Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ ప్ర‌ధాని భార‌త‌దేశంలో ఆధికారిక ప‌ర్య‌ట‌న‌ కు విచ్చేసిన సంద‌ర్భంగా 2018 ఏప్రిల్ 7వ తేదీ న భార‌త‌దేశం- నేపాల్ సంయుక్త ప్ర‌క‌ట‌న‌


భార‌తదేశ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకొని, నేపాల్ ప్రధాని మాన్య శ్రీ కె.పి. శర్మ ఓలీ 2018 ఏప్రిల్ 6- 7 తేదీల మ‌ధ్య‌ భార‌త‌దేశంలో ప‌ర్య‌టించేందుకు విచ్చేశారు.

2018 ఏప్రిల్ 7వ తేదీ నాడు, ప్ర‌ధానులు ఇరువురూ ఉభ‌య దేశాల మ‌ధ్య బ‌హుముఖ సంబంధాలను స‌మ‌గ్రంగా స‌మీక్షించారు. ఇరు దేశాల ప్ర‌భుత్వాల మ‌ధ్య, ప్రైవేటు రంగం మ‌ధ్య, ఇంకా ప్ర‌జ‌ల‌కు- ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య నెల‌కొన్న భాగ‌స్వామ్యాలు వ‌ర్ధిల్లుతుండ‌టాన్ని వారు స్వాగ‌తించారు. స‌మాన‌త్వం, ప‌ర‌స్ప‌ర విశ్వాసం, పరస్పర గౌర‌వం మ‌రియు పరస్పర ప్ర‌యోజ‌నాల ప్రాతిప‌దిక‌లపై ద్వైపాక్షిక సంబంధాల‌ను నూత‌న శిఖ‌రాల‌కు చేర్చేందుకు క‌లసి కృషి చేయాల‌ని ఇరువురు ప్ర‌ధానులు సంక‌ల్పించారు.

భార‌త‌దేశం, నేపాల్ ల మ‌ధ్య స‌న్నిహిత‌మైన మ‌రియు మిత్ర పూర్వ‌క‌మైన సంబంధాలు ఉమ్మ‌డి చారిత్ర‌క‌, సాంస్కృతిక సంబంధాలతో పాటు, ప్ర‌జ‌ల‌కూ ప్ర‌జ‌ల‌కూ మ‌ధ్య గాఢ‌మైన బంధాల, బ‌ల‌మైన పునాదుల మీద నిర్మితమయ్యాయ‌ని ప్రధానులు ఇరువురూ గుర్తుకు తెచ్చుకొంటూ ద్వైపాక్షిక సంబంధాల‌ను దృఢ‌త‌రం చేసుకోవ‌డం లో ఉన్న‌త‌ స్థాయి రాజ‌కీయ బృందాల ప‌ర్య‌ట‌న‌లు క్ర‌మం త‌ప్ప‌క చోటు చేసుకొంటూ ఉండడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలన్న అభిప్రాయ‌ం వ్యక్తం చేశారు.

భార‌త‌దేశంతో స్నేహ‌పూర్వ‌క సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్టం చేసుకోవ‌డానికి త‌న ప్ర‌భుత్వం అత్యధిక ప్రాముఖ్యాన్ని ఇస్తోంద‌ని ప్ర‌ధాని శ్రీ ఓలీ స్ప‌ష్టం చేశారు. నేపాల్ ప్ర‌భుత్వం ఆర్థిక పరివర్తనకు మరియు వికాసం కోసం- భార‌త‌దేశం సాధిస్తున్న పురోగ‌తి మ‌రియు స‌మృద్ధి ల నుండి లాభం పొందేట‌ట్లుగా- తన ద్వైపాక్షిక సంబంధాల‌ను అభివృద్ధి ప‌ర‌చుకోవాల‌ని కోరుకుంటోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. నేపాల్ ప్ర‌భుత్వ ప్రాథ‌మ్యాల‌కు అనుగుణంగా భార‌తదేశం త‌న భాగ‌స్వామ్యాన్ని బ‌లోపేతం చేసుకొనేందుకు క‌ట్టుబ‌డి ఉంద‌ని ప్ర‌ధాని శ్రీ ఓలీ కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హామీ ని ఇచ్చారు.

భార‌త‌దేశం ఇరుగుపొరుగు దేశాల‌తో నెరపుతున్న స‌మ్మిళిత అభివృద్ధి మ‌రియు స‌మృద్ధి ల తాలూకు ఉమ్మ‌డి దార్శ‌నిక‌త‌కు ‘స‌బ్‌కా సాత్ స‌బ్‌కా వికాస్’ విధానం మార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని అందిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ వెల్లడించారు. చ‌రిత్రాత్మ‌క‌మైన రాజ‌కీయ ప‌రివ‌ర్త‌న అనంత‌రం త‌న ప్ర‌భుత్వం ‘స‌మృద్ధ నేపాల్‌ సుఖీ నేపాలీ’ అనే ధ్యేయంతో ఆర్థికప‌ర‌మైన ప‌రివ‌ర్త‌న‌కు పెద్ద పీట వేసినట్లు ప్ర‌ధాని శ్రీ ఓలీ తెలిపారు. నేపాల్ లో స్థానిక ఎన్నిక‌లు, స‌మాఖ్య పార్ల‌మెంటు ఎన్నిక‌లు మ‌రియు ప్ర‌ప్ర‌థ‌మంగా జ‌రిగిన ప్రాదేశిక ఎన్నికలను విజ‌య‌వంతంగా నిర్వ‌హించుకొన్నందుకు నేపాల్ ప్ర‌జ‌ల‌తో పాటు నేపాల్ ప్ర‌భుత్వాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ అభినందించారు. సుస్థిర‌త మ‌రియు అభివృద్ధి సాధన లకు సంబంధించినంతవరకు వారి యొక్క దార్శ‌నిక‌త‌ను కూడా ఆయ‌న ప్ర‌శంసించారు.

నేపాల్ లోని బీర్‌గంజ్ లో ఒక స‌మీకృత చెక్ పోస్టు ను ప్ర‌ధానులు ఇరువురూ ప్రారంభించారు. ఇది త్వ‌ర‌గా కార్య‌క‌లాపాల‌ను ఆరంభిస్తే సీమాంత‌ర వ్యాపారంతో పాటు ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌ను, స‌ర‌కుల చేర‌వేత‌ను కూడా పెంపొందించగలదని మరియు ఉమ్మ‌డి వృద్ధికి మ‌రిన్ని మ‌హ‌త్త‌ర‌మైన అవ‌కాశాల‌ను అందించగ‌ల‌ద‌ంటూ వారు ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

భార‌త‌దేశం లోని మోతీహారీ లో మోతీహారీ-అమ్‌లేఖ్‌గంజ్ సీమాంత‌ర పెట్రోలియ‌మ్ ఉత్ప‌త్తుల గొట్ట‌పు మార్గం నిర్మాణానికి జ‌రిగిన భూమి పూజ కార్య‌క్ర‌మాన్ని ఉభ‌య ప్ర‌ధానులు వీక్షించారు.

నేపాల్ లో ద్వైపాక్షిక ప‌థ‌కాల‌ను త్వ‌రిత‌ గతిన అమ‌లు చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని, అలాగే వేరు వేరు రంగాల‌లో స‌హ‌కార పూర్వ‌క కార్యాచ‌ర‌ణ‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌స్తుతం పనిచేస్తున్న యంత్రాంగాల‌ను పునరుత్తేజితం చేయవ‌ల‌సిన అవ‌స‌రం కూడా ఉంద‌ని ప్ర‌ధానులు ఇద్ద‌రూ నొక్కి ప‌లికారు.

క్రింద పేర్కొన్నటువంటి కీల‌క రంగాల‌లో విడివిడిగా సంయుక్త ప్ర‌క‌ట‌న‌ల‌ను ఈ రోజు జారీ చేయ‌డ‌మైంది (లింకుల‌ను దిగువన చూడగలరు):
· India-Nepal: New Partnership in Agriculture
· Expanding Rail Linkages: Connecting Raxaul in India to Kathmandu in Nepal
· New Connectivity between India and Nepal through Inland Waterways

ఈ ప‌ర్య‌ట‌న రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న బ‌హుముఖీన భాగ‌స్వామ్యానికి ఒక కొత్త గ‌తిశీల‌త‌ను అందించింద‌న్న అభిప్రాయంతో ఇరువురు ప్ర‌ధానులూ ఏకీభవించారు.

త‌న‌కు మ‌రియు త‌న ప్ర‌తినిధి వ‌ర్గానికి ఆత్మీయ‌మైన‌టువంటి ఆహ్వానాన్ని మ‌రియు ఆతిథ్యాన్ని అందించినందుకుగాను ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ కి ప్ర‌ధాని శ్రీ ఓలీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

వీలైనంత త్వ‌ర‌లో నేపాల్ సంద‌ర్శ‌న‌ కు త‌ర‌లి రావలసిందంటూ ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ కి ప్ర‌ధాని శ్రీ ఓలీ ఆహ్వానం ప‌లికారు. ఈ ఆహ్వానాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ స్వీక‌రించారు; దౌత్య వర్గాల మధ్య సంప్ర‌దింపుల ద్వారా ప‌ర్య‌ట‌న తేదీ ల‌ను ఖ‌రారు చేయ‌డం జ‌రుగుతుంది.

***