భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీమన్సుఖ్ మాండవీయ, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ జయంత్ చౌదరి, శ్రీమతి రక్షా ఖడ్సే, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రముఖులు సహా దేశం నలుమూలల నుంచి హాజరైన నా యువ మిత్రులారా!
నేడు ఈ భారత మండపం మీ అందరితోనే కాకుండా నవోత్తేజంతో, ఉప్పొంగే భారత యువశక్తితో నిండిపోయింది. యావద్దేశం ఈ క్షణంలో స్వామి వివేకానందను స్మరిస్తూ ఆయనకు నివాళి అర్పిస్తోంది. మన యువతరంపై ఆయనకు ఎనలేని విశ్వాసం ఉండేది. అందుకే, స్వామీజీ తరచూ- “నాకు భారత నవ,యువతరంపై అపార విశ్వాసం ఉంది.యువతరం నుంచి సింహాల్లా వచ్చే నా కార్యకర్తలు ప్రతిసమస్యకు పరిష్కారం అన్వేషించగలరు” అని చెబుతుండేవారు. యువత మీద వివేకానందుని నమ్మకం ఎలాంటిదో, అలాంటి నమ్మకమే ఆయనపై నాకూ ఉండేది. ఆయన ప్రబోధంలోని ప్రతి అక్షరం నాలో విశ్వాసం నింపింది. భారత యువత భవిత గురించి ఆయన ఏమి ఆలోచించారో.. ఏది ప్రబోధించారో.. వాటన్నిటి మీదా నాది తిరుగులేని నమ్మకం. వాస్తవానికి, స్వామి వివేకానంద నేడు మన మధ్య ఉండి ఉంటే, ప్రస్తుత 21వ శతాబ్దపు యువతలో రగిలిన చైతన్య శక్తిని, మీ చురుకైన కృషిని ప్రత్యక్షంగా తిలకించి పులకించేవారు. అలాగే భారతదేశాన్ని కొత్త విశ్వాసంతో, నవోత్తేజంతో నింపి, నవ్య స్వప్న బీజాలునాటి ఉండేవారు.
మిత్రులారా!
ఇప్పుడు మీరంతా ఈ భారత్ మండపంలో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాలచక్రాన్నిఒకసారి గమనించండి.. ఇదే వేదికపై ప్రపంచంలోని మహామహులు ఇంతకుముందు సమావేశమయ్యారు. ప్రపంచ భవిష్యత్తు గురించి చర్చించారు. ఇదే భారత్ మండపంలో ఈ రోజున నా దేశ యువత రాబోయే 25 ఏళ్లలో భారత్ ఏ విధంగా రూపాంతరం చెందాలనే అంశంపై భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేయబోవడం నా భాగ్యం.
మిత్రులారా!
కొన్నినెలల కిందట నా అధికార నివాసంలో కొందరు యువ క్రీడాకారులను కలుసుకున్నాను.ఆ బృందంతో ముచ్చటిస్తున్న సందర్భంగా వారిలో ఒకరు లేచి, “మోదీజీ, ప్రపంచం దృష్టిలో ఈ దేశానికి మీరుప్రధానమంత్రి (పిఎం) కావచ్చు… కానీ, నా దృష్టిలో మాత్రం ‘పిఎం’ అంటే- (పరమ మిత్ర) ప్రాణమిత్రుడని అర్థం” అన్నారు.
మిత్రులారా!
ఇక నా విషయానికొస్తే- ఈ దేశ యువతరంతో నాదీ అదేవిధమైన స్నేహబంధం. ఈ బంధంలో అత్యంత బలమైన అనుబంధం నమ్మకం. మీపైనా నాకు ఎనలేని విశ్వాసం.ఈ పరస్పర నమ్మకమే ‘మై యంగ్ ఇండియా’… అంటే- మైభారత్’(MYBharat)’ ఏర్పాటుకు పురికొల్పింది. ఈ నమ్మకమే ప్రస్తుత ‘వికసిత భారత యువ నాయక యువభారత’ చర్చాగోష్ఠి’కి ప్రాతిపదిక. భారత యువశక్తి దేశాన్నిఅతి త్వరలోనే ‘వికసిత భారత్’గా రూపుదిద్దగలదని నాలోని విశ్వాసం చెబుతోంది.
మిత్రులారా!
వేలి కొసలతో లెక్కలు వేసుకునే వారికి ఇదంతా అత్యంత కష్టసాధ్యం అనిపించవచ్చు. అయితే, ఇది భారీ లక్ష్యమే అయినా, మీ అందరి ఆత్మవిశ్వాసం ఆలంబనగా నిలిస్తే ఏదీ అసాధ్యం కాదని నా అంతర్వాణి భరోసా ఇస్తోంది. కోట్లాదిగా యువత చేయి కలిపితే ప్రగతి రథచక్రాలు వేగం పుంజుకుని, నిస్సందేహంగా మనను లక్ష్యానికి చేరుస్తాయి.
మిత్రులారా!
చరిత్ర మనకు పాఠాలు నేర్పడమే కాదు.. ముందడుగు వేసే స్ఫూర్తిని కూడా ఇస్తుందంటారు. దీన్ని నిరూపించే అనేక ఉదాహరణలు మనముందున్నాయి. ఏదైనా దేశం లేదా సమాజం లేదా ఓ సమూహం భారీ స్వప్నాలు, పెద్ద సంకల్పాలతో ఒకే దిశగా కదిలితే, సమష్టిగా పదం కదిపితే, లక్ష్యాన్ని విస్మరించకుండా ముందడుగు వేస్తే ఏదీ అసాధ్యం కాదని పలుమార్లు రుజువైంది. తమ స్వప్న సాకారం కోసం… సంకల్ప సిద్ధి కోసం ప్రతి చిన్నఅవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ గమ్యం చేరారని చరిత్ర సాక్ష్యమిస్తోంది. ఈ క్రమంలో 1930 దశకంలో అంటే దాదాపు 100 సంవత్సరాల కిందట అమెరికా ‘మహా ఆర్థిక సంక్షోభం’లో కూరుకుపోయింది. మీలో చరిత్రపై అవగాహనగల చాలామందికి ఇది తెలిసి ఉంటుంది. అమెరికా ప్రజలు ఆనాడు దాన్నుంచి విముక్తి సాధించి, వేగంగా ముందడుగు వేయాలని దృఢ సంకల్పం పూనారు.ఆ మేరకు ‘న్యూ డీల్’ పేరిట తమదైన మార్గం నిర్దేశించుకుని, సంక్షోభం నుంచి విముక్తులు కావడమేగాక వందేళ్ల లోపే ప్రగతి వేగాన్నిఅనేక రెట్లు పెంచుకున్నారు.
అదేవిధంగా ఒకనాడు ఓ చిన్న మత్స్యకారులగ్రామంలాంటి సింగపూర్ అత్యంత దారుణ స్థితిలో ఉండేది. కనీస సౌకర్యాలకూ నోచని దీనావస్థలో ప్రజలు అల్లాడేవారు. అయితే, వారికి సరైన నాయకత్వం లభించింది..ప్రజల భాగస్వామ్యంతో సింగపూర్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనారు. ఆ క్రమంలో సమష్టితత్వాన్ని అలవరచుకుని, క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ, నిబంధనలను తూచా తప్పకుండా పాటించారు. అలా కేవలం కొన్నేళ్లలోనే సింగపూర్ అంతర్జాతీయ ఆర్థిక-వాణిజ్య కూడలిగా ఆవిర్భవించింది. ప్రపంచంలో ఇలాంటి ఎన్నో దేశాలు, సమాజాలు, సమూహాలు, ఉదంతాలు మనముందే ఉన్నాయి. మన దేశంలోనూ ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. భారతీయులు స్వాతంత్య్ర సముపార్జనకు కంకణం కట్టుకున్నారు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి లేని అధికారమంటూ లేదు.ఏ విషయంలోనూ కొరతకు తావులేదు. కానీ, యావద్దేశం ఒక్కటై నిలిచింది. స్వాతంత్య్ర స్వప్నాన్నిసజీవ చైతన్యంతో నింపి దేశ విముక్తి పోరాటంప్రారంభించింది. చివరకు ప్రాణత్యాగానికీ వెనుకాడకుండా ముందంజ వేసింది. ఆ విధంగా భారత ప్రజానీకం స్వాతంత్య్ర సాధన ద్వారా సమష్టి సంకల్పబలాన్ని చాటిచెప్పారు.
అయితే, స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఆహార సంక్షోభం నెలకొంది.అప్పుడు రైతులంతా దృఢ సంకల్పంతో భారత్‌ను ఆ సంకటంనుంచి విముక్తం చేశారు. మీరంతా అప్పటికి పుట్టి ఉండరు… ఆనాడు ‘పిఎల్ 480’ పేరిట గోధుమలు వచ్చేవి.. వాటిని పంపిణీ చేయడం ఓ పెద్ద పనిగా ఉండేది. మేము ఆ సంక్షోభంనుంచి బయటపడ్డాం. కాబట్టి- భారీ కలలు కనడం, గొప్ప సంకల్పాలు పూనడం, నిర్దిష్ట వ్యవధిలో వాటిని సాకారం చేసుకోవడం అసాధ్యమేమీ కాదు. ఏ దేశమైనా ముందడుగు వేయాలంటే భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిందే.కానీ, ఆలోచిస్తూ కూర్చునే వారు మాత్రం- “వదిలెయ్ మిత్రమా.. అదంతే అలా జరుగుతూనే ఉంటుంది..మనమేమీ మార్చలేం.. ఇదిలాగే కొనసాగుతుంది.. అయినా మనకేం అవసరం మిత్రమా, జనమేమీ చచ్చిపోరు.. ఏదో ఒకటి.. దాన్నలాపోనీ, దేన్నయినా మనం మార్చాల్సిన అవసరం ఏముంది? దాని గురించి మీరెందుకు కలతపడతారు మిత్రమా” అంటూ ఆవారాగా తిరిగేవాళ్లు మన చుట్టూనే ఉంటారు. అలాంటి వారంతా జీవచ్ఛవాలే తప్ప మరేమీ కారు.
మిత్రులారా…
లక్ష్యమంటూ లేని జీవితం ఉండదు.ప్రాణాలను నిలబెట్టే మూలిక ఏదైనా ఉంటే బాగుండునని నాకుకొన్నిసార్లు అనిపిస్తూంటుంది. కానీ, అలాంటిదేదైనా ఉందంటే అది మన లక్ష్యమే. మన జీవనయానానికి అదే ఇంధనం. ఒక భారీ లక్ష్యంమన ముందున్నపుడు దాన్నిసాధించడానికి మన శాయశక్తులా ప్రయత్నిస్తాం.నేటి భారతం చేస్తున్నదీ అదే!
మిత్రులారా!
పటిష్ఠ సంకల్పంతో గత పదేళ్లలో సాధించిన విజయాలకు అనేక ఉదాహరణలు మనముందున్నాయి. భారతీయులంతా బహిరంగ విసర్జన నుంచి విముక్తం కావాలని నిర్ణయించుకున్నాం. ఆ సంకల్ప బలంతో కేవలం 60 నెలల్లోనే 60 కోట్ల మంది దేశవాసులు బహిరంగ విసర్జన నుంచి విముక్తులయ్యారు. ప్రతి కుటుంబాన్ని బ్యాంకు ఖాతాతో అనుసంధానించాలని దేశం లక్ష్యనిర్దేశం చేసుకుంది. తదనుగుణంగా భారత్‌లోని దాదాపు ప్రతి కుటుంబం బ్యాంకింగ్ సేవలతో అనుసంధానమైంది. పేద మహిళలను వంటింటి పొగనుంచి విముక్తం చేయాలని జాతి సంకల్పించింది. దేశవ్యాప్తంగా10 కోట్లకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఆ సంకల్పాన్ని కూడా మనం నిజం చేసి చూపాం.
దేశం నేడు అనేకరంగాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను గడువుకు ముందే సాధిస్తోంది. కరోనా సమయంలో ప్రపంచం టీకా గురించి ఆందోళనపడింది. అందుకు కొన్నేళ్లు పడుతుందన్న మాట వినిపించింది. కానీ,మన శాస్త్రవేత్తలు మాత్రం అనుకున్న గడువుకు ముందే టీకాను మన ముందుంచారు. కరోనా టీకా రావడానికి 3, 4, 5 సంవత్సరాలు పడుతుందని కొందరు నిరాశావాదులు ప్రతి ఒక్కరికీ చెబుతుండేవారు. కానీ, ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం ద్వారా రికార్డు సమయంలో అందరికీ టీకాలు వేయడం ద్వారా భారత్ తన సామర్థ్యమేమిటో చాటిచెప్పింది.నేడు యావత్ ప్రపంచం భారత్ వేగాన్ని ప్రత్యక్షంగా చూస్తోంది.
జి-20 సందర్భంగా పరిశుభ్ర ఇంధనం విషయంలో ప్రపంచానికి మనమొక భారీ హామీ ఇచ్చాం.తదనుగుణంగా పారిస్ లో చేసిన వాగ్దానాన్నినెరవేర్చిన తొలి దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అది కూడా నిర్దిష్ట గడువుకు ఏకంగా 9 సంవత్సరాలు ముందుగానే లక్ష్యం చేరింది. అటుపైన ఇప్పుడు 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం దిశగా లక్ష్యనిర్దేశం చేసుకుంది. అయితే, ఆ గడువుకు ముందే…అంటే- బహుశా అతి త్వరలో మనం ఆ గమ్యం చేరగలం. భారత్ సాధించిన ప్రతి విజయం దృఢ సంకల్పంతో సత్ఫలితాల సిద్ధికి నిదర్శనం… మనందరికీ ఇది స్ఫూర్తిదాయకం. ఈవిజయమే వికసిత భారత్ లక్ష్యం దిశగా మన నిబద్ధతను నిరూపిస్తూ మరింత వేగంగా గమ్యానికి చేరువ చేస్తుంది.
మిత్రులారా!
ఈ ప్రగతి పయనంలో మనం ఒక విషయాన్ని ఎప్పటికీ మరవరాదు. భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని,సాధించే బాధ్యత కేవలం ప్రభుత్వ యంత్రాంగం ఒక్కదానిదే కాదు. అటువంటి సంకల్పాల సాధనలో దేశ పౌరులంతా ఏకతాటిపైకి రావడం చాలా ముఖ్యం. ఈదిశగా మనం మేధోమథనంతో దిశను నిర్దేశించుకోవాలి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నేను మీ ప్రజెంటేషన్ చూస్తున్నపుడు, మధ్యలో మాట్లాడుతూ కూడా నేనొక మాట అన్నాను. ఈ మొత్తం ప్రక్రియలో లక్షలాదిగా మనం ఏకం కావడమంటే వికసిత భారత్ ఘనత ఒక్క మోదీది మాత్రమే కాదు… మీ అందరికీ కూడా అని ప్రకటించాను. ఇప్పుడీ ‘వికసిత భారత్: యంగ్ లీడర్స్ డైలాగ్’ ఈ మేధోమథనానికి గొప్ప ఉదాహరణ. ఇది యువతరం నాయకత్వాన ఒక ప్రయత్నం. ఆ మేరకు క్విజ్, వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న యువతీయువకులు సహా ఈ కార్యక్రమంతోముడిపడిన మీరందరూ వికసిత భారత్ లక్ష్యసాధనలో భాగస్వాములయ్యారు. ఇదంతా ఇక్కడ ఆవిష్కరించిన వ్యాస సంపుటిలోనే కాకుండా నేను ఇప్పటిదాకా చూసిన10 ప్రజెంటేషన్లలోనూ క్లుప్తంగా కనిపిస్తుంది. ఈ ప్రజెంటేషన్లన్నీ నిజంగా అద్భుతం… నా దేశ యువత ఆలోచన ధోరణి ఇంత వేగంగా ముందుకువెళ్లడం చూశాక నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడంలో మీ పరిధి ఎంత విస్తృతమైనదో తేటతెల్లమైంది. మీ పరిష్కారాలలో వర్తమాన వాస్తవం ఉంది… క్షేత్రస్థాయి అనుభవం ఉంది. మీరు చెప్పే ప్రతి అంశంలోనూ మాతృభూమి మట్టి వాసన ఉంది. నేటి భారత యువతరం తలుపులు మూసిన ఏసీ గదుల వెనుక తలపులకు పరిమితం కావడం లేదు. వారి ఆలోచనా పరిధి ఆకాశాన్నంటేలా ఉంది. నిన్న రాత్రి మీలో కొందరు నాకుపంపిన వీడియోలను చూస్తున్నాను. మీ ప్రత్యక్ష చర్చలలో,మంత్రులతో సంభాషణల్లో, విధాన నిర్ణేతలతో మీ మాటామంతీ వగైరాల సందర్భంగా మీ గురించి వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాన్ని నేను వింటున్నాను. ఆయా అంశాల్లో వికసిత భారత్‌పై మీ సంకల్పాన్నినేను అనుభూతి చెందాను. యువ నాయక చర్చగోష్ఠి కార్యక్రమంలో భాగమైన ఈ మొత్తం ప్రక్రియలోమేధోమథనం అనంతరం వచ్చిన సూచనలు, యువత ఆలోచనలు ఇక దేశ విధానాల్లో అంతర్భాగం అవుతాయి. ప్రగతిశీల భారతదేశానికి దిశానిర్దేశం చేస్తాయి. ఇందుకు తమవంతు కృషి చేస్తున్న దేశయువతరాన్ని నేనెంతగానో అభినందిస్తున్నాను.
మిత్రులారా!
ఎర్రకోట పైనుంచి నేను లక్షమంది నవతరం యువతను రాజకీయాల్లోకి తీసుకురావడం గురించి మాట్లాడాను. ఈ నేపథ్యంలో ప్రస్తుత కార్యక్రమంలోని మీ సూచనల అమలుకు రాజకీయాలు కూడా గొప్ప మాధ్యమం కావచ్చు. తదనుగుణంగా మీలో చాలామంది రాజకీయ రంగప్రవేశానికి సంసిద్ధులవుతారని కచ్చితంగా నమ్ముతున్నాను. మిత్రులారా! ఈ రోజు నేనిలా మీతో సంభాషిస్తూనే ఘనమైన వికసిత భారత్ స్వరూపాన్ని కూడా దర్శించగలుగుతున్నాను. అభివృద్ధి చెందిన భారత దేశంలో మనం చూడాలని భావిస్తున్నదేంటి? మన మదిలో మెదలుతున్న భవిష్యత్ భారతం ఎలాంటిది? అభివృద్ధి చెందిన భారతదేశమంటే- ఆర్థికంగా, వ్యూహాత్మకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అత్యంత శక్తిమంతమైనదిగా ఉండాలి. సుస్పష్టంగా చెప్పాలంటే- బలమైన ఆర్థిక వ్యవస్థ, సుసంపన్న పర్యావరణం, చక్కని విద్య-మంచి సంపాదనకు గరిష్ఠ అవకాశాలు, ప్రపంచంలోనే అత్యధిక యువ నిపుణులతో కూడిన మానవశక్తి సహా యువత తమ కలలను నెరవేర్చుకునే అపార అవకాశాలూ అందుబాటులో ఉంచగలిగేదే వికసిత భారత్!
కానీ సహచరులారా,
కేవలం మాటలతోనే మనం అభివృద్ధి సాధిస్తామా? మీరు ఏమనుకుంటున్నారు? అలా అయితే మనం ఇంటికి వెళ్లి అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన భారత్ అంటూ జపం చేద్దామా. మన ప్రతి నిర్ణయంలో ఉద్దేశం ఒకటే. అది ఏమిటి – అభివృద్ధి చెందిన భారత్. మన ప్రతి అడుగు ఒకేదిశలో పడినప్పుడు, అది ఏమిటి – అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన భారత్. మన విధాన స్ఫూర్తి ఒకటే అయినప్పుడు, ఏమిటది – అభివృద్ధి చెందిన భారత్. అప్పుడు మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడాన్ని ప్రపంచంలోని ఏ శక్తీ అడ్డుకోలేదు. చరిత్రలో ప్రతి దేశం కోసం ఒక సమయం ఉంటుంది. అప్పుడు భారీ మార్పు సాధ్యమవుతుంది. ప్రస్తుతం భారత్కు ఆ అవకాశం ఉంది. చాలా కాలం క్రితం ఎర్రకోట నుంచి నేను నా మనస్సు నుంచి మాట్లాడుతూ ఇదే సమయం, సరైన సమయం అని పిలుపునిచ్చాను.
నేడు ప్రపంచంలో అనేక దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. అయితే రానున్న అనేక దశాబ్దాల పాటు భారత్ ప్రపంచంలో అత్యధికంగా యువత కలిగిన దేశంగా నిలుస్తుంది. యువశక్తి ద్వారా మాత్రమే దేశ జీడీపీలో అధిక వృద్ధి సాధ్యమని అనేక పెద్ద ఏజెన్సీలు చెబుతున్నాయి. దేశంలోని గొప్ప మహర్షులు సైతం ఈ యువశక్తి పట్ల అచంచలమైన విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తు శక్తి నేటి యువత చేతుల్లోనే ఉందని మహర్షి అరబిందో చెప్పారు. యువత కలలు కనాలని, వాటిని నెరవేర్చుకోవడానికి తమ జీవితాలను గడపాలని గురుదేవ్ ఠాగూర్ చెప్పారు. యువకుల చేతులతోనే ఆవిష్కరణ జరుగుతుందని, అందుకే యువత కొత్త ప్రయోగాలు చేయాలని హోమీ జహంగీర్ బాబా చెప్పేవారు. మీరు చూస్తే, నేడు ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీలను భారత యువత నడుపుతున్నారు. భారతీయ యువశక్తిని యావత్ ప్రపంచం అభిమానిస్తోంది. మనకు 25 ఏళ్ల పాటు స్వర్ణయుగం ఉంది. ఇది నిజంగా అమృతకాలం, మన యువశక్తి కచ్చితంగా అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాకారం చేస్తుందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. కేవలం 10 ఏళ్ల కాలంలోనే మన యువత భారతదేశాన్ని స్టార్టప్ల ప్రపంచంలో మొదటి మూడు దేశాల సరసన నిలిపింది. గత 10 ఏళ్లలోనే, మన యువత తయారీ రంగంలో దేశాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్ళింది. కేవలం 10 ఏళ్లలోనే మన యువత డిజిటల్ ఇండియా జెండాను ప్రపంచ వ్యాప్తంగా ఎగురవేసింది. కేవలం 10 ఏళ్లలోనే, మన యువత భారతదేశాన్ని క్రీడా ప్రపంచంలోనూ ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. మన భారత యువత అసాధ్యాలను సుసాధ్యం చేసింది, కాబట్టి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కూడా యువత సాకారం చేస్తుంది.
మిత్రులారా,
నేటి యువతలో సామర్థ్యాలను పెంపొందించేందుకు మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోంది. నేడు, భారతదేశంలో ప్రతి వారం కొత్త విశ్వవిద్యాలయం, ప్రతిరోజూ కొత్త ఐటీఐ ఏర్పాటవుతోంది. నేడు ప్రతి మూడు రోజులకో అటల్ టింకరింగ్ ల్యాబ్ తెరుస్తున్నాం. అలాగే ప్రతిరోజూ దేశంలో రెండు కొత్త కళాశాలలు నిర్మితమవుతున్నాయి. నేడు దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయి. గడిచిన దశాబ్ధంలోనే, ట్రిపుల్ ఐటీల సంఖ్య 9 నుంచి 25కి చేరింది, ఐఐఎమ్‌ల సంఖ్య 13 నుంచి 21కి చేరింది. గడిచిన 10ఏళ్ల కాలంలో ఎయిమ్స్‌ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది, వైద్య కళాశాలల సంఖ్య సైతం దాదాపు రెండు రెట్లు పెరిగింది. నేడు మన దేశంలో పాఠశాలలైనా, కళాశాలలైనా, విశ్వవిద్యాలయాలైనా ప్రతిస్థాయిలో వాటి సంఖ్యలో అలాగే నాణ్యతలో అద్భుతమైన ఫలితాలను రాబట్టడం మనం చూస్తున్నాం. 2014 సంవత్సరం వరకు, భారతదేశంలోని తొమ్మిది ఉన్నత విద్యా సంస్థలు మాత్రమే క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో చేరాయి. నేడు ఈ సంఖ్య 46కి చేరింది. దేశంలో విద్యాసంస్థల సామర్ధ్యం పెరగడం అభివృద్ధి చెందిన భారతదేశ సాధనకు ముఖ్యమైన ప్రాతిపదిక అవుతుంది.
మిత్రులారా,
2047 ఇంకా చాలా దూరంలో ఉంది, ఇప్పుడే దాని కోసం పనిచేయడం ఎందుకని కొంతమంది భావించవచ్చు, కాని మనం ఆ ఆలోచన నుంచి బయటపడాలి. అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో, మనం ప్రతిరోజూ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలి అలాగే వాటిని సాధిస్తూ ముందడుగు వేయాలి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యాన్ని భారత్ సాధించే రోజు ఎంతో దూరంలో లేదు. గడిచిన పదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇదే వేగంతో మనం ముందుకెళితే దేశంలో పేదరిక నిర్మూలన సంపూర్ణం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ దశాబ్దం చివరి నాటికి, భారతదేశం 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకుంది. మన రైల్వేలు 2030 నాటికి కర్భన ఉద్గారాలను పూర్తిగా లేకుండా చేసే లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది.
మిత్రులారా,
వచ్చే దశాబ్దంలో ఒలింపిక్స్ నిర్వహించాలనే పెద్ద లక్ష్యం కూడా మన ముందు ఉంది. ఇందుకోసం దేశం తీవ్రంగా శ్రమిస్తోంది. మనదేశం అంతరిక్ష శక్తిగా వేగంగా ముందుకు సాగుతోంది. 2035 నాటికి అంతరిక్షంలో మన సొంత కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ప్రపంచం ఇప్పటికే మన చంద్రయాన్ విజయాన్ని చూసింది. ఇప్పుడు గగన్‌యాన్ కోసం సన్నద్ధత వేగంగా సాగుతోంది. మనం అంతకుమించి ఆలోచించాల్సి ఉంది, మన చంద్రయాన్ ద్వారా మనం భారతీయుడిని చంద్రునిపై కాలుమోపేలా చేయాలి. ఇలాంటి అనేక లక్ష్యాలను సాధించడం ద్వారా మాత్రమే మనం 2047 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని సాధించగలం.
మిత్రులారా,
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గణాంకాల గురించి మనం మాట్లాడితే, అది మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని కొందరు అనుకుంటారు. నిజమేమిటంటే, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినప్పుడు ప్రజల జీవితాల్లో ప్రతి స్థాయిపై దాని సానుకూల ప్రభావం ఉంటుంది. ఈ శతాబ్దం మొదటి దశాబ్దంలో భారత్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారింది. నేను 21వ శతాబ్దపు మొదటి కాలం గురించి మాట్లాడుతున్నా, ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ పరిమాణం చిన్నది, కాబట్టి భారతదేశ వ్యవసాయ బడ్జెట్ కొన్ని వేల కోట్ల రూపాయలు మాత్రమే. దేశ మౌలిక సదుపాయాల బడ్జెట్ లక్ష కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండేది. మరి ఆ సమయంలో దేశ పరిస్థితి ఏమిటి? అప్పట్లో చాలా గ్రామాల్లో రహదారులు, కరెంటు, జాతీయ రహదారులు, రైల్వేల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. భారతదేశంలోని చాలా భాగం విద్యుత్, త్రాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉండేది.
మిత్రులారా,
ఆ తరువాత కొంతకాలానికే, మన దేశం రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారింది. ఆ సమయంలో దేశ మౌలిక సదుపాయాల బడ్జెట్ రూ. 2 లక్షల కోట్ల కంటే తక్కువ. కానీ రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, కాలువలు, పేదలకు ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇవన్నీ గతంతో పోలిస్తే పెరగడం మొదలైంది. ఆ తరువాత, భారతదేశం వేగంగా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారింది, ఫలితంగా విమానాశ్రయాల సంఖ్య రెండింతలు పెరిగింది, వందే భారత్ వంటి ఆధునిక రైళ్లు దేశంలో నడుస్తున్నాయి అలాగే బుల్లెట్ రైలు కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. మన దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5జీని అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని వేలాది గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ చేరుకుంది. 3 లక్షలకు పైగా గ్రామాలకు రహదారులు, ముద్ర రుణం ద్వారా యువతకు రూ. 23 లక్షల కోట్ల హామీ రహిత రుణాలు అందాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పథకం ఉచిత చికిత్స అందించే ఆయుష్మాన్ భారత్ ప్రారంభమైంది. ఏటా వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే పథకం కూడా ప్రారంభమైంది. పేదలకు 4 కోట్ల కాంక్రీట్ ఇళ్లు నిర్మించి ఇచ్చాం. అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదైతే అభివృద్ధి పనులు అంత ఊపందుకున్నాయి, మరిన్ని అవకాశాలు కల్పించగలిగాం. ప్రతి రంగంలో, సమాజంలోని ప్రతి వర్గంలో, ఖర్చు చేసే సామర్థ్యం దేశమంతటా సమానంగా పెరిగింది.
మిత్రులారా,
నేడు మన దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో భారత్ బలం అనేక రెట్లు పెరిగింది. 2014 నాటి మొత్తం మౌలిక సదుపాయాల బడ్జెట్‌లో, రైల్వేలు, రహదారులు అలాగే విమానాశ్రయాల నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం కంటే ఈరోజు కేవలం రైల్వేల కోసం చేస్తున్న ఖర్చు ఎక్కువగా ఉంది. 10 సంవత్సరాల క్రితం కంటే నేడు దేశ మౌలిక సదుపాయాల బడ్జెట్ 6 రెట్లు ఎక్కువ, ఇది 11 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంది. అలాగే మీరు ఈ రోజు దేశం మారుతున్న తీరుతో దాని ఫలితాన్ని చూడవచ్చు. ఈ భారత మండపం కూడా దీనికి ఒక చక్కటి ఉదాహరణ. గతంలో మీలో ఎవరైనా ప్రగతి మైదాన్‌కి వచ్చి ఉంటే, ఇక్కడ మధ్యలో సంత జరిగేది, దేశం నలుమూలల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి టెంట్లు వేసుకుని తమ పనులు చేసేవారు, అలాంటి చోట ఈ రోజు ఇదంతా సాధ్యమైంది.
మిత్రులారా,
ఇప్పుడు మనం అత్యంత వేగంగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా సాగుతున్నాం. మనం 5 ట్రిలియన్‌లకు చేరుకున్నప్పుడు, అభివృద్ధి స్థాయి ఎంత పెద్దదిగా ఉంటుందో, సౌకర్యాల విస్తరణ ఇంకెంత ఉంటుందో మీరు ఊహించవచ్చు. మన దేశం ఇక్కడితో ఆగదు. వచ్చే దశాబ్దం చివరి నాటికి భారత్ 10 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటనుంది. ఈ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో, మీ కెరీర్ పురోగమిస్తున్నప్పుడు, మీకు ఎన్ని అవకాశాలు ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు. 2047లో మీ వయస్సు ఎంత ఉంటుంది, మీ కుటుంబం కోసం మీరు ఏ ఏర్పాట్ల గురించి ఆందోళన చెందుతుంటారో ఒకసారి ఊహించుకోండి. 2047లో మీరు 40-50 ఏళ్ల వయస్సులో, జీవితంలోని ఒక ముఖ్యమైన దశలో ఉన్నప్పుడు, మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది, అప్పుడు దాని నుంచి ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందుతారు? ఎవరు పొందుతారు? నేటి యువతే ఎక్కువ ప్రయోజనం పొందుతుంది. అందుకే ఈ రోజు నేను మీకు పూర్తి విశ్వాసంతో చెబుతున్నా, మీ తరం దేశ చరిత్రలో అతిపెద్ద మార్పును తీసుకురావడమే కాకుండా, ఆ మార్పు నుంచి భారీగా లబ్ది పొందనుంది. ఈ ప్రయాణంలో గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. అందులోనే ఉండటం చాలా ప్రమాదకరమైనది, మనం ముందుకు వెళ్లాలంటే, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్క్ తీసుకోవడం తప్పనిసరి. ఈ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో కూడా, యువత తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం ద్వారా మాత్రమే ఇక్కడికి చేరుకోగలరు. ఈ జీవన మంత్రం మీకు ఉన్నత విజయాన్ని సాధించడంలో తోడుగా ఉంటుంది.
మిత్రులారా,
నేటి ఈ అభివృద్ధి చెందిన భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం దేశ భవిత కోసం రోడ్‌మ్యాప్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఈ తీర్మానాన్ని ఆమోదించిన శక్తి, ఉత్సాహం అలాగే అభిరుచి నిజంగా అద్భుతమైనవి. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మీ ఆలోచనలు కచ్చితంగా విలువైనవి, అద్భుతమైనవి అలాగే అత్యుత్తమమైనవి. ఇప్పుడు మీరు ఈ ఆలోచనలను దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లాలి. దేశంలోని ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామం, వీధి అలాగే సదరు ప్రాంతంలో గల ఇతర యువత సైతం ఈ ఆలోచనలతో అనుసంధానమై, ఈ స్ఫూర్తిని తీసుకోవాలి. 2047 నాటికి మనం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుదాం. ఈ తీర్మానంతోనే మనం జీవించాలి, దాని కోసం మనల్ని మనం అంకితం చేసుకోవాలి.
మిత్రులారా,
మరోసారి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశంలోని యువతకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ తీర్మానాన్ని విజయవంతం చేయడంలో మీ నిరంతర ప్రయత్నాలను కొనసాగిస్తూ, విజయం సాధించే వరకు విశ్రమించమనే ఈ ముఖ్యమైన ప్రమాణంతో మీరు ముందుకు సాగాలి, నా శుభాకాంక్షలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి ఇప్పుడు నాతో పాటు మీరూ చెప్పండి-
భారత్ మాతా కీ జై
భారత్ మాతా కీ జై
భారత్ మాతా కీ జై
వందే మాతరం. వందే మాతరం.
వందే మాతరం. వందే మాతరం.
వందే మాతరం. వందే మాతరం.
వందే మాతరం. వందే మాతరం.
వందే మాతరం. వందే మాతరం.
వందే మాతరం. వందే మాతరం.
ధన్యవాదాలు
గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి దాదాపు అనువాదం మాత్రమే. వాస్తవానికి ఆయన హిందీలో మాట్లాడారు.
***
India's Yuva Shakti is driving remarkable transformations. The Viksit Bharat Young Leaders Dialogue serves as an inspiring platform, uniting the energy and innovative spirit of our youth to shape a developed India. #VBYLD2025 https://t.co/gjIqBbyuFU
— Narendra Modi (@narendramodi) January 12, 2025
The strength of India's Yuva Shakti will make India a developed nation. pic.twitter.com/GoF0uLZK0g
— PMO India (@PMOIndia) January 12, 2025
India is accomplishing its goals in numerous sectors well ahead of time. pic.twitter.com/idaPkm6u83
— PMO India (@PMOIndia) January 12, 2025
Achieving ambitious goals requires the active participation and collective effort of every citizen of the nation. pic.twitter.com/Edxnx84TSc
— PMO India (@PMOIndia) January 12, 2025
भारत के युवा की सोच का विस्तार आसमान से भी ऊंचा है। pic.twitter.com/uHkgt8ZYEU
— PMO India (@PMOIndia) January 12, 2025
A developed India will be one that is empowered economically, strategically, socially and culturally. pic.twitter.com/ieYuPmauIn
— PMO India (@PMOIndia) January 12, 2025
भारत की युवाशक्ति विकसित भारत का सपना जरूर साकार करेगी। pic.twitter.com/oPHpGh7F6S
— PMO India (@PMOIndia) January 12, 2025
Witnessing a series of insightful presentations on women empowerment, sports, culture, StartUps, infrastructure development and more at the Viksit Bharat Young Leaders Dialogue 2025! India is truly blessed to have such a talented Yuva Shakti. #VBYLD2025 pic.twitter.com/los1xTP20D
— Narendra Modi (@narendramodi) January 12, 2025
आज देश तेजी से अपने लक्ष्यों को हासिल कर रहा है। बीते 10 वर्षों में देशवासियों ने संकल्प से सिद्धि के ऐसे कई बड़े उदाहरण देखे हैं… pic.twitter.com/UKEfo9kump
— Narendra Modi (@narendramodi) January 12, 2025
विकसित भारत यंग लीडर्स डायलॉग में हमारे युवा साथियों ने जो आइडियाज दिए हैं, उनमें हमारे देश की मिट्टी की महक है। pic.twitter.com/7PFiiP9DKf
— Narendra Modi (@narendramodi) January 12, 2025
आज देश का युवा असंभव को संभव बना रहा है। इसलिए मैं पूरे आत्मविश्वास के साथ कह सकता हूं कि हमारी युवाशक्ति विकसित भारत का सपना जरूर साकार करेगी। pic.twitter.com/bmYKpR0PQY
— Narendra Modi (@narendramodi) January 12, 2025
बीते 10 वर्षों में हमारे प्रयासों से 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं और वो दिन दूर नहीं है, जब पूरा भारत गरीबी से मुक्त होगा। pic.twitter.com/pKMSpoG0VW
— Narendra Modi (@narendramodi) January 12, 2025
मैं आज पूरे विश्वास से कह रहा हूं कि हमारी युवा पीढ़ी ना सिर्फ देश के इतिहास का सबसे बड़ा परिवर्तन करेगी, बल्कि उसकी सबसे बड़ी लाभार्थी भी बनेगी। pic.twitter.com/O03icdLWZz
— Narendra Modi (@narendramodi) January 12, 2025
विकसित भारत यंग लीडर्स डायलॉग के मौके पर आयोजित प्रदर्शनी में अपने युवा साथियों के इनोवेटिव प्रयासों और अद्भुत प्रतिभा का साक्षी बना। pic.twitter.com/UErtAb1hqp
— Narendra Modi (@narendramodi) January 12, 2025
The enthusiasm and optimism I saw also highlight the immense potential of our youth as changemakers driving the nation forward.
— Narendra Modi (@narendramodi) January 12, 2025
I also told my young friends that the ownership of this Viksit Bharat movement is with them and the success of today’s programme further cements it! pic.twitter.com/ZavG1UihYj
India’s youth are the harbingers of a Viksit Bharat, brimming with innovation, passion and a deep commitment to the nation’s progress.
— Narendra Modi (@narendramodi) January 12, 2025
The Viksit Bharat Young Leaders Dialogue illustrated this spirit. Today’s programme was one of the most memorable, where we collectively… pic.twitter.com/TToLIeIkKq