Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లో నిఘా అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని ప్రసంగించిన – ప్రధానమంత్రి

న్యూ ఢిల్లీ లో నిఘా అవగాహన వారోత్సవాలను పురస్కరించుకుని ప్రసంగించిన – ప్రధానమంత్రి


నిఘా అవగాహన వారోత్సవాల సందర్భంగా ఈ రోజు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్‌ లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సి.వి.సి) నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సి.వి.సి కి చెందిన నూతన ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ పోర్టల్‌ ను ఆయున ప్రారంభించారు. 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్ర‌ధానమంత్రి మాట్లాడుతూ, స‌ర్దార్ ప‌టేల్ జ‌యంతి తో నిఘా అవగాహన వారోత్సవాలు ప్రారంభ‌మయ్యాయని చెప్పారు.   “సర్దార్ పటేల్ జీవితమంతా నిజాయితీ, పారదర్శకత వంటి విలువల ఆధారంగా ప్రజా సేవా వ్యవస్థ నిర్మాణానికి అంకితం చేయబడింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  అవగాహన, అప్రమత్తత చుట్టూ తిరుగుతున్న ప్రచారం ఈ సూత్రాలపైనే ఆధారపడి ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  అవినీతి రహిత భారతదేశ కలలు, ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఈ నిఘా అవగాహన వారోత్సవాల ప్రచారం జరుగుతోందని, ప్రతి పౌరుడి జీవితంలో దీని ప్రాముఖ్యత ఎంతో ఉందని, ఆయన నొక్కి చెప్పారు.

అభివృద్ధి చెందిన భారతదేశానికి విశ్వాసం మరియు విశ్వసనీయత చాలా కీలకమని, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.   గత ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడంతో పాటు, ప్రజలను విశ్వసించడంలో కూడా విఫలమయ్యాయని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు.  అవినీతి, దోపిడీ, వనరులపై నియంత్రణ యొక్క దీర్ఘకాల బానిసత్వం నుండి సంక్రమించిన వారసత్వం, దురదృష్టవశాత్తు, స్వాతంత్య్రం తర్వాత మరింత బలపడింది.   దీని వల్ల దేశంలోని కనీసం నాలుగు తరాల వారికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.  “దశాబ్దాల తరబడి సాగిన ఈ మార్గాన్ని ఆజాదీ-కా-అమృత్-కాల్ సమయంలో మనం పూర్తిగా మార్చుకోవాలి”, అని ప్రధానమంత్రి సూచించారు.

అవినీతికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరు కోసం ఎర్రకోట ప్రాకారాల నుంచి తమ స్పష్టమైన పిలుపును ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, అవినీతికి, ప్రజల పురోగతికి ఆటంకం కలిగించడానికి, సౌకర్యాల కొరత మరియు ప్రభుత్వం నుండి అనవసరమైన ఒత్తిడి రెండు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.   చాలా కాలం పాటు, ఈ సౌకర్యాలు, అవకాశాలు లేకపోవడాన్ని ఉద్దేశపూర్వకంగా సజీవంగా ఉంచబడిందనీ, అదేవిధంగా, ఎటువంటి ప్రయోజనం లేని అనారోగ్య పోటీకి దారితీసే అంతరాన్ని విస్తరించడానికి అనుమతించబడిందనీ, ఆయన విచారం వ్యక్తం చేశారు.   ఈ పోటీ అవినీతి పర్యావరణ వ్యవస్థను పోషించింది.   ఈ కొరత సృష్టించిన అవినీతి,  పేద మరియు మధ్యతరగతి వర్గాలను ఎక్కువగా ప్రభావితం చేసింది.   “పేద, మధ్యతరగతి ప్రజలు కేవలం ప్రాథమిక సౌకర్యాలు కోసమే తమ శక్తిని ఖర్చు చేస్తూ పోతే, దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది?” అని ప్రధానమంత్రి  ప్రశ్నించారు.  “అందుకే, మేము గత 8 సంవత్సరాలుగా ఈ కొరత మరియు ఒత్తిడి వ్యవస్థను మార్చడానికి ప్రయత్నిస్తున్నాము” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  సరఫరా మరియు డిమాండ్ మధ్య అంతరాన్ని పూరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.  దీనిని సాధించడానికి అనుసరించిన మూడు మార్గాలు సాంకేతికతలో పురోగతి, ప్రాథమిక సేవలను సంతృప్త స్థాయికి తీసుకెళ్లడం, చివరకు ఆత్మనిర్భరత వైపు వెళ్లడం.

టెక్నాలజీ వినియోగం గురించి ప్రధానమంత్రి వివరిస్తూ, పి.డి.ఎస్. ని టెక్నాలజీకి అనుసంధానం చేయడం, కోట్లాది నకిలీ లబ్ధిదారులను తొలగించడం, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి) ని అనుసరించడం ద్వారా సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదా చేయడం గురించి ప్రస్తావించారు.  అదేవిధంగా, పారదర్శక డిజిటల్ లావాదేవీలను స్వీకరించడం మరియు జి.ఈ.ఎం. ద్వారా పారదర్శక ప్రభుత్వ సేకరణలు భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తున్నాయి.

ప్రాథమిక సౌకర్యాలను సంతృప్త స్థాయికి తీసుకెళ్లడం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఏదైనా ప్రభుత్వ పథకం అర్హులైన ప్రతి లబ్ధిదారుని చేరుకోవడంతో పాటు, సంతృప్త లక్ష్యాలను సాధించడం ద్వారా అవినీతి పరిధిని నిర్మూలించడం తో పాటు సమాజంలో వివక్ష కు ముగింపు పలకవచ్చని సూచించారు.  ప్ర‌తి ప‌థ‌కం పంపిణీకి ప్ర‌భుత్వం అవలంబిస్తున్న సంతృప్త త‌త్వాన్ని ప్ర‌ధానమంత్రి ప్రముఖంగా పేర్కొంటూ, నీటి క‌నెక్ష‌న్లు, ప‌క్కా ఇళ్లు, క‌రెంటు క‌నెక్ష‌న్లు, గ్యాస్ క‌నెక్ష‌న్ల‌ ను ఉదాహ‌రించారు. 

విదేశీ వస్తువులపై ఎక్కువగా ఆధారపడటం కూడా అవినీతికి ఒక పెద్ద కారణంగా పరిణమించిందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.   రక్షణ రంగంలో ఆత్మనిర్భరత వైపు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.  రైఫిల్స్ నుండి యుద్ధ విమానాలు, రవాణా విమానాల వరకు భారతదేశం తన సొంత రక్షణ పరికరాలను తయారు చేయడం వల్ల అవినీతికి ఆస్కారం లేకుండా పోతోందని ఆయన నొక్కి చెప్పారు.

సి.వి.సి. అనేది పారదర్శకతను నిర్ధారించడానికి ప్రతి ఒక్కరి ప్రయత్నాలను ప్రోత్సహించే సంస్థగా ప్రధానమంత్రి పేర్కొంటూ, ‘నివారణ విజిలెన్స్’ కోసం గతంలో తాను చేసిన అభ్యర్థనను గుర్తు చేసుకున్నారు.  ఆ దిశగా సి.వి.సి. కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు.  తమ ఆడిట్‌ లు, తనిఖీలను ఆధునీకరించడంపై విజిలెన్స్ సమాజం ఆలోచించాలని ఆయన కోరారు.  “అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం చూపుతున్న సంకల్పం అన్ని శాఖల్లోనూ అదే స్థాయిలో కనిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.   అభివృద్ధి చెందిన భారతదేశం కోసం, అవినీతిని ఏమాత్రం సహించని పరిపాలనా పర్యావరణ వ్యవస్థను మనం అభివృద్ధి చేయాలి”, అని ఆయన సూచించారు. 

అవినీతికి సంబంధించిన క్రమశిక్షణా ప్రక్రియలను సమయానుకూలంగా, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి కోరారు.  క్రిమినల్ కేసులను నిరంతరం పర్యవేక్షించాలని, పెండింగు లో ఉన్న అవినీతి కేసుల ఆధారంగా శాఖలకు ర్యాంకింగ్‌ ను రూపొందించాలని, సంబంధిత నివేదికలను నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన ప్రచురించాలని ఆయన సూచించారు.  సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిఘా కేసులను పరిష్కరించే ప్రక్రియను క్రమబద్ధీకరించాలని కూడా ప్రధానమంత్రి కోరారు.  ప్రజా ఫిర్యాదుల సమాచారాన్ని ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా సంబంధిత శాఖలో అవినీతి కి గల మూల కారణాలను విశ్లేషించవచ్చునని ప్రధానమంత్రి సూచించారు. 

అవినీతి పై నిఘా పెట్టే పనిలో సామాన్య పౌరులను సైతం తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  “అవినీతిపరులు ఎంత శక్తివంతులైనా, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించకూడదు, అది మీ లాంటి సంస్థల బాధ్యత.  అవినీతిపరులు ఎవరికీ కూడా రాజకీయ-సామాజిక మద్దతు లభించకూడదనీ, ప్రతి అవినీతిపరుడినీ సమాజం దూరంగా ఉంచాలనీ, ఇటువంటి వాతావరణాన్ని సృష్టించడం చాలా అవసరమని కూడా ఆయన చెప్పారు.   ఆందోళన కలిగించే ధోరణి గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, “అవినీతిపరులుగా నిరూపించబడి, జైలు శిక్ష అనుభవించిన వ్యక్తులు కూడా వివిధ సందర్భాల్లో అనేకసార్లు కీర్తించబడుతున్నారు; ఈ పరిస్థితి భారతీయ సమాజానికి మంచిది కాదు.  నేటికీ కొందరు దోషులుగా తేలిన అవినీతిపరులకు అనుకూలంగా వాదనలు వినిపిస్తున్నారు.  అలాంటి వారికి, అలాంటి శక్తులకు సమాజం తమ కర్తవ్యాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఇటువంటి పరిస్థితుల్లో, మీ శాఖ తీసుకునే ఖచ్చితమైన చర్య చాలా పెద్ద పాత్రను కలిగి ఉంటుంది. 

అవినీతి మరియు అవినీతిపరులకు వ్యతిరేకంగా పనిచేసే సి.వి.సి. వంటి సంస్థలు ఏ విధంగానూ, ఆత్మరక్షణ కోసం ఎదురుచూడవలసిన అవసరం లేదని, ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.   అదే విధంగా, వారు ఏ రాజకీయ అజెండాతో పని చేయాల్సిన అవసరం లేదనీ, సాధారణ ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి కృషి చేయాలని ఆయన నొక్కి చెప్పారు.  “స్వార్థ ప్రయోజనాలను కలిగి ఉన్నవారు విచారణలను అడ్డుకోవడానికి, ఈ సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల పరువు తీసేందుకు ప్రయత్నిస్తారు.  కానీ జనతా జనార్దన్ భగవంతుని రూపం, వారు సత్యాన్ని తెలుసుకుంటారు, పరీక్షిస్తారు, సమయం వచ్చినప్పుడు, వారు సత్యానికి మద్దతు ఇచ్చే వారితో నిలబడతారు.”, అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.   ప్రతి ఒక్కరూ తమ విధులను అంకితభావంతో నెరవేర్చేందుకు సత్య మార్గంలో నడవాలని, “మీరు దృఢ నిశ్చయంతో చర్య తీసుకున్నప్పుడు, దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది” అని ఆయన నొక్కిచెప్పారు.

ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగిస్తూ, బాధ్యత చాలా పెద్దదని, సవాళ్లు కూడా మారుతూనే ఉంటాయని, పేర్కొన్నారు.   “అమృత్ కాల్‌ సమయంలో పారదర్శకమైన, పోటీతత్వ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను”, అని ప్రధానమంత్రి అన్నారు.  ఈ సవాలును పరిష్కరించే పద్దతిలో స్థిరమైన చైతన్యం అవసరమని ఆయన నొక్కి చెప్పారు.  వ్యాసరచన పోటీ విజేతలతో సంభాషించడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు, భవిష్యత్తులో వక్తృత్వ పోటీని ప్రవేశపెట్టాలని సూచించారు.  అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో బహుమతులు గెలుచుకున్న ఐదు మంది విజేతలలో నలుగురు బాలికలేనని గమనించిన ప్రధానమంత్రి, ఈ ప్రయాణంలో అబ్బాయిలు కవచం ధరించి, కలిసి ర్యాలీగా రావాలని కోరారు.  “మురికిని తొలగించినప్పుడే పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.   “చట్టం పరిధికి వెలుపల పని చేసేవారిని గుర్తించే విషయంలో సాంకేతికత ఖచ్చితంగా పేపర్ ట్రయిల్‌ ను వదిలివేస్తుంది”, అని గమనించిన ప్రధానమంత్రి, అవినీతికి వ్యతిరేకంగా ఈ పోరాటంలో సాంకేతికతను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి, డా. పి.కె. మిశ్రా; సిబ్బంది, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్;  కేబినెట్ కార్యదర్శి, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ శ్రీ సురేష్ ఎన్. పటేల్;  విజిలెన్స్ కమిషనర్లు శ్రీ పి.కె. శ్రీవాస్తవ, శ్రీ అరవింద కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం :

పౌరులకు వారి ఫిర్యాదుల పురోగతి గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడం కోసం ఈ పోర్టల్ ను  రూపొందించడం జరిగింది.   “నైతికత మరియు మంచి పద్ధతులు” పై చిత్రాలతో కూడిన చిన్న చిన్న పుస్తకాలను, ప్రివెంటివ్ విజిలెన్స్”పై ఉత్తమ అభ్యాసాల సంకలనంతో పాటు, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌ పై ఒక ప్రత్యేక సంచిక “విజె-వాణి” లను కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు.  జీవితంలోని అన్ని రంగాలలో సమగ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో భాగస్వాములందరినీ ఒకచోట చేర్చడం కోసం సి.వి.సి. ప్రతి సంవత్సరం ఈ నిఘా అవగాహన వారోత్సవాలను పాటిస్తుంది.  “అభివృద్ధి చెందిన దేశానికి అవినీతి రహిత భారతదేశం” అనే ఇతివృత్తంతో ఈ ఏడాది అక్టోబర్, 31వ తేదీ నుంచి నవంబర్, 6వ తేదీ వరకు దీనిని పాటిస్తున్నారు.  నిఘా అవగాహన వారోత్సవాలలో భాగంగా ఇదే ఇతివృత్తంపై సి.వి.సి. దేశవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఉత్తమ వ్యాసాలు రాసిన ఐదుగురు విద్యార్థులకు ప్రధానమంత్రి బహుమతులు ప్రదానం చేశారు.

 

*****