పరాక్రమ్ దివస్ (పరాక్రమ దినోత్సవం) పేరిట నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని స్మరించుకొంటున్న సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో యువ మిత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2047కల్లా దేశం సాధించాలనుకుంటున్న లక్ష్యం ఏమిటంటారు? అని విద్యార్థులను ఆయన అడిగారు. ఓ విద్యార్థి ఎంతో ఆత్మవిశ్వాసంతో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేదే ఆ లక్ష్యం అంటూ జవాబిచ్చారు. 2047కే ఎందుకు? అంటూ ప్రధాని మళ్లీ ప్రశ్నించారు. దీనికి ఇంకొక విద్యార్థి సమాధానాన్నిస్తూ, ‘‘అప్పటికల్లా మా తరం దేశ ప్రజలకు సేవ చేయడానికి సన్నద్ధమవుతుంది. ఆసరికి ఇండియా తన స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలను జరుపుకోనుంద’’న్నారు.
ఈ రోజుకున్న ప్రాముఖ్యమేమిటో చెప్పగలరా అని శ్రీ మోదీ అడిగిన మీదట, ఈ రోజు ఒడిశాలోని కటక్‌లో జన్మించిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి అంటూ వారు బదులిచ్చారు. నేతాజీ బోస్ జయంతిని పాటించడానికి కటక్‌లో ఘనంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని శ్రీ మోదీ చెప్పారు. మరో విద్యార్థినిని ఉద్దేశించి ఆయన, నేతాజీ ప్రబోధాల్లో నీకు బాగా ఎక్కువగా ప్రేరణనిచ్చిన ప్రబోధం ఏమిటో చెబుతావా అంటూ అడిగారు. దానికి ఆ విద్యార్థిని ‘‘నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను’’ అన్న నేతాజీ మాటలను గుర్తుచేశారు. మరే ఇతర అంశాలన్నిటి కన్నా మిన్నగా దేశానికే నేతాజీ ప్రాధాన్యాన్నిచ్చి, సిసలైన నాయకత్వాన్ని చాటిచెప్పారు, ఆ అంకితభావమే మనకు గొప్ప ప్రేరణనిస్తూ వస్తోందని కూడా ఆమె అన్నారు. ఆ ప్రేరణను అందుకొని నీవు సాధిస్తున్నవేమేమిటో చెప్పాలని ప్రధాని అడిగారు. దీనికి ఆ అమ్మాయి సమాధానమిస్తూ, దేశంలో కర్బన పాదముద్రను తగ్గించాలనే స్ఫూర్తిని నేను పొందాను, ఈ అంశం స్థిరాభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీస్)లో ఒకటిగా ఉంది అన్నారు. కర్బన పాదముద్ర వ్యాప్తిని తగ్గించే దిశలో భారత్ తీసుకున్న కార్యక్రమాల గురించి చెప్పాలని ప్రధానమంత్రి అడిగారు. మన దేశం విద్యుత్తు వాహనాలను, బస్సులను నడపడం మొదలుపెట్టిందని ఆమె జవాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందజేసిన 1,200కు పైగా ఎలక్ట్రిక్ బస్సులను ఢిల్లీలో నడుపుతున్నారని, ఇలాంటి బస్సులను మరిన్నిటిని కూడా ప్రవేశపెడతారని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
వాతావరణ మార్పు విసురుతున్న సవాలును ఎదుర్కోవడానికి పీఎం సూర్యఘర్ యోజన ఒక సాధనమని విద్యార్థులకు ప్రధానమంత్రి వివరించారు. ఈ పథకంలో భాగంగా, సౌర ఫలకాలను ఇంటి పైకప్పు మీద ఏర్పాటు చేశారని, వాటితో సౌర శక్తి ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అయ్యి, తద్వారా విద్యుత్తు బిల్లులను చెల్లించాల్సిన అవసరం ఇక ఉండదని ఆయన అన్నారు. ఉత్పత్తి అయిన విద్యుత్తును ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను చార్జి చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చని, దీంతో శిలాజ జనిత ఇంధనాలపై ఖర్చుపెట్టనక్కరలేదు, కాలుష్యానికి అడ్డుకట్ట వేయవచ్చని కూడా ఆయన వివరించారు. ఇంట్లో సొంత వినియోగం తరువాత మిగులు విద్యుత్తు అంటూ ఏదైనా ఉంటే, ఆ విద్యుత్తును ప్రభుత్వానికి అమ్మొచ్చు, ప్రభుత్వం ఆ విద్యుత్తును మీ వద్ద నుంచి కొనుగోలు చేసి డబ్బు చెల్లిస్తుంది అని శ్రీ మోదీ విద్యార్థినీవిద్యార్థులకు తెలిపారు. అంటే దీని అర్థం మీరు ఇంట్లో విద్యుత్తును ఉత్పత్తి చేసి, దానిని లాభాన్ని రాబట్టుకోవడానికి అమ్మొచ్చని కూడా అన్నమాట అని ఆయన అన్నారు.
***
Paid homage to Netaji Subhas Chandra Bose. Don’t miss the special interaction with my young friends! pic.twitter.com/M6Fg3Npp1r
— Narendra Modi (@narendramodi) January 23, 2025