Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నైరోబీ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం పూర్తి పాఠం (జులై 11, 2016)

నైరోబీ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం పూర్తి పాఠం (జులై 11, 2016)


నైరోబీ విశ్వవిద్యాలయం కుల‌ప‌తి డాక్ట‌ర్ విజూ ర‌త్తన్ సీ గారు,

నైరోబీ విశ్వవిద్యాలయం ఉప‌ కుల‌ప‌తి ఆచార్య పీట‌ర్ ఎంబితి గారు,

విశ్వవిద్యాలయం సెనేట్ స‌భ్యులు,

విశిష్టులైన ఆచార్యులు,

ప్రియ‌మైన విద్యార్థులారా..

జాంబో ! హ‌బారి గాని (హ‌లో! ఎలా ఉన్నారు)?

ఉత్సాహ‌భ‌రిత‌మైన ఈ వాతావ‌ర‌ణంలో నేను కూడా భాగ‌స్వామిని కావడం నాకెంతో సంతోషంగా ఉంది.

కెన్యా లోని అత్యుత్త‌మ‌, ప్ర‌తిభావంతులంద‌రి మ‌ధ్య నిల‌బ‌డినందుకుడ‌డం నిజంగా భలే ఆనందంగా ఉంది.

ఈ గ‌డ్డ గ‌ర్వించ‌ద‌గ్గ బిడ్డ‌లు మీరు. ఆఫ్రికా భ‌విష్య‌త్తుకు ప్ర‌తినిధులు. మీ ఆశ‌లు, ఆశ‌యాలు, చ‌ర్య‌లు కేవ‌లం ఈ గొప్ప దేశం ద‌శ‌- దిశ‌లనే కాకుండా అత్యంత విశిష్ఠ‌మైన ఈ ఖండాన్నే శ్రేయోమార్గంలో ప‌య‌నించ‌డానికి సైతం మార్గ‌నిర్దేశ‌కాలు అవుతాయి.

కెన్యా యువ‌త‌రం ప్రతినిధులారా, మీకు మా 80 కోట్ల యువ‌ భార‌తావ‌ని స్నేహ‌ హ‌స్తాన్ని అందించడానికి నేను ఇక్కడికి వచ్చాను.

అంత మందిలో నేను కూడా ఒక‌రినని మీరనుకోవచ్చు.

చూడండి మిత్రులారా, జాతి నిర్మాణం లేదా.. కెన్యా లాంటి దేశంతో స్నేహాన్ని పెంచుకోవ‌డం వంటి అంశాలలో నా మ‌న‌సు 20 ఏళ్ళ కుర్రాడిలా ఉర‌క‌లేస్తుంది.

ప్రియ‌మైన విద్యార్థులారా,

నైరోబీ విశ్వవిద్యాలయం కేవ‌లం ఆఫ్రికాలోనే కాకుండా యావ‌త్ ప్ర‌పంచంలోనూ పేరున్న‌ఓ అద్భుత‌మైన విద్యాసంస్థ‌.

ఎంతో ఉత్సుక‌త‌తో కూర్చున్న ఈ యువ‌త‌రాన్ని చూస్తుంటే, త‌ర త‌రాల రాజ‌కీయ‌ నేత‌లు, ఇంజినీర్లు, శాస్ర్త‌వేత్త‌లు, సామాజిక‌వేత్త‌లు, క‌ళాకారులు ఈ చ‌దువుల త‌ల్లి త‌లుపులు దాటుకొని రావ‌డానికి ఎందుకు త‌పించారో అర్థ‌ం అవుతోంది.

ఈ విశ్వవిద్యాలయం మీ దేశానికి పేరు ప్ర‌తిష్ఠ‌లను కొనితెచ్చింది. మునుముందు కూడా కెన్యా భ‌విష్య‌త్ త‌రాల‌ను ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ త‌యారు చేయ‌బోతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భార‌తదేశం, కెన్యా ల చ‌రిత్ర‌కు, అనుభ‌వాల‌కు కూడా ఈ విశ్వవిద్యాలయం ప్ర‌తీక‌గా నిలుస్తుంది.

ఈ వేదిక‌ మీద అడుగుపెట్టే కన్నా కొద్ది సేపటి క్రితం విశ్వ‌విద్యాల‌య ప్రాంగ‌ణంలోని మ‌హాత్మ గాంధీ విగ్ర‌హానికి శ్రద్ధాంజలి ఘటించి వ‌చ్చాను. 60 సంవ‌త్స‌రాల కింద‌ట ఏర్పాటు చేసిన మ‌హాత్ముని ఈ స్మార‌క‌ం మ‌న రెండు దేశాల మ‌ధ్య స్నేహ‌ బంధం ఎంత పాత‌దో, దృఢ‌మైందో తెలియ‌జేస్తోంది. మ‌న జాతీయాభివృద్ధికి మ‌న రెండు దేశాల స‌మాజాలు విద్య‌కు ఇస్తున్న విలువ‌ను కూడా ఇది చాటిచెబుతోంది.

భార‌త్‌లో మాకో ప్రాచీన ఆర్యోక్తి ఉంది. అదేమిటంటే, ఇచ్చిన‌ కొద్దీ పెరిగే నిధి ఏమైనా ఉందంటే అదే విద్య‌ అని. విజ్ఞానాన్ని ఎంత పంచితే మ‌న‌లో అది అంత‌గా పెరుగుతుంది.

మీకు కూడా ఇలాంటి సామెతే ఉంద‌ని విన్నాను. పైసలు ఉప‌యోగించిన‌కొద్దీ ఖ‌ర్చ‌వుతాయి. కానీ చ‌దువునెంత‌గా ఖ‌ర్చు చేస్తే అంత పెరుగుతుందీ అని.

మిత్రులారా!

పురాత‌న ఖండంలో కెన్యా ఓ యువ‌ దేశం. అనేక‌ రంగాలలో అగ్ర‌గామిగా మార్గ‌నిర్దేశ‌ం చేస్తున్న యువ‌ దేశం.

నోబల్ శాంతి బ‌హుమ‌తిని అందుకున్న తొలి ఆఫ్రిక‌న్ మ‌హిళ‌గా చ‌రిత్ర‌కెక్కిన ప్ర‌పంచ విఖ్యాత ప‌ర్యావ‌ర‌ణ ఉద్య‌మ‌కారిణి వాంగ‌రి మాథయ్ కెన్యా వాసి. ఈ విశ్వవిద్యాల‌యం విద్యార్థి కూడా.

ఆస్కార్ గెలిచిన తొలి ఆఫ్రిక‌న్ లుపితా ఎన్‌యోంగో కూడా కెన్యా మూలాలున్న‌ వారే. ఇక ప్ర‌పంచ మారథాన్ రేసుల‌లో కెన్యా ర‌న్న‌ర్లు అగ్రగాములుగా ఆధిపత్యం వహిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే.

అంతే కాదు, ఆధునిక సాంకేతిక అభివృద్ధికీ కెన్యా వాతావ‌ర‌ణం దోహ‌దం చేస్తోంది. తూర్పూ ఆఫ్రికా దేశాల‌కు అత్యంత కీల‌క‌మైన ఆర్థిక‌, ర‌వాణా కేంద్రంగా నిలుస్తోంది. 2007లో ఆవిష్కృత‌మైన M-Pesa సాంకేతికతకు కెన్యానే వేదికైంది. ఆ ఐడియా ప్ర‌పంచ స్వ‌రూపాన్నే మార్చేసింది. కేవ‌లం కెన్యాలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా మొబైల్ మ‌నీ సేవ‌ల‌కు దారి తీసింది. ఆర్థిక‌ రంగాలలోవెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు సాధికారితను క‌ల్పించేందుకు కార‌ణ‌మైంది. ఈ కెన్యా త‌ర‌హానే ఇప్పుడు భార‌తదేశంలో కూడా ఉంది.

ప్రియ‌మైన విద్యార్థులారా,

నేడు కెన్యా, భార‌తదేశం ప్ర‌జాస్వామ్యం వర్ధిల్లుతున్న దేశాలు. త‌మ ప్ర‌జ‌ల శాంతి, శ్రేయ‌స్సుల‌ను కోరుకుంటున్న అభివృద్ధి చెందుతున్న దేశాలు. మ‌న‌ది త‌ర‌త‌రాల బంధం. శ‌తాబ్దాలుగా వాణిజ్యం, సంస్కృతి, వ్యాపారం, సంప్ర‌దాయాలు, ఆలోచ‌న‌లు, ఆదర్శాలు, న‌మ్మ‌కాలు, విలువ‌లు మ‌న రెండు స‌మాజాల‌ను క‌లిపాయి. ఈ హిందూ మ‌హాస‌ముద్ర వెచ్చ‌ని జ‌లాలు మ‌న రెండు దేశాల మ‌ధ్య ప్ర‌జ‌ల బంధానికి వంతెనగా నిలిచాయి. కెన్యాలో 42 జాతులు ఉంటే, భార‌త సంత‌తి వారిని 43వ జాతిగా పిలుస్తార‌ని నాకు తెలుసు. మీ స‌మాజంలోని అత్యున్న‌త విలువ‌ల మాదిరిగానే భార‌తదేశం కూడా ఎంతో భిన్న‌మైన సంస్కృతులున్న దేశం. ప్ర‌జాస్వామ్యం, స్వేచ్ఛ‌, స‌మాన‌త్వాలే ఆధునిక భార‌తదేశ సారాంశం.

మిత్రులారా,

నిన్న సాయంత్రం నేనూ, శ్రేష్ఠుడైన అధ్య‌క్షుడు శ్రీ కెన్యాటా ఇక్క‌డి భార‌తీయ సంత‌తి వారితో చిర‌స్మ‌ర‌ణీయ స‌మావేశం జ‌రిపారం. వారంతా ద‌శాబ్దాల కింద‌ట కెన్యాను త‌మ సొంతిల్లు చేసుకున్న‌వారు. కెన్యా ప‌ట్ల వారికున్న ఆప్యాయ‌త అపారం. మ‌న రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు ముందుకు సాగ‌డంలో వారి పాత్ర గ‌ణ‌నీయ‌మైంది. ప్ర‌జ‌ల మ‌ధ్య అల్లుకున్న క‌ల‌యిక మ‌న‌ నవీన భాగ‌స్వామ్య ల‌క్ష్యాల‌కు పునాది.

భార‌తదేశం, ఆఫ్రికా కలిస్త ఈ మాన‌వాళిలో మూడో వంతు ఉంటామనే సంగ‌తిని మ‌నం మ‌రచిపోకూడ‌దు. ఎవ‌రెంతగా ఏమ‌న్నా, మ‌న‌ల్ని కిందికి లాగే వారు ఉన్నా మ‌నం ప‌ట్టించుకోవాల్సిన పని లేదు. ఒక‌దానితో మరొక‌టి క‌ల‌సిపోయిన ఈ ప్ర‌పంచంలో మ‌నం ఎంత మాత్రం అల్పసంఖ్యాకవర్గాలం కాదు. మ‌న భాగ‌స్వామ్యాన్ని మ‌రింత దృఢంగా, సుదీర్ఘంగా కొన‌సాగించాల‌ని కోరుకుంటున్నాం.

ఈ మ‌న భాగ‌స్వామ్యం పాత‌ ప‌ద్ధ‌తులలో కాకుండా, ఇరు వైపులా ప్ర‌జ‌లను సశక్తిమంతులను చేసేటట్లు, ఇరువురి ఆర్థిక శ్రేయోఫ‌లాల్ని పంచుకునేటట్లు, 21వ శ‌తాబ్ధి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునేటట్లు, మ‌న స‌మాజాల‌కు ఎదుర‌య్యే ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త స‌వాళ్ళ‌కు స్పందించేటట్లు, అన్నింటికి మించి ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకునేటట్లు, ప్రాంతీయంగానే కాకుండా ప్ర‌పంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ప్ర‌యోజ‌న‌కారిగా ఉండేటట్లు కొన‌సాగాలి.

మిత్రులారా,

ఆఫ్రికాలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌లలో కెన్యా అత్యంత బ‌లీయ‌మైన దేశం. బ‌ల‌మైన సంప్ర‌దాయాలున్న దేశ‌మిది. అంతేగాకుండా అపార‌మైన అవ‌కాశాల గ‌ని కూడా. హిందూ మ‌హాస‌ముద్రానికి అటు వైపు భార‌త్ కూడా ఏటా 7.6 శాతం వృద్ధితో ఓ గొప్ప ఆర్థిక విప్ల‌వానికి నాంది ప‌లుకుతోంది. సుస్థిర ఆర్థికాభివృద్ధిని కొన‌సాగించ‌డమే మ‌న రెండు దేశాల క‌ర్త‌వ్యం. ఇదే అందివ‌స్తున్న అవ‌కాశాల్లో మ‌న రెండు దేశాలూ క‌ల‌సి ప‌నిచేయ‌డానికి దారి వేస్తోంది. కేవ‌లం రాజ‌కీయంగానే కాదు.. ఆర్థిక‌, సామాజిక‌, అభివృద్ధి రంగాల్లో , వివిధ స్థాయిల‌లో కూడా క‌ల‌సి ప‌నిచేయ‌డానికి అవ‌కాశాలున్నాయి.

ఇప్ప‌టికే మ‌న రెండు దేశాల మ‌ధ్య గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా వాణిజ్యం జ‌రుగుతోంది. కెన్యాలో గ‌ణ‌నీయంగా ఉన్న భార‌తదేశ కంపెనీలే మ‌న భాగ‌స్వామ్య బ‌లానికి సూచిక‌లు. ఇవి రెండు స‌మాజాల్లోనూ మ‌న యువ‌త‌రానికి ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పిస్తాయి. వ్యాపార‌, పెట్టుబ‌డుల ఆదాన‌ప్ర‌దానాలు పెరుగుతున్న స‌మ‌యాన వివిధ రంగాల్లో క‌ల‌సి త‌యారీకున్న అవ‌కాశాల‌ను మ‌న రెండుదేశాలు ప‌రిశీలించాలి. ఇది కేవ‌లం భార‌త్‌, కెన్యాల కోస‌మే కాదు. యావ‌త్ ఆఫ్రికా, ఇత‌ర ప్రాంతాల‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ దిశ‌గా త‌క్ష‌ణ‌మే నా మ‌దికి త‌ట్టిన రంగం- ఆరోగ్య‌ రంగం.

ఈ రంగంలో భార‌తదేశానికి ఉన్న అనుభ‌వం కెన్యాలో వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌లు, సామ‌ర్థ్యాల పెంపున‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. వైద్య నైపుణ్యాల్లో మాకున్న ప్ర‌త్యేకత‌లు కెన్యా యువ‌త‌రానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఫార్మాస్యూటిక‌ల్స్‌లో పెరుగుతున్న మ‌న వాణిజ్య బంధం, త‌యారీకీ విస్త‌రించ‌వ‌చ్చు. కెన్యా వైద్య అవ‌స‌రాల‌కు వారు స్పందించ‌వ‌చ్చు. ప్రాంతీయంగా ఇక్క‌డి ఆరోగ్య రంగం డిమాండ్ల‌ను తీర్చ‌టానికి వీల‌వుతుంది. కెన్యా భ‌విష్య‌త్తు ఇక్క‌డి యువ‌త చేతుల్లోనే ఉంది. అదే విధంగా భార‌తదేశ భ‌విష్య‌త్తు కూడా 80 కోట్ల యువ‌భారతం చేతుల్లో ఉంది. వారి కోసం 2022క‌ల్లా 500 మిలియన్ ఉద్యోగాలు క‌ల్పించాల‌ని మేం ల‌క్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం జాతీయ ఉద్య‌మం చేప‌ట్టాం. మ‌న యువ‌త‌రానికి ఇంత‌కుముందెన్న‌డూ చూడ‌నంత భారీస్థాయిలో నైపుణ్యాభివృద్ధి క‌ల్పించ‌నిదే ఈ లక్ష్యాన్ని చేరుకోవ‌డం అసాధ్యం. స్కిల్ ఇండియా, స్టార్ట‌ప్ ఇండియా కార్య‌క్ర‌మాలు భార‌తదేశంలో ఉపాధి క‌ల్ప‌న రూపురేఖ‌ల‌ను మార్చ‌బోతున్నాయి.

మా అనుభ‌వాలు, సామ‌ర్థ్యాల‌ను కెన్యా మిత్రుల‌కు కూడా అందించ‌డానికి మేం సిద్ధంగా ఉన్నాం. విద్యారంగంలో వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌ల ఏర్పాటులో స‌హాయ‌స‌హ‌కారాలు అందించుకుంటున్నాం. కానీ అది స‌రిపోదు. టెలికాం, వ్య‌వ‌సాయం, ఇంధ‌నం, సమాచార సాంకేతిక‌త త‌దిత‌ర రంగాల‌వైపు కూడా మ‌నం చూపు సారించాల్సిన త‌రుణ‌మిది. ఈ రంగాలు మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను ఆధునికీక‌రించ‌డమే గాకుండా, మ‌న నిపుణులైన యువ‌త‌రానికి ఉద్యోగాలు కూడా చూపిస్తాయి. చౌకగా ఆధునిక‌, సమ‌ర్థ సాంకేతిక‌త‌ల‌ను ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం మ‌న‌కుంది. మ‌న స‌మాజాల్లోని బ‌ల‌హీన‌ వ‌ర్గాల ప్ర‌జ‌ల జీవితాన్ని స్థానిక ఆలోచనకు సాంకేతిక‌త తోడైతే ఎలా మార్చేస్తోందో M-Pesa నిరూపించింది.

అయితే మ‌న భాగ‌స్వామ్యం, ఆర్థిక బంధం దృఢ‌మైన‌ వేళ మ‌న‌పై ప‌ర్యావ‌ర‌ణ ప‌ర‌మైన బాధ్య‌త కూడా పెరుగుతుంది. త‌ల్లి వంటి భూమిని గౌర‌వించ‌డం మ‌న రెండు దేశాల సంప్ర‌దాయాల్లో భాగం. ‘మ‌న ప‌ర్యావ‌ర‌ణాన్ని నాశ‌నం చేయ‌ని అభివృద్ధిని మ‌నం ప్రోత్స‌హించాలి’ అని నోబ‌ల్ పుర‌స్కార గ్ర‌హీత వాంగారి మాథయ్ అన్న మాట‌లు ఈ సంద‌ర్భంగా గ‌మ‌నార్హం.

ప్ర‌కృతితో క‌ల‌సి మెల‌సి జీవించే మ‌న ఉమ్మ‌డి సంప్ర‌దాయం హరిత ఆఫ్రికా కోసం భాగ‌స్వామ్యానికి మంచి పునాది. ఈ భాగ‌స్వామ్యం కొత్త ఆర్థిక అవ‌కాశాల‌ను కూడా సృష్టిస్తుంది. భార‌తదేశం ప్ర‌తిపాదించిన ఇంటర్ నేషనల్ అలయన్స్ ఆవిర్భావానికి ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణే ప్ర‌ధాన సూత్రిక‌. పున‌రుత్పాద‌క ఇంధ‌నంలో సూర్యుడు మ‌నకు శాశ్వ‌త వ‌న‌రు. ఇప్ప‌టికే 120 దేశాల భాగ‌స్వామ్య‌మున్న ఈ కూట‌మి కెన్యాతో భాగ‌స్వామ్యంలో కూడా కీల‌క‌పాత్రను పోషిస్తుంది.

అదే విధంగా భార‌తీయ పురాత‌న సంప్ర‌దాయ యోగా కూడా ప్ర‌కృతితో మ‌మేక‌మై జీవించడాన్ని గురించి నేర్పుతుంది. జూన్ 19న కెన్యా విశ్వ‌విద్యాల‌యంలో సుమారు 7,000 మంది ఔత్సాహికులు యోగా చేశార‌ని తెలిసి ఎంతో ఆనంద‌మ‌నిపించింది.

మిత్రులారా,

ఆర్థిక‌ రంగంలో ముందుకువెళ్లడం మ‌న రెండు దేశాల ప్రాధాన్యాంశ‌మే. అయితే అదే స‌మ‌యంలో మ‌న ప్ర‌జ‌ల భ‌ద్ర‌తను, ర‌క్ష‌ణను గురించి కూడా మ‌నం మ‌ర‌చిపోలేం. మ‌న ప్ర‌జ‌లు సుర‌క్షితంగా, భ‌ద్రంగా ఉన్న‌ప్పుడే మ‌న ఆర్థిక‌, సామాజిక అభివృద్ధికి అర్థం.

అధ్య‌క్షుడు శ్రీ ఉహురు కెన్యాట్టా గ‌త అక్టోబ‌రులో న్యూ ఢిల్లీలో చెప్పిన‌ట్లుగా ”తీవ్ర‌వాదపు భూతానికి స‌రిహ‌ద్దులుగానీ, మ‌తంగానీ, జాతిగానీ, విలువ‌లుగానీ లేవు”.

మ‌న స‌మాజపు మూల స్వ‌భావాల‌నే స‌వాలు చేసేలా అహింస‌, ద్వేష‌భావాల‌ను పెంచే ప్ర‌చార‌కుల మ‌ధ్య మ‌నం జీవిస్తున్నామిప్ప‌డు. కెన్యా ప్ర‌గతిశీల పౌరులుగా, ఆఫ్రికా స‌భ్యులుగా ఈ విప్ల‌వ సిద్ధాంతాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. అంతేకాకుండా తీవ్ర‌వాదానికి ఆశ్ర‌య‌మిచ్చే వారితో పాటు తీవ్ర‌వాదుల‌ను రాజ‌కీయ పావులుగా వాడే వారిని అంతే స‌మానంగా ఖండించాలి. ఈ తీవ్ర‌వాద సిద్ధాంతాల‌ను తిప్పికొట్ట‌డంలో యువ‌త‌రానిదే కీల‌క‌ పాత్ర‌.

విద్యార్థులారా,

స‌ముద్ర‌యాన‌ వాణిజ్య దేశాలుగా, హిందూ మ‌హాస‌ముద్ర రిమ్ అసోసియేష‌న్ స‌భ్యులుగా స‌ముద్రంపై నుండి వ‌చ్చే స‌వాళ్ళ ప‌ట్ల కూడా మ‌నం అప్ర‌మ‌త్తంగా ఉండాలి. స‌ముద్ర‌పు దొంగ‌లు మ‌న వాణిజ్యానికి, నావికుల‌కు స‌వాలుగా నిల‌వ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి. కెన్యాకు వ‌చ్చే ముందు నేను మొజాంబిక్‌, ద‌క్షిణ ఆఫ్రికా, టాంజానియాల‌ను కూడా సంద‌ర్శించాను. వెయ్యేళ్ళ‌కు పైగా తూర్పు ఆఫ్రికా తీర‌ ప్రాంతంతో భార‌తదేశానికి బ‌ల‌మైన స‌ముద్ర‌యాన సంబంధాలున్నాయి. ఇవాళ అదే తూర్పుతీరం అనేక సంక్లిష్ట‌, వ్యూహాత్మ‌క భ‌ద్ర‌త స‌వాళ్ళ‌ను ఎదుర్కొంటోంది.

ప్రియ‌మైన విద్యార్థులారా,

ఇది ప‌ర‌స్ప‌ర ఆధారిత యుగం. అపారంగా పుట్టుకొస్తున్న అవ‌కాశాల‌తోపాటే స‌వాళ్ళు కూడా ఉన్నాయి. వాటిలో నుండే మ‌నం రేప‌టి భ‌విష్య‌త్‌ను, దేశ భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దుకోవాలి. సుర‌క్షిత‌ం, శ్రేయోభరితమైన కెన్యాతో పాటు బ‌ల‌మైన కెన్యా మీ అంద‌రి ల‌క్ష్యం కావాలి. దీన్ని మీ నుండి లాక్కొని పోయే అవ‌కాశం ఎవ్వ‌రికీ ఇవ్వ‌కూడ‌దు. మీ ల‌క్ష్యాల‌ను సాధించే క్ర‌మంలో ఈ దేశ నిర్మాణ‌మ‌నేది నిరంత‌ర ప్ర‌క్రియ‌నే సంగ‌తి మీకు అర్థ‌మ‌వుతుంది. ఇత‌రులు కూడా ఉన్న‌తంగా ఆలోచించేలా, నిర్మాణాత్మ‌క చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్రోత్స‌హించేలా మీ చ‌ర్య‌లు ఉండాలి. ఇత‌రుల‌కు స్ఫూర్తిగా నిల‌వాలి. క‌ష్ట‌ప‌డాలి. స‌మైక్యంగా క‌ల‌సిక‌ట్టుగా ఉన్న‌ప్పుడే ఆ క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం మ‌న‌దవుతుంది. అదే మీ ల‌క్ష్యం కావాలి. మీ లక్ష్యాన్ని చేరుకునే క్ర‌మంలో భార‌తదేశం మీకు విశ్వ‌స‌నీయ భాగ‌స్వామిగా ఉంటుంది.

మేం ఎలాంటి భాగ‌స్వాముల‌మంటే..

– మీ విజ‌యాన్ని మా విజ‌యంగా ఆనందించే భాగ‌స్వాములం;

– ఎల్ల‌ప్పుడూ తోడు నిలిచే భాగ‌స్వాములం;

– అవ‌స‌ర‌మైన త‌రుణంలో మీ వెంట నిలిచే భాగ‌స్వాములం.

మీతో మాట్లాడ‌డం ఎంతో ఆనందంగా ఉంది.

నాకు ఈ అవ‌కాశాన్నిచ్చిన నైరోబీ విశ్వ‌విద్యాల‌యానికి, ఆచార్యవర్గానికి, అందరికన్నా మరీ ముఖ్యంగా కెన్యాకు భ‌విష్యత్ అయినటువంటి కెన్యా యువ విద్యార్థుల‌కు ఇవే నా కృత‌జ్ఞ‌త‌లు.

అసంతే సనా, ధన్యవాద్.

మళ్లీ మళ్లీ ధ‌న్య‌వాదాలు.