Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీకారం

న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీకారం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాన్ని ప్రారంభించారు. ప్రపంచ వారసత్వ సంబంధిత అంశాలన్నిటి నిర్వహణ, ఆ జాబితాలో చేర్చాల్సిన ప్రదేశాలపై తుది నిర్ణయం వంటివి ఈ కమిటీ బాధ్యతలు. ఈ దిశగా ప్రతి సంవత్సరం నిర్వహించే కమిటీ సమావేశానికి భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మండపంలో ఏర్పాటు చేసిన వివిధ అంశాల ప్రదర్శనను ప్రధానమంత్రి తిలకించారు.

   ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ- ముందుగా గురు పూర్ణిమ శుభదినాన దేశ ప్రజలంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ పర్వదినం నాడు ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం ప్రారంభం కావడం… దీనికి తొలిసారి భారత్ అతిథ్యమివ్వడం హర్షణీయమన్నారు. సమావేశానికి హాజరైన ప్రపంచ ప్రముఖులు, అతిథులను… ముఖ్యంగా ‘యునెస్కో’ డైరెక్టర్ జనరల్ శ్రీమతి ఔడ్రే అజూలేని ప్రధానమంత్రి సాదరంగా స్వాగతించారు. భారతదేశంలో నిర్వహించిన అనేక అంతర్జాతీయ సభలు, సమావేశాల తరహాలో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం కూడా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించగలదని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు.

   భారత కళాఖండాలు విదేశాల నుంచి తిరిగి స్వదేశం చేరడాన్ని ప్రస్తావిస్తూ- ఇటీవలి కాలంలో 350కిపైగా ప్రాచీన వారసత్వ వస్తుసామగ్రిని వెనక్కు తెచ్చినట్లు ప్రధాని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ‘‘ప్రాచీన వారసత్వ కళాఖండాలను వెనక్కు ఇవ్వడం చరిత్రపై ప్రపంచానికిగల గౌరవం, ఔదార్యానికి నిదర్శనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సాంకేతిక పరిజ్ఞాన ప్రగతి వల్ల ఈ రంగంలో పరిశోధన-పర్యాటక అవకాశాలు పెరుగుతుండటాన్ని నొక్కిచెప్పారు.

   ప్రపంచ వారసత్వ కమిటీకి ప్రశంసలు తెలుపుతూ… ఈ సమావేశ నిర్వహణ భార‌త్‌కు ఎంతో  గర్వకారణమని ప్రధాని అభివర్ణించారు. యునెస్కో ‘ప్రపంచ ప్రసిద్ధ వారసత్వ ప్రదేశాల’ జాబితాలో ఈశాన్య భారతంలోని చారిత్రక ‘మైడామ్’కు చోటుకల్పిస్తూ ప్రతిపాదించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘యునెస్కో జాబితాలో ఇది భారత 43వ ప్రపంచ వారసత్వ ప్రదేశం. అలాగే ప్రపంచ సాంస్కృతిక వారసత్వ హోదా పొందిన ఈశాన్య భారత తొలి వారసత్వం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.  ఈ జాబితాలో చేరిన ‘మైడామ్’ తనదైన విశిష్ట సాంస్కృతిక ప్రాముఖ్యం ద్వారా మరింత అంతర్జాతీయ ప్రాచుర్యం పొంది, ప్రపంచాన్ని ఎంతగానో ఆకర్షించగలదని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు.

   ఈ సమావేశానికి ప్ర‌పంచవ్యాప్త నిపుణులు పెద్ద సంఖ్యలో తరలిరావడమే దీనికిగల విస్తృతి, ఆమోదయోగ్యతలకు నిదర్శనమని ప్ర‌ధానమంత్రి అన్నారు. ప్రపంచ సజీవ ప్రాచీన నాగరికతలలో ఒకటైన ఈ నేలపై దీనికి ఆతిథ్యమివ్వడం ఎంతో ప్రత్యేకమని ఆయన చెప్పారు. ప్రపంచంలో వైవిధ్య భరిత వారసత్వ ప్రదేశాలున్నాయని పేర్కొంటూ భారత ప్రాచీన శకాల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు ‘‘భారత్ అత్యంత ప్రాచీన దేశం కాబట్టే నేటి ప్రతి క్షణం గతకాలపు ఉజ్వల చారిత్రక గాథలెన్నిటినో ప్రతిబింబిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. భారత రాజధాని న్యూఢిల్లీని ఉటంకిస్తూ- వేల ఏళ్ల వారసత్వ కేంద్రమైన ఈ నగరంలో అడుగడుగునా వారసత్వం-చరిత్ర సాక్షాత్కరిస్తాయని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా 2000 సంవత్సరాల నాటి తుప్పు నిరోధక ‘ఉక్కు స్తంభం’ ప్రాశస్యాన్ని ఉదాహరించారు. గతకాలపు భారత లోహశాస్త్ర నైపుణ్యానికి ఇది అద్దం పడుతుందని పేర్కొంటూ- ‘‘భారత వారసత్వం కేవలం చరిత్రకు పరిమితం కాదు… అదొక విజ్ఞాన శాస్త్రం’’ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే 8వ శతాబ్దం నాటి 3,500 మీటర్ల ఎత్తునగల కేదార్‌నాథ్ ఆలయం గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. అగ్రశ్రేణి ఇంజనీరింగ్ ప్రమాణాల దిశగా భారత వారసత్వ పయనానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన వివరించారు. ప్రతి శీతాకాలంలో ఎడతెగని హిమపాతం వల్ల ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన నేటికీ సవాలుగా ఉన్నదని గుర్తుచేశారు. దక్షిణ భారతంలోని చోళ సామ్రాజ్య చక్రవర్తి రాజరాజ చోళుడు తమిళనాడులో నిర్మించిన బృహదీశ్వరాలయం, దాని అద్భుత నిర్మాణ శైలి, అందులోని మూల విరాట్ ప్రాశస్త్యాన్ని కూడా వివరించారు.

   గుజరాత్‌లోని ధోలవీర, లోథాల్‌ గురించి కూడా ప్రధాని విశదీకరించారు. క్రీ.పూ. 3000 నుంచి 1500 మధ్య పురాతన నగరం ధోలవీర పట్టణ ప్రణాళిక-జల నిర్వహణ వ్యవస్థలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు. అలాగే లోథాల్ కోట విశిష్టత సహా దాని ప్రాథమిక ప్రణాళిక, వీధులు, విస్తృత మురుగు పారుదల సదుపాయం తదితరాలు అధ్భుత ప్రాచీన ప్రణాళికలకు నిదర్శనమని పేర్కొన్నారు.

   అదేవిధంగా ‘‘భారత చరిత్ర, చరిత్రపై దేశానికిగల అవగాహన సాధారణం కన్నా ఎంతో ప్రాచీనమేగాక విస్తృతమైనవి. కాబట్టి, సాంకేతిక ప్రగతి, నవ్యావిష్కరణల సాయంతో నవ్య దృక్కోణాల నుంచి గతాన్ని సరికొత్తగా ఆవిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని సినౌలీలో పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన చారిత్రక విశేషాలను ఆయన ఉటంకించారు. సింధులోయ నాగరికతతో పోలిస్తే ఇక్కడ వేదకాలపు నాగరికతకు మరింత సమీప తామ్ర (రాగి) యుగ అవశేషాలు ఇక్కడ వెలుగు చూశాయని వెల్లడించారు. ఈ మేరకు 4000 ఏళ్లనాటి అశ్వరథం అవశేషాలు లభ్యమైందని తెలిపారు. భారతదేశం గురించి లోతుగా తెలుసుకోవాలంటే దురభిమానం వీడి, కొత్త భావనలతో ముందడుగు వేయాల్సిన అవసరాన్ని ఇది స్పష్టం చేస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తదనుగుణంగా ఈ కొత్త స్రవంతిలో భాగం కావాల్సిందిగా సదస్యులకు ఆహ్వానం పలికారు.

   వారసత్వ ప్రాముఖ్యాన్ని నొక్కిచెబుతూ- ‘‘వారసత్వమంటే చరిత్ర మాత్రమే కాదు.. అది మానవాళి సామూహిక చైతన్యం. చారిత్రక ప్రదేశాలను దర్శించినపుడల్లా నేటి భౌగోళిక-రాజకీయాంశాలకు అతీతంగా అవి మన మేధను తట్టిలేపుతాయి’’ అని ప్రధానమంత్రి నిర్వచించారు. ఈ ప్రదేశాలను జన హృదయ స్పందనకు జోడిస్తూ వారసత్వ సామర్థ్యాన్ని ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘వారసత్వానికి పరస్పర ప్రోత్సాహంతోపాటు మానవ సంక్షేమ స్ఫూర్తి విస్తరణ దిశగా ఏకం కావడంపై ఈ 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం ద్వారా ప్రపంచానికి భారత్ మేల్కొలుపు పలుకుతోంది. అలాగే పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ మరిన్ని ఉద్యోగావకాశాల సృష్టికి కృషి చేద్దామని పిలుపునిస్తోంది’’ అని శ్రీ మోదీ ప్రకటించారు.

   ప్రగతి పథంపై మాత్రమే దృష్టి సారించి, వారసత్వాన్ని విస్మరించిన కాలాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయితే, భారతదేశం నేడు ‘‘వికాస్ భీ… విరాసత్ భీ’’… దృక్కోణంతో ప్రగతి-వారసత్వం జమిలిగా సాగే విధానాలను అమలు చేస్తున్నదని ఆయన వివరించారు. ఈ మేరకు గడచిన పదేళ్లలో వారసత్వ ప్రతిష్టను సగర్వంగా చాటుకునేలా కాశీ విశ్వనాథ కారిడార్, శ్రీరామ మందిరం,  పురాతన నలంద విశ్వవిద్యాలయ ప్రాంగణం ఆధునికీకరణ వంటి వినూత్న చర్యలు చేపట్టడాన్ని ప్రధాని ఉదాహరించారు. ‘‘వారసత్వ ప్రతిష్ట పునరుద్ధరణపై భారతదేశ సంకల్పం యావత్ మానవాళికీ సేవ అనే ఉదాత్త భావనతో ముడిపడినది. అంటే- భారతీయ సంస్కృతి ‘మనం’ అంటుంది… ‘నేను’ అనే సంకుచిత భావనకు ఇందులో తావులేదు’’ అన్నారు.

   ప్రపంచ సంక్షేమంలో భాగస్వామ్యానికి భారత్ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ మేరకు భారత వైజ్ఞానిక వారసత్వమైన యోగా, ఆయుర్వేద విజ్ఞానాలను నేడు ప్రపంచం మొత్తం అనుసరించడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘‘ఒకే ప్రపంచం.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’’ ఇతివృత్తంతో జి-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమివ్వడాన్ని గుర్తుచేశారు. ‘‘వసుధైవ కుటుంబకం’ అనే భారతీయ దార్శనికతకు అనుగుణంగా చిరుధాన్యాల సాగు-వినియోగాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సౌరశక్తి కూటమి, ‘మిషన్ లైఫ్’ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం వగైరాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.

   ప్రపంచ వారసత్వ సంపద పరిరక్షణను భారత్ ఒక బాధ్యతగా పరిగణిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. తదనుగుణంగా భారతీయ వారసత్వంసహా దక్షిణార్థ గోళ దేశాల్లో వారసత్వ సంపద పరిరక్షణకూ సహకరిస్తున్నామని గుర్తుచేశారు. ఈ మేరకు అంగ్‌కోర్ వాట్ (కంబోడియా), చామ్ టెంపుల్స్ (వియత్నాం), బగన్‌ స్తూపాలు (మయన్మార్) వంటి వారసత్వ ప్రదేశాల జాబితాను ఉటంకించారు. ఈ సందర్భంగా యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రానికి భారత్ తరఫున 1 మిలియన్ డాలర్ల  విరాళం అందజేస్తామని ప్రకటించారు. ఈ నిధులు ముఖ్యంగా దక్షిణార్థ గోళ దేశాల్లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల పరిరక్షణ, సామర్థ్య వికాసం, సాంకేతిక సహాయం దిశగా సద్వినియోగం కాగలవని చెప్పారు. భారత యువ నిపుణుల కోసం ‘ప్రపంచ వారసత్వ సంపద నిర్వహణపై సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌’  కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత సాంస్కృతిక-సృజనాత్మక పరిశ్రమ అంతర్జాతీయ వృద్ధికి కీలకాంశం కాగలదని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

   చివరగా, భారత్ గురించి మరింత అవగాహన కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని ఈ సమావేశంలో పాల్గొంటున్న విదేశీ అతిథులు, ప్రముఖులందరికీ ప్రధానమంత్రి సూచించారు. అలాగే విశిష్ట పర్యాటక ప్రదేశాల పర్యటనకు కల్పించిన సౌలభ్యాలను కూడా వివరించారు. చిరస్మరణీయ అనుభవాలను పదిలపరచుకునేలా ఈ పర్యటనను సద్వినియోగం చేసుకోగలరని ఆకాంక్షిస్తున్నానంటూ ఆయన తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్, కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, యునెస్కో డైరెక్టర్ జనరల్ శ్రీమతి ఔడ్రీ అజూలే, ప్రపంచ వారసత్వ కమిటీ చైర్‌పర్సన్ శ్రీ విశాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   న్యూఢిల్లీలోని భారత మండపంలో 2024 జూలై 21 నుంచి 31 వరకు నిర్వహించే ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశానికి భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తోంది. ఏటా నిర్వహించే ఈ సమావేశాల్లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నిర్వహణ, జాబితాలో చేర్చాల్సిన ప్రదేశాలపై తుది నిర్ణయం ఈ కమిటీ బాధ్యతలు. ఈ మేరకు ప్రస్తుత జాబితాలోని 124 ప్రపంచ వారసత్వ ప్రదేశాల పరిరక్షణ నివేదికలను కమిటీ పరిశీలిస్తుంది. ఈ జాబితాలో చేర్చే కొత్త ప్రదేశాలపై ప్రతిపాదనలు స్వీకరిస్తుంది. అంతర్జాతీయ సహాయం, ప్రపంచ వారసత్వ నిధుల వినియోగం వగైరాలపై చర్చిస్తుంది. మొత్తం 150కిపైగా దేశాల నుంచి 2000 మందికిపైగా జాతీయ-అంతర్జాతీయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.

   ఈ సమావేశంతోపాటు ‘‘వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరమ్’’, ‘‘వరల్డ్ హెరిటేజ్ సైట్ మేనేజర్స్ ఫోరమ్’’ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.

   మరోవైపు భారత మండపంలో భారతీయ సంస్కృతిని ప్రస్ఫుటం చేసే పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ‘రిటర్న్ ఆఫ్ ట్రెజర్స్’ పేరిట ఇప్పటిదాకా స్వదేశానికి తిరిగివచ్చిన 350కిపైగా కళాఖండాలలో కొన్నిటితో నిర్వహిస్తున్న ప్రదర్శన విశేష ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే దేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లోని మూడు విశేషాలు- ‘‘రాణి కీ వావ్, పటాన్ (గుజరాత్);  కైలాస దేవాలయం, ఎల్లోరా గుహలు (మహారాష్ట్ర); హోయసల ఆలయం, హళేబీడు (కర్ణాటక) ప్రాంతాలపై ప్రత్యక్ష సందర్శానానుభవం కల్పించేలా దృశ్య-శ్రవణ సాంకేతికతతో కనువిందు చేసే ప్రదర్శనలు నిర్వహిస్తారు. అలాగే ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ పేరిట సమాచార సాంకేతికత-మౌలిక సదుపాయాల రంగంలో ఆధునిక పరిణామాలు సహా సుసంపన్న భారత సాంస్కృతిక వారసత్వం, ప్రాచీన నాగరికత, భౌగోళిక వైవిధ్యం, పర్యాటక ప్రదేశాలను ప్రముఖంగా వివరించే ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు.