నేను రాజకీయాలలో లేనప్పుడు కూడాను.. నేపాల్ ను సందర్శించినపుడల్లా ఈ శాంతి, ప్రేమ భావనలు నాలో ఉదయించేవి. దీనికి ప్రధాన కారణం మీరు చూపించే వాత్సల్యం, మీ ఆదరణ, ఇంకా మీరు పలికే ఆప్యాయమైన ఆహ్వానం , మీ ప్రజలంతా కనబరచే గౌరవాలు.
నిన్నటి రోజున, నేను జనక్ పుర్ లో ఉన్నాను. ఆధునిక ప్రపంచానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చే గడ్డ అది. జనక మహారాజు లోని ఆ వైశిష్ట్యం ఏమిటి ? ఆయుధ నిర్మూలన ద్వారా ప్రేమాభిమానాలతో అందరినీ ఏకం చేయడం. ఆ విధంగా ఆయుధాలను నిర్మూలించి ప్రేమాభిమానాలను పాదుకొల్పే భూమి ఇది.
మిత్రులారా, కాఠ్ మాండూ ను తలచుకున్నపుడల్లా నా మదిలో మెదిలే దృశ్యం కేవలం ఓ నగరానికి సంబంధించింది కాదు. భౌగోళికమైన ఓ లోయ చిత్రం కాదు.. పొరుగునే గల, విడదీయరాని స్నేహం పెనవేసుకున్న నేపాల్ దేశ రాజధాని మాత్రమే కాదు… లిలీ గురజ్ ను, ఎవరెస్ట్ పర్వతాన్ని కలిగిన దేశానికి ఇది రాజధాని కావడంతో పాటు బుద్ధ భగవానుని జన్మస్థలం కూడాను. కాఠ్ మాండూ అంటే- మొత్తం ప్రపంచాన్నే ఇముడ్చుకున్న నగరం. ఈ చిన్ని ప్రపంచం యొక్క చరిత్ర పురాతనమైందీ, ఘనమైందీ అయినటువంటి హిమాలయాలకు సాటి వచ్చేదీనూ.
కాఠ్ మాండూ ఎల్లప్పటికీ నన్ను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఈ నగరం ఎంత వేగంగా పురోగమిస్తున్నదో అంత లోతైనది కూడా. ఇది హిమాలయాల సిగ లోని అమూల్యమైన ఆభరణం. మన సంయుక్త సంస్కృతి- వారసత్వాలకు ఇది ఒక పవిత్రమైన, దివ్యమైన ఆలయం. నేపాల్ గొప్ప సంస్కృతి, విశాల హృదయానికి ఈ నగరంలో విలసిల్లే భిన్నత్వం ఒక ప్రతీక. నాగార్జున అటవీ ప్రాంతం కావచ్చు లేదా శివపురి పర్వతాలు కావచ్చు.. వందలాది జలపాతాలు, ప్రవాహాల ఘోషతో నిండిన ప్రశాంతత కావచ్చు.. లేదా భాగమతి మూలాలు కావచ్చు.. వేల ఆలయాలతో, మంజుశ్రీ గుహ లతో, బౌద్ధ ఆరామాలతో శోభిల్లే ఈ నగరం కచ్చితంగా ప్రపంచంలో అత్యంత విశిష్టమైంది.
ఇక్కడి భవనాల పైకప్పు నుండి ఒక వైపు ధౌలాగిరిని, మరియు అన్నపూర్ణ ను, మరోవైపు సాగర మాతను చూడవచ్చు. వీటినే ఎవరెస్టు, కాంచన జంఘ గా ప్రపంచం పిలుస్తుంది. ఇటువంటి దృశ్యాల సాక్షాత్కారం మరెక్కడైనా సాధ్యమవుతుందా ? సాధ్యమయ్యే ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఒక్క కాఠ్ మాండూ మాత్రమే.
బసంత్ పుర్ నిర్మాణ శైలి, పటాన్ ఖ్యాతి, భరత్ పుర్ శోభ, కీర్తి పుర్ కళా వైభవం, లలిత్ పుర్ లాలిత్యం.. వీటన్నిటికీ తనలో పొదవుకున్న కాఠ్ మాండూ ఇంద్ర ధనుస్సు లోని సప్త వర్ణాలనూ సంలీనం చేసుకుంది. పసుపు, చందనం కలగలసిపోయే రీతిలో అనేక సంప్రదాయాలు ఇక్కడి గాలి లో అల్లుకుపోయి ఉంటాయి. పశుపతినాథ్ సమక్షంలో ప్రార్థనలు, భక్తజన సమూహాల చేరిక, సర్వాధిపతి అయిన దైవ సన్నిధిలోని మెట్ల మీద ఆధ్యాత్మిక గమనం, బుద్ధ భగవానుడి ఆలయ ప్రదక్షిణ సమయంలో ‘ఓం మణి పద్మేహం’ అనే మంత్రోచ్చారణ ప్రతి భక్తుని అడుగులో ప్రతిధ్వనిస్తుంది. ఇలా ఒక రాగం లోని సంగీత స్వరాలన్నీ వాద్య తంత్రులపై ఒకదానితో మరొకటి మమేకం అయినట్లు వినిపిస్తాయి. నెవారి సమాజం నిర్వహించే పండుగల వంటి కొన్ని ప్రత్యేక ఉత్సవాలలో బౌద్ధ, హిందూ విశ్వాసాలు, సంప్రదాయాలు అపూర్వ రీతిలో కలగలసి ఉంటాయని నేను విన్నాను. అలాగే సంస్కృతి- సంప్రదాయాలు కాఠ్ మాండూ లోని హస్తకళా నిపుణులను, హస్తకళా వస్తువులను సాటి లేనివిగా తీర్చిదిద్దాయి. చేతితో తయారు చేసిన కాగితం గానీ, తార లేదా బుద్ధ ప్రతిమలు గానీ భరత్ పుర్ బంకమన్ను లేదా రాయితో రూపొందించిన పాత్రలు గానీ, పటాన్ పట్టణంలో తయారయ్యే కొయ్య- లోహపు వస్తువులు వగైరాలతో కూడిన నేపాల్ విశిష్ట కళా, హస్తకళా నైపుణ్యాల గొప్ప సమ్మేళనమే కాఠ్ మాండూ. ఈ సంప్రదాయాలన్నిటినీ నేపాల్ కొత్త తరం కూడా అనుసరించడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. యువతరం అభిరుచులకు తగినట్లుగా ఈ కళారూపాలన్నీ కొత్తదనాన్ని కూడా సంతరించుకుంటున్నాయి.
మిత్రులారా,
ఇప్పటిదాకా రెండు సార్లు నేను నేపాల్ సందర్శనకు రాగా, రెండు సందర్భాల లోనూ పశుపతినాథుడిని దర్శించుకునే భాగ్యం లభించింది. ఈసారి పశుపతినాథునితో పాటు జనక్ పుర్ ధామం, ముక్తినాథ దర్శనం తో మూడు పుణ్య క్షేత్రాలను సందర్శించుకునే అదృష్టం దక్కింది. ఈ మూడూ ముఖ్యమైన యాత్రస్థలాలు మాత్రమే కాదు.. అవి చెక్కుచెదరని, దృఢమైన ఎవరెస్టు శిఖరం వంటి నేపాల్, భారత్ ల మైత్రికి చిహ్నాలు కూడాను. భవిష్యత్తులో మరో సారి నేపాల్ సందర్శన అవకాశం లభిస్తే బుద్ధ దేవుని జన్మస్థలం లుంబిని దర్శనం వీలయ్యే విధంగా నా కార్యక్రమాన్ని రూపొందించుకుంటాను.
మిత్రులారా,
మన రెండు దేశాల్లోనూ గల ఆధ్యాత్మిక విలువలతో కూడిన నైతిక వ్యవస్థలు, శాంతితో పాటు ప్రకృతితో సమతూకం మొత్తం మానవాళికి, ప్రపంచానికి వారసత్వాలు. కాబట్టే శాంతి ని అన్వేషిస్తూ ప్రపంచం లోని పలు ప్రాంతాల నుండి పర్యటకులు భారత్, నేపాల్ దేశాల వైపు ఆకర్షితులవుతున్నారు. కొందరు వారాణసీ కి, మరికొందరు బుద్ధగయ కు వెళ్తుండగా ఇంకొందరు హిమాలయాల ఒడిలో సేద దీరుతుంటే.. మరికొందరు బౌద్ధ మఠాలలో సాధువుల వలె జీవిస్తున్నారు. కానీ, వీరందరి అంతిమ లక్ష్యం ఒక్కటే.. ఉమ్మడి విలువలు గల భారతదేశం, నేపాల్ లలోనే ఆధునిక జీవనం లోని ఆయాసాన్ని అధిగమించగల పరిష్కారం లభిస్తుందన్నది వారి విశ్వాసం.
మిత్రులారా,
పశుపతినాథుడు కాఠ్ మాండూ లో భాగమతి నది తీరాన కొలువై వుండగా, కాశీ విశ్వనాథుడు గంగా నది ఒడ్డున వెలిశాడు.. అలాగే బుద్ధుని జన్మస్థలం లుంబిని, బౌద్ధ వారసత్వ కేంద్రాలైన సారనాథ్, బుద్ధగయ తదితర ప్రాంతాల నుండి శాంతి సందేశం ప్రపంచానికి ప్రసరించింది.
మిత్రులారా,
మనందరిదీ వేలాది ఏళ్ల చరిత్రల సుసంపన్న, ఉమ్మడి వారసత్వం. ఇది మన రెండు దేశాల యువతకు ఒక వారసత్వ సంపద. వారి గతానికి సంబంధించిన మూలాలు, వారి భవిష్యత్ ఆశల మోసులకు చెందిన వర్తమాన బీజాలు కూడా ఇందులోనే ఉన్నాయి.
మిత్రులారా,
ప్రపంచం మొత్తం నేడు అనేక రకాలైన మార్పుల శకంలో సాగుతోంది. అంతర్జాతీయ వాతావరణం పలు విధాలైన అనిశ్చితితో, హెచ్చుతగ్గులతో నిండి వుంది. అయితే, మిత్రులారా.. యావత్తు ప్రపంచం ఒకే కుటుంబం అన్నదే వేల ఏళ్లుగా భారతీయ తత్త్వం బోధిస్తున్న సందేశం. ఈ తత్త్వశాస్త్రం చూపిన ‘ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అందరి తోడ్పాటుతో అందరి ప్రగతి’’ మార్గాన… విదేశీ సహకార విధానంలో అదే పవిత్రతను అనుసరిస్తూ మేం ముందుకు సాగుతున్నాం. భారత వేదాల్లో ఒక ప్రార్థన ఉంది…
सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामया:। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग्भवेत्।
సర్వే భవన్తు సుఖిన..
సర్వే సంతు నిరామయ:
సర్వే భద్రాణి పశ్యంతు..
మాకశ్చిత్ దుఃఖ భాగ్భవేత్|
అంటే… ‘‘అందరూ సంతోషంగా ఉండాలి… అందరూ ఆరోగ్యంగా ఉండాలి.. ప్రతి ఒక్కరికీ శ్రేయోదాయక జీవనం లభించాలి. ఏ ఒక్కరు బాధకు గురి కారాదు’’ అని అర్థం.
భారతీయ యోగులు సదా సర్వజన శ్రేయస్సునే కలలుగన్నారు. ఈ సదాశయ సాధన ప్రాతిపదిక గానే ప్రతి ఒక్కరి ప్రగతిని కాంక్షిస్తూ మాతో తీసుకుపోయే విధంగా మా విదేశీ విధానం రూపొందింది. అంతేకాదు.. ప్రత్యేకించి భారతదేశానికే గల అవకాశాలను, అనుభవాలను పొరుగు దేశాలతో పంచుకుంటున్నాం. ‘నీబర్ హుడ్ ఫస్ట్’ (పొరుగువారే ముందు) అన్నది మా విదేశీ విధానంలో భాగం మాత్రమే కాదు.. అదే మా జీవన విధానం. ఇందుకు అనేక నిదర్శనాలు ఉన్నాయి. భారతదేశం తానే ఒక వర్ధమాన దేశమైనప్పటికీ 50 ఏళ్లుగా ప్రపంచం లోని 160 దేశాలలో సామర్థ్య నిర్మాణానికి ఇండియన్ టెక్నికల్ అండ్ ఇకనామిక్ కోఆపరేశన్ ప్రోగ్రామ్ ద్వారా చేయూతను ఇస్తోంది. ప్రత్యేకించి ఆయా దేశాల అవసరాలకు అనుగుణంగా మేం సహకారం అందిస్తున్నాము.
నిరుడు దక్షిణాసియా ఉపగ్రహాన్ని భారతదేశం అంతరిక్షం లోకి పంపింది. మా అంతరిక్ష పరిశోధన సామర్థ్యం ఫలితమైన ఈ ఉపగ్రహ సేవలు ఒక బహుమతి గా మా పొరుగు దేశాలకూ లభిస్తున్నాయి. ఎస్ఎఎఆర్ సి (సార్క్) శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొనేందుకు నేను ఇక్కడకు వచ్చిన సందర్భంగా అదే వేదిక నుండి నేను ఈ ప్రకటన చేశాను. అదే సమయం లో అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఎలా నిర్మించాలన్న అంశం పైనా మేము దృష్టి ని సారించాము. ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను ఏ దేశమూ తనంతట తాను పరిష్కరించుకోవడం సాధ్యం కాదు కాబట్టే ఈ ప్రయత్నం. జల వాయు పరివర్తన నేపథ్యం లో భారతదేశం- ఫ్రాన్స్ లు 2016 లో అంతర్జాతీయ ఒప్పందం ప్రాతిపదిక గా ఓ కొత్త సంస్థ కు రూపాన్ని ఇవ్వడం ఇందుకు ఒక ఉదాహరణ. ఈ విప్లవాత్మక ఆరంభం ఇప్పుడొక విజయవంతమైన ప్రయోగంగా మార్పు చెందింది. ఆ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షులు శ్రీ మాక్రాన్, ఇతర దేశాలకు చెందిన దాదాపు 50 మంది నాయకులు ఈ ఏడాది మార్చి నెల లో మేం న్యూ ఢిల్లీ లో నిర్వహించిన తొలి ‘అంతర్జాతీయ సౌర కూటమి’ శిఖర సమ్మేళనం లో పాల్గొన్నారు. జల వాయు పరివర్తన సవాలు ను ఎదుర్కొనడంలో అటువంటి సాంకేతిక, ఆర్థిక భాగస్వామ్యాలు ఏర్పడేందుకు ఈ ప్రయత్నాలు దోహదం చేస్తాయి. ఇది ప్రత్యేకించి చిన్న వర్ధమాన దేశాల అవసరాలను తీర్చగలదన్న విశ్వాసం నాకుంది.
మిత్రులారా,
భారతీయులు నేపాల్ వైపు దృష్టి సారించినపుడల్లా ఇక్కడి పర్యావరణాన్ని, ప్రజలను చూసి ఎంతో సంతోషిస్తారు. ఉజ్జ్వల భవిష్యత్తు ను నిర్మించుకోవడంపై సంపూర్ణ ఆశాభావం, ఆకాంక్షభరిత వాతావరణం నేపాల్‌లో సదా కనిపిస్తూంటుంది. అలాగే బలమైన ప్రజాస్వామ్యం సహా ‘ ప్రాస్పరస్ నేపాల్, హ్యాపీ నేపాలీస్ (సమృద్ధ నేపాల్.. నేపాలీయుల ఆనంద జీవనం) అనే ఆదర్శం కోసం ఆరాటం అందరి లోనూ ప్రస్ఫుటం అవుతుంటాయి. ఇటువంటి పరిస్థితులను సృష్టించడం లో మీరంతా మీ వంతు పాత్రను సమర్థంగా పోషించారనడంలో సందేహం లేదు.
2015 లో భూకంపం తాలూకు భారీ దుర్ఘటన దేశాన్ని కుదుపేసినపుడు నేపాల్ ప్రజలు అంతు లేని సహనాన్ని, మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించారు. ప్రత్యేకించి ఈ విషయంలో కాఠ్ మాండూ యావత్తు ప్రపంచానికే ఉదాహరణగా నిలచింది. ఒకవైపు ఇంతటి భారీ విపత్తు నుండి కోలుకుంటూనే మరో వైపు దేశంలో సరికొత్త వ్యవస్థ కు ఊపిరి పోయడంలో మీ సమాజం చూపిన చిత్తశుద్ధికి, కఠోర శ్రమకు ఇది ఒక నిదర్శనం. ఒక విధంగా చూస్తే భూకంప విలయం తరువాత కూలిన భవనాలు మాత్రమే కాక మొత్తం దేశం, సమాజం అంతా పునర్నిర్మితం అయిందని చెప్పవచ్చు. నేపాల్‌లో నేడు సమాఖ్య, ప్రాంతీయ, స్థానిక స్థాయులలో మూడు అంచెల ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ మూడు అంచెలకూ ఏడాది వ్యవధిలో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ శక్తి మీలో అంతర్గతంగానే ఉంది గనుకే నేను మిమ్మల్నందర్నీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
మిత్రులారా,
యుద్ధ దశ నుండి బుద్ధ భగవానుడికి చేరువ కావడం దాకా నేపాల్ సుదూరం ప్రయాణించింది. ఆయుధ ఆధిపత్యాన్ని త్యజించి ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుందీ దేశం. యుద్ధం నుండి బుద్ధుని దాకా సాగిన ప్రయాణం ఇదే. అయితే, గమ్యం ఇంకా చాలా దూరం లోనే ఉంది. దాన్ని చేరుకోవడానికి ప్రయాణం మరింతగా కొనసాగాల్సి ఉంది. ఒక విధంగా మనం ఇప్పుడు ఎవరెస్టు శిఖరారోహణలో మొదటి మెట్టు మీద ఉన్నాం. కాబట్టి శిఖరారోహణ మన లక్ష్యం కావాలి. ఎవరెస్టును జయించే కాంక్షతో వచ్చే పర్వతారోహకులకు నేపాల్ శెర్పాలు ఎంతో మద్దతు, తోడ్పాటు అందిస్తుంటారు. అదేవిధంగా నేపాల్ ప్రగతి పయనంలో శెర్పా పాత్ర ను పోషించేందుకు భారతదేశం సదా సంసిద్ధం అని నేను ప్రకటిస్తున్నాను.
నేను పలికిన వేరువేరు పదాల లోని సందేశ సారాంశం ఇదే.. నేపాల్ సందర్శన సందర్భంగా నిన్న, నేడు నా మది లోని భావనలను నేను ప్రస్ఫుటం చేశాను. నేపాల్ ప్రధాని శ్రీ ఓలీ గత నెల లో భారతదేశ పర్యటనకు వచ్చినపుడు కూడా ఇదే భావన ను వ్యక్తం చేశాను. నేపాల్ తన అవసరాల, ప్రాధమ్యాల ప్రాతిపదికన ముందంజ వేయాలని నేను ఎంతో బాధ్యతాయుతంగా చెబుతున్నాను. ఆ దిశగా నేపాల్ విజయ సాధనలో భుజం కలిపి నడిచేందుకు భారతదేశం సదా సిద్ధమే అంటూ పునరుద్ఘాటిస్తున్నాను. మీ విజయం తోనే భారతదేశం విజయం ముడిపడి ఉంది.. నేపాల్ సంతోషం లోనే భారతదేశం యొక్క సంతోషం ఇమిడి వుంటుంది.
మీ ప్రతి అవసరంలోనూ ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ మేం మీతో కలసి నడుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. రైలు మార్గాలు, రహదారుల నిర్మాణం కావచ్చు.. జల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కావచ్చు.. విద్యుత్తు లైన్ లు వేయడం కావచ్చు.. సమగ్ర తనిఖీ కేంద్రాల ఏర్పాటు లేదా చమురు గొట్టపు మార్గాల నిర్మాణం వంటి అంశాలలో మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా భారత్- నేపాల్ మధ్య సాంస్కృతిక బంధాలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికీ మా కృషిని కొనసాగిస్తాం. కాఠ్ మాండూ తో భారతదేశాన్ని కలిపే రైలు మార్గం నిర్మాణంపై సమగ్ర పథక నివేదిక (డిపిఆర్) రూపకల్పన ఇప్పటికే ప్రారంభమైంది. దీనిని గురించి బహుశా నేపాల్ లో చర్చ సాగుతూంటుందేమో.. అయితే, అది ఏ స్థాయి లో అన్నది నాకు తెలియదు. ఇక భారతదేశంలో ఐపీఎల్ క్రికెట్ టూర్నమంట్ నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ పోటీ లతో నేపాల్ కూడా అనుసంధానం కావడం గమనార్హం.
ఈ పయనంలో ఇటీవలి అనేక వినూత్న పరిణామాలు మీకు అవగతం అయ్యే ఉంటాయి. తొలిసారిగా నేపాల్ ఆటగాడు సందీప్ లామిచానే ఐపీఎల్ క్రికెట్ లో భాగస్వామి అయ్యాడని నేను విన్నాను. ఒక్క క్రికెట్ ద్వారానే గాక భవిష్యత్తు లో ఇతర క్రీడల ద్వారానూ మన రెండు దేశాల ప్రజా సంబంధాలు ఇలాగే కొనసాగుతాయని నేను ఆశిస్తున్నాను.
మిత్రులారా,
నా ఈ ప్రసంగం ద్వారా కాఠ్ మాండూ మేయర్ శ్రీ శాక్యా గారికి, ఇక్కడి పాలన యంత్రాంగానికి, నేపాల్ ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి కి, మాననీయులైన విదేశాంగ శాఖ మంత్రి కి, మీకందరికీ మరొక్క సారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ హృదయాలలో మెదలుతున్న భావనే నా హృదయం లోనూ మెదలుతోంది. ప్రతి నేపాలీ గుండె లో ఉప్పొంగుతున్న భావనే నా గుండె లోనే గాక ప్రతి భారతీయుడి గుండె లోనూ పొంగుతోంది; అది ఇదే:
నేపాల్- భారత్ స్నేహం వర్ధిల్లాలి,
నేపాల్- భారత్ స్నేహం వర్ధిల్లాలి,
నేపాల్- భారత్ స్నేహం వర్ధిల్లాలి,
అనేకానేక ధన్యవాదాలు.
***
I thank the people of Kathmandu for the memorable civic reception. Kathmandu is a unique city. It is an ideal mix of the old and the new. Kathmandu is a great manifestation of the culture of Nepal. Sharing my speech at the reception. https://t.co/DE0l5UiDkR pic.twitter.com/jtmta6mYIn
— Narendra Modi (@narendramodi) May 12, 2018
At the programme in Kathmandu, I reiterated India’s strong support to Nepal as they pursue their development agenda. Highlighted instances of India-Nepal cooperation and elaborated on steps such as the Solar Alliance, which are being taken by India for the welfare of humanity. pic.twitter.com/eM0sBRg3y2
— Narendra Modi (@narendramodi) May 12, 2018