Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూఢిల్లీలో అఖిల భార‌త మ‌రాఠీ సాహిత్య స‌మ్మేళ‌నం ప్రారంభోత్స‌వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

న్యూఢిల్లీలో అఖిల భార‌త మ‌రాఠీ సాహిత్య స‌మ్మేళ‌నం ప్రారంభోత్స‌వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


   గౌరవనీయ సీనియర్ నాయకులు శ్రీ శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌, అఖిల భారత‌ మరాఠీ సాహిత్య సమ్మేళన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీమతి తారా భావల్కర్‌, మాజీ అధ్యక్షులు డాక్టర్ శ్రీ రవీంద్ర శోభనే, గౌరవనీయ సభ్యులు.. మరాఠీ భాషా పండితులు.. సభకు హాజరైన సోదరీసోద‌రులారా!
   డాక్టర్ తారా గారు ఓ క్షణం కిందట తన ప్రసంగం ముగించగానే నేను “భార్చాన్‌” అన్నాను. వెంటనే ఆమె గుజరాతీలో ప్రతిస్పందించారు… అయితే, నాకు గుజరాతీ కూడా తెలుసు మరి! దేశ ఆర్థిక రాజధానిగా పేరుప‌డిన‌ రాష్ట్రం నుంచి దేశ రాజధానికి వచ్చిన మరాఠీ సారస్వత‌ సమాజ సభ్యులందరికీ ఈ సంద‌ర్భంగా నా శుభాకాంక్షలు.
   ఈ రోజు మరాఠీ భాషకు సంబంధించిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ఢిల్లీ గడ్డపై నిర్వహించడం ముదావహం. అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం కేవలం ఒక భాష లేదా రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనది కాదు. మరాఠీ సాహిత్యంపై ఏర్పాటైన ఈ మహాసభ స్వాతంత్ర్య పోరాట సారాంశంతోపాటు మహారాష్ట్ర సహా దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. సంత్‌ జ్ఞానేశ్వర్, తుకారాం వంటి పండితులు పలికిన మరాఠీ భాషను నేడు రాజధాని ఢిల్లీలో హృదయపూర్వకంగా సత్కరించుకుంటున్నాం.
సోద‌రీసోద‌రులారా!
   అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం తొలిసారి 1878లో నిర్వహించినప్పటి నుంచి ఇప్పటిదాకా 147 సంవత్సరాల చరిత్రకు సాక్షిగా నిలిచింది. శ్రీ మహాదేవ్ గోవింద్ రనడే, శ్రీ హరి నారాయణ్ ఆప్టే, శ్రీ మాధవ్ శ్రీహరి అనే, శ్రీ శివరామ్ పరంజపే, శ్రీ వీర్ సావర్కర్ వంటి దేశంలోని ఎందరో మహామహులు ఇలాంటి మహాసభలకు అధ్యక్షత వహించారు. ఈ రోజున శ్రీ  శరద్ గారి ఆహ్వానంతో ఈ ప్రతిష్ఠాత్మక సంప్రదాయంలో భాగస్వామినయ్యే భాగ్యం నాకు దక్కింది. ఈ గొప్ప కార్యక్రమం నేపథ్యంలో మీ అందరితోపాటు దేశవిదేశాల్లోని మరాఠీ భాషా ప్రియులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఈ రోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కూడా కావడం మరో విశేషం. ఆ మేరకు ఢిల్లీలో ఈ సాహిత్య సమ్మేళనం నిర్వహణకు మీరు అద్భుతమైన రోజును ఎంచుకున్నారు!
మిత్రులారా!
   మరాఠీ భాషను తలచుకున్నపుడు ‘माझा मराठीची बोलू कौतुके। परि अमृतातेहि पैजासी जिंके। (మాఝా మరాఠీచీ బోలూ కైతుకే… పరి అమృతాతేహే పైజీసీ జింకే) అన్న సంత్‌ జ్ఞానేశ్వర్ మాటలు గుర్తుకు రావడం సహజం: అంటే- “మరాఠీ భాష-సంస్కృతులంటే నాకు ఎనలేని ప్రేమ.. ఎందుకంటే- మరాఠీ భాష అమృతం కన్నా మధురమని మీకందరికీ తెలుసు” అని అర్థం. మీ భాషా పండితుల్లాగా మరాఠీలో నాకు ప్రావీణ్యం లేకపోవచ్చు. కానీ, ఆ భాషలో మాట్లాడటానికి, కొత్త పదాలు నేర్చుకోవడానికి నేనెప్పుడూ ప్రయత్నిస్తుంటాను.
మిత్రులారా!
   మరాఠీ మహాసభ నిర్వహిస్తున్న ఈ సమయం ఓ చారిత్రక ఘట్టాన్ని గుర్తుకు తెస్తుంది. అదేమిటంటే- ఛత్రపతి శివాజీ మహరాజ్‌ పట్టాభిషేక 350వ వార్షికోత్సవం. అంతేకాదు.. గౌరవనీయ అహిల్యాబాయి హోల్కర్‌ 300వ జయంతి. అలాగే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కృషితో రూపొందిన మన రాజ్యాంగ 75వ వార్షికోత్సవం నిర్వహించి కూడా ఎన్నో రోజులు కాలేదు.
మిత్రులారా!
   మరాఠీ మాట్లాడే ఓ గొప్ప వ్యక్తి వందేళ్ల కిందట పవిత్ర మహారాష్ట్ర గడ్డపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)కు బీజావాపనం చేయడం మనకు గర్వకారణం. నేడు అదొక శక్తిమంతమైన వటవృక్షంగా ఎదిగి, శతాబ్ది వేడుక నిర్వహించుకుంటోంది. ఆ మేరకు వేదకాలం నుంచి స్వామి వివేకానంద వరకు గడచిన వందేళ్లుగా విలువల పవిత్ర యజ్ఞాన్ని ‘ఆర్‌ఎస్‌ఎస్‌’ నిరంతరం కొనసాగిస్తోంది. తద్వారా కొత్త తరాలకు భారతదేశ విశిష్టత, సంప్రదాయాలు, సంస్కృతిని పరిచయం చేస్తూ ముందుకెళ్తోంది. లక్షలాది యువత మాదిరిగా ‘ఆర్‌ఎస్‌ఎస్‌’ నుంచి ప్రేరణ పొందడం నా అదృష్టం. అందుకే, ఈ జీవితాన్ని దేశానికి అంకితం చేశాను. మరాఠీ భాష, సంప్రదాయాలతో నా సాన్నిహిత్యానికి సంఘ్ తోడ్పాటే కారణం. కొన్ని నెలల కిందట మరాఠీకి అధికారికంగా ‘అభిజత్ భాష’ (శాస్త్రీయ భాష) హోదా లభించింది. ప్రపంచవ్యాప్తంగా 12 కోట్లకుపైగా మరాఠీ మాట్లాడే ప్రజలంతా ఈ గుర్తింపు నిమిత్తం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. మరాఠీ మాట్లాడే లక్షలాది ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చే అవకాశం లభించడం నా అదృష్టం.
గౌరవనీయ పండితులారా!
   భాషంటే కేవలం భావప్రసార సాధనం కాదన్నది మీకందరికీ తెలిసిందే- మన భాషే మన సంస్కృతికి వాహకం. భాషల ఆవిర్భావానికి సమాజమే మూలమన్నది ఎంత నిజమో… ఆ సమాజాన్ని రూపుదిద్దడంలో భాషలు కీలక పాత్ర పోషిస్తాయన్నదీ అంతే వాస్తవం. ఆ విధంగా మహారాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎందరో వ్యక్తుల ఆలోచనలకు మన మరాఠీ భాష ఒక స్వరమిచ్చి, మన సాంస్కృతిక గుర్తింపునకు రూపమిచ్చింది. అందుకే సమర్థ రామదాస్‌- “मराठा तितुका मेळवावा महाराष्ट्र धर्म वाढवावा आहे तितके जतन करावे पुढे आणिक मेळवावे महाराष्ट्र राज्य करावे जिकडे तिकडे” అన్నారు. అంటే- మరాఠీ ఓ సంపూర్ణ భాష- ధైర్యం, సాహసం, సౌందర్యం, సదవగాహన, సమానత్వం, సామరస్యాలకు ప్రతీక. ఇది భక్తితో ముడిపడిన ఆధ్యాత్మిక సారాన్ని, ఆధునికత తరంగాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తుంది. మరాఠీ భాష భక్తి, శక్తి, యుక్తి త్రయానికి చిహ్నం. భారతదేశానికి ఆధ్యాత్మిక మార్గదర్శనం అవసరమైన ప్రతి సందర్భంలోనూ మన ప్రాచీన రుషిపుంగవులు ప్రవచించిన జ్ఞానాన్ని మహారాష్ట్రలోని మహనీయులు మరాఠీ భాషద్వారా అందించారు. జ్ఞానేశ్వర్, తుకారాం, రామదాస్, నామ్‌దేవ్, తుక్డోజీ మహారాజ్, గాడ్గే బాబా, గోరా కుంభార్, బహినాబాయి వంటి ఎందరో సాధుసంతులు భక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు. మరాఠీ భాషతో సమాజాన్ని కొత్త ఆదర్శాలతో ఉజ్వలం చేశారు. ఆధునిక కాలంలోనూ గజానన్ దిగంబర్ మద్గుల్కర్, సుధీర్ ఫడ్కేలు రచించిన ‘గీతా రామాయణం’ మనందరిపై ఎంత లోతైన ప్రభావం చూపిందో మనకు తెలిసిందే.
మిత్రులారా!
   శతాబ్దాల విదేశీ పాలనలో అణచివేతదారుల నుంచి విముక్తికి మరాఠీ భాష ఒక యుద్ధ నినాదంగా మారింది. ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్, బాజీరావు పేష్వా- వంటి ఎందరో పరాక్రమవంతులైన మరాఠా యోధులు శత్రువులను వణికించి, లొంగదీసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే, లోకమాన్య తిలక్, వీర సావర్కర్ వంటి విప్లవకారులు బ్రిటిష్ వారికి నిద్రలేకుండా చేశారు. ధైర్యసాహసాలతో కూడిన వారి ప్రతిఘటనలో మరాఠీ భాష-సాహిత్యం కీలక పాత్ర పోషించాయి. ‘కేసరి’, ‘మరాఠా’ వంటి వార్తాపత్రికలు, గోవిందగ్రజ్ శక్తిమంతమైన కవిత్వం, రామ్ గణేష్ గడ్కరీ నాటకాలు వంటివన్నీ  యావద్దేశంలో దేశభక్తిని రగిలించి స్వాతంత్ర్య ఉద్యమానికి ఆజ్యం పోశాయి. లోకమాన్య తిలక్ ‘గీతా రహస్యం’ గ్రంథాన్ని మరాఠీలో రచించినా, అది దేశమంతటా సరికొత్త శక్తిని నింపింది.

మిత్రులారా,

సమాజంలోని అణగారిన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం మరాఠీ భాష, సాహిత్యం అందించిన తోడ్పాటు మరవలేనిది. జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, మహర్షి కార్వే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి గొప్ప సామాజిక సంస్కర్తలు తమ కృషితో మరాఠీలో ఆధునిక యుగానికి నాంది పలికారు. మరాఠీ భాష దేశానికి గొప్ప దళిత సాహిత్యాన్ని అందించింది. ఆధునిక ఆలోచనా ధోరణి కారణంగా, మరాఠీ సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్‌ కూడా భాగమైంది. గతంలోనూ ఆయుర్వేదం, సైన్స్, తర్క శాస్త్రాలకు మహారాష్ట్ర ఎంతగానో చేయూతనిచ్చింది. ఈ మేధోపరమైన, శాస్త్రీయ పరిశోధనల సంస్కృతి మహారాష్ట్రను కొత్త ఆలోచనలు, అసాధారణ ప్రతిభకు కేంద్రంగా మార్చి, నిరంతర పురోగతికి ఊతమిస్తోంది. ఈ స్ఫూర్తితోనే మహారాష్ట్రకు గర్వకారణంగా ఉన్న ముంబాయి నేడు మొత్తం దేశానికి ఆర్థిక రాజధానిగా అవతరించింది.

సోదర సోదరీమణులారా,

మనం ముంబయి గురించి ప్రస్తావించిన ప్రతి సందర్భంలో, సినిమాల ప్రస్తావన లేకుండా సాహిత్యం గురించి మాట్లాడటం సాధ్యం కాదు! మరాఠీ, హిందీ సినిమాలు రెండింటినీ ముంబయి అలాగే మహారాష్ట్ర ఎంతగానో ఆదరిస్తూ ఉన్నత శిఖరాలకు చేర్చాయి. శివాజీ సావంత్ ప్రముఖ మరాఠీ నవల ద్వారా శంభాజీ మహారాజ్ పరాక్రమాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ రూపొందించిన ఇటీవలి చిత్రం ‘ఛావా’ విశేష జనాదరణ పొందుతోంది.

మిత్రులారా,

కవి కేశవసుత్‌ ఒక సందర్భంలో “जुने जाऊ द्या, मरणालागुनि जाळुनि किंवा, पुरुनी टाका सडत न एक्या ठायी ठाका (పాతని వదిలేయండి, అది పూర్తిగా అంతమయేదాకా దహించేయండి, లేదా దానంతటదే కుళ్లి క్రుశించే దాకా వదిలేయండి” అని గొప్పగా రాశారు. దీని అర్థం మనం పాత ఆలోచనలకే పరిమితమై ఉండకూడదు. మానవ నాగరికత, ఆలోచనలు, భాష నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. నిరంతరం అభివృద్ధి చెందుతూ, కొత్త ఆలోచనలను స్వీకరిస్తూ, మార్పులను స్వాగతిస్తూ భారత్ ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన దేశాల్లో ముందువరుసలో నిలిచింది. విస్తృత భాషా వైవిధ్యం ఈ పరిణామానికి నిదర్శనం. మన ఐక్యతకు భిన్నత్వమే ప్రాథమిక ఆధారం. ఈ వైవిధ్యానికి మరాఠీ భాష చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. వివక్షత లేకుండా తన పిల్లలకు సరికొత్త, విస్తారమైన జ్ఞానాన్ని పంచే తల్లి వంటిదే భాష. భాష ప్రతి ఆలోచనను, ప్రతి అభివృద్ధిని స్వీకరిస్తుంది. మరాఠీ భాష సంస్కృతం నుంచి ఉద్భవించినా, ప్రాకృత భాషా ప్రభావం ఈ భాషపై గణనీయంగా ఉంది. తరతరాలుగా ఈ భాష అభివృద్ధి చెందుతూ మానవ ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తోంది. సంస్కృతంలోని ‘గీతా రహస్యాన్ని’ చక్కని మరాఠీ వ్యాఖ్యానంతో లోకమాన్య తిలక్ అందరికీ అర్థమయ్యేలా అందించారు. సంస్కృతంలోని జ్ఞానేశ్వరి గీతకు అందించిన అర్థవంతమైన మరాఠీ వ్యాఖ్యానం కారణంగా అది పండితులు, సాధువులకు ఒక ప్రామాణిక గ్రంథంగా మారింది. మరాఠీ ఇతర భారతీయ భాషల ద్వారా సుసంపన్నమైంది. ‘ఆనంద్‌మఠ్’ వంటి రచనను భార్గవ్‌రామ్ విఠల్ వారేకర్ మరాఠీలోకి అనువదించారు, అలాగే పన్నా ధాయ్, దుర్గావతి, రాణి పద్మిని జీవితాల ఆధారంగా విందా కరాండికర్ రాసిన రచనలు అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి. “భారతీయ భాషలకు ఎప్పుడూ పరస్పర శత్రుత్వం లేదు; అవి ఎల్లప్పుడూ పరస్పర చేయూతతో సుసంపన్నం అయ్యాయి”.

మిత్రులారా,

భాష పేరుతో జరుగుతున్న విభజనను ప్రయత్నాలకు మన భాషల ఉమ్మడి వారసత్వం ధీటుగా సమాధానం ఇచ్చింది. అలాంటి భాషా దురభిమానానికి దూరంగా ఉంటూ మన భాషలను సుసంపన్నం చేసుకుని, స్వీకరించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. నేడు దేశంలోని అన్ని భాషలకు సమాన గౌరవం లభిస్తోంది. మరాఠీ సహా అన్ని ప్రధాన భాషల్లో విద్యాబోధనను మేం ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం మహారాష్ట్రలో యువతకు మరాఠీలోనే ఉన్నత విద్య, ఇంజనీరింగ్, వైద్య విద్యలను అభ్యసించే అవకాశం లభించింది. ఆంగ్లభాషలో ప్రావీణ్యం లేని కారణంగా ప్రతిభను విస్మరించే ధోరణిని నేడు పూర్తిగా మార్చేశాం.

మిత్రురారా,

సాహిత్యం సమాజానికి దర్పణం లాంటిది, మార్గదర్శి లాంటిది. అందుకే జాతి నిర్మాణంలో సాహిత్య సమ్మేళన్, సంబంధిత సంస్థల పాత్ర కీలకమైంది. గోవింద్ రనడే, హరినారాయణ్ ఆప్టే, ఆచార్య ఆత్రే, వీర్ సావర్కర్ వంటి గొప్ప వ్యక్తులు అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారు, అఖిల భారత మరాఠీ సాహిత్య మహామండలి ఆ గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాను. 2027లో మరాఠీ సాహిత్య సమ్మేళన్ 150 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది, అలాగే అది 100వ సమావేశం కానుంది. ఈ ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి మీరంతా ఇప్పుడే సన్నాహాలు ప్రారంభించాలి. సోషల్ మీడియా ద్వారా మరాఠీ సాహిత్యానికి ఎంతోమంది యువత చేయూతనినందిస్తున్నారు. వారి కోసం ఒక వేదికను ఏర్పాటు చేయాలి, వారి ప్రతిభకు గుర్తింపునివ్వాలి అలాగే మరింత మంది మరాఠీ నేర్చుకునేలా ప్రోత్సహించాలి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ‘భాషిణి’ వంటి కార్యక్రమాలను ఉపయోగించుకుంటూ మరాఠీకి మరింత ప్రాచుర్యం కల్పించవచ్చు. యువతలో మరాఠీ భాష పట్ల ఆసక్తిని పెంపొందించేలా మరాఠీ సాహిత్యానికి సంబంధించిన పోటీలు నిర్వహించాలి.

ఈ ప్రయత్నాలతో పాటు మరాఠీ సాహిత్య స్ఫూర్తిదాయక వారసత్వం 140 కోట్ల మంది పౌరులను వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) సాధన కోసం శక్తిమంతం చేస్తూ వారికి ఈ లక్ష్యం గురించి అవగాహన, ప్రేరణ కలిగిస్తాయని నేను నమ్ముతున్నాను. మహాదేవ్ గోవింద్ రనడే, హరినారాయణ్ ఆప్టే, మాధవ్ శ్రీహరి ఆనే, శివరామ్ పరంజపే వంటి విశిష్ట వ్యక్తులు నెలకొల్పిన ఈ గొప్ప సంప్రదాయాన్ని ముందుకు కొనసాగించాలని మీ అందరినీ కోరుతున్నాను, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!!!

గమనిక: ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలకు దాదాపు అనువాదం మాత్రమే. వాస్తవానికి ఆయన హిందీలో మాట్లాడారు.