మంత్రివర్గం లో నా సహచరుడు, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి శ్రీ సురేశ్ ప్రభు గారు, గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురీ గారు, వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సి. ఆర్. చౌదరి గారు, వాణిజ్యం మరియు ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు, ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర ప్రముఖులారా.
ముందుగా వాణిజ్య భవన్ కు శంకుస్థాపన సందర్భంగా మీ అందరికీ ఇవే నా అభినందనలు. భవన నిర్మాణం ఈ రోజే మొదలైంది. ఈ భవనం వచ్చే సంవత్సరం డిసెంబర్ కల్లా పూర్తి అవుతుందని ఈ వేదిక మీద నాకు తెలిపారు. నిర్దిష్ట గడువు లోగా వాణిజ్య భవన్ నిర్మాణం పూర్తి అవుతుందని, మరి ప్రజలు దీని ప్రయోజనాలను అతి త్వరలో పొందుతారని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా, నేను అన్నింటికన్నా ముందు సమయాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ప్రభుత్వ హయంలో నేను పునాది రాయి వేసిన, లేదా ప్రారంభించిన భవనాలన్నింటిలోనూ ఒక విషయంలో సామ్యం ఉంది. ఈ భవనాలన్నీ ఆనాటి ప్రభుత్వ పని తీరును ప్రతిబింబిస్తున్నాయి. వీటిని చూసినప్పుడు న్యూ ఇండియా వైపు అడుగులు వేస్తున్న దేశానికి మరియు పాత వ్యవస్థ కు మధ్య ఉన్న తేడా కళ్ళకు కడుతుంది.
మిత్రులారా, నేను మీకు కొన్ని ఉదాహరణలను ఇవ్వదలచాను. ప్రవాసి భారతీయ కేంద్ర భవనాన్ని 2016 లో దేశ ప్రజలకు అంకితం ఇచ్చిన విషయం నాకు గుర్తుంది. ఈ భవన నిర్మాణం తాలూకు ప్రకటన అటల్ బిహారీ వాజపేయి గారు ప్రధాని గా ఉన్నప్పుడు జరిగింది. ఆ భవనాన్ని నిర్మించడానికి 12 సంవత్సరాలు పట్టింది. డాక్టర్ ఆంబేడ్ కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని నిర్మించాలని 1992 లో నిర్ణయించారు. అయితే, ఆ కేంద్రం నిర్మాణానికి 2015 లో పునాది రాయి వేయడమైంది. దానిని 2017 లో దేశ ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది. అంటే నిర్మాణ పనులు పూర్తి కావడానికి 23-24 సంవత్సరాల పట్టిందన్న మాట.
మిత్రులారా,
నేను కేంద్ర సమాచార కమిశన్ కొత్త భవనాన్ని ఈ ఏడాది మార్చి నెలలో దేశ ప్రజలకు అంకితం చేశాను. ఈ భవనం నిర్మించాలని 12 సంవత్సరాల క్రితం కోరడం జరిగింది. అయితే ఈ ఎన్ డిఎ ప్రభుత్వ హయాం లోనే నిర్మాణాన్ని మొదలుపెట్టి నిర్ణీత కాల వ్యవధి లో పూర్తి చేయడం జరిగింది.
అలీపూర్ రోడ్డు లో నిర్మించినటువంటి ఆంబేడ్ కర్ జాతీయ స్మారకం మరొక ఉదాహరణ. ఈ భవనాన్ని కూడా రెండు నెలల క్రితం దేశ ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది. ఈ స్మారక మందిరాన్ని నిర్మించడాన్ని గురించి సంవత్సరాల తరబడి చర్చ జరిగింది. అటల్ గారి హయాం లో దీనిపై సత్వర చర్యలు తీసుకున్నారు. కానీ, ఆ తరువాత 10-12 సంవత్సరాల పాటు పని అంతాను నిలచిపోయింది.
ఈ నాలుగు చిహ్నాల యొక్క, ఢిల్లీ లోని ఈ భవనాల యొక్క కథ ఏమిటంటే ఢిల్లీ లో ప్రభుత్వం లోని అన్ని విభాగాలు, అన్ని మంత్రిత్వ శాఖలు దేనికి అవి గిరి గీసుకొని వాటి పనులను చేయకుండా ఉన్నప్పటిది. అలాగ కాకుండా అవన్నీ గిరి గీసుకోకుండా బయటకు వచ్చి ఒక్కుమ్మడిగా పని చేసినట్లయితే అలాంటప్పుడు పని త్వరగా జరుగుతుంది. అడ్డంకులను సృష్టించడం, అయోమయానికి తావు ఇవ్వడం, మరి పనులలో జాప్యం చేయడం వంటి వైఖరి నుండి దేశం ముందుకు కదలింది.
డిల్లీకి ఐదో చిహ్నాన్ని చేర్చే పనిలో ఈ రోజు తొలి అడుగు పడినందుకు నేను సంతోషిస్తున్నాను.
వాణిజ్య రంగానికి చెందిన ప్రతి ఒక్క క్షేత్రంలోనూ అడ్డుగోడలను ఛేదించే పనిని చేపట్టి ఒక కప్పు కింద మరింత మెరుగైన రీతిలో పని చేయాలన్నది నా అభిలాష. అది కార్యరూపం దాల్చుతుందని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా, ప్రస్తుతం భారతదేశం అత్యంత క్లిష్ట పరిస్థితి లో ఉంది. మన దేశంలో జనాభాపరంగా నెలకొన్న వయోవర్గం యొక్క అనుకూలత ఏ దేశానికైనా అసూయా జనకమే. మన యువత మన ప్రజాస్వామ్యానికి ఒక నూతన శక్తి ని అందిస్తోంది. ఈ యువజనులే 21వ శతాబ్దపు భారతదేశానికి పునాది. వారి ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చడం కేవలం ఏవో కొన్ని మంత్రిత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదు, అది మన అందరి యొక్క సమష్టి బాధ్యత.
గడచిన శతాబ్దం లో పారిశ్రామిక విప్లవం వల్ల వచ్చిన అవకాశాన్ని భారతదేశం అందిపుచ్చుకోలేక పోయింది. అప్పుడు అలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ శతాబ్దం లో పారిశ్రామిక విప్లవానికి ఆధిపత్యం వహించగల దేశాలలో భారతదేశం ఒకటి కావడానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. నాలుగో పారిశ్రామిక విప్లవం సంగతికి వస్తే డిజిటల్ టెక్నాలజీ ఈ విప్లవానికి ఆధారం; దానినే నాలుగో పారిశ్రామిక విప్లవం అని కూడా అంటారు. ఈ రంగంలో ఇతర దేశాల కన్నా భారతదేశం ముమ్మాటికీ ముందున్నది.
ఈ రోజు వాణిజ్య మంత్రిత్వ శాఖ చేస్తున్న అన్ని పనులతో పాటు లక్ష్యాలన్నింటిని సాధించడానికి డిజిటల్ టెక్నాలజీ ప్రధానమని మీరు గుర్తిస్తారు. వాణిజ్య భవన్ ఉదాహరణే తీసుకోండి.. ఆ భవనం నిర్మిస్తున్న స్థలం ఇంతకు మునుపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సప్లయిస్ అండ్ డిస్పోజల్స్ అధీనంలో ఉండేది. 100 సంవత్సరాలకు పైబడిన ఈ సంస్థ ను మూసివేసి దాని స్థానంలో డిజిటల్ టెక్నాలజీ పై ఆధారపడిన గవర్నమెంట్-ఇ- మార్కెట్ ప్లేస్ (జిఇఎమ్) ను ఏర్పాటు చేయడమైంది. ప్రభుత్వం తనకు అవసరమైన సామగ్రిని సేకరించే పద్ధతి ని జిఇఎమ్ పూర్తిగా మార్చివేసింది.
చిన్న, పెద్ద విక్రేత సంస్థలు కలుపుకొని 1.17 లక్షలకు పైగా కంపెనీలు ఈ వేదిక పైకి వచ్చి నిలచాయి. జిఇఎమ్ ద్వారా ఈ విక్రయ సంస్థలకు ఐదు లక్షలకు పైగా ఆర్డర్ లను ఇవ్వడమైం. అతి తక్కువ వ్యవధి లో జిఇఎమ్ ద్వారా 8,700 కోట్ల రూపాయలకు పైగా విలువైన వస్తువులను సేకరించడమైంది.
దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న చిన్న నవ పారిశ్రామికులకు వారి ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించేటటువంటి అవకాశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ కల్పించిన తీరుకుగాను ఆ శాఖ ప్రశంసార్హమే. అయితే ఇది మీ యొక్క సుదీర్ఘ ప్రస్థానం లో ఆరంభమేనని నేను అనుకొంటున్నాను.
జిఇఎమ్ ను ఏ విధంగా మరింత విస్తరించవచ్చు, దేశం లోని సూక్ష్మ, లఘు, మధ్యతరహా సంస్థల రంగాన్ని, చిన్న నవపారిశ్రామికులను అంతర్జాతీయ వాణిజ్యం దిశగా ఇది తీసుకుపోగలదు.. ఈ విషయాలలో చేయవలసింది ఎంతో ఉంది. ఈ రోజు, 40 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్ లు ఉండడం, ఇంటర్ నెట్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడం, చౌక లో డేటా లభిస్తుండడం.. ఇటువంటి అంశాలన్నీ మీ పని ని మరింత సులభతరం చేసివేస్తున్నాయి.
మిత్రులారా, మన దేశంలో ‘భార సమర్ధనం కిం దూర్ వ్యవసాయినమ్’ అని ఒక నానుడి ఉంది. ఈ మాటలకు శక్తిమంతునికి ఏదీ భారం కాదు. అదే విధంగా, వ్యాపారులకు ఏ స్థలమూ దూరం కాదు అని భావం. ఈనాడు సాంకేతిక విజ్ఞానం వ్యాపారాన్ని ఎంత సులభతరం చేసివేసిందంటే దూరాలన్నీ కూడాను రోజు రోజుకు చిన్న చిన్నవిగా అయిపోతున్నాయి. దేశ వ్యాపార సంస్కృతి లో ఈ సాంకేతిక విజ్ఞానాన్ని ఎంతగా వినియోగించుకొంటే అది అంత ఎక్కువ ప్రయోజనకరంగా మారుతుంది.
దేశంలో వ్యాపారాన్ని నిర్వహించే తీరును జిఎస్ టి ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలంలోనే ఎలా మార్చివేసిందీ మనం చూశాము. సాంకేతిక విజ్ఞానం లేకపోయివుంటే ఇది సాధ్యం అయ్యేదేనే ? లేదు. ప్రస్తుతం, జి ఎస్ టి కారణంగా పరోక్ష పన్నుల వ్యవస్థ లో చేరుతున్న వారి సంఖ్య శరవేగంగా విస్తరిస్తోంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పరోక్ష పన్నుల వ్యవస్థ తో ముడిపడిన వారి సంఖ్య కేవలం 60 లక్షలు. జి ఎస్ టి అమలు లోకి వచ్చిన అనంతరం గడచిన 11 నెలల కాలంలో తమను కూడా చేర్చుకోవాలంటూ 54 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకొన్నారు. వారిలో 47 లక్షల మందికి పైగా ఇప్పటికే జి ఎస్ టి లో నమోదయ్యారు. ఆ విధంగా పరోక్ష పన్నుల వ్యవస్థ లో నమోదైన వారి సంఖ్య ఇప్పటికే ఒక కోటి ని అధిగమించింది.
ఒకసారి పద్దతులను సులభతరం చేస్తే– కనిష్ఠ ప్రభుత్వం మరియు గరిష్ఠ పాలన మార్గాన్ని అనుసరిస్తూ పోతే– అప్పుడు మంచి ఫలితాలు దక్కుతాయని కూడా ఇది నిరూపిస్తోంది. ప్రధాన అభివృద్ధి స్రవంతి లోకి చేరేందుకు మరింత మంది ప్రస్తుతం మందుకు వస్తున్నారు.
మిత్రులారా, గడచిన నాలుగు సంవత్సరాలలో జనహితకరమైన, అభివృద్ధికి అనుకూలమైన, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం నిరంతరం పాటుపడిందన్న విషయం మీకు బాగా తెలిసిన విషయమే. ప్రపంచ వ్యాప్తంగా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ- అది ద్రవ్యోల్బణం గాని, లేదా కోశ సంబంధి లోటు గాని లేదా కరెంట్ అకౌంటు నిల్వ గాని- ఈ భారతదేశ స్థూల ఆర్ధిక సూచికలు అన్నీ కూడాను మునుపటి ప్రభుత్వ కాలంలోని సంఖ్యలతో పోల్చి చూసినప్పుడు మెరుగుదలను నమోదు చేశాయి.
ప్రస్తుతం, ప్రపంచ ఆర్ధిక వృద్ధి లో భారతదేశం ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తోంది. గత త్రైమాసికంలో దేశ ఆర్ధిక వృద్ధి రేటు 7.7 శాతం స్థాయిని అందుకొంది. గడచిన నాలుగు సంవత్సరాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డి ఐ)లోను, విదేశీ మారక ద్రవ్యం నిల్వల లోను రికార్డు స్థాయి పెరుగుదల ఉంది.
ఎఫ్ డి ఐ విశ్వాస సూచిక లో- భారతదేశం అగ్రగామి ఎమర్జింగ్ మార్కెట్ ఫెర్ఫార్మర్స్ రెండింటిలో స్థానం సంపాదించుకొంది. వ్యాపారానుకూలత ర్యాంకింగ్ లో 142 వ స్థానం నుండి 100వ స్థానానికి ఎగబాకింది. లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో 19 పాయింట్లు మెరుగుపడింది. ప్రపంచ స్పర్ధాత్మకత సూచిక లో దేశ స్థానం 71 నుండి 39 కి ఎగసింది. ప్రపంచ నూతన ఆవిష్కార సూచిక లో 21 పాయింట్ల వృద్ధి ఉంది. ఇవన్నీ ప్రభుత్వం దూరదృష్టి తో చేపట్టిన చర్యల ఫలితమే.
అగ్రగామి అయిదు ఫిన్ టెక్ కంట్రీస్ లో భారతదేశం ఇటీవలే ఒక స్థానాన్ని సంపాదించుకొన్న సంగతి మీకు తెలిసేవుంటుంది. అయితే, ఈ సానుకూల సూచికలతో పాటే ఒక పెద్ద ప్రశ్న కూడా ఉంది- అదే, ఆ తరువాత ఏమిటి అనేది.
మిత్రులారా, మనం 7- 8 శాతం వృద్ధి రేటు ను అధిగమించి రెండు అంకెల వృద్ధి రేటు నును సాధించాలన్న మన లక్ష్యం కోసం కృషి చేయవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం భారతదేశం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థల స్థాయి కి చేరేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని ప్రపంచం ఎదురుచూస్తోంది.
వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులందరూ ఈ లక్ష్యాలను ఒక సవాలుగా తీసుకొంటారని నేను నమ్ముతున్నాను. దేశ ఆర్ధిక వ్యవస్థ లో సాధించే ఈ పురోగతి దేశ సామాన్య మానవుడి జీవనంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
ఈ కారణంగానే నేను సులభతరమైన వ్యాపార నిర్వహణను, వ్యాపారానుకూలతను గురించి ప్రస్తావించినపుడల్లా జీవనంలో సరళత్వాన్ని గురించి కూడా ప్రస్తావిస్తున్న సంగతిని మరు గమనించే ఉంటారు. పరస్పరం అనుసంధానమైనటువంటి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటీ మరొకదానితో పెనవేసుకొని వుంది.
ఒక విద్యుత్తు కనెక్షన్ ను పొందడం సులభతరం అయిందంటే, నిర్మాణ అనుమతులు వెంటనే మంజూరయ్యాయంటే, పరిశ్రమలు, కంపెనీలు ప్రక్రియలతో పెనగులాట ఆడవలసిన అక్కర లేకపోయిందంటే.. అటువంటప్పుడు ఈ అంశాలు అన్నీ కూడాను సామాన్య మానవుడికి సైతం ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. వివిధ రంగాలలో పనులు సజావుగా జరగకుండా ఏవైనా అడ్డంకులు ఉన్నట్లయితే దానిని సవాలుగా తీసుకొని అన్ని శాఖల అధికారులు కలసికట్టుగా వీలయినంత త్వరగా తొలగించాలి. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన రంగంలో సమస్యల పరిష్కారానికి, ఉత్పత్తికి అవరోధంగా ఉండే అధిక లావాదేవీల వ్యయాన్ని తగ్గించడానికి , సేవలలో వైవిధ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలి.
ఇటీవల వాణిజ్య శాఖ రవాణా సౌకర్యాల సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యతను చేపట్టడం నాకు చాలా సంతోషం కలిగించింది. దేశ వాణిజ్య వాతావరణాన్ని మెరుగుపరచేందుకు ఈ చర్య ముఖ్యమైన పాత్ర పోషించగలదు.
మిత్రులారా, ఇప్పుడు రవాణా సౌకర్యాల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ను రూపొందించాలి. న్యూ ఇండియా కు ఇప్పుడు అది అవసరం కూడా. ప్రస్తుత విధానాలను, పద్దతులను సవరించడం మరియు ఆధునిక ఉపకరణాలు వాడకం పెంచడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చును.
వాణిజ్య శాఖ ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు కు పని చేస్తున్నట్లు నాకు తెలిసింది. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం యొక్క స్థాయిని పెంచడానికి, ఉన్నత స్థానాలకు చేర్చడానికి అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు కలసికట్టుగా పనిచేయాలి. దీనినే ‘సంపూర్ణ ప్రభుత్వ పద్ధతి’ అని అంటారు. దీనినే అనుసరించాలి.
రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపొందించడానికి కౌన్సిల్ ఫర్ ట్రేడ్ డివెలప్ మెంట్ అండ్ ప్రమోశన్ తీసుకున్న చర్య చాలా మంచిది. మన ఎగుమతులు పెరగాలంటే రాష్ట్రాలు చురుకైన పాత్ర ను పోషించేటట్టు చేయాలి. రాష్ట్ర స్థాయిలో ఎగుమతి వ్యూహం రూపకల్పన, దానిని జాతీయ వాణిజ్య విధానం తో మమేకం చేసే దిశగా ముందడుగు వేయడంతో పాటు ఆర్ధిక సహాయం చేయాలి. అంతేకాక ఇందుకు సంబంధించిన వారినందిరినీ భాగస్వాములను చేయాలి. అది దేశానికి ప్రయోజనకారి కాగలదు.
మిత్రులారా, అంతర్జాతీయ విపణి లో భారతదేశం ఉనికిని పెంచడానికి సంప్రదాయ ఉత్పత్తులను, విపణులను కొనసాగించడంతో పాటు కొత్త ఉత్పత్తులపై, కొత్త విపణులపై దృష్టి ని కేంద్రీకరించాలి. దేశం లోపలి పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు దేశం వెలుపల పరిస్థితులను కూడా ఎదుర్కొనే విధంగా మనంతట మనం స్వయంగా బలపడాలి.
స్వల్పకాలిక అభివృద్ధి తో పాటు దీర్ఘ కాలం నిలదొక్కుకొనే విధంగా సమతూకాన్ని పాటించినప్పుడు మంచి ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వాణిజ్య విధానం పై గత సంవత్సరం జరిపిన మధ్యకాలిక సమీక్ష సానుకూల చర్య. ప్రోత్సాహకాలను పెంచడం, ఎగుమతులను పెంచడానికి ఎమ్ఎస్ ఎమ్ ఇ రంగానికి చేయూతను ఇవ్వడం అభినందనీయం. అది దేశ ఉపాధి అవకాశాలపైన సైతం ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
మరో ముఖ్యమైన విషయం ఉత్పత్తుల నాణ్యత. అందుకే 2014 ఆగస్టు 15న ఎర్ర కోట మీది నుండి ప్రసంగిస్తూ లోపాలు లేని (జీరో డిఫెక్ట్) ఉత్పత్తులు తయారు చేయాలని పిలుపు ఇచ్చాను. చిన్నదైనా, పెద్దదైనా ఫ్యాక్టరీలు అన్నింటిలో, ప్రతి ఉత్పత్తిదారు లోప రహిత ఉత్పత్తుల తయారీకి పాటుపడాలి. అప్పుడే వాటిని ఏ దిగుమతిదారు తిప్పి పంపబోరు. అంతేకాక వాతావరణం పై ప్రతికూల ప్రభావం చూపని (జీరో ఎఫెక్ట్) ఉత్పత్తులను తయారు చేయవలసిందని కోరాను.
వస్తువుల నాణ్యత ను గురించిన అవగాహన ‘మేక్ ఇన్ ఇండియా’ కీర్తిని పెంచడమే న్యూ ఇండియా యొక్క గుర్తింపు ను మరింత బలోపేతం చేస్తుంది. మన దేశంలో గత నాలుగు సంవత్సరాలలో మొబైల్ ఫోన్ ల తయారీ యూనిట్ ల సంఖ్య 2 నుండి 120 కి పెరగడం చూసి మీరు గర్వపడుతుండవచ్చు. ఆ కంపెనీలన్నీ ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.
మిత్రులారా, ఇది సత్యనిష్ఠ తో ప్రతిజ్ఞను స్వీకరించవలసిన సమయం. సవాళ్ళను స్వీకరించవలసిన సమయం. ప్రపంచ వాణిజ్యం లో ఇప్పుడు మన వాటా 1.6 శాతం. దానిని రెట్టింపు చేసి కనీసం 3.4 శాతం వరకు తీసుకుపోవడానికి వాణిజ్య విభాగం ప్రయత్నించాలి. అప్పుడు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో మన వాటా భారతదేశ జిడిపి తో సమానంగా ఉంటుంది. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మన తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ లక్ష్య సాధన కోసం ప్రభుత్వంలోని అన్ని శాఖలతో పాటు, ఇక్కడ ఉన్న ఎగుమతి ప్రోత్సాహక మండలి సిబ్బంది ఉమ్మడి ప్రయత్నాలు చేయాలి.
దిగుమతులకు సంబంధించి మరో సంకల్పం కూడా తీసుకోవాలి. ఎంపిక చేసిన కొన్ని రంగాలలో దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించలేమా ? శక్తి, ఇలెక్ట్రానిక్ వస్తువులు, రక్షణ రంగంలో వాడే ఆయుధాలు, ఉపకరణాలు, వైద్య రంగంలో వాడే పనిముట్ల దిగుమతి ని తగ్గించాగలమా ? దేశీయ ఉత్పత్తులను పెంచడం ద్వారా దిగుమతులు 10 శాతం తగ్గితే దేశ ఆదాయాన్ని పెంచి 3.5 లక్షల కోట్ల రూపాయలకు చేర్చుతుంది. ఇది భారతదేశ జిడిపి వృద్ధి ని రెండు అంకెల స్థాయికి చేర్చడంలో సమర్ధమైన ఉపకరణం కాగలుగుతుంది.
మీకు ఇలెక్ట్రానిక్ వస్తువులను గురించి ఒక ఉదాహరణను చెప్పదలచుకొన్నాను. ప్రస్తుతం దాదాపు 65 శాతం ఇలెక్ట్రానిక్ వస్తువులను దిగుమతి చేసుకోవలసి వస్తోంది. మొబైల్ ఫోన్ ల తయారీ సవాలును స్వీకరించినట్లే ఇలెక్ట్రానిక్ వస్తువుల తయారీలో దేశం స్వయం సంవృద్ది ని సాధించేలా చేయగలరా ?
మిత్రులారా, ఎగుమతులపై అధారపడడాన్ని తగ్గించాలని గత సంవత్సరం అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామని మీకు తెలుసు. అదేవిధంగా ప్రభుత్వ శాఖలు, సంస్థలు తమకు అవసరమైన వస్తువులను దేశీయ విపణి నుండి సేకరించాలి. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వును ఖచ్చితంగా అమలు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి.
ఈ ఉత్తర్వును అమలు చేయడానికి మీరందరూ, అన్ని ప్రభుత్వ విభాగాలు తమ తమ నియంత్రణ వ్యవస్థలను పటిష్టం చేయాలి. 21 శతాబ్ద పారిశ్రామిక విప్లవం లో వెనుకబడి పోకుండా ఉండేందుకు దేశీయ ఉత్పత్తులను పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న అన్ని ముఖ్యమైన నిర్ణయాలు- ఇందుకోసం నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, పెట్టుబడిదారులకు హితమైన విధానం అమలు చేయడం, మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాల సమగ్రత కోసం వ్యూహాన్ని రూపొందిచడం- అమలు చేయడం ద్వారా స్వయంసంవృద్దిని సాధించాలన్నది ప్రభుత్వ సంకల్పం.
‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా ఇప్పుడు పెరుగుతున్న కీర్తి ఈ రోజు నిర్మాణం ప్రారంభమైన వాణిజ్య భవన్ ప్రతిష్ఠ ను మరింత పెంచగలదని నేను ఆశిస్తున్నాను.
మిత్రులారా, మీరు నా చేత ఈ రోజు మంగళకరమైన కార్యం చేయించారు. ఈ ఆవరణలో ‘మాల్ శ్రీ ‘ మొక్కను నాటించారు. మాల్ శ్రీ మొక్కను పురాణ కాలం నుండి గౌరవిస్తారు. దానికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అంతే కాక ఈ వృక్షం ఎన్నో ఏళ్ళ పాటు నీడనిస్తుంది. ఇది కాకుండా ఈ ఆవరణ లో మరో వేయి మొక్కలను నాటనున్నట్లు నా దృష్టి కి తీసుకువచ్చారు.
ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో కూడిన పర్యావరణ హితమైన వాతావరణం లో మీరంతా న్యూ ఇండియా నిర్మాణానికి శక్తి వంచన లేకుండా మీ యొక్క సర్వోత్తమ ప్రతిభ ను కనబరుస్తారని ఆశిస్తూ, నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
వాణిజ్య భవన్ నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ మరొక్క మారు అనేకానేక అభినందనలు.
మీకు ధన్యవాదాలు.