Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభోపాన్యాసం

పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభోపాన్యాసం


మిత్రులందరికీ నమస్కారం!

చల్లని ఆహ్లాదకర వాతావరణంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి… మనం 2024 సంవత్సరం చివరి అంకానికి చేరుకున్నాం.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు దేశం ఉత్సాహంగా  ఎదురుచూస్తోంది.

మిత్రులారా, ఈ సమావేశాలు ఎంతో ప్రత్యేకమైనవి, రాజ్యాంగంతో మన ప్రయాణం 75 ఏళ్ళకు చేరుకోబోతోంది. భారత రాజ్యాంగం 75 వ ఏడాదిలోకి అడుగిడనుంది.  మన ప్రజాస్వామ్యానికి ఇదొక మైలురాయి. ఈ సందర్భంగా, రేపటి నుంచీ పార్లమెంటు కాన్స్టిట్యూషన్ హాల్ లో ప్రారంభమయ్యే వేడుకల్లో మనమంతా పాలుపంచుకుందాం. రాజ్యాంగ రూపకల్పన చేస్తున్న సమయంలో మన రాజ్యాంగకర్తలు ప్రతి అంశాన్నీ కూలంకషంగా చర్చించినందువల్లే అత్యద్భుతమైన గ్రంథం తయారయ్యింది.

మన పార్లమెంటు సభ్యులు రాజ్యాంగ మూలస్థంభాల్లో కీలక భాగంగా ఉన్నారు. పార్లమెంటు చేపట్టే చర్చలు అర్థవంతంగా ఉండేందుకు  వీలైనంత ఎక్కువ మంది ఈ ప్రక్రియలో పాలుపంచుకోవడం ఎంతో అవసరం. దురదృష్టవశాత్తూ, ప్రజలు తిరస్కరించిన కొందరు పదేపదే సభకు అంతరాయం కలిగించి. పార్లమెంటును  నియంత్రించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. పార్లమెంటు కార్యకలాపాలకు విఘాతం కలిగించాలన్న వీరి లక్ష్యం దాదాపు నెరవేరకపోవడాన్ని మీరు గమనించే ఉంటారు. వీరి ఆకతాయి చర్యల్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారు, సరైన సమయం వచ్చినప్పుడు ఇటువంటి వారికి తగిన బుద్ధి చెబుతారు.

అయితే ఇటువంటి అవాంఛనీయ ప్రవర్తన అన్ని పార్టీల నూతన  ఎంపీల హక్కులకు ఇబ్బందులు సృష్టిస్తోంది. వినూత్న ఆలోచనలతో, నూతన ఉత్సాహంతో పార్లమెంటులోకి ప్రవేశించే ఈ కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం లభించడం లేదు. కొత్త తరాలకు దిశానిర్దేశం చేయలసిన బాధ్యత పాత తరానిదే. అయితే ‘పార్లమెంటుకు మీరు అనర్హులు..’ అని 80-90 సార్లు ప్రజలు తిరస్కరించిన వారు, పార్లమెంటులో చర్చలకు అడ్డు పడుతూ, ప్రజాస్వామ్య విలువలను, ప్రజల ఆకాంక్షలను బేఖాతరు చేస్తున్నారు. ప్రజల ఆశయాల స్థాయికి చేరుకోలేని వీరిని అందుకే కాబోలు, ఎన్నికల వేళ  ప్రజలు పక్కనపెడతారు.

మిత్రులారా,

మన సభ ప్రజాస్వామ్యానికి నిదర్శనం. 2024 పార్లమెంటు ఎన్నికల తరువాత, తమ తమ రాష్ట్రాల్లో తమ అభీష్టాన్ని వెల్లడించే అనేక అవకాశాలు ప్రజలకు లభించాయి. రాష్ట్రాల్లో వెలువడ్డ ఫలితాలు 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలను బలపరిచాయి. మద్దతు మరింత విస్తృతమై, ప్రజాస్వామ్య పద్ధతుల పట్ల విశ్వాసం మరింత పెరిగేందుకు దోహదపడింది. ప్రజల ఆశలూ ఆకాంక్షలనూ గౌరవించవలసిన గురుతర బాధ్యత మనమీద ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి. ఈ విషయంలో విపక్షానికి నేను పలుమార్లు విజ్ఞప్తి చేశాను.  సభ సజావుగా జరగాలని కోరుకునే కొంతమంది విపక్ష  సభ్యులు ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ప్రజలు తిరస్కరించిన వారు తమ పక్షం సభ్యుల గొంతులు వినబడకుండా అడ్డు తగులుతూ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు.

ఏ పార్టీకి చెందిన వారైనా సరే, కొత్త సభ్యులకు అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశ పురోగతి కోసం తాజా ఆలోచనలు, విలక్షణమైన వ్యూహాలతో వీరు ముందుకొస్తున్నారు. ఈరోజున స్ఫూర్తి కోసం ప్రపంచం మనవైపు చూస్తోంది. ఇటువంటి సమయంలో, భారత్ కు ప్రపంచ దేశాల మధ్య గల గౌరవం, ఆకర్షణలని పెంపొందించవలసిన బాధ్యత, పార్లమెంటు సభ్యులమైన మనపై   ఉంది. ప్రపంచ వేదికపై ఈనాడు భారత్ కు గల అవకాశాల వంటివి అరుదుగా లభిస్తాయి.

ప్రజాస్వామ్యం పట్ల మన పౌరులకు గల అంకితభావం, రాజ్యాంగం పట్ల నిబద్ధత, పార్లమెంటరీ పద్ధతుల పట్ల వారికి గల విశ్వాసాన్ని మన పార్లమెంటు ప్రతిబింబించాలి. వారి ప్రతినిధులుగా వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన  బాధ్యత మనదే! ఇంతవరకూ పోగొట్టుకున్న సమయం గురించి పక్కనపెట్టి, ఇకపై సభ ముందున్న అంశాలను లోతుగా చర్చించి ఆ లోటుని పూడ్చాలి. ఈ చర్చల ప్రతులను చదివిన భవిష్య తరాలు తప్పక స్ఫూర్తి పొందుతాయి. మన రాజ్యాంగం 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ తరుణంలో ఈ సమావేశాలు ఫలవంతమై, రాజ్యాంగ గౌరవాన్ని ఇనుమడింపజేస్తాయని ఆశిస్తున్నాను. ఈ సమావేశాలు భారత్ ప్రతిష్ఠను మరింత పెంచి, నూతన సభ్యులకు, నూతన ఆలోచనలకు మరిన్ని అవకాశాలను కల్పించగలవని ఆశిస్తున్నాను. సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని మరొక్కమారు విజ్ఞప్తి చేస్తూ గౌరవనీయ పార్లమెంటు సభ్యులందరినీ ఈ సమావేశాలకు ఆహ్వానిస్తున్నాను. నమస్కారం!

 

***