Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పశ్చిమ బెంగాల్ లోని శాంతినికేతన్ లో విశ్వ భారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


బాంగ్లాదేశ్ ప్ర‌ధాని శేఖ్ హసీనా గారు, ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ కేశ‌రి నాథ్ జీ త్రిపాఠీ, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ గారు, విశ్వ‌ భార‌తి ఉప కులపతి ప్రొఫెస‌ర్ సాబుజ్ కాళీ సేన్ గారు, రామ‌కృష్ణ మిశన్ వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఉప కులపతి స్వామి స్వామ్యప్రియానంద‌ జీ మరియు ఇక్కడ హాజరైన విశ్వ‌ భార‌తి కి చెందిన ప్రతి ఒక్కరు, ఇంకా ప్రియమైన నా యువ మిత్రులారా.

విశ్వ భార‌తి కులపతి గా ముందు మీ అంద‌రికీ నేను క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేసుకుంటున్నాను. ఎందుకంటే విశ్వ‌విద్యాల‌యానికి వ‌స్తున్న దారిలో కొంత‌మంది పిల్ల‌లు వారికి తాగునీరు కూడా అందడం లేద‌ంటూ నా దృష్టి కి తీసుకువ‌చ్చారు. విశ్వ‌విద్యాలయ‌ కులపతి గా మీకు అంద‌రికీ ఎలాంటి అసౌక‌ర్యమూ క‌లుగ‌కుండా చూడ‌డం నా బాధ్య‌త‌. కాబ‌ట్టి మీకు క‌లిగిన అసౌక‌ర్యానికి నేను చింతిస్తున్నాను. న‌న్ను క్ష‌మించ‌గ‌ల‌రు. దేశ ప్ర‌ధాన మంత్రిగా దేశం లోని ప‌లు విశ్వ‌విద్యాల‌యాల స్నాత‌కోత్స‌వాల‌కు హాజ‌ర‌య్యే అదృష్టం నాకు ల‌భిస్తుంటుంది. చాలా సంద‌ర్భాల్లో ఆ కార్య‌క్ర‌మాల‌కు నేను అతిథిని. కానీ ఈ రోజున నేను ఇక్క‌డ అతిథిని కాదు. విశ్వ‌విద్యాల‌య కులపతి ని. ప్ర‌జాస్వామ్యం ఫ‌లితంగా నాకు ఈ పాత్ర ల‌భించింది. ప్ర‌ధాని ని కావ‌డంవ‌ల్ల నేను చాన్స్ ల‌ర్ ను కాగ‌లిగాను. ప్ర‌జాస్వామ్యం ఎంతో గొప్ప‌ది. ఈ దేశంలో 125 కోట్ల మంది భార‌తీయుల్లో అనేక విధాలుగా స్ఫూర్తిని నింపుతోంది. ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌తో పెరిగే, విద్య‌ను పొందే ప్రతి మ‌నిషి మెరుగైన భార‌త‌దేశ నిర్మాణంలోను, చ‌క్క‌టి భ‌విష్య‌త్తు ను అందించ‌డం లోను త‌మ వంతు సాయం చేస్తుంటారు. ‘ఆచార్య‌త్ విద్వావిహితా సాధిష్ట‌త‌మ్ ప్రాప్త్యుతీ ఇతి’…అని మ‌న‌కు మ‌న పెద్ద‌లు చెప్పారు. ఈ మాటల భావం- గురువు ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌కుండా ఎవ‌రికైనా విద్య‌, గొప్ప‌ద‌నం, విజ‌యం అనేవి సిద్ధించ‌వు- అని. గురుదేవులు ర‌వీంద్ర‌నాధ్ టాగోర్ గారు నివ‌సించిన ఈ గడ్డ మీద ఎంతో మంది గురువుల‌తో క‌లిసి నాణ్య‌మైన కొంత స‌మ‌యాన్ని గ‌డిపే అవ‌కాశం దక్కినందుకు నేను నిజంగా అదృష్టవంతుడిని.

ఎవ‌రైనా దేవాల‌యంలో మంత్రాల మ‌హిమ‌ను ఎలా అనుభూతి పొందుతారో అలాగే నేను ఇక్క‌డ ఈ విశ్వ‌భార‌తి విశ్వ‌విద్యాల‌యంలో అలాంటి శ‌క్తిని పొందుతున్నాను. కారులో నుండి దిగి వేదిక వైపు వ‌స్తున్న స‌మ‌యంలో ఈ నేల‌ పైన ప్ర‌తి చోటా ర‌వీంద్ర‌నాధ్ టాగోర్ గారు న‌డిచారన్న సంగతి నాకు గుర్తుకు వచ్చి అనిర్వ‌చ‌నీయ‌మైన అనుభూతిని పొందాను. ఆయ‌న ఇక్క‌డే కూర్చొని ఎన్నో ర‌చ‌నలు చేసి వుంటారు. ఇక్క‌డే ఎక్క‌డో ఒక‌చోట‌ కూర్చొని ఆయ‌న సంగీతాన్ని వినిపించి వుంటారు. ఇక్క‌డే మ‌హాత్మ గాంధీ గారితో క‌లిసి సుదీర్ఘ‌మైన సంభాష‌ణ‌లు చేసి వుంటారు. ఆయ‌న ఎంతో మంది విద్యార్థుల‌కు జీవితానికి, జాతికి, జాతి ఆత్మ‌గౌరవానికి గ‌ల అర్థాల‌ను ఇక్క‌డే వివ‌రించి వుంటారు.

మిత్రులారా,

ఒక సంప్ర‌దాయాన్ని అనుస‌రించ‌డానికిగాను ఈ రోజున మ‌నం ఇక్క‌డ స‌మావేశ‌మ‌య్యాము. గ‌త శ‌తాబ్ద కాలంలో ఇలాంటి అనేక కార్య‌క్ర‌మాల‌కు అమ‌ర్ కుంజ్ సాక్షీభూతంగా నిలచింది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఇక్క‌డ కొన‌సాగిన మీ విద్యాభ్యాసానికి సంబంధించిన ఒక‌ ద‌శ ఈ రోజుతో ముగుస్తుంది. ప‌ట్టాలు పొందిన‌ వారంద‌రినీ ఈ సంద‌ర్భంగా అభినందిస్తున్నాను. మీరు భ‌విష్య‌త్తు కాలం లో చేప‌ట్ట‌బోయే కార్యాచ‌ర‌ణ‌ కు నా అభినంద‌న‌లు. మీ విద్యార్హ‌త‌ను అంద‌రికీ తెలియ‌జేసే ఆధారం ఈ ప‌ట్టా. ఈ విష‌యంలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే మీరు ఇక్క‌డ కేవలం ప‌ట్టా ను పొంద‌లేదు; అమూల్య‌మైన సంగ‌తులను ఎన్నింటినో నేర్చుకున్నారు. ఒక ఘనమైన వార‌స‌త్వానికి మీరు వార‌సులు. మీరు గురు- శిష్య సంప్ర‌దాయంలో విద్య‌ను అభ్య‌సించారు. ఇది పురాత‌న‌మైంది, ఆధునిక‌మైందీనూ.

వేద‌, పురాణాల కాలంలో ఈ సంప్ర‌దాయాన్ని నాటి మ‌హ‌ర్షులు పెంచి పోషించారు. ఈ ఆధునిక యుగంలో గురుదేవులు ర‌వీంద్ర‌నాధ్ టాగోర్ వంటి వారు ఈ గొప్ప సంప్ర‌దాయాన్ని ముందుకు తీసుకుపోయారు. ఇది కేవలం ఉప‌న్యాసం కాదు. మీకు అంద‌రికీ ఇది ఒక గొప్ప సందేశం. మ‌నం మంచి మాన‌వులుగా, ఒక మంచి జాతిగా ఎద‌గ‌డానికి ప్ర‌కృతి బోధన‌లు ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలియ‌జేయ‌డానికి ఇది ఒక చక్కటి ఉదాహ‌ర‌ణ‌. ఈ అద్భుతమైన సంస్థ వెనుక‌, గురుదేవులు ర‌వీంద్ర‌నాధ్ టాగోర్ ఆలోచ‌న‌ వెన‌క వున్న సందేశ‌ం ఇది. విశ్వ‌భార‌తికి ఇది మూలాధారం.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

య‌త్ర విశ్వ‌మ్ భ‌వెతెక్ నిరమ్.. ఈ మాటలకు మొత్తం విశ్వం ఒక గూడు లేదా ఇల్లు లాంటిది అని భావం. వేదాలు అందించిన ఈ బోధ‌న ను విశ్వ‌ భార‌తి అందించే ముఖ్య‌ సందేశంగా మ‌లచారు గురుదేవులు ర‌వీంద్రులు. ఈ వేద‌ మంత్రం లోనే భార‌త‌దేశం యొక్క అత్యున్న‌త సంప్ర‌దాయం దాగి ఉంది. యావత్తు ప్ర‌పంచ‌మే ఈ ప్రాంతాన్ని త‌న గృహంగా చేసుకునేలా ఒక స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న వెలువ‌డాల‌ని గురుదేవులు భావించారు. ప‌క్షి గూళ్ల‌కు, పెద్ద పెద్ద భవ‌నాల‌కు స‌మాన‌మైన ప్రాధాన్య‌ాన్ని ఇచ్చి మొత్తం ప్ర‌పంచమే ఇక్క‌డ నివ‌సించాల‌ని త‌ల‌పోశారు. ఇదే భార‌తీయ‌త అంటే. వ‌సుధైక కుటుంబకమ్ అనే భావ‌న వేల సంవత్స‌రాలుగా భార‌త‌దేశంలో ప్ర‌తిధ్వ‌నిస్తూనే ఉంది. ఈ మంత్రానికి గురుదేవులు ఆయన యొక్క యావత్తు జీవితాన్ని అంకితం చేశారు.

మిత్రులారా,

వేల సంవ‌త్స‌రాల క్రితం వేదాలు, ఉప‌నిష‌త్తులు ఎంత‌ ఉప‌యోగ‌క‌రంగా ఉన్నాయో వందేళ్ల‌ క్రితం ర‌వీంద్ర నాధ్ టాగోర్ శాంతినికేత‌న్ కు వ‌చ్చిన‌ప్పుడు కూడా అంతే ఉప‌యోగ‌క‌రంగా ఉన్నాయి. ఈ 21 వ శ‌తాబ్దంలో ప్ర‌పంచం విసిరే స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డానికి కూడా ఇవి ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక‌ దేశాలు రాజ‌కీయ చ‌ట్రాలలో ఇరుక్కుపోయాయి. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఒక వాస్త‌వాన్ని గుర్తించాలి.. ప్ర‌పంచీక‌ర‌ణ కార‌ణంగా భార‌త‌దేశానికి చెందిన‌ అద్భుత‌మైన సంప్ర‌దాయాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించాయి. ఈ రోజున బాంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా జీ మ‌న‌తో ఉన్నారు. ఒకే స్నాతకోత్సవం లో రెండు దేశాల ప్ర‌ధానులు ఆసీనులు కావ‌డం ఒక అరుదైన సంద‌ర్భం. భార‌త‌దేశం, బాంగ్లాదేశ్ లు రెండు వేరు వేరు దేశాలు. కానీ రెండు దేశాల ప్రాధాన్య‌ాలు ఒక‌దానితో మ‌రొక‌టి స‌మ‌న్వ‌యంతో ఉన్నాయి. ఇరు దేశాలు ఒక‌దానితో మ‌రొక‌టి స‌హ‌క‌రించుకుంటున్నాయి. సంస్కృతి కావ‌చ్చు, ప్ర‌జావిధానం కావ‌చ్చు.. వీటి నుండి మ‌నం చాలా నేర్చుకోవ‌చ్చు. కాసేప‌ట్లో మేము ఇద్దరం క‌లిసి ప్రారంభించవలసిన బాంగ్లాదేశ్ భ‌వ‌న్ దీనికి ఉదాహ‌ర‌ణ‌. ఈ భ‌వ‌నం గురుదేవుల దార్శ‌నిక‌త ను ప్ర‌తిఫ‌లిస్తోంది.

మిత్రులారా,

అప్పుడ‌ప్పుడు న‌న్ను ఒక విష‌యం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ఉంటుంది. గురుదేవుని వ్య‌క్తిత్వమే కాదు ఆయ‌న‌ ప్ర‌యాణాలు కూడా అత్యున్నతమైన‌వి. విదేశాలలోప్ర‌యాణిస్తున్న‌ప్పుడు నేను ఎంతో మందిని క‌లుసుకొంటూ ఉంటాను. వారు త‌మ దేశాన్ని గురుదేవులు ర‌వీంద్ర‌నాధ్ టాగోర్ సంద‌ర్శించిన విష‌యాన్ని గుర్తు చేస్తుంటారు. ఆ దేశాలలో ఇప్ప‌టికీ గురుదేవులను ఎంతో ప్రేమ‌తో, గౌర‌వంతో గుర్తు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ టాగోర్ గారితో బంధాన్ని క‌లుపుకుపోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు.

అఫ్గానిస్తాన్ లో ప్ర‌తి అఫ్గాన్.. కాబులీవాలా క‌థ‌ ను ఎంతో గ‌ర్వంగా ప్రస్తావిస్తూ ఉంటారు. మూడు సంవత్సరాల క్రితం నేను తాజికిస్తాన్ కు వెళ్లిన‌ప్పుడు గురుదేవుని విగ్ర‌హావిష్క‌ర‌ణ భాగ్యం క‌లిగింది. గురుదేవుని ప‌ట్ల అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఉన్న గౌర‌వాన్ని నేను ఏనాడూ మ‌రచిపోలేను.

ప్ర‌పంచం లోని ప‌లు విశ్వ‌విద్యాల‌యాలలో టాగోర్ గారిని గురించి అధ్య‌య‌నం చేస్తున్నారు. ఆయ‌న పేరుతో చైర్స్ ను ప్రారంభించారు. శ్రీ ర‌వీంద్ర నాధ్ టాగూర్ నాటికి నేటికీ ఒక ప్ర‌పంచ పౌరుడని చెప్ప‌డం ఎంత‌మాత్రం త‌ప్పు కాదు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు, గుజ‌రాత్ కు ఉన్నటువంటి బంధాన్ని గురించి చెప్పాల‌ని నాకు చాలా ఆతుర‌త గా ఉంది. ఆయ‌న పెద్ద‌న్న గారు శ్రీ స‌త్యేంద్ర‌నాధ్ టాగోర్ సివిల్ స‌ర్వీసు లో చేరిన మొద‌టి భార‌తీయుడు. ఆయ‌న చాలా కాలం పాటు అహ‌మదాబాద్ లో నివ‌సించారు. ఆయ‌న అహ‌మదాబాద్ క‌మిశన‌ర్ గా సేవ‌లు అందించారనుకుంటాను. నేను ఎక్క‌డో చ‌దివాను.. స‌త్యేంద్ర‌నాథ్ గారు ఇంగ్లండ్ కు వెళ్లబోయే ముందు త‌న చిన్న త‌మ్ముడికి ఆరు నెల‌ల‌ పాటు అహ‌మదాబాద్ లోనే ఆంగ్లాన్ని బోధించార‌ని. అప్పుడు గురుదేవునికి 17 ఏళ్లు. ఆ స‌మ‌యంలో గురుదేవుడు త‌న ప్ర‌ముఖ న‌వ‌ల ఖుదీతో పాషాణ్ లోని ముఖ్య‌మైన భాగాల‌ను, కొన్ని క‌విత‌ల‌ను అహ‌మదాబాద్ లోనే రాశారు. ఒక ర‌కంగా చెప్పాలంటే గురుదేవుడు విశ్వ‌ మాన‌వునిగా అవ‌త‌రించ‌డంలో దేశం లోని ప్ర‌తి ప్రాంతం త‌న వంతు పాత్ర‌ ను పోషించింది.

మిత్రులారా,

ప్ర‌తి మ‌నిషి ఏదో ఒక ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి జ‌న్మించారని గురుదేవుడు భావించారు. ప్ర‌తి పిల్ల‌వాడు స‌మ‌ర్థ‌ుడిగా మారి త‌న లక్ష్యాన్ని చేరుకోవ‌డానికి విద్య చాలా ప్ర‌ధాన‌మైన పాత్ర ను పోషిస్తుంది. ఆప్యాయ‌త అనురాగాల‌ శ‌క్తి అనే గురుదేవుల‌ క‌విత‌ ను చ‌దివితే పిల్ల‌ల‌కు ఎలాంటి విద్య కావాల‌నే అంశంలో మ‌న‌కు అవ‌గాహ‌న లభిస్తుంది. విద్య అంటే పాఠ‌శాల‌ల్లో నేర్పేది మాత్ర‌మే కాద‌ని ఆయ‌న అంటూ ఉండే వారు. మ‌నిషి లోని ప్ర‌తి పార్శ్యాన్ని స‌మ‌న్వ‌యం చేసే అభివృద్ధి అని చెప్పే వారు. అలాగ‌ని దానిని ఒక కాలానికో, ఒక ప్రాంతానికో ముడిపెట్ట‌లేం అని ఆయన అనే వారు. భార‌తీయ విద్యార్థుల‌కు బయటి ప్ర‌పంచంలో ఏం జ‌రుగుతుందో తెలియాల‌ని గురుదేవులు ఆశించే వారు. ఇత‌ర దేశాలలో ఎంత మంది జీవిస్తున్నారు ? వారి సాంఘిక విలువ‌లు ఏమేమిటి ? వారి సంస్కృతి, సంప్ర‌దాయం మొద‌లైన‌వి ఎలా ఉంటాయి ? మొద‌లైన విష‌యాల‌ను మ‌న విద్యార్థులు తెలుసుకోవాల‌ని చెప్పే వారు. అదే స‌మ‌యంలో ప్ర‌తి భార‌తీయుడు త‌న సంస్కృతిని మ‌రిచిపోకూడదు అని కూడా ఆయ‌న నొక్కి పలికే వారు.

ఇదే అంశాన్ని ర‌వీంద్ర‌నాధ్ టాగోర్ వ్య‌వ‌సాయ విద్య‌ ను అభ్య‌సించ‌డానికి అమెరికా కు వెళ్లిన త‌న అల్లుడికి వ్రాసిన ఉత్త‌రంలో పేర్కొన్న‌ట్టు నాకు తెలిసింది. వ్య‌వ‌సాయ విద్య‌ ను అధ్య‌య‌నం చేయ‌డం మాత్ర‌మే స‌రిపోదు స్థానిక ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డం కూడా విద్య‌ లో భాగ‌మే అని ఆయ‌న ఈ ఉత్త‌రంలో రాశారు. అయితే అక్క‌డి ప్ర‌జ‌ల‌ను తెలుసుకునే క్ర‌మంలో అతడు తన అస్తిత్వాన్ని కోల్పోవ‌డం మొద‌లైతే మ‌టుకు, అటువంటప్పుడు అతడు తన గది తలుపులను మూసివేసుకొని లోపలే ఉండిపోవాల‌ని కూడా ఆయన వ్రాశారు.

భార‌త జాతీయోద్య‌మ స‌మ‌యంలో టాగోర్ గారు విద్యా తాత్త్విక‌త‌, భార‌తీయ తాత్త్విక‌త‌ ప్ర‌త్యేకంగా ఉండేవి. ఆయ‌న జీవితం జాతీయ‌, అంత‌ర్జాతీయ ఆలోచ‌న‌లలో భాగంగా ఉండేది. ఆ ఆలోచ‌న‌లు మ‌న పురాత‌న సంప్ర‌దాయాలలో భాగంగా ఉండేవి. అందుకే ఆయ‌న విశ్వ‌ విద్య‌ కోసం విశ్వ‌ భార‌తి పేరుతో ఒక ప్ర‌త్యేక‌మైన ప్ర‌పంచాన్ని సృష్టించారు. ఇక్క‌డ బోధించే విద్య‌ లో సామాన్య‌త అనేది ప్ర‌ధాన‌మైన సూత్రం. ఇప్ప‌టికీ ఇక్క‌డ చెట్ల కింద ప్ర‌కృతి స‌మక్షంలో త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తున్నారు. మ‌నిషి కి, ప్ర‌కృతి కి మ‌ధ్య‌ ప్ర‌త్య‌క్ష సంభాష‌ణ ఉంటుంది. ప్ర‌కృతి ఒడిలో మాన‌వ జీవితానికి సంబంధించిన అన్ని అంశాల‌ను.. సంగీతం, చిత్ర‌లేఖ‌నం, రంగ‌స్థ‌లం, న‌ట‌న.. మొద‌లైన‌ వాటిని బోధించ‌డం జ‌రుగుతుంది.

ఈ సంస్థ‌ కు పునాది వేసే స‌మ‌యంలో గురుదేవులు ఎలాంటి క‌ల‌లు క‌న్నారో వాటిని నెర‌వేర్చే దిశ‌గా ఈ విద్యాల‌యం నిరంత‌రం కృషి చేయ‌డం ఆనంద‌దాయ‌కం. విద్య‌ ను, నైపుణ్యాభివృద్ధి ని క‌లిపి సామాన్య ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికిగాను గురుదేవులు చేసిన శ్ర‌మ ఎంత‌గానో కొనియాడ‌ద‌గింది. మీరంద‌రూ ఐక‌మ‌త్యంగా ఉంటూ ఈ ప్రాంతం లో యాభై దాకా గ్రామాల‌ను అభివృద్ధి చేస్తున్నార‌ని నాకు తెలిసింది. మీరు చేస్తున్న ఈ కృషి గురించి తెలియ‌గానే నా ఆశ‌లు, ఆశ‌యాలు విస్త‌రించాయి. ఆశాభావ‌ం అనేది ప‌నితో పాటు పెరుగుతూ ఉంటుంది. మీరు చాలా ప‌ని చేశారు, కాబ‌ట్టే మీపై నాకు ఉన్నటువంటి అంచ‌నాలు కొంత‌మేర‌కు పెరిగాయి.

మిత్రులారా,

ఈ సంస్థ 2021 నాటికి వంద సంవ‌త్స‌రాలను పూర్తి చేసుకోనుంది. రాబోయే రెండు మూడు సంవ‌త్స‌రాలలో మీరు మీ యొక్క కృషి ని యాభై గ్రామాల‌ నుండి వంద‌ గ్రామాలకు లేదా రెండు వంద‌ల గ్రామాల‌కు విస్త‌రించండి. మీ కృషి ని దేశ అవ‌స‌రాల‌కు అనుగుణంగా మ‌ల‌చాల‌ని నేను అభ్య‌ర్థిస్తున్నాను. ఉదాహ‌ర‌ణ‌కు చెప్పాలంటే, 2021 లో ఈ సంస్థ శ‌తాబ్ది ఉత్స‌వాలను జరుపుకొనే స‌మ‌యానికి మీరు అభివృద్ధి చేసే 100 గ్రామాలలో విద్యుత్తు సౌక‌ర్యం ఉండాలి. అంద‌రికీ చ‌దువడం రావాలి. అన్ని ఇళ్లకు గ్యాస్ క‌నెక్ష‌న్ లు, మ‌రుగుదొడ్లు ఉండాలి. ఈ గ్రామాల లోని మాతృమూర్తులకు, పిల్ల‌లకు పూర్తిగా టీకాలు వేయించి ఉండాలి. అంతే కాదు, ఈ గ్రామాల్లోని వారందిర‌కీ డిజిట‌ల్ లావాదేవీల‌ పైన అవ‌గాహ‌న ఉండాలి. ఉమ్మ‌డిగా ల‌భించే సేవా కేంద్రాల గురించి, ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను నింప‌డం గురించి ఈ గ్రామాల్లో ప్ర‌జ‌లంద‌రికీ తెలిసి ఉండాలి.

మీకు అంద‌రికీ తెలిసే ఉంటుంది.. ఉజ్వ‌ల ప‌థ‌కం లో భాగంగా అందించే గ్యాస్ క‌నెక్ష‌న్ లు, స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ లో భాగంగా క‌ట్టిస్తున్న మ‌రుగుదొడ్లు పేద మ‌హిళ‌ల జీవితాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికేన‌ని.

గ్రామాల అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషితో పాటు శ‌క్తి ఉపాస‌కులు కూడా ఈ ప్రాంత‌ మ‌హిళ‌ల సాధికారిత‌ కోసం కృషి చేయాలి. అంతే కాదు ఈ 100 గ్రామాల‌ను ప్ర‌కృతి ని ప్రేమించే గ్రామాలుగా మార్చాలి. లేదా ప్ర‌కృతి ని ఆరాధించే గ్రామాలుగా మ‌ల‌చాలి. ప్ర‌కృతి ని సంర‌క్షించ‌డానికి ఎలాగైతే మీరు ప‌ని చేస్తున్నారో , ఈ గ్రామాలు కూడా మీ కార్య‌క్ర‌మంలో భాగం కావాలి. ఈ గ్రామాలు నీటి నిలువ కోసం త‌గినన్ని ఏర్పాట్లు చేసుకోవ‌డం ద్వారా జల సంర‌క్షణ దార్శ‌నిక‌త‌ ను ముందుకు తీసుకుపోవాలి. వంటచెరకు ను ఉప‌యోగించ‌డం మానివేయ‌డం ద్వారా వాయు కాలుష్యాన్ని నివారించాలి. పారిశుధ్యాన్ని దృష్టి లో పెట్టుకొని సేంద్రియ ఎరువుల‌ను ఉప‌యోగించ‌డం ద్వారా నేల‌ సారాన్ని సంర‌క్షించుకోవాలి. కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన గోబ‌ర్ ధ‌న్ యోజ‌న‌ ను ఉప‌యోగించుకొని ఈ ప‌ని ని చేయ‌వ‌చ్చు. ఒక జాబితా ను సిద్ధం చేసుకొని దాని ద్వారా మీరు ఈ పనుల‌న్నింటినీ పూర్తి చేయ‌వ‌చ్చు.

మిత్రులారా,

ఈనాడు మ‌నం అనేక ర‌కాల స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నాము. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 2022 వ సంవత్సరానికల్లా 75 ఏళ్లు అవుతుంది. ఆ స‌మ‌యానికి న్యూ ఇండియా ను నిర్మించుకోవాల‌ని 125 కోట్ల మంది భార‌తీయులు ప్ర‌తిన బూనారు. ఈ ల‌క్ష్యాన్ని సాధించాలంటే విద్య‌ తో పాటు ఇటువంటి విద్యా సంస్థలు ప్ర‌ధాన‌ పాత్ర‌ను పోషించాలి. ఇలాంటి గొప్ప సంస్థ‌ల‌కు చెందిన యువ‌త ఈ దేశానికి నూత‌న శ‌క్తిని, మార్గాన్ని అందించ‌గ‌ల‌దు. మ‌న విశ్వ‌విద్యాల‌యాలు ఒక్క విద్యా సంస్థ‌లు మాత్ర‌మే కాదు; సామాజిక జీవితంలో అవి చాలా చురుకుగా పాలుపంచుకోవడానికిగాను చ‌ర్య‌లను చేప‌ట్ట‌డం జ‌రుగుతోంది.

ఉన్న‌త్ భార‌త్ అభియాన్ లో భాగంగా గ్రామాల అభివృద్ధి కోసం వాటితో విశ్వ విద్యాలయాల‌ను సంధానించడం జ‌రుగుతోంది. గురుదేవుల దార్శ‌నిక‌త ప్ర‌కారం, న్యూ ఇండియా అవ‌స‌రాల ప్ర‌కారం మ‌న విద్యావ్య‌వ‌స్థ‌ ను బ‌లోపేతం చేయ‌డానికిగాను కేంద్ర ప్ర‌భుత్వం నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉంది. ఈ సంవత్సర బ‌డ్జెటు లో మౌలిక స‌దుపాయాలను, విద్యావ్య‌వ‌స్థ‌ ను బ‌లోపేతం చేయ‌డానికిగాను రీవైట‌లైజింగ్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అండ్ సిస్ట‌మ్ ఇన్ ఎజుకేశన్ (ఆర్ ఐఎస్ ఇ.. రైజ్‌) అనే ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. రాబోయే నాలుగు సంవ‌త్స‌రాలలో దేశం లోని విద్య వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డానికిగాను ఈ ప‌థ‌కం లో భాగంగా ఒక ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేయ‌డం జ‌రుగుతుంది. ఇందుకోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌ల విద్యాసంస్థ‌ల‌తో ఒక నెట్ వ‌ర్క్ ను ప్రారంభించ‌డం జ‌రిగింది. దీని ద్వారా ప్ర‌పంచం లోని ప్ర‌సిద్ధి చెందిన అధ్యాప‌కుల‌ను భార‌త‌దేశానికి ఆహ్వానించి వారి సేవ‌ల‌ను మ‌న సంస్థ‌లలో ఉయోగించుకోవడం జ‌రుగుతుంది. హయ్యర్ ఎజుకేశన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ ని ఒక వేయి కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి తో ప్రారంభించ‌డం జ‌రిగింది. దీని ద్వారా విద్యాసంస్థ‌ల‌కు కావ‌ల‌సిన సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. త‌ద్వారా దేశంలోని ప్ర‌ధాన‌మైన విద్యా సంస్థ‌లు ఉన్న‌త‌ స్థాయి నాణ్య‌త‌ గ‌ల మౌలిక స‌దుపాయాల‌ను ఏర్ప‌రచుకోవ‌డానికి నిధుల‌ను వినియోగిస్తాయి. దేశ‌వ్యాప్తంగా గ‌ల 2400 పాఠ‌శాల‌లను ఎంపిక చేసుకోవ‌డం జ‌రిగింది. వీటి ద్వారా పిన్న‌వ‌య‌స్సు లోనే బాల‌ల‌కు వినూత్న‌మైన ఆలోచ‌న‌ విధానం అలవడేటట్టు వారిని తీర్చిదిద్ద‌డం జ‌రుగుతుంది. ఈ పాఠ‌శాల‌ల్లో 6 వ తరగతి నుండి 12 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థుల‌కు అట‌ల్ టింక‌రింగ్ ల్యాబ్స్ ద్వారా శిక్ష‌ణ ను ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఆధునిక సాంకేతికత గ‌ల ప్ర‌యోగ‌శాల‌ల్ని చిన్నారుల‌కు ప‌రిచ‌యం చేయ‌డం జ‌రుగుతోంది.

మిత్రులారా,

మీ సంస్థ విద్యారంగానికి సంబంధించిన ఆవిష్క‌ర‌ణ‌కు స‌జీవ సాక్ష్యం. ఆవిష్క‌ర‌ణ‌లను ప్రోత్సహించ‌డానికిగాను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ నుండి వీలైనంత ల‌బ్ధి ని పొందాల‌ని విశ్వ‌ భార‌తి కి చెందిన 11000 మంది విద్యార్థుల‌ను కోరుతున్నాను. మీరంతా ఇక్క‌డ చ‌దువు పూర్తి చేసుకొని బయటకు వెళ్తున్నారు. గురుదేవుల ఆశీస్సుల‌తో మీరు దార్శ‌నిక‌త‌ ను సంపాదించుకున్నారు. మీరు మీతో పాటు విశ్వ‌ భార‌తి అస్తిత్వాన్ని మోస్తున్నారు.

మీరు ముందు ముందు చేప‌ట్టే కార్య‌క్ర‌మాల ద్వారా ఈ సంస్థ ఔన్న‌త్యాన్ని మ‌రింత పెంచేలా చూడాల‌ని నేను కోరుతున్నాను. ఈ సంస్థ యొక్క విద్యార్థులు వారి ఆవిష్క‌ర‌ణ‌ ద్వారా 500-1000 మంది ప్ర‌జల జీవితాల్లో మార్పును తీసుకురాగలరన్న సంగతిని ప్రజలు విన్నప్పుడు ఈ సంస్థ‌కు ప్ర‌జ‌లు వందనం చేస్తారు.

‘‘జోడీ తోర్ డాక్ శునే కె యూ న ఆశే త‌బే ఏక్ లా చ‌లో రే’’ అంటూ గురుదేవుడు ఆడిన మాట‌లను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీతో క‌లిసి న‌డ‌వ‌డానికి ఎవ‌రూ సిద్ధంగా లేక‌పోతే మీ ల‌క్ష్యాన్ని సాధించ‌డానికి ఒంట‌రి గానే ప్ర‌యాణం చేయండి అని ఆయ‌న చెప్పారు. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే మీతో కలిసి నాలుగు అడుగులు వేయ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్ప‌డానికి ఈ రోజున నేను ఇక్క‌డ‌కు వ‌చ్చాను. గురుదేవులు క‌ల‌లు గ‌న్న 21వ శ‌తాబ్దం లోకి దేశాన్ని తీసుకుపోవాలంటే ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో మాత్ర‌మే సాధ్య‌పడుతుంది.

మిత్రులారా,

విశ్వ‌భార‌తి అనే నావ‌ లో నా జీవితానికి సంబంధించిన ఎంతో విలువైన సంప‌ద‌ ను ఉంచాన‌ని గురుదేవులు వారి మ‌ర‌ణానికి ముందు రోజుల్లో మ‌హాత్మ గాంధీ గారితో చెప్పారు. ఈ సంప‌ద‌ను మ‌నమంతా, భార‌తీయులు అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఈ సంప‌ద‌ను సంర‌క్షించుకోవ‌డ‌మే కాదు దీనిని మ‌రింత సంప‌న్నం చేయాల్సిన బాధ్య‌త మ‌న మీద ఉంది. న్యూ ఇండియా క‌ల‌లను నెరవేర్చుకుంటూనే ఈ ప్ర‌పంచానికి నవీన మార్గాల‌ను చూపెట్టే ప‌ని ని విశ్వ భార‌తి కొన‌సాగిస్తుందా ? ఈ ప్ర‌శ్న‌ తో నేను నా ఉప‌న్యాసాన్ని ముగిస్తున్నాను. అంద‌రికీ అభినంద‌న‌లు.

మీ త‌ల్లితండ్రుల క‌ల‌ల‌తో పాటు మీ క‌ల‌లు, ఈ విద్యాల‌యం యొక్క స్వప్నాలు, ఈ దేశం యొక్క క‌ల‌లు నెర‌వేరాల‌ని ఆకాంక్షిస్తున్నాను.

మీ కంద‌రికీ నా శుభాభినంద‌న‌లు. మీకు అనేకానేక ధన్యవాదాలు.