పారిశ్రామిక కారిడర్ ల సమగ్ర అభివృద్ధి కోసం ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఫండ్ (డి ఎమ్ ఐ సి-పి ఐ టి ఎఫ్ ట్రస్ట్) పరిధిని విస్తరించేందుకు మరియు దాని పేరును ‘నేషనల్ ఇండస్ట్రియల్ కారిడర్ డెవలప్ మెంట్ & ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్’ (ఎన్ ఐ సి డి ఐ టి) గా మార్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ ఫండ్ కు కాల పరిమితిని 2022 మార్చి 31 వరకు విస్తరిస్తూ, ఇప్పటికే మంజూరు చేసిన ఆర్థిక వనరులతో పాటు అదనంగా మంజూరు చేసిన రూ.1,584 కోట్లను పారిశ్రామిక కారిడర్ లు అన్నింటి సమగ్ర అభివృద్ధికి వినియోగించేందుకు ఈ ఆమోదం వర్తిస్తుంది.
ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే మంజూరు చేసిన సొమ్ము రూ.18,500 కోట్లలో ఖర్చు చేయగా మిగిలిన సొమ్ము డి ఎమ్ ఐ సి-పి ఐ టి ఎఫ్ కు ఇంకా అందవలసి ఉంది. ఈ సొమ్మును ఇక నుండి ఎన్ ఐ సి డి ఐ టి వినియోగిస్తుంది. అలాగే మరో నాలుగు కారిడర్ ల నిర్మాణ కార్యక్రమాలు, 2022 మార్చి 31 వరకు ఎన్ ఐ సి డి ఐ టి పాలన వ్యయాల కోసం అదనంగా రూ.1,584 కోట్లు కూడా మంజూరు చేశారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఐదు పారిశ్రామిక కారిడర్ లు పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, ఝార్ ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ర్ట, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు రాష్ట్రాలను కలుపుతున్నాయి.
డి ఐ పి పి పరిపాలనా పరిధిలో అన్ని పారిశ్రామిక కారిడర్ ల సమన్వయాన్ని, అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టే అత్యున్నత స్థాయి సంస్థగా ఎన్ ఐ సి డి ఐ టి వ్యవహరిస్తుంది. దేశంలో పారిశ్రామిక, నగర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన విస్తృత జాతీయ ప్రయోజనాల పరిధిలో వివిధ కారిడర్ ల ప్రణాళిక, అమలు కోసం ప్రభుత్వం నుండి, ఇతర సంస్థల నుండి నిధులను సమీకరించడం, ప్రాజెక్టు ప్రతిపాదనలు పరిశీలించి వాటికి విలువ కట్టి, అనుమతులు మంజూరు చేయడం వంటి కార్యకలాపాలను ఎన్ ఐ సి డి ఐ టి నిర్వహిస్తుంది. దేశంలో పారిశ్రామిక కారిడర్ ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సమన్వయం చేస్తూ వాటి అమలు తీరును పర్యవేక్షిస్తుంది.
డి ఎమ్ ఐ సి డి ఐ సి ప్రస్తుతం తన పరిధిలోని డి ఎమ్ ఐ సి పనులతో పాటుగా దేశంలోని అన్ని పారిశ్రామిక కారిడర్ లకు ఎన్ ఐ సి డి ఐ టి కి విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఇతర పారిశ్రామిక కారిడర్ లకు కూడా విజ్ఞాన భాగస్వాములు తెర మీదకు వచ్చే వరకు ఈ బాధ్యతను నిర్వర్తిస్తుంది.
ఎన్ ఐ సి డి ఐ టి కార్యకలాపాలను, ప్రాజక్టుల పురోగతిని నిర్దిష్ట కాల పరిమితిలో సమీక్షించేందుకు ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఒక అత్యున్నత స్థాయి పర్యవేక్షక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న ఇన్ చార్జి మంత్రితో పాటు రైల్వేలు, రోడ్డు రవాణా & హైవేలు, షిప్పింగ్ శాఖల మంత్రులు, నీతి ఆయోగ్ వైస్- చైర్మన్, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సంఘంలో సభ్యులుగా ఉంటారు.
ఎన్ ఐ సి డి ఐ టి ధర్మకర్తల మండలి లో (i) చైర్ పర్సన్ – డిఐపిపి కార్యదర్శి, (ii) వ్యయ విభాగ కార్యదర్శి, (iii) ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, (iv) రోడ్డు రవాణా & హైవేల శాఖ కార్యదర్శి, (v) షిప్పింగ్ కార్యదర్శి, (vi) రైల్వే బోర్డు చైర్మన్, (vii) నీతి ఆయోగ్ సిఇఒ, (viii) మెంబర్ సెక్రటరీ ఉంటారు. ఎన్ ఐ సి డి ఐ టికి పూర్తి కాలపు సిఇఒ గా మెంబర్ సెక్రటరీ వ్యవహరిస్తారు. మెంబర్ సెక్రటరీ/ఎన్ ఐ సి డి ఐ టి సిఇఒగా డి ఎం ఐ సి డి సి సిఇఒ వ్యవహరిస్తారు.
ఎన్ ఐ సి డి ఐ టి ఏర్పాటు వల్ల దేశంలో పారిశ్రామిక కారిడర్ ల అభివృద్ధి, అమలు ప్రక్రియ వేగవంతం అవుతుంది. అన్ని కారిడర్ లకు కలిపి సమగ్ర ప్రణాళిక, అభివృద్ధి విధానాన్ని అనుసరించడంతో పాటు పారిశ్రామిక కారిడర్ ల అభివృద్ధిలో ఒకరి అనుభవాల నుండి మరొకరు పాఠాలు నేర్చుకోగలుగుతారు. దీని వల్ల కారిడర్ ల ప్రణాళిక, డిజైనింగ్ , అభివృద్ధి, నిధుల కల్పన, సేవలు అందించడంలో నవ్యతకు మార్గం సుగమం అవుతుంది. దీని వల్ల జాతీయోత్పత్తిలో తయారీ రంగం వాటా పెంచడానికి, తయారీ, సేవల రంగాలకు మరింతగా నిధులను ఆకర్షించడానికి వీలు ఏర్పడుతుంది. కార్మిక శక్తిలో నైపుణ్యాల వృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు కూడా బాటలు వేయగలుగుతారు.
ప్రస్తుతం నడుస్తున్న స్కీమ్ ల వివరాలు, పురోగతి..
(i) ఢిల్లీ-ముంబయ్ ఇండస్ట్రియల్ కారిడర్ (డి ఎమ్ ఐ సి) : దేశంలో మంజూరైన తొలి పారిశ్రామిక కారిడర్ ఇది. 2011 సంవత్సరంలో కేంద్ర మంత్రివర్గం ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. రూ.17,500 కోట్ల ప్రాజెక్టు అమలు ఫండ్ గాను, ప్రాజెక్టు అభివృద్ధి కార్యకలాపాలకు రూ.1,000 కోట్లు అదనపు కార్పస్ గాను ప్రకటించింది. తొలి దశలో ఏడు పారిశ్రామిక నగరాలను అనుసంధానం చేయడానికి ఐదేళ్ళ కాలపరిమితిలో ఈ నిధులు అందించనున్నట్టు పేర్కొంది. 450 కోట్ల డాలర్ల పెట్టుబడితో డి ఎమ్ ఐ సి ప్రాజెక్టు తొలి దశలో భాగస్వామి అయ్యేందుకు జపాన్ ప్రభుత్వం అంగీకరించింది.
గుజరాత్ లోని అహమ్మదాబాద్ సమీపంలో ధొలేరా స్పెషల్ ఇన్ వెస్ట్ మెంట్ రీజియన్, మహారాష్ర్టలోని ఔరంగాబాద్ సమీపంలో షేంద్రా-బిడ్కిన్ ఇండస్ట్రియల్ పార్క్, ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్, మధ్య ప్రదేశ్ లో ఉజ్జయిని సమీపంలోని విలా అమ్-ఉద్యోగపురి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ నిర్మాణం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డి ఎమ్ ఐ సి లో భాగంగా ఉన్న ఇతర ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
(ii) చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడర్ (సి బి ఐ సి) : ఈ కారిడర్ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కింద తుమకూరు (కర్ణాటక), కృష్ణపట్నం (ఆంధ్ర ప్రదేశ్), పొన్నేరి (తమిళ నాడు) ప్రాంతాలను పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి గుర్తించారు.
(iii) బెంగళూరు-ముంబయ్ ఎకనామిక్ కారిడర్ (బి ఎమ్ ఇ సి) : పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ధార్వాడ్ ను గుర్తించగా సాంగ్లి, షోలాపూర్ జిల్లాలను పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి మహారాష్ర్ట ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది.
(iv) అమృతసర్-కోల్ కాతా ఇండస్ట్రియల్ కారిడర్ (ఎ కె ఐ సి) : నిర్మాణంలో ఉన్న ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ (ఇ డి ఎఫ్ సి), ఈ నగరాల మధ్య ఉన్న జాతీయ రహదారి వ్యవస్థ ఎ కె ఐ సి కి వెన్నెముకగా ఉంటాయి. ఈ కారిడర్ వెంబడి ఉన్న పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, ఝార్ ఖండ్, పశ్చిమ బెంగాల్ ఏడు రాష్ట్రాలలోను సమగ్ర తయారీ క్టస్లర్లు అభివృద్ధి చేసే విధంగా దీనికి రూపకల్పన చేశారు.
బి ఎం ఇ సి, ఎ కె ఐ సి ప్రాజెక్టులు ప్రారంభ దశలో అమలులో ఉన్నాయి.
(v) వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ (వి సి ఐ సి) : ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2104లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కట్టుబాటుకు అనుగుణంగా ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడర్ (ఇ సి ఇ సి)పై సాధ్యాసాధ్యాల అధ్యయనం చేస్తున్న ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎ డి బి) వి సి ఐ సి తొలి దశను చేపట్టేందుకు గల అవకాశాలపైన కూడా అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల విభాగం నిర్ణయించింది. వి సి ఐ సి కి సంబంధించిన కాన్సెప్ట్ డెవలప్ మెంట్ ప్లాన్ (సి డి పి)ని ఎ డి బి బృందం ఇప్పటికే సమర్పించింది. ఎ డి బి గుర్తించిన మేరకు ఈ మార్గం వెంబడి ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి, ఏర్పేడు ప్రాంతాలను పారిశ్రామిక కేంద్రాలుగా అభివృధ్ధి చేసేందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్ తయారీ 2016 మార్చిలో మొదలయింది. 2017 మార్చి నాటికి ఇది పూర్తి కావచ్చు.
పూర్వరంగం
తయారీ రంగాన్ని ఉత్తేజితం చేయడం ద్వారా ఆ రంగంలో వృద్ధికి దోహదపడడం, పట్టణీకరణ శాస్త్రీయంగా జరిగేలా చూడడం లక్ష్యంగా తయారీ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ రాష్ర్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ కారిడర్ లను అభివృద్ధి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ వ్యూహం. ఇందులో భాగంగా ఢిల్లీ-ముంబయ్ ఇండస్ట్రియల్ కారిడర్ (డి ఎమ్ ఐ సి), చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడర్ (సి బి ఐ సి), అమృత్ సర్-కోల్ కాతా ఇండస్ట్రియల్ కారిడర్ (ఎ కె ఐ సి), బెంగళూరు- ముంబయ్ ఎకనామిక్ కారిడర్ (బి ఎమ్ ఇ సి), వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ (వి సి ఐ సి)లు అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.