భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎఎఐ) కు 11.35 ఎకరాల భూమిని బదలాయించేందుకు, తత్సమాన విస్తీర్ణం కలిగిన భూమిని అనిశాబాద్ లో ఎఎఐ నుండి తీసుకొనేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. పట్నా విమానాశ్రయం వద్ద ఉన్న ప్రతిపాదిత భూమిని విమానాశ్రయ విస్తరణకు మరియు ఒక కొత్త టర్మినల్ భవన నిర్మాణంతో పాటు సంబంధిత మౌలిక సదుపాయాల కోసం కూడా ఉపయోగించడం జరుగుతుంది. భూమి బదలాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సైతం అంగీకారం తెలిపింది.
కొత్త టర్మినల్ భవనం నుండి ఏడాదిలో 3 మిలియన్ మంది ప్రయాణికులు రాకపోకలు జరిపేందుకు తగ్గట్లుగా దానిని నిర్మిస్తారు. అంటే, ఇది విమానాశ్రయ ప్రస్తుత సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా, సాధారణ ప్రజానీకానికి కూడా సౌకర్యవంతంగా ఉండగలదన్న మాట.
పూర్వరంగం:
పట్నా విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న టర్మినల్ భవనాన్ని ఏడాదిలో 0.5 మిలియన్ మంది ప్రయాణికుల రాకపోకలకు అనువుగా నిర్మించడమైంది. అయితే, ఇప్పటికే ఈ విమానాశ్రయాన్ని 1.5 మిలియన్ మంది ప్రయాణికులు వినియోగించుకొంటున్నారు. తత్ఫలితంగా టర్మినల్ భవనం విపరీతమైన సమూహాలతో కిక్కిరిసిపోతోంది.