Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారిస్ ఏఐ కార్యాచరణ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

పారిస్ ఏఐ కార్యాచరణ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం


పెద్దలారా,

మిత్రులారా,

 

ఓ చిన్న ప్రయోగంతో నేను మొదలుపెడతాను.

 

మీ వైద్య సంబంధ రిపోర్టును కృత్రిమ మేధ (ఏఐ)తో నడిచే యాప్ లో మీరు అప్లోడ్ చేస్తే.. సులభంగా అర్థమయ్యే భాషలో, ఎలాంటి వృత్తిపరమైన ప్రామాణిక పదజాలమూ లేకుండా మీ ఆరోగ్య సమాచారాన్ని అది వివరించగలదు. కానీ, మీరు అదే యాప్‌ ను ఎడమ చేతితో రాసే వ్యక్తి చిత్రాన్ని గీయమని అడిగితే, అది చాలావరకు కుడి చేతితో రాసే వారి చిత్రాన్నే గీస్తుంది. ఎందుకంటే ట్రైనింగ్ డేటాలో ఎక్కువ భాగం అదే ఉంటుంది.

 

కృత్రిమ మేధ సానుకూల సామర్థ్యం అత్యద్భుతమే అయినప్పటికీ, దానిపై జాగ్రత్తగా ఆలోచించాల్సిన అంశాలూ అనేకం ఉన్నాయని దీన్ని బట్టి తెలుస్తోంది. అందుకే, ఈ సదస్సుకు ఆతిథ్యమిచ్చి, సహాధ్యక్షత వహించేలా నన్ను ఆహ్వానించిన మిత్రుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కు కృతజ్ఞతలు.

 

 

మిత్రులారా,

 

ఇప్పటికే మన రాజకీయ, ఆర్థిక, భద్రత వ్యవస్థలతోపాటు మన సమాజ రూపురేఖలను కూడా కృత్రిమమేధ మార్చేస్తోంది. ఈ శతాబ్దపు మానవీయతా స్మృతిని ఏఐ లిఖిస్తోంది. కానీ, మానవ చరిత్రలో ఇతర సాంకేతికతలతో పోలిస్తే ఇది భిన్నమైనది.

 

మునుపెన్నడూ లేనంత స్థాయిలో, వేగంగా ఏఐ అభివృద్ధి చెందుతోంది. మరింత వేగంగా విస్తృత జనామోదాన్ని పొందుతూ విస్తరిస్తోంది. సరిహద్దుల వెంబడి పరస్పరం విస్తృతంగా ఆధారపడాల్సి ఉంది కూడా. కాబట్టి ఉమ్మడి విలువలను కాపాడే, ప్రమాదాలను నివారించే, విశ్వాసాన్ని కలిగించే విధంగా విధానాలు, ప్రమాణాలను నెలకొల్పే దిశగా సమష్టి అంతర్జాతీయ కృషి అత్యావశ్యకం.

 

కానీ, విధానమంటే కేవలం సంకట పరిస్థితులను, స్పర్ధలను ఎదుర్కోవడం మాత్రమే కాదు.. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, అంతర్జాతీయ శ్రేయస్సు కోసం వాటిని విస్తృతం చేయడం కూడా. కాబట్టి ఆవిష్కరణలు, విధానాల గురించి లోతుగా ఆలోచించి బహిరంగంగా చర్చించాలి.

 

అందరికీ, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందుబాటులో ఉండేలా చూడడం కూడా విధానంలో భాగమే. ఆ దేశాల్లో గణన శక్తి, ప్రతిభ, డేటా, లేదా ఆర్థిక వనరులు చాలావరకూ తక్కువగా ఉంటాయి.

మిత్రులారా,

 

ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మరెన్నో అంశాలను మెరుగుపరచడం ద్వారా లక్షలాది జీవితాల్లో సానుకూల మార్పులను తేవడానికి కృత్రిమ మేధ సహాయపడుతుంది. ప్రపంచం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా సులభంగా, వేగంగా ప్రయాణించడానికి ఇది సహాయపడుతుంది.

 

ఇందుకోసం మనం వనరులు, ప్రతిభను తప్పక సమీకరించుకోవాలి. నమ్మకాన్ని, పారదర్శకతను పెంపొందించే ఓపెన్ సోర్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. ఎలాంటి పక్షపాతమూ లేకుండా నాణ్యమైన డేటా సెట్లను ఏర్పాటు చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామికీకరించి, ప్రజా కేంద్రీకృత అనువర్తనాలను ఆవిష్కరించాలి. సైబర్ భద్రత, తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ సంబంధిత ఆందోళనలను పరిష్కరించాలి. స్థానిక వ్యవస్థల్లోనే సాంకేతికత మూలాలుండి అది సమర్ధంగా, ఉపయుక్తంగా ఉండేలా చూడాలి.

 

 

 

మిత్రులారా,

 

ఏఐ కలిగించే ముఖ్యమైన భయాల్లో ఉద్యోగాలు కోల్పోవడం ఒకటి. కానీ, సాంకేతికత వల్ల పని కనుమరుగవడం ఉండదని చరిత్ర చెప్తోంది. పని స్వభావం మారి కొత్తరకం ఉద్యోగాలు లభిస్తాయి. ఏఐ ఆధారిత భవిత దిశగా సన్నద్ధులయ్యేలా మన ప్రజల్లో నైపుణ్యాభివృద్ధి, నైపుణ్యాలను మెరుగుపరచడంలో మనం పెట్టుబడులు పెట్టాల్సి ఉంది.

 

 

మిత్రులారా,

 

కృత్రిమ మేధ శక్తిని అత్యధికంగా వినియోగిస్తుందన్నది నిస్సందేహంగా పరిశీలనార్హమైన అంశం. పర్యావరణ హితమైన శక్తిని ఉపయోగించడం ద్వారా భవిష్యత్తులో దీనికి ఇంధనాన్ని అందించవచ్చు.

 

సౌర శక్తిని వినియోగించుకునేందుకు అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాల ద్వారా భారత్, ఫ్రాన్స్ కొన్నేళ్లుగా కలిసి పనిచేస్తున్నాయి. మా భాగస్వామ్యాన్ని కృత్రిమ మేధ దిశగా ముందుకు తీసుకెళ్లడమన్నది.. సుస్థిరత నుంచి ఆవిష్కరణ దిశగా సాగే సహజమైన పురోగతి. ఇది భవితను ఆధునికంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుతుంది. సుస్థిరమైన కృత్రిమ మేధ అంటే పర్యావరణ హిత ఇంధనాన్ని వినియోగించడం మాత్రమే కాదు. పరిమాణంలో, డేటా అవసరాల్లో, అవసరమైన వనరుల విషయంలో కూడా ఏఐ నమూనాలు సమర్ధంగా, సుస్థిరంగా ఉండాలి. అన్నింటినీ మించి.. అనేక లైట్ బల్బుల కన్నా తక్కువ శక్తినే ఉపయోగించి మానవ మెదడు కవిత్వాన్ని రాయగలదు, అంతరిక్ష నౌకలనురూపొందించగలదు.

మిత్రులారా,

 

140 కోట్ల మందికి పైగా ప్రజల కోసం డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను చాలా తక్కువ ఖర్చుతో విజయవంతంగా భారతదేశం నిర్మించింది. సార్వత్రిక, అందరికీ అందుబాటులో ఉండే వ్యవస్థతో వీటిని నిర్మించాం. ఆర్థిక వ్యవస్థను ఆధునికీకరించే, పరిపాలనను సంస్కరించే, ప్రజల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే విస్తృత శ్రేణి అనువర్తనాలు, నియంత్రణలూ ఇందులో ఉన్నాయి.

 

డేటా సాధికారత, పరిరక్షణ ఏర్పాట్ల ద్వారా డేటా సామర్థ్యాన్ని ఆవిష్కరించాం. మేము డిజిటల్ వాణిజ్యాన్ని ప్రజాస్వామ్యీకరించి అందరికీ అందుబాటులోకి తెచ్చాం. ఈ దృక్పథమే భారత జాతీయ ఏఐ మిషన్ కు మూలం.

 

అందుకే జీ20కి అధ్యక్షత వహించిన సమయంలో అందరి శ్రేయస్సు కోసం కృత్రిమమేధను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలన్న ఏకాభిప్రాయానికి వచ్చాం . ఏఐని పుణికిపుచ్చుకోవడంలో, డేటా గోప్యతకు సంబంధించి సాంకేతిక- న్యాయపరమైన పరిష్కారాలను అందించడంలో భారత్ ముందుంది.

 

 

ఏఐ అనువర్తనాలను ప్రజా శ్రేయస్సు కోసం మేం రూపొందిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమమేధ ప్రతిభావంతులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. వైవిధ్యం దృష్ట్యా విస్తృత భాషా నమూనాలను భారత్ రూపొందిస్తోంది. కంప్యూటింగ్ పవర్ వంటి వనరులను సమీకరించడం కోసం విలక్షణమైన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనా కూడా మాకుంది. అందుబాటు ధరల్లోనే అంకుర సంస్థలకు, పరిశోధకులకు దీన్ని అందుబాటులోకి తెచ్చాం. మంచి కోసం, అందరి కోసం కృత్రిమ మేధ భవితను తీర్చిదిద్దేలా అనుభవాన్ని, నైపుణ్యాన్ని పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది.

 

మిత్రులారా,

 

మానవాళి గమనాన్ని నిర్దేశించే కృత్రిమ మేధ యుగంలో ఇది తొలిపొద్దు. మేధలో మనుషుల కన్నా యంత్రాలే ఉన్నత స్థానంలో ఉంటాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. కానీ మన ఉమ్మడి భవిత, సమష్టి గమ్యాన్ని నిర్ణయించేది మానవులే తప్ప మరొకటి కాదు.

 

ఆ బాధ్యతను గుర్తెరిగి మనం నడుచుకోవాలి.

ధన్యవాదాలు. 

 

 

****