ద లబ్ధిదారులు అవుతారు. వారు తమ జీవితంలో అత్యుత్తమ దశలో ఉంటారు, వారు విధానాలను రూపొందించే వ్యవస్థలో భాగమవుతారు, స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తయ్యేనాటికి అభివృద్ధి చెందిన దేశంతో గర్వంగా ముందుకు సాగుతారు. అందువల్ల అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధన కోసం చేస్తున్న ఈ ప్రయత్నం, ఈ అపారమైన కృషి, నేటి మన టీనేజర్లకు, మన యువతరానికి గొప్ప బహుమతిగా మారబోతోంది.

1930, 1942 కాలంలో యావత్ దేశంలోని యువతరం స్వాతంత్య్ర పోరాటంలో గడిపారు, దాని ఫలాలు 25 ఏళ్ల తర్వాత వచ్చిన తరానికి అందాయి. నాటి పోరాటంలో భాగమైన ఆనాటి యువతకు ఆ ప్రయోజనాలు లభించాయి. స్వాతంత్య్రానికి ముందు 25 ఏళ్ల శ్రమ స్వాతంత్య్ర ఫలాలను ఆనందించే అవకాశం అందించాయి. అదేవిధంగా, రానున్న 25 ఏళ్లలో తమ సంకల్పం ద్వారా సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశాన్ని సాధించాలని, వారి విజయాల ద్వారా శిఖరాగ్రాన్ని చేరుకోవాలని దేశప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల, ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఎంపీలందరి సహకారం ఉంటుంది. ప్రత్యేకించి, యువ ఎంపీలకు ఇది ఒక సువర్ణావకాశం, ఎందుకంటే వారు ఈ రోజు సభలో పొందే అవగాహన, వారి భాగస్వామ్యం వల్ల వారు అభివృద్ధి చెందిన భారత్ వల్ల కలిగే ఫలాలను చూస్తారు. అందుకే యువ ఎంపీలకు ఇది అమూల్య అవకాశం.

మిత్రులారా,

ఈ బడ్జెట్ సమావేశాల్లో మనమంతా దేశ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని నేను ఆశిస్తున్నాను.

మిత్రులారా,

ఈరోజు మీరు ఒక విషయం గమనించే ఉంటారు, మీడియా వ్యక్తులు కచ్చితంగా గమనించాలి. బహుశా 2014 నుంచి, పార్లమెంటు సమావేశాలకు ఒకటీ లేదా రెండు రోజుల ముందు విదేశాల నుంచి  ఎలాంటి అలజడి లేకుండా జరుగుతున్న మొదటి సమావేశాలు ఇవే, ఈసారి విదేశాల నుంచి ఎలాంటి వివాదాల జాడ లేదు. నేను 2014 నుంచి పదేళ్లుగా గమనిస్తున్నాను, ప్రతి సెషన్‌కు ముందు ప్రజల్లో అల్లర్లు సృష్టించడానికి కొందరు సిద్ధంగా ఉండేవారు, ఇక్కడ అలాంటి అలజడులను అభిమానించే వారికి కొరతే లేదు. పదేళ్ల  తర్వాత అలాంటి విదేశీ కుట్రలు ఏవీ లేకుండా ప్రారంభమైన మొదటి సెషన్ నేను ఈరోజు చూస్తున్నాను.

మిత్రులారా, చాలా ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి దాదాపు అనువాదం మాత్రమే. వాస్తవానికి ఆయన హిందీలో ప్రసంగించారు.

 

****