Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్లమెంట్ చారిత్రాత్మక అర్థరాత్రి సమావేశంలో వస్తు సేవా పన్ను వ్యవస్థలోకి అడుగిడిన భారతావని

s20170701110499


పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన చారిత్రాత్మక అర్థరాత్రి సమావేశంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణగా భావిస్తున్న వస్తుసేవా పన్ను- జి.ఎస్.టి. ఆవిష్కృతమైంది. జీఎస్టీ ప్రారంభానికి సంకేతంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బటన్ ప్రెస్ చేశారు. అంతకుముందు రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ సమావేశానికి హాజరైనవారినుద్దేశించి ప్రసంగించారు.

ప్రధానమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ ను నిర్ధారించడంలో నిర్ణయాత్మకమైన మైలురాయికి ఈరోజు సంకేతమని పేర్కొన్నారు.

గతంలో కూడా పార్లమెంటు సెంట్రల్ హాల్ అనేకమైన చారిత్రక సందర్భాలకు సాక్షీభూతంగా నిలిచిందని.. రాజ్యాంగ పరిషత్, భారత స్వాతంత్ర్యం, రాజ్యాంగం ఆమోదం వంటి సందర్భాల తొలి సమావేశాలు సెంట్రల్ హాల్ లోనే జరిగాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. జీఎస్టీ సహకార ఫెడరల్ వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తుందని శ్రీ నరేంద్రమోదీ అభివర్ణించారు.

కష్టపడి పనిచేయడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోయి అతి క్లిష్టమైన లక్ష్యాలను కూడా సాధించగలుగుతామన్న చాణక్యుని మాటలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. సర్దార్ పటేల్ సాధించిన దేశ రాజకీయ సమగ్రత తరహాలో జీఎస్టీ ఆర్థిక సమగ్రత సాధనకు దోహదపడుతుందని ప్రధానమంత్రి చెప్పారు. “ప్రపంచంలో అర్థంచేసుకోవడం అత్యంత కష్టమైన అంశం ఆదాయపన్ను” అని ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్ పేర్కొన్న మాటలను గుర్తుచేస్తూ.. ఒకే దేశం.. ఒకే పన్ను జీఎస్టీ వల్ల సాధ్యపడుతుందని శ్రీ నరేంద్రమోదీ చెప్పారు. జీఎస్టీ వల్ల ఎంతో ఖర్చు, సమయం ఆదా అవుతాయని అన్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆలస్యాన్ని అధిగమించి ఇంధనాన్ని పొదుపుచేయడం వల్ల పర్యావరణానికి దోహదకారి అవుతుందని అన్నారు. సులభమైన, అత్యంత పారదర్శకమైన పన్నుల వ్యవస్థకు జీఎస్టీ దారితీస్తుందని, అవినీతిని అరికట్టేందుకు దోహదపడుతుందని శ్రీ నరేంద్రమోదీ చెప్పారు.

అంతిమంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మంచి, సులభమైన పన్ను (గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్)గా జీఎస్టీని ప్రధానమంత్రి అభివర్ణించారు. రుగ్వేదంలోని ఒక శ్లోకాన్ని ఉటంకిస్తూ, ఒకే లక్ష్యం, ఒకే సంకల్పం స్ఫూర్తితో మొత్తం సమాజ హితాన్ని, ప్రయోజనాన్ని సాధించగలుగుతామని శ్రీ నరేంద్రమోదీ అన్నారు.

*****