Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పశుపోషకులకు తోడ్పాటు దిశగా పశువులకు సోకే గాలికుంటు, బ్రూసెలోసిస్ వ్యాధుల నియంత్రణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం


లోక్‘సభ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రిమండలి తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా దేశంలోని కోట్లాది రైతులకు లబ్ధి చేకూర్చడంతోపాటు పశుసంపద ఆరోగ్యం మెరుగు దిశగా వినూత్న చర్యల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆ మేరకు పశుపోషకులకు తోడ్పాటునిస్తూ- పశువులకు సోకే ‘‘గాలికుంటు (కాలు-నోరు సంబంధిత వ్యాధి-FMD), బ్రూసెలోసిస్’’ (పశువుల నుంచి మానవులకు వ్యాపించే సూక్ష్మజీవి) వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ వ్యాధుల నియంత్రణతోపాటు వాటి నిర్మూలనద్వారా దేశంలోని పశుసంపదను రక్షించడం కోసం రాబోయే ఐదేళ్లలో రూ.13,343 కోట్లు వ్యయం చేసే ప్రతిపాదను కూడా మంత్రిమండలి ఆమోదించింది. ఈ భూగోళంలో విలువైన భాగంగా ఉన్న మూగజీవులపై ప్రభుత్వానికిగల కరుణా స్ఫూర్తికి ఈ నిర్ణయం అద్దం పడుతోంది.
గాలికుంటు, బ్రూసెలోసిస్ వ్యాధులతో ముప్పు:

ఆవులు, ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు తదితర జంతువులకు ఈ వ్యాధులు సర్వసాధారణంగా సోకుతుంటాయి. ఆవు లేదా గేదె గాలికుంటు వ్యాధికి గురైనప్పుడు 4 నుంచి 6 నెలలపాటు పాల దిగుబడి 100 శాతందాకా నష్టపోవాల్సి వస్తుంది. అదేవిధంగా బ్రూసెలోసిస్ వ్యాధి సోకినట్లయితే ఆయా జంతువుల జీవితకాలంపాటు పాల దిగుబడి 30 శాతం మేర పడిపోతుంది. అలాగే ఈ వ్యాధి బారినపడిన జంతువులలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం నశించి వంధ్యత్వం సంభవించడమేగాక ఆయా జంతువుల యజమానులు, వాటితో పొలం పనులు చేసే కూలీలకు కూడా బ్రూసెలోసిస్ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ రెండు వ్యాధుల కారణంగా పాలు, ఇతర పశుసంబంధ ఉత్పత్తుల వ్యాపారంపై ప్రత్యక్ష ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని కోట్లాది రైతులకు.. ముఖ్యంగా పశుపోషకులకు మేలు చేసే నిర్ణయం తీసుకోవడంద్వారా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని కేంద్ర మంత్రిమండలి నెరవేర్చింది.

పశుసంపదపై కరుణ, సంరక్షణ:

గాలికుంటు వ్యాధి విషయంలో- దేశంలోని 30 కోట్ల పశువులకు (ఆవులు, ఎద్దులు, గేదెల) ఆరు నెలలకు ఒకసారి వంతున టీకాలతోపాటు దూడలకు ప్రాథమిక టీకాలు వేయాలని ఈ పథకం నిర్దేశిస్తోంది. అదేవిధంగా 20 కోట్ల గొర్రెలు/మేకలు, కోటి పందులకు కూడా టీకాలు వేయాలి. ఇక బ్రూసెలోసిస్ వ్యాధి నియంత్రణ విషయానికొస్తే- 3.6 కోట్ల పెయ్య (ఆడ) దూడలకు 100 శాతం టీకాల కార్యక్రమాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.

ఈ కార్యక్రమం ఇప్పటిదాకా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యయ భాగస్వామ్యం ప్రాతిపదికన సాగుతూ వచ్చింది. అయితే, ఈ రెండు వ్యాధుల సంపూర్ణ నిర్మూలన, తద్వారా పశుపోషణ చేపట్టిన రైతులకు మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు ఎన్నడూ లేనిరీతిలో ఈ కార్యక్రమ వ్యయం మొత్తాన్నీ తానే భరించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.