కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు నితిన్ గడ్కరీ గారు, జితన్ రామ్ మాంఝీ గారు, మనోహర్ లాల్ గారు, హెచ్.డి. కుమారస్వామి గారు, పీయూష్ గోయల్ గారు, హర్దీప్ సింగ్ పూరీ గారు, దేశవిదేశాలకు చెందిన వాహన పరిశ్రమ ప్రముఖులు, ఇతర అతిథులు, సోదర సోదరీమణులారా!
నేను గత లోక్‌సభ ఎన్నికలు సమీపంలో ఉన్న సమయంలో మిమ్మల్ని కలుసుకున్నాను. ఆ సమయంలో మీ అందరి నమ్మకం వల్ల వచ్చేసారి కూడా ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోకు నేను తప్పకుండా వస్తానని చెప్పాను. దేశం మమ్మల్ని మూడోసారి ఆశీర్వదించింది. మీరంతా మరోసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఈ ఏడాది ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో పరిధి మరింత విస్తరించడం నాకు సంతోషాన్ని కలిగించింది. గత ఏడాది, 800 మందికి పైగా ఎగ్జిబిటర్లు, అలాగే 1.5 లక్షలకు పైగా ప్రజలు ఇక్కడకు వచ్చారు. ఈసారి భారత్ మండపంతో పాటు, ఈ ఎక్స్‌పో ద్వారకలోని యశోభూమి, అలాగే గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో కూడా జగురుతోంది. రానున్న 5-6 రోజుల్లో అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడకు రానున్నారు. ఇక్కడ అనేక కొత్త వాహనాలను సైతం ఆవిష్కరించనున్నారు. ఇది భారత్‌లో మొబిలిటీ రంగ భవిష్యత్తు ఎంత ఆశాజనంగా ఉందో చూపుతోంది. ఇక్కడ కొన్ని ప్రదర్శనలను సందర్శించే అవకాశం నాకు కూడా కలిగింది. భారత ఆటోమోటివ్ రంగం అద్భుతంగా ఉంది. అలాగే భవిష్యత్తు కోసం సంసిద్ధంగా ఉంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు.
మిత్రులారా,
భారత వాహన రంగానికి సంబంధించిన ఇంత పెద్ద కార్యక్రమంలో నేను ఈ రోజు రతన్ టాటా జీ, ఒసాము సుజుకీ జీని కూడా గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులు భారతదేశ వాహన రంగ వృద్ధికి, మధ్యతరగతి కలలను నెరవేర్చడానికి ఎంతగానో కృషి చేశారు. రతన్ టాటా గారు, ఒసాము సుజుకీ గారి వారసత్వం దేశంలోని మొత్తం మొబిలిటీ రంగానికి స్ఫూర్తినిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా,
నేటి భారతదేశం ఆకాంక్షలతో, యువశక్తితో నిండి ఉంది. మన వాహన రంగంలో ఈ ఆకాంక్షలను మనం చూస్తూనే ఉన్నాం. గతేడాది, మన వాహన రంగం సుమారు 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ అనే మంత్రాన్ని అనుసరిస్తూ ఇప్పుడు ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. మన దేశంలో ప్రతియేటా అమ్ముడయ్యే వాహనాల సంఖ్య ప్రపంచంలోని అనేక దేశాల జనాభా కంటే ఎక్కువగా ఉంది. ఒకే సంవత్సరంలో దాదాపు 2.5 కోట్ల వాహనాలు అమ్ముడవడం మన దేశంలో నిరంతరం డిమాండు ఎలా పెరుగుతున్నదీ చూపిస్తోంది. మొబిలిటీ రంగ భవిష్యత్తు ఆశాజనంగా ఉంటుందనే దానికి ఇదే నిదర్శనం.
మిత్రులారా,
నేడు, భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇక ప్యాసింజర్ వాహనాల మార్కెట్ పరంగా చూస్తే మనం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నాం. ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న మన వాహన మార్కెట్ ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించగలరా? అభివృద్ధి చెందిన భారత్ ప్రయాణం అనేది మొబిలిటీ రంగ అపూర్వ పరివర్తన, అనేక రెట్ల విస్తరణల ప్రయాణం కూడా అవుతుంది. దేశంలో మొబిలిటీ భవిష్యత్తును ముందుకు నడిపించే అంశాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు, మన దేశంలోని అధికంగా యువ జనాభా ఉండడం, మధ్యతరగతి పరిధి రోజురోజుకీ పెరుగుతుండడం, పట్టణీకరణ వేగవంతమవడం, దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల వృద్ధి, మేక్ ఇన్ ఇండియా ద్వారా సరసమైన వాహనాలు వంటి ఈ కారకాలన్నీ మన వాహన రంగ వృద్ధికి దోహదం చేస్తూ, కొత్త బలాన్ని ఇస్తున్నాయి.
మిత్రులారా,
వాహన రంగ అభివృద్ధికి అవసరాలు, ఆకాంక్షలు చాలా ముఖ్యమైనవి. అదృష్టవశాత్తూ, ఈ రెండూ నేడు భారతదేశంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రాబోయే కొన్ని దశాబ్దాలపాటు మన దేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా గల దేశంగా కొనసాగబోతోంది. మీ వినియోగదారుల్లో సింహభాగం ఈ యువతే ఉండనున్నది. ఇంత పెద్ద యువ సమూహం ఎంత పెద్ద డిమాండ్ సృష్టిస్తుందో మీరు బాగా అంచనా వేయవచ్చు. అలాగే మీ వినియోగదారుల్లో మరో అత్యధిక భాగం మధ్యతరగతి వర్గానిదే. గడిచిన పదేళ్లలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ నవీన మధ్యతరగతి వర్గం వారి మొదటి వాహనాన్ని కొనుగోలు చేస్తోంది. జీవితంలో పురోగతి పొందినప్పుడు, వారు తమ వాహనాలను కూడా అప్‌గ్రేడ్ చేస్తారు. దీనివల్ల వాహన రంగం లాభపడటం ఖాయం.
మిత్రులారా,
మంచి, విశాలమైన రహదారులు లేకపోవడం ఒకప్పుడు మన దేశంలో వాహనాలు కొనకపోవడానికి కారణంగా ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా మారుతోంది. ప్రయాణ సౌలభ్యం నేడు దేశానికి అతిపెద్ద ప్రాధాన్యంగా ఉంది. గతేడాది బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు 11 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించాం. నేడు, దేశంలో బహుళ–వరుస జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ మార్గాల వ్యవస్థ ఏర్పాటవుతోంది. పీఎమ్ గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా మల్టీమోడల్ కనెక్టివిటీ ఊపందుకుంది. ఇది లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తుంది. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ కారణంగా, ప్రపంచంలోనే అత్యంత సరసమైన లాజిస్టిక్స్ ఖర్చులు కలిగిన దేశంగా మన దేశం అవతరిస్తుంది. ఈ ప్రయత్నాలన్నింటి కారణంగా, వాహన రంగంలో అనేక కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. దేశంలో వాహనాలకు డిమాండ్ పెరగడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం.
మిత్రులారా,
నేడు, మంచి మౌలిక సదుపాయాలతో పాటు, ఆధునిక సాంకేతికతను సైతం ఏకీకృతం చేస్తున్నారు. ఫాస్టాగ్ దేశంలో డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ దేశంలో ప్రయాణం సాఫీగా సాగేలా చేసే ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తోంది. ఇప్పుడు మనం స్మార్ట్ మొబిలిటీ దిశగా ముందుకు సాగుతున్నాం. అనుసంధానిత వాహనాలు, స్వయంప్రతిపత్త డ్రైవింగ్ దిశగా భారత్ వేగంగా ప్రయత్నాలను కొనసాగిస్తోంది.
మిత్రులారా,
దేశంలో వాహన పరిశ్రమ వృద్ధి అవకాశాల్లో మేక్ ఇన్ ఇండియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మేక్ ఇన్ ఇండియా ప్రచారానికి పీఎల్ఐ పథకాల ద్వారా కొత్త ఊపు వచ్చింది. రూ. 2.25 లక్షల కోట్లకు పైగా అమ్మకాల్లో పీఎల్ఐ పథకం సహాయపడింది. ఈ పథకం ద్వారానే ఈ రంగంలో 1.5 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన సాధ్యమైంది. మీకు తెలిసినట్లుగా, మీరు మీ రంగంలో ఉద్యోగాలను కల్పించడమే కాకుండా, ఇతర రంగాల్లో కూడా ఎన్నో రెట్ల ప్రభావం కలిగి ఉంటారు. మన ఎమ్ఎస్ఎమ్ఇ రంగం పెద్ద సంఖ్యలో వాహన విడిభాగాలను తయారు చేస్తోంది. వాహన రంగం వృద్ధి చెందుతున్నప్పుడు, ఎమ్ఎస్ఎమ్ఇల లాజిస్టిక్స్, పర్యాటకం, రవాణా రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు పెరుగుతున్నాయి.
మిత్రులారా,
భారత ప్రభుత్వం ప్రతి స్థాయిలో వాహన రంగానికి మద్దతునిస్తోంది. గత దశాబ్దంలో, ఈ పరిశ్రమలో ఎఫ్‌డిఐ, సాంకేతికత బదిలీ అలాగే ప్రపంచ భాగస్వామ్యం కోసం కొత్త మార్గాలను కనుగొనడం సాధ్యపడింది. గత 4 ఏళ్ల కాలంలో, ఈ రంగంలో 36 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. రాబోయే సంవత్సరాల్లో, ఇది అనేక రెట్లు పెరగబోతోంది. దేశంలో వాహనాల తయారీకి సంబంధించి సంపూర్ణ వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నాం.
మిత్రులారా,
నాకు గుర్తుంది… మొబిలిటీకి సంబంధించిన కార్యక్రమంలో నేను మన మొబిలిటీ పరిష్కారాలు సాధారణమైనవి, అనుసంధానించినవి, సౌకర్యవంతమైనవి, రద్దీ లేనివి, ఛార్జ్ చేసినవి, శుభ్రమైనవి అలాగే అత్యాధునికమైనవిగా ఉండాలనే ఏడు ‘సి’ల (common, connected, convenient, congestion-free, charged, clean, and cutting-edge) దార్శనికతను గురించి చెప్పాను. గ్రీన్ మొబిలిటీపై మేం దృష్టిసారించడం ఈ దార్శనికతలో ఒక భాగం. ఈ రోజు మన ఆర్థిక వ్యవస్థకు, జీవావరణ శాస్త్రానికి రెండింటికీ మద్దతునిచ్చే మొబిలిటీ వ్యవస్థ అభివృద్ధికి కృషి జరుగుతోంది. ఈ వ్యవస్థ మన శిలాజ ఇంధనాల దిగుమతి వ్యయాన్ని తగ్గిస్తుంది. అందువల్ల, ఈ రోజు మనం గ్రీన్ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల వంటి సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాం. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి ప్రచారాలు ఈ లక్ష్యంతోనే ప్రారంభించాం.
మిత్రులారా,
గడిచిన కొన్నేళ్లలో, దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీలో వేగవంతమైన వృద్ధి సాధ్యమైంది. గడిచిన దశాబ్ద కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 640 రెట్లు పెరిగాయి. పదేళ్ల క్రితం ఏడాదికి దాదాపు 2600 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే విక్రయించగా, 2024లో 16 లక్షల 80 వేలకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. అంటే, పదేళ్ల క్రితం ఏడాది మొత్తంలో విక్రయించిన వాటి కంటే రెట్టింపు ఎలక్ట్రిక్ వాహనాలు నేడు ఒక్క రోజులోనే అమ్ముడుపోతున్నాయి. ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 8 రెట్లు పెరగవచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఈ విభాగంలో మీ కోసం పెరుగుతున్న అవకాశాలకు ఇదే నిదర్శనం.
మిత్రులారా,
ఈ పరిశ్రమకు మద్దతుగా దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని విస్తరించేందుకు ప్రభుత్వం నిరంతరం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో FAME-2 పథకం 5 ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. దీని కింద 8 వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాలు అందించాం. ఈ మొత్తం నుండి, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి రాయితీలు అందించడంతో పాటు ఛార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశాం. ఇది 16 లక్షల కంటే ఎక్కువ ఈవీలకు మద్దతునివ్వగా, వీటిలో 5 వేలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీలో కూడా, భారత ప్రభుత్వం అందించిన 1200 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మా మూడవ హాయాంలో, పీఎమ్ ఈ–డ్రైవ్ పథకాన్ని తీసుకువచ్చాం. దీని కింద ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, ఈ–అంబులెన్స్‌లు, ఈ–ట్రక్కులు వంటి సుమారు 28 లక్షల ఈవీలను కొనుగోలు చేసేందుకు సహాయం అందిస్తున్నాం. దాదాపు 14 వేల ఎలక్ట్రిక్ బస్సులను కూడా కొనుగోలు చేయనున్నాం. దేశవ్యాప్తంగా వివిధ వాహనాలకు 70 వేలకు పైగా ఫాస్ట్ ఛార్జర్లను అమర్చనున్నాం. మూడో హాయాంలోనే పీఎం ఈ–బస్ సర్వీస్‌ను కూడా ప్రారంభించాం. దీని కింద దేశంలోని చిన్న నగరాల్లో సుమారు ముప్పై ఎనిమిది వేల ఈ–బస్సులను నడపడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఈవీ తయారీ కోసం ప్రభుత్వం ఈ పరిశ్రమకు నిరంతరం మద్దతునిస్తోంది. ఈవీ కార్ల తయారీ కోసం భారతదేశానికి రావాలనుకునే ప్రపంచ పెట్టుబడిదారుల కోసం మార్గాలు సుగమం చేశాం. ఇది దేశంలో నాణ్యమైన ఈవీ తయారీ వ్యవస్థను విస్తరించడంలో, వాల్యూ చెయిన్ నిర్మాణంలో సహాయపడుతుంది.
మిత్రులారా,
గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవటానికి, సౌరశక్తి, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం మనం కొనసాగించాల్సి ఉంది. భారత్ జి-20కి అధ్యక్షత వహించిన సమయంలో హరిత భవిష్యత్తు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. నేడు, ఈవీతో పాటు, దేశంలో సౌర విద్యుత్తుకు సంబంధించి చాలా పెద్ద స్థాయిలో కృషి జరుగుతోంది. పీఎమ్ సూర్యఘర్– ఉచిత విద్యుత్ పథకంతో రూఫ్‌టాప్ సోలార్ మిషన్ భారీ స్థాయిలో కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితిలో, ఈ రంగంలో కూడా బ్యాటరీలు, ఇంధన నిల్వ వ్యవస్థలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అధునాతన రసాయనిక ఘటాల బ్యాటరీ నిల్వను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.18 వేల కోట్లతో పీఎల్‌ఐ పథకాన్ని ప్రారంభించింది. అంటే మీరు ఈ రంగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం. ఇంధన నిల్వ రంగంలో అంకురసంస్థలను ప్రారంభించడానికి దేశంలోని అనేక మంది యువతను కూడా ఆహ్వానించాలనుకుంటున్నాను. మన దేశంలోనే లభించే సామాగ్రితో బ్యాటరీలు, నిల్వ వ్యవస్థలను తయారు చేయగల ఆవిష్కరణలపై మనం కృషి చేయాలి. దీనికి సంబంధించి దేశంలో ఇప్పటికే ఎంతగానో కృషి జరుగుతోంది, అయితే దీనిని మిషన్ మోడ్‌లో ముందుకు తీసుకెళ్లడం చాలా ముఖ్యం.
మిత్రులారా,
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం, నిబద్ధత చాలా స్పష్టంగా ఉంది. కొత్త విధానాలు రూపొందించడం, సంస్కరణలు చేపట్టడం వంటి విషయాల్లో మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు వాటిని ముందుకు తీసుకెళ్లాలి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు వాహన స్క్రాపింగ్ విధానం అమలులో ఉంది. తయారీదారులందరూ ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. మీరు మీ కంపెనీలో దీనికోసం ప్రోత్సాహక పథకాన్ని కూడా తీసుకురావచ్చు. దీంతో పాత వాహనాలను స్క్రాప్ చేసేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తారు. ఈ ప్రేరణ చాలా ముఖ్యమైనది. ఇది దేశ పర్యావరణానికి మీరు చేసే గొప్ప సేవ అవుతుంది.
మిత్రులారా,
ఆటోమోటివ్ రంగం ఆవిష్కరణల ఆధారితమైనది, అలాగే సాంకేతికతతో నడిచేది. అది ఆవిష్కరణ, సాంకేతికత, నైపుణ్యం లేదా డిమాండ్ ఏదైనా కావచ్చు, భవిష్యత్తు మాత్రం తూర్పు ఆసియా, భారతదేశానిది మాత్రమే. మొబిలిటీ రంగంలో భవిష్యత్తును ఆశిస్తున్న ప్రతి రంగం కోసం అలాగే పెట్టుబడిదారుల కోసం భారత్ గొప్ప గమ్యస్థానంగా ఉంది. ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మరోసారి నేను మీకు హామీ ఇస్తున్నాను. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ అనే మంత్రంతో ముందుకు సాగుతూ ఉండండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు.
ధన్యవాదాలు!
గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి దాదాపు అనువాదం మాత్రమే. వాస్తవానికి ఆయన హిందీలో ప్రసంగించారు.
***
Speaking at the Bharat Mobility Global Expo 2025. Driven by the aspirations of the people, India's automobile sector is witnessing an unprecedented transformation. @bharat_mobility
— Narendra Modi (@narendramodi) January 17, 2025
https://t.co/w6LYEJy2gX
The journey of Viksit Bharat is set to be one of unprecedented transformation and exponential growth in the mobility sector. pic.twitter.com/Z1T5KR5nUJ
— PMO India (@PMOIndia) January 17, 2025
Ease of travel is a top priority for India today. pic.twitter.com/0jHBkIdNjA
— PMO India (@PMOIndia) January 17, 2025
The strength of the Make in India initiative fuels the growth prospects of the country's auto industry. pic.twitter.com/T1aVhDO1nM
— PMO India (@PMOIndia) January 17, 2025
Seven Cs of India's mobility solution. pic.twitter.com/QYtxCEKR4v
— PMO India (@PMOIndia) January 17, 2025
Today, India is focusing on the development of Green Technology, EVs, Hydrogen Fuel and Biofuels. pic.twitter.com/yWmey6vjlk
— PMO India (@PMOIndia) January 17, 2025
India stands as an outstanding destination for every investor looking to shape their future in the mobility sector. pic.twitter.com/V57UcW0Oem
— PMO India (@PMOIndia) January 17, 2025
Inaugurated the Bharat Mobility Global Expo 2025 earlier today. Was particularly glad to witness the cutting-edge innovations and advancements in the mobility sector. pic.twitter.com/IVZsUXifNT
— Narendra Modi (@narendramodi) January 17, 2025
India's automobile industry is thriving, reflecting the rising aspirations of people. pic.twitter.com/IxEFaeck8D
— Narendra Modi (@narendramodi) January 17, 2025
Our focus is on creating seamless travel experiences and unlocking new opportunities for the auto industry. pic.twitter.com/XctAhjHZR1
— Narendra Modi (@narendramodi) January 17, 2025
The @makeinindia initiative, supported by PLI schemes, is driving growth in the automotive industry. pic.twitter.com/3MbYHmpECV
— Narendra Modi (@narendramodi) January 17, 2025