Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి చేతులమీదుగా జనవరి 5న ఢిల్లీలో ప్రారంభించడంతోపాటు శంకుస్థాపన: విలువ రూ. 12,200 కోట్లకు పైనే


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 5న మధ్యాహ్నం సుమారు 12 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఢిల్లీలో అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతోపాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ రూ.12,000 కోట్లకు పైనే. ప్రధాని దాదాపుఉదయం 11 గంటల 15 నిమిషాల వేళలో నమో భారత్ రైలులో సాహిబాబాద్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ వరకు ప్రయాణించనున్నారు.

ఢిల్లీ-ఘజియాబాద్-మేరఠ్ నమో భారత్ కారిడార్లో సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ మధ్య 13 కి.మీ. మేర పొడవున ఉండే భాగాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. నిర్మాణానికి దాదాపు రూ.4,600 కోట్లు ఖర్చయిన ఈ మార్గం ప్రాంతీయ సంధానాన్ని పెంచడంలో ఒక చెప్పుకోదగిన ఘట్టం కానుంది.  దీనిని ప్రారంభించడంతో, ఢిల్లీకి మొదటిసారి నమో భారత్ సంధాన సదుపాయం (కనెక్టివిటీ) సమకూరనుంది.  ఇది ఢిల్లీ, మేరఠ్‌ల మధ్య ప్రయాణించడాన్ని సులభతరంగా మార్చివేయడమే కాకుండా లక్షలాది ప్రజలకు అధిక వేగవంతమైన, సౌకర్యవంతమైన యాత్రానుభూతినీ, దాంతోపాటే సాటిలేని సురక్షనూ, విశ్వసనీయతనూ కూడా అందిస్తుంది.

ప్రధాని ఢిల్లీ మెట్రో నాలుగో దశలో భాగంగా జనక్‌పురి, కృష్ణ పార్క్‌ల మధ్య 2.8 కి.మీ. పొడవైన మార్గాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ మార్గం నిర్మాణానికి దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేశారు. ఢిల్లీ మెట్రో నాలుగో దశలో ప్రారంభానికి నోచుకొంటున్న మొదటి మార్గం ఇదే కానుంది. దీంతో పశ్చిమ ఢిల్లీలో కృష్ణ పార్క్, వికాస్‌పురిలో కొన్ని ప్రాంతాలే కాక దీంతో ముడిపడ్డ ఇతర ప్రాంతాలకు కూడా ప్రయోజనం అందనుంది.

ఢిల్లీ మెట్రో నాలుగో దశలో భాగంగా రిఠాలా – కుండలీ సెక్షను నిర్మాణ పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 26.5 కి.మీ. పొడవు ఉండే ఈ మార్గం నిర్మాణానికి ఇంచుమించు రూ. 6,230 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ కారిడార్ ఢిల్లీలోని రిఠాలాను హర్యానాలోని నాథూపూర్ (కుండలీ)తో కలుపుతుంది. ఫలితంగా ఢిల్లీ, హర్యానాల్లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో సంధాన సదుపాయాన్ని చాలావరకు మెరుగుపడనుంది. దీంతో రోహిణి, బవానా, నరేలా, ఇంకా కుండలీ వంటి ప్రధాన ప్రాంతాలు లాభపడతాయి. ఆ ప్రాంతాల్లోని నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలకు చేరుకోవడం మెరుగుపడుతుంది. రెడ్ లైనును విస్తరించినందువల్ల ఇది ఒకసారి పనిచేయడం మొదలైందంటే గనక, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో ప్రయాణాలు చేయడం సౌకర్యవంతంగా మారిపోతుంది.

న్యూ ఢిల్లీలో రోహిణి ప్రాంతంలో కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ (సెంట్రల్ ఆయుర్వేద రిసర్చ్ ఇనిస్టిట్యూట్..‘సీఏఆర్ఐ’)కి అత్యాధునిక భవనాన్ని సుమారు రూ.185 కోట్ల ఖర్చుతో నిర్మించడానికి సంబంధించిన పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్యాంపస్ ఆరోగ్య సంరక్షణ సేవలు, వైద్య చికిత్స సేవలకు అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానుంది. నూతన భవనంలో పరిపాలన బ్లాకు, ఓపీడీ బ్లాకు, ఐపీడీ బ్లాకులతోపాటు చికిత్సలకు మాత్రమే ప్రత్యేకంగా మరో బ్లాకును కూడా ఏర్పాటు చేయనున్నారు.  వీటితో రోగులకు, పరిశోధకులకు ఒక ఏకీకృత, అంతరాయాలకు తావుండని ఆరోగ్య సంరక్షణ సేవల్ని అందించడం సాధ్య పడనుంది.

 

***