ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి నాలుగో సమావేశం ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు.
నిర్మాణాత్మకంగా సాగిన చర్చ ను మరియు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందించిన సూచనలను ప్రధాన మంత్రి స్వాగతిస్తూ, విధాన రూపకల్పన క్రమంలో ఈ సూచనలను గంభీరంగా పరిశీలిస్తామంటూ హామీని ఇచ్చారు. రాష్ట్రాలు సూచించిన వాటిలో ఆచరణ లోకి తీసుకురాదగినటువంటి అంశాల పై రాష్ట్రాలతో కలసి మూడు నెలల లోపల అనుశీలన చర్యలను చేపట్టవలసిందిగా నీతి ఆయోగ్ ను ఆయన కోరారు.
నీతి ఆయోగ్ గుర్తించినటువంటి 115 ఆకాంక్ష భరిత జిల్లాల తరహా లోనే, ఒక రాష్ట్రం లోని మొత్తం బ్లాకులలో 20 శాతం బ్లాకులను ఆకాంక్షా భరిత బ్లాకులుగా గుర్తించడం కోసం రాష్ట్రాలు సొంత పరామితులను నిర్వచించుకోవచ్చని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రులు ప్రస్తావించిన పర్యావరణ అంశాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రాలు వాటి ప్రభుత్వ భవనాలలోను,ఆధికారిక నివాసాలలో ను మరియు వీధి దీపాల కోసం ఎల్ఇడి బల్బులను వినియోగించాలంటూ అన్ని రాష్ట్రాలకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనిని ఒక నిర్ధిష్ట కాల వ్యవధి లోపల అమలు చేయాలని ఆయన సూచించారు.
జల సంరక్షణ, వ్యవసాయం, ఎమ్ఎన్ఆర్ఇజిఎ వంటి అంశాలపై వివిధ ముఖ్యమంత్రులు అందించిన అనేక సూచనలను ఆయన ప్రశంసించారు.
నాట్లకు ముందు, పంట కోత తరువాతి దశలలో, అలాగే ‘వ్యవసాయం మరియు ఎమ్ఎన్ఆర్ఇజిఎ’ .. ఈ రెండు అంశాలలో సమన్వయంతో కూడిన విధాన దృక్పథం అంశంపై సిఫారసులను అందించేందుకు కలసి పని చేయండంటూ ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, సిక్కిమ్, బిహార్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన పిలుపునిచ్చారు.
‘వరుస లోని ఆఖరి వ్యక్తుల’ను ఎంపిక చేయడం కీలకమని, ఇది జరిగినపుడు పాలన ప్రయోజనాలు వారికి అందుతాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అలాగే, సామాజిక న్యాయం అనేది పాలన లో ఒక ముఖ్యమైన ఉద్దేశం అని కూడా ఆయన వివరించారు. ఇటువంటి పవిత్రమైన ఆశయాలు నెరవేరాలంటే సన్నిహిత సమన్వయంతో పాటు నిరంత పర్యవేక్షణ అవసరపడుతుందని ఆయన అన్నారు.
2018వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ కల్లా 115 ఆకాంక్షా భరిత జిల్లాలలో మరో 45,000 గ్రామాలకు ఏడు కీలక పథకాల ద్వారా అందరికీ లబ్ది ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొందని ఆయన పునరుద్ఘాటించారు.
కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రంగా ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నిలుస్తోందని ప్రధాన మంత్రి సుదీర్ఘంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఇక కొంత మందికో, లేదా కొన్ని ప్రాంతాలకో ఎంత మాత్రం పరిమితం కావడం లేదని, ఇవి ప్రతి ఒక్కరికీ ఎటువంటి వివక్షకు తావు లేకుండా ఒక సమతుల్యమైన పద్ధతిలో చేరుతున్నాయని ఆయన చెప్పారు.
దేశం లోని అన్ని పల్లెలు ప్రస్తుతం విద్యుత్తు సౌకర్యానికి నోచుకొన్నాయని, ‘సౌభాగ్య యోజన’ లో భాగంగా 4 కోట్ల గృహాలకు ప్రస్తుతం విద్యుత్తు కనెక్షన్ లను సమకూర్చడం జరుగుతోందని ప్రధాన మంత్రి వివరించారు. గ్రామీణ పారిశుధ్యం పరిధి 40 శాతం కన్నా తక్కువ స్థాయి నుండి నాలుగు సంవత్సరాలలో దాదాపు 85 శాతానికి పెరిగినట్లు ఆయన వెల్లడించారు. ‘జన్ ధన్ యోజన’ ను అమలు చేసిన తరువాత దేశం లోని యావత్తు జనాభా బ్యాంకింగ్ వ్యవస్థ తో సంధానం అవుతారని ఆయన చెప్పారు. అలాగే, ఉజ్జ్వల యోజన వంట లభ్యత ను సమకూర్చుతోందని, ‘మిశన్ ఇంద్రధనుష్’ అందరికీ టీకా ల సదుపాయం కల్పించే దిశ గా పని చేస్తోందని తెలిపారు. 2022వ సంవత్సరం కల్లా అందరికీ గృహ వసతి కల్పన దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.
పేదల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాల 100 శాతం అమలు సాధ్యమయ్యేటట్టుగా ముఖ్యమంత్రులందరూ వారి వారి ప్రయత్నాలతో ముందుకు రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
ఈ సంక్షేమ పథకాల అమలు ప్రజా జీవితంలో ప్రవర్తన పూర్వకమైనటువంటి మార్పు ను కూడా తీసుకు వస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఆయన యూరియా కు వేప పూత, ఉజ్జ్వల యోజన, జన్ ధన్ ఖాతాలు, ఇంకా రూపే డెబిట్ కార్డులను గురించి ప్రస్తావించారు. ఈ పథకాలు ప్రజల జీవితాన్ని ఏ విధంగా మెరుగుపరచాయో ఆయన చెప్పుకొచ్చారు.
స్వచ్ఛ భారత్ మిశన్ ను గురించి ప్రపంచం అంతటా చర్చ జరుగుతోందని ప్రధాన మంత్రి తెలిపారు. గత నాలుగు సంవత్సరాలలో 7.70 కోట్ల మరుగుదొడ్లను నిర్మించడం జరిగిందని తెలిపారు. మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా 2019 అక్టోబరు 2వ తేదీ కల్లా 100 శాతం పారిశుధ్య సేవల విస్తరణ దిశగా కృషి చేయాలని సమావేశంలో పాలుపంచుకొన్న అందరికీ ఆయన పిలుపునిచ్చారు.
జల సంరక్షణ మరియు జల నిర్వహణ ల దిశగా యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలని ప్రధాన మంత్రి కోరారు.
ఆర్థిక వ్యవస్థను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారతదేశం త్వరలోనే అయిదు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకోవాలని ప్రపంచం ఆశిస్తోందన్నారు. ఫలితాలను రాబట్టగలిగే కేటాయింపులకు ప్రోత్సాహకాలు అందించడం మరియు వ్యయంలో దిద్దుబాట్ల కోసం ఆర్థిక సంఘానికి తాజా ఉపాయాలను సూచించవలసిందంటూ రాష్ట్రాలను ఆయన ఉత్సాహపరిచారు.
రాష్ట్రాలు ప్రస్తుతం పెట్టుబడిదారు సంస్థల శిఖర సమ్మేళనాలను నిర్వహిస్తుండడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎగుమతులపై శ్రద్ధ వహించాలని రాష్ట్రాలకు ఆయన సూచించారు. ‘‘వ్యాపారం చేయడంలో సరళత్వాన్ని’’ పెంపొందించవలసిందిగా రాష్ట్రాలను ఆయన ప్రోత్సహించారు. వ్యాపారాన్ని సులువుగా నిర్వహించడానికి మరింత ఉత్తేజాన్ని అందించేందుకు గాను అన్ని రాష్ట్రాలతో ఒక సమావేశాన్ని నీతి ఆయోగ్ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. సామాన్య మానవుడికి సైతం ‘జీవించడంలో సరళత్వం’ అనేది తక్షణావసరంగా ఉందని, మరి రాష్ట్రాలు ఈ విషయంలో చొరవలు తీసుకోవాలని ఆయన అన్నారు.
వ్యవసాయాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. ఈ రంగంలో కార్పొరేట్ పెట్టుబడి భారతదేశంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. గిడ్డంగుల నిర్మాణం, రవాణా, విలువ జోడింపు, ఇంకా ఫూడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలలో కార్పొరేట్ పెట్టుబడి ని ప్రోత్సహించగల విధానాలను రాష్ట్రాలు రూపొందించాలని ఆయన అన్నారు.
వేలం పాటలు విజయవంతంగా ముగిసిన గని క్షేత్రాలు వీలైనంత త్వరగా ఉత్పత్తిని ఆరంభించాలని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేశన్ లు పేదలకు మరియు ఆదివాసీలకు పెద్ద ఎత్తున సహాయం చేస్తాయని ఆయన చెప్పారు.
లోక్ సభ కు మరియు విధాన సభలకు ఏక కాలంలో ఎన్నికలు జరిపే అంశం లో ఇమిడివున్నటువంటి ఆర్థిక పరమైన ఆదాలు మరియు పర్యవసానంగా చోటు చేసుకోగల వనరుల ఉత్తమ వినియోగం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏక కాల ఎన్నికల అంశం మీద విస్తృతమైన చర్చ మరియు సంప్రదింపులు జరగాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
చివరగా, ముఖ్యమంత్రులు చేసిన సూచనలకుగాను వారికి ప్రధాన మంత్రి మరో మారు ధన్యవాదాలు తెలిపారు.
***