భారతదేశ ప్రజలతో సరైన సంబంధాలు కలిగి ఉండేందుకు యువ ఐఎఎస్ అధికారులు వారి పరిసరాల పట్ల, పరిస్థితుల పట్ల సూక్ష్మగ్రాహ్యతను అలవరుచుకోవాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి ఈ రోజు సలహా ఇచ్చారు.
సహాయక కార్యదర్శుల ప్రారంభిక సమావేశంలో ప్రధాన మంత్రి పాల్గొని, 2014 ఐ ఎ ఎస్ అధికారుల జట్టును ఉద్దేశించి మాట్లాడారు. వారికి వారి విజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచుకునేందుకు- ఇంతకాలం శిక్షణలో వారు నేర్చుకున్నదానికన్నా ఎంతో మిన్నగా- ఇప్పుడు ఒక గొప్ప అవకాశం లభించిందని ప్రధాన మంత్రి చెప్పారు. వారు వారి నైపుణ్యాలను మరింతగా పెంచుకోవడానికి వారికి ఇచ్చిన విభాగాల పనితీరుకు అధిక విలువను జోడించడానికి ప్రయత్నించేందుకు రానున్న మూడు నెలల కాలాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరీ ముఖ్యంగా పరిపాలనలో సాంకేతిక విజ్ఞానం వినియోగం గురించి ఆయన ప్రస్తావిస్తూ, ప్రభుత్వం పనితీరులో ఇప్పుడున్న సాంకేతిక విజ్ఞానాన్ని మరింత మెరుగుపరచేందుకు యువ అధికారులు కృషి చేయాలన్నారు.
అధికార క్రమం గురించిన భయానికి లోనుకావద్దని, కేంద్ర ప్రభుత్వంలో సహాయక కార్యదర్శులుగా వారికి నిర్దేశించిన విధులను నేరవేర్చడంలో రానున్న మూడు నెలల లోను అనుభవయుక్త అధికారులతో సంప్రదింపులు జరిపేటప్పుడు నిర్భయంగా, అరమరికలు లేకుండా వ్యవహరించవలసిందని అధికారులకు ప్రధాన మంత్రి సూచించారు. ఇది ఐ ఎ ఎస్ శిక్షణలో 2013 సంవత్సర జట్టు నుండి మొదలైన ఒక కొత్త సంప్రదాయం అని ఆయన వెల్లడించారు. ఐ ఎ ఎస్ అధికారులు వారి వృత్తి జీవనం ఆరంభంలోనే కేంద్రంలో పనిచేసే విధంగా ఈ అవకాశం పూచీపడుతుందని, ఇటువంటి అవకాశం వారి సీనియర్ అధికారులకు కూడా లభించి ఉండదేమోనని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఇంకా సీనియర్ అధికారులు పాల్గొన్నారు.