मोर प्रिय भाई ओ, भऊणीमाने पराक्रम दिवस अबसर रे शुभेच्छा!
నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యావత్ దేశం ఆయనను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటోంది. సుభాష్ బాబుకు వినమ్ర పూర్వక నివాళి అర్పిస్తున్నాను. ఆయన జన్మస్థలంలో ఈ ఏడాది పరాక్రమ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒడిశా ప్రజలకు, ఒడిశా ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు. నేతాజీ జీవిత విశేషాలను వివరించేలా భారీ ప్రదర్శనను కూడా కటక్ లో ఏర్పాటు చేశారు. ఆయన జీవితంతో ముడిపడి ఉన్న అనేక వారసత్వ స్మారకాలను భద్రపరిచి ఈ ప్రదర్శనకు ఉంచారు. అనేకమంది చిత్రకారులు బోస్ జీవిత విశేషాలకు కాన్వాస్ పై చిత్రరూపమిచ్చారు. వీటన్నింటితో పాటు సుభాష్ బాబుకు సంబంధించిన అనేక పుస్తకాలను కూడా సేకరించారు. నేతాజీ ఈ ఘనమైన జీవిత ప్రస్థానం నా యువ భారతానికీ, నా భారతదేశానికి కొత్త శక్తిని అందిస్తాయి.
మిత్రులారా,
అభివృద్ధి చెందిన భారత్ గా ఎదగాలన్న ఆశయాన్ని సాధించడంలో దేశం నిమగ్నమై ఉన్న నేటి తరుణంలో సుభాష్ చంద్రబోస్ జీవితం మనకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆజాద్ హింద్ – ఇదే నేతాజీ జీవితంలో అతిపెద్ద లక్ష్యం. దాన్ని సాధించడం కోసం ‘ఆజాద్ హింద్’నే ఏకైక ప్రాతిపదికగా భావించి తన నిర్ణయాలను పరీక్షించుకున్నారు. సంపన్న కుటుంబంలో జన్మించిన నేతాజీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కావాలనుకుంటే, బ్రిటీష్ పాలనలో సీనియర్ అధికారిగా సౌకర్యవంతమైన జీవితాన్ని ఆయన గడిపి ఉండేవారు. కానీ కష్టాలు, సవాళ్లతో కూడినదే అయినా స్వాతంత్య్రం కోసం ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. స్వాతంత్య్రం కోసం దేశవిదేశాల్లో తిరగడానికి ముందుకొచ్చారు. సుభాష్ చంద్రబోస్ సౌకర్యవంతమైన జీవితానికి బందీ కాలేదు. నేడు మనమంతా అదే స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిర్మించాలి. అంతర్జాతీయంగా మనల్ని మనం ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలి, శ్రేష్టతను అందిపుచ్చుకోవాలి, సామర్థ్య నిర్మాణంపై దృష్టి పెట్టాలి.
మిత్రులారా,
నేతాజీ దేశ స్వాతంత్య్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి అన్ని వర్గాలకు చెందిన ధైర్యవంతులైన పురుషులు, మహిళలు ఇందులో చేరారు. వారందరి భాషలు వేరైనా భావం ఒక్కటే – అది దేశ స్వాతంత్య్రం. అభివృద్ధి చెందిన భారత్ గా ఎదగడంలో ఈ ఐక్యత గొప్ప పాఠంగా నిలుస్తుంది. నాడు స్వరాజ్యం కోసం ఐక్యంగా నిలిచిన మనం, నేడు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిలపడం కోసం ఏకం కావాలి. నేడు దేశంలో, ప్రపంచంలో ప్రతిచోటా భారత పురోగతికి అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. ఈ 21వ శతాబ్దం మనదే అని చాటేలా దేశాన్ని మనం తీర్చిదిద్దుతున్న తీరును గమనిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో భారత ఐక్యతకు మనం పెద్దపీట వేయాలి. దేశాన్ని బలహీనపరచాలనుకునే వారి పట్ల, దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనుకునే వారి పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి.
మిత్రులారా,
భారత ఘనమైన వారసత్వాన్ని గర్వకారణంగా నేతాజీ భావించారు. సుసంపన్నమైన భారత ప్రజాస్వామిక చరిత్రపై ఆయనెప్పుడూ సుదీర్ఘమైన చర్చలు చేసేవారు, దాని నుంచి ప్రేరణ పొందాలని భావించారు. నేడు భారత్ బానిస మనస్తత్వం నుంచి బయటపడుతోంది. ఘనమైన తన వారసత్వాన్ని గర్వంగా చాటుతూ అభివృద్ధి చెందుతోంది. ఆజాద్ హింద్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం లభించడం నా అదృష్టం. ఆ చారిత్రాత్మక సందర్భాన్ని ఎప్పటికీ మరచిపోలేను. నేతాజీ వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఢిల్లీలోని ఎర్రకోటలో 2019లో మా ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకార్థం మ్యూజియాన్ని నిర్మించింది. అదే ఏడాది సుభాష్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ పురస్కారాలను కూడా ప్రారంభించింది. నేతాజీ జయంతిని పరాక్రమ దివస్ గా నిర్వహించాలని 2021లో ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియా గేట్ వద్ద నేతాజీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అండమాన్ లోని ద్వీపానికి ఆయన పేరుపెట్టడం, గణతంత్ర దినోత్సవ కవాతులో ఐఎన్ఏ సైనికులకు నివాళి అర్పించడం… ప్రభుత్వ చిత్తశుద్ధికి ప్రతీక.
మిత్రులారా,
వేగవంతమైన అభివృద్ధి సామాన్యుడి జీవితాన్ని సులభతరం చేస్తుందని, సైనిక శక్తినీ బలోపేతం చేస్తుందని గత పదేళ్లలో మన దేశం నిరూపించింది. గత దశాబ్ద కాలంలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని అధిగమించారు. ఇది గొప్ప విజయం. నేడు పల్లె అయినా, నగరమైనా.. అన్ని చోట్లా ఆధునిక మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. దీనితోపాటు భారత సైన్యం బలం కూడా అనూహ్యంగా పెరిగింది. నేడు ప్రపంచ వేదికపై భారత్ పాత్ర పెరుగుతోంది. భారత్ మరింత బలంగా తన గళాన్ని వినిపిస్తోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించే రోజు మరెంతో దూరంలో లేదు. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణమే ఏకైక లక్ష్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో నిరంతరం మనం కృషిచేయాలి. ఇదే నేతాజీకి మనం అందించే నివాళి. మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించు అనువాదం. మౌలిక ప్రసంగం హిందీలో ఉంది.
***
Netaji Subhas Chandra Bose's ideals and unwavering dedication to India's freedom continue to inspire us. Sharing my remarks on Parakram Diwas.
— Narendra Modi (@narendramodi) January 23, 2025
https://t.co/wyDCWX6BNh