Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నీతి ఆయోగ్ లో ‘అట‌ల్ ఇన్నొవేష‌న్ మిష‌న్’, ఇంకా ‘సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ అండ్ టాలెంట్ యుటిలైజేష‌న్’ ల స్థాప‌న‌


నీతి ఆయోగ్ లో త‌గినంత మంది సిబ్బందితో “అట‌ల్ ఇన్నొవేష‌న్ మిష‌న్” (ఎఐఎమ్) ను, ఇంకా “సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ అండ్ టాలెంట్ యుటిలైజేష‌న్” (ఎస్ఇటియు) ను నెల‌కొల్పే ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర మంత్రిమండ‌లి ఆమోద‌ముద్ర వేసింది. కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించారు.

అట‌ల్ ఇన్నొవేష‌న్ మిష‌న్ కార్య‌క‌లాపాల‌ను ప‌క్కాగా అమ‌లు చేయ‌డానికి ఎఐఎమ్ మ‌రియు ఎఐఎమ్ డైరెక్ట‌రేట్ ల స్థాప‌న దోహ‌దం చేయ‌నుంది. అంతే కాకుండా ఇది దేశంలో న‌వ‌క‌ల్ప‌న (ఇన్నొవేష‌న్)కు, ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల ప్రేర‌ణ‌కు కూడా కేంద్ర బిందువు కానుంది.

వివ‌రాలు.. :-

(i) ఒక మిష‌న్ హై లెవెల్ క‌మిటీ (ఎమ్ హెచ్ ఎల్ సి) ఈ మిష‌న్ కు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంది. ఎఐఎమ్ మ‌రియు ఎస్ఇటియు ల‌కు సంబంధించిన గ్రాండ్ ఛాలెంజ్ ఏరియాలు, బ‌హుమ‌తి సొమ్ము, వేరు వేరు అంశాల అమ‌లు స‌హా మార్గ‌ద‌ర్శ‌క సూత్రాలకు ఆమోదం తెల‌ప‌డం వంటి అన్ని నిర్ణ‌యాల‌ను ఎమ్ హెచ్ ఎల్ సి తీసుకొంటుంది.

(ii) మిష‌న్ డైరెక్టర్, ఇంకా ఇత‌ర సిబ్బందిని నీతి ఆయోగ్ నియ‌మించి, వారి చేత‌ ప‌ని చేయిస్తుంది.

(iii) న్యూఢిల్లీలో మిష‌న్ కేంద్ర కార్యాల‌యం ఉంటుంది.

పూర్వ రంగం :

న‌వ‌క‌ల్ప‌న‌ల‌కు త‌గిన ప‌రిస్థితుల‌ను ఏర్ప‌ర‌చ‌డమే కాక, వాటిని ఉత్తేజితం చేయ‌డం కోసం, దేశంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌లో ఉత్ప్రేర‌ణం క‌లిగించ‌డం కోసం అట‌ల్ ఇన్నొవేష‌న్ మిష‌న్ (ఎఐఎమ్) ను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఉంద‌ని కేంద్ర‌ ఆర్థిక శాఖ‌ మంత్రి 2015-16 బ‌డ్జెటు ప్ర‌సంగంలో ప్ర‌క‌టించారు. ఎఐఎమ్ ను రూ.500 కోట్ల ప్రారంభిక సొమ్ముతోను, అలాగే ఎస్ఇటియు ను రూ.1,000 కోట్ల ప్రారంభిక సొమ్ముతోను నీతి ఆయోగ్ ప‌రిధిలో నెల‌కొల్పుతామ‌ని ఆయ‌న చెప్పారు. బ‌డ్జెట్ ప్ర‌క‌ట‌న‌కు త‌దుప‌రి చ‌ర్య‌గా, నీతి ఆయోగ్ పూనుకొని ప్రొఫెస‌ర్ త‌రుణ్ ఖ‌న్నా అధ్య‌క్ష‌త‌న ఇన్నొవేష‌న్, ఆంట్ర‌ప్ర‌న‌ర్ షిప్ పై ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రొఫెస‌ర్ త‌రుణ్ ఖ‌న్నా అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ కి చెందిన సౌత్ ఏషియ‌న్ ఇన్ స్టిట్యూట్ కు డైరెక్ట‌ర్. ఎఐఎమ్, ఎస్ఇటి యు ల‌కు స‌మ‌గ్ర‌మైన రూపురేఖ‌ల‌ను తీర్చి దిద్ద‌డం ఈ నిపుణుల సంఘం బాధ్య‌త‌. ఈ సంఘం స్వ‌ల్ప కాలానికి, మ‌ధ్య కాలానికి, మ‌రియు దీర్ఘ కాలానికి అంటూ ప‌లు సిఫార‌సులు చేసింది. దేశంలో ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను పెంచి పోషించ‌డం ద్వారా ఆశించిన ఫ‌లితాల‌ను పొందేందుకు ఈ సిఫార‌సుల అమ‌లు తోడ్ప‌డ‌గ‌ల‌ద‌ని భావిస్తున్నారు. కార్య‌క్ర‌మాల అమ‌లును ప‌ర్య‌వేక్షించేందుకు, ప్ర‌భావాన్ని సృష్టించ‌గ‌లిగేందుకు త‌గ్గ వ్య‌వ‌స్థ‌లను ఏర్పాటు చేయాల‌ని కూడా ఈ సంఘం స్ప‌ష్టం చేసింది.

2015-16 కేంద్ర బ‌డ్జెటు లో చేసిన ప్ర‌క‌ట‌న‌ల ద‌రిమిలా ఎఐఎమ్, ఎస్ఇటియు ల దిశ‌గా అడుగులు ప‌డ్డాయి. ఈ ప్ర‌తిపాద‌న‌ను 2015 ఆగ‌స్టు 28న ఇఎఫ్‌సి ప‌రిశీలించింది. ఎఐఎమ్ ను ఒక లక్ష్యం (మిష‌న్) గాను, ఎస్ఇటియు ను ఆ గ‌మ్యానికి చేర్చే ఒక స‌మీప మార్గంగాను చేసుకోవాల‌నుకున్నారు. దీంతో, ఎఐఎమ్ పేరిట ఒక స‌మ్మిళిత ప‌థ‌కం ఉండాల‌ని, ఇందులో ఇన్నొవేష‌న్ ను, ఎస్ఇటియు ను అంత‌ర్భాగాలుగా ఇముడ్చాల‌ని త‌ల‌పోశారు. ఇన్నొవేట‌ర్ల‌కు బాస‌ట‌గా నిల‌వ‌డం, వారిని స‌ఫ‌ల ఔత్సాహిక పారిశ్రామికులుగా మ‌ల‌చ‌డమే ఎస్ఇటియు ప‌ని.