ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేదరిక నిర్మూలన లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో మార్పులకు ఆమోదముద్ర వేసింది. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎమ్) కింద వడ్డీ రాయితీ ప్రయోజనాలను మరో 100 జిల్లాలకు విస్తరించేందుకు, హిమాయత్ కార్యక్రమం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కార్యక్రమాలకు కేటాయింపులు మరింత సరళం చేసేందుకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2023-24 నాటికి అస్సాం మినహా మిగతా ఈశాన్య రాష్ర్టాలన్నింటికీ నిధుల కేటాయింపునకు ప్రస్తుతం అమలులో ఉన్న అర్హతలను సడలించే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
ఎ. ఎన్ఆర్ఎల్ఎమ్ విధానాల అమలులో మార్పులు.
i. సామాజిక, ఆర్థిక, కులపరమైన జనాభా గణాంకాలు, ఎస్ఇసిసి డాటాబేస్‌కు అనుగుణంగా పేదరిక నిర్మూలనకు లక్ష్యాలతో కూడిన పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలుపరచడం- ఎస్ఇసిసి డేటాను ఉపయోగించుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు మరింత ఫోకస్‌తో కూడిన లక్ష్యనిర్దేశిత కార్యక్రమాలు ప్రవేశపెట్టేందుకు అవకాశం కలుగుతుంది. పంచాయత్ రాజ్ సంస్థలు, స్వయంసహాయక బృందాలను భాగస్వాములను చేస్తూ పేదరిక రహిత పంచాయతీల అభివృద్ధికి ఎస్ఇసిసి డాటాను ఎన్ఆర్ఎల్ఎమ్ ఉపయోగించుకుంటుంది.
ii. మరో 100 జిల్లాలకు వడ్డీ రాయితీని విస్తరిస్తారు. మహిళా స్వయం సహాయ బృందాలు (ఎస్‌హెచ్ జీ లు) 3 లక్షల రూపాయల వరకు 7 శాతం రాయితీ వడ్డీపై రుణాలు అందుకునే వీలు కలుగుతుంది. రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి అదనంగా మరో 3 శాతం వడ్డీ రాయితీ అందుతుంది. దీని వల్ల వాస్తవ వడ్డీరేటు 4 శాతానికే పరిమితం అవుతుంది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఈ వడ్డీ రాయితీని మరో 100 జిల్లాలకు విస్తరిస్తారు. జిల్లాల గుర్తింపునకు ఈ దిగువ అర్హతలు పరిశీలిస్తారు…
అ) ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ (ఐఏపి) కింద ఇప్పటివరకు పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు జరుగుతున్న 150 జిల్లాలు మినహా కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఆ) ఆయా రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న మొత్తం జిల్లాల సంఖ్య ఆధారంగా ప్రోరాటా విధానంలో ఇతర జిల్లాలను కూడా ఈ పథకంలో భాగస్వాములుగా చేర్చుతూ ఉంటారు. ఎన్ఆర్ఎల్ఎంకు చెందిన ఐఏపి జిల్లాల నుంచి అర్హత గల జిల్లాలను రాష్ర్టాలు గుర్తిస్తాయి.
ఇ) పేదరిక నిష్పత్తి ఆధారంగా ఎన్ఆర్ఎల్ఎమ్ కింద ఏకమొత్తంలో కేటాయింపులు చేసే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇస్తారు.
iii. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కింద నైపుణ్యాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. కార్యక్రమాలను మరింత పక్కాగా అమలుపరిచేందుకు, విదేశీ ఉద్యోగాల్లో చేరేందుకు అర్హత సాధించడానికి వీలుగా దీర్ఘకాలిక శిక్షణ కార్యక్రమాల విస్తరణకు డిడియు-జికెవై కింద నిధుల కేటాయింపునకు నిర్దేశించిన ఎన్ఆర్ఎల్ఎమ్ కేటాయింపుల్లో 25 శాతం పరిమితిని తొలగించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌కు, గుర్తింపు పొందిన సంస్థల్లో శిక్షణకు, ఐటిఐ/పాలిటెక్నిక్ సంస్థల్లో ఉత్తీర్ణులైన యువకులతో సహా పేద వర్గాలకు చెందిన గ్రామీణ యువతలో నైపుణ్యాల పునర్నిర్మాణానికి కూడా దీన్ని విస్తరిస్తారు.
iv. ఎన్ఆర్ఎల్ఎమ్ కోసం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వ్యయాలు (పాలనాపరమైన వ్యయాలు)…
అ) ప్రొఫెషనల్ మేనేజ్ మెంట్ వ్యయాల పరిమితిని ఎన్ఆర్ఎల్ఎమ్ కేటాయింపుల్లో 6 శాతానికి పెంచారు.
ఆ) దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన కింద నైపుణ్యాల వృద్ధికి, ప్లేస్‌మెంట్‌కి అయ్యే వ్యయాలను ఎన్ఆర్ఎల్ఎమ్ నిర్వహణ వ్యయాల కింద ఖర్చు చేయడానికి అనుమతిస్తారు.
ఇ) ఎన్ఆర్ఎల్ఎమ్ లోని మానవ వనరుల విభాగాన్ని ప్రపంచ బ్యాంకుతో కుదిరిన ప్రాజెక్టుల అమలు, ఆర్థిక సహకార ఒప్పందం కింద నిర్దేశించిన పరిమితికి వెలుపల ఉంచాలని నిర్ణయించారు.
బి. జమ్ము- కశ్మీర్ కు హిమాయత్ కార్యక్రమం కింద అవసరం ఆధారంగా ఆర్థిక సహాయం అందిస్తారు. హిమాయత్ కార్యక్రమం కింద 235.30 కోట్ల రూపాయల ప్రస్తుత పెట్టుబడి పరిమితిని ఎన్ఆర్ఎల్ఎమ్ బడ్జెట్ కేటాయింపుల స్థూల పరిమితి పరిధిలోనే డిమాండు ఆధారిత కేటాయింపుగా మార్చేందుకు అనుమతిస్తారు. స్కీమ్ మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
సి. అస్సాం మినహా ఈశాన్య రాష్ర్టాలన్నింటికీ నిధుల కేటాయింపు నిమిత్తం ప్రస్తుత అర్హత నిబంధనల నుంచి సడలింపు ఇస్తారు. 2023-24 నాటికి ఆయా రాష్ర్టాల్లోని అన్ని గ్రామీణ గృహాలకు విస్తరిస్తారు. అస్సాం మినహా ఎన్ఆర్ఎల్ఎమ్ పరిధిలోని ఇతర జిల్లాలన్నింటికీ కేటాయింపుల కోసం అర్హత నిబంధనలు సడలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.