Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నీతి ఆయోగ్ పాలక మండలి నాలుగో స‌మావేశం ప్రారంభ సందర్భం లో ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యలు

నీతి ఆయోగ్ పాలక మండలి నాలుగో స‌మావేశం ప్రారంభ సందర్భం లో ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యలు

నీతి ఆయోగ్ పాలక మండలి నాలుగో స‌మావేశం ప్రారంభ సందర్భం లో ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యలు

నీతి ఆయోగ్ పాలక మండలి నాలుగో స‌మావేశం ప్రారంభ సందర్భం లో ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యలు


న్యూ ఢిల్లీ లోని రాష్ట్రప‌తి భ‌వ‌న్ సాంస్కృతిక కేంద్రం లో ఈ రోజు జ‌రిగిన నీతి ఆయోగ్ పాల‌క మండ‌లి నాలుగో స‌మావేశం ప్రారంభ కార్యక్రమంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు.

ముఖ్య‌మంత్రులు మ‌రియు ఇత‌ర ప్ర‌తినిధులకు ప్ర‌ధాన మంత్రి స్వాగ‌తం ప‌లుకుతూ, పాల‌క మండ‌లి ‘చ‌రిత్రాత్మ‌కమైన మార్పు’ను తీసుకు రాగ‌లిగేటటువంటి ఒక వేదిక అని పున‌రుద్ఘాటించారు. ప్ర‌స్తుతం దేశంలో వ‌ర‌ద‌ల బారిన ప‌డిన రాష్ట్రాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగాను స‌హాయాన్ని అందిస్తుంద‌ని, ఆ ప్రాంతాల‌లో ప‌రిస్థితుల‌ను దీటుగా ఎదుర్కోవ‌డానికి తోడ్ప‌డుతుంద‌ని ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఆయ‌న హామీ ని ఇచ్చారు.

ప‌రిపాల‌న లోని సంక్లిష్ట అంశాల‌ను పాల‌క మండ‌లి స‌హ‌కార పూర్వ‌క‌మైన‌, స్ప‌ర్ధాత్మ‌క‌మైన స‌మాఖ్య త‌త్వాన్ని అనుస‌రిస్తూ ‘‘టీమ్‌ ఇండియా’’ స్ఫూర్తితో పరిష్క‌రిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. జిఎస్‌టి ని ప్ర‌వేశ‌పెట్ట‌డం మ‌రియు సాఫీగా అమ‌లు ప‌రుస్తుండడం దీనికి ఒక ప్ర‌ముఖ ఉదాహ‌ర‌ణ‌ అని ఆయ‌న అభివ‌ర్ణించారు.

స్వ‌చ్ఛ భార‌త్ మిశన్‌, డిజిట‌ల్ లావాదేవీలు, ఇంకా నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాల‌పైన ఏర్పాటైన సంఘాలు మ‌రియు ఉప బృందాల ద్వారా విధాన రూప‌క‌ల్ప‌న‌ లో రాష్ట్రాల యొక్క ముఖ్య‌మంత్రులు ఒక కీల‌క‌మైన పాత్ర‌ను పోషించార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ ఉప బృందాల సిఫారసుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం లోని వివిధ మంత్రిత్వ శాఖ‌లు అమ‌లు చేశాయ‌ని ఆయ‌న చెప్పారు.

2017-18 ఆర్థిక సంవ‌త్స‌రం నాలుగో త్రైమాసికం లో భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఆరోగ్యదాయ‌క‌మైన రీతిలో 7.7 శాతం వృద్ధి రేటును సాధించింద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ వృద్ధి రేటును రెండు అంకెల స్థాయికి చేర్చ‌డం ప్ర‌స్తుతం మ‌న ముందున్న స‌వాలు అని ఆయ‌న పేర్కొంటూ, ఇందుకోసం మ‌రెన్నో ముఖ్య‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకోవ‌ల‌సివుంద‌ని తెలిపారు. 2022వ సంవ‌త్స‌రం క‌ల్లా ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించాల‌న్న దార్శ‌నిక‌త ప్ర‌స్తుతం మ‌న దేశ ప్ర‌జ‌ల సంక‌ల్పంగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈ రోజు చేప‌ట్టిన చ‌ర్చ‌నీయాంశాల‌లో వ్య‌వ‌సాయ‌దారుల ఆదాయాన్ని రెట్టింపు చేయ‌డం, మ‌హ‌త్వాకాంక్ష క‌లిగిన జిల్లాల‌ను అభివృద్ధిప‌ర‌చ‌డం, ఆయుష్మాన్ భార‌త్‌, మిశన్ ఇంద్ర‌ధ‌నుష్‌, పోష‌ణ్ మిశన్ ల‌తో పాటు, మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ వంటివి ఉన్నాయ‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

ఆయుష్మాన్ భార‌త్ లో భాగంగా 1.5 ల‌క్ష‌ల హెల్త్ అండ్ వెల్ నెస్ సెంట‌ర్ ల‌ను నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు. ప్ర‌తి ఏటా 5 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆరోగ్య హామీ ని సుమారు 10 కోట్ల కుటుంబాల‌కు క‌ల్పించ‌నున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. ‘స‌మ‌గ్ర శిక్ష అభియాన్’ లో భాగంగా విద్య ప‌ట్ల ఒక స‌మ‌గ్ర‌మైన విధానాన్ని అనుస‌రిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ముద్ర యోజ‌న, జ‌న్ ధ‌న్ యోజ‌న‌, ఇంకా స్టాండ్-అప్ ఇండియా ల వంటి ప‌థ‌కాలు ఆర్థిక సేవ‌ల‌ను మ‌రింత మందికి అందుబాటు లోకి తీసుకుపోవ‌డంలో దోహదం చేస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆర్థికప‌ర‌మైన అస‌మాన‌త‌ల‌ను ప్రాధాన్య ప్రాతిపదికన ప‌రిష్క‌రించ‌వ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త ఉన్న‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

115 ఆకాంక్షా భ‌రిత జిల్లాల‌లో మాన‌వాభివృద్ధి సంబంధిత అంశాల‌ను అన్నింటిని మ‌రియు ప‌రామితుల‌ను ప‌రిష్క‌రించవలసిన మరియు వాటిని మెరుగుప‌ర‌చ‌వ‌ల‌సిన అవసరం ఉంద‌ని ఆయ‌న అన్నారు.

ప‌థ‌కాల అమ‌లుకు ఒక కొత్త న‌మూనా గా గ్రామ స్వ‌రాజ్ అభియాన్ రూపుదిద్దుకొంద‌ని శ్రీ న‌రేంద్ర మోదీ చెప్పారు. దీనిని ఇంత‌వ‌ర‌కు ఆకాంక్ష భ‌రిత జిల్లాల‌లోని 45,000 ప‌ల్లెల‌కు విస్త‌రించిన‌ట్లు తెలియజేశారు. 7 ముఖ్య‌మైన సంక్షేమ ప‌థ‌కాలు.. ఉజ్జ్వ‌ల, సౌభాగ్య, ఉజాలా, జ‌న్ ధ‌న్ , జీవ‌న జ్యోతి యోజన, సుర‌క్షా బీమా యోజ‌న‌, ఇంకా మిష‌న్ ఇంద్రధ‌నుష్.. అంద‌రికీ అందుబాటు లోకి చేర్చాలన్నది ల‌క్ష్యమని ఆయ‌న చెప్పారు. సుమారు 17,000 గ్రామాల‌లో ఈ ల‌క్ష్యాన్ని ఇటీవ‌లే సాధించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు.

భార‌త‌దేశంలో శ‌క్తియుక్తుల‌కు, సామ‌ర్ధ్యాల‌కు, వ‌న‌రుల‌కు లోటు ఏమీ లేద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రాష్ట్రాలు కేంద్రం నుండి 11 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా అందుకొంటున్నాయ‌ని, ఇది క్రితం ప్ర‌భుత్వ హ‌యాంలోని ఆఖ‌రి సంవ‌త్స‌రం తో పోలిస్తే దాదాపు 6 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అధిక‌ం అని ఆయన వివరించారు.

ఈ రోజు ఇక్కడ గుమికూడిన స‌మూహం భార‌త‌దేశ ప్ర‌జ‌ల ఆశ‌ల‌కు మ‌రియు ఆకాంక్ష‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్రజల ఆశలను మరియు ఆకాంక్షలను నెర‌వేర్చ‌డానికి సాధ్యమైన అన్ని ప్ర‌య‌త్నాలను చేయ‌డం ఈ స‌ముదాయం యొక్క బాధ్య‌త అని కూడా ఆయ‌న చెప్పారు.

అంత క్రితం ముఖ్య‌మంత్రుల‌కు మ‌రియు ఇత‌ర ప్ర‌తినిధుల‌కు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ శ్రీ రాజీవ్ కుమార్ స్వాగ‌తం ప‌లికారు. చ‌ర్చ‌ల‌కు స‌మ‌న్వ‌య క‌ర్త‌గా కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

***