Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నావికా సాగర్ పరిక్రమ సిబ్బందితో ప్రధాన మంత్రి భేటీ


స‌ముద్ర మార్గంలో ప్ర‌పంచాన్ని చుట్టి వ‌చ్చేందుకు ఐఎన్ఎస్ వి తారిణి నౌక మీద బ‌య‌లుదేరి వెళ్ళ‌నున్న భార‌త నౌకా ద‌ళానికి చెందిన ఆరుగురు మ‌హిళా అధికారులు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు.

మ‌హిళా నావికా సిబ్బంది స‌భ్యులుగా ఉన్న ఒక భార‌తీయ బృందం ప్ర‌పంచాన్ని స‌ముద్ర మార్గంలో చుట్టి వ‌చ్చేందుకు వెళుతున్న మొట్ట మొద‌టి జల యాత్ర ఇదే. వారు త‌మ స‌ముద్ర యానాన్నిత్వ‌ర‌లో గోవా నుండి ఆరంభించ‌నున్నారు. ఈ యాత్ర 2018 మార్చి నెల‌లో ముగుస్తుంద‌ని భావిస్తున్నారు. ఈ సాహ‌స యాత్ర‌కు “నావికా సాగ‌ర్ ప‌రిక్ర‌మ‌” అనే పేరును పెట్టారు. 5 విడ‌త‌లుగా సాగే ఈ ప‌రిక్ర‌మలో 4 మ‌జిలీలు… ఆస్ట్రేలియాలోని ఫ్రీమేంట‌ల్‌, న్యూజిలాండ్ లోని లైట‌ల్ ట‌న్‌, ఫాక్ లాండ్ లోని పోర్ట్ స్టాన్లే తో పాటు, ద‌క్షిణ ఆఫ్రికా లోని కేప్ టౌన్‌.. ఉంటాయి.

ఐఎన్ఎస్‌వి తారిణి అనేది 55 అడుగుల తెర‌చాప నావ, దీనిని మ‌న దేశంలోనే నిర్మించారు. ఈ సంవ‌త్స‌రం ఆరంభంలో దీనిని భార‌త నౌకాద‌ళం లోకి తీసుకున్నారు.

సంభాష‌ణ క్ర‌మంలో నావికా సిబ్బంది త్వ‌ర‌లో వారు జ‌ర‌ప‌బోయే స‌ముద్ర ప్ర‌యాణానికి సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌ధాన మంత్రికి తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళా నావికా సిబ్బందికి ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. వారి ప్ర‌పంచ యాత్ర సాగే తీరును తాను గ‌మ‌నిస్తూ ఉంటాన‌ని కూడా ఆయ‌న అన్నారు. భార‌త‌దేశం యొక్క సామ‌ర్ధ్యాల‌ను మ‌రియు శ‌క్తుల‌ను గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటి చెప్పాల్సిందిగా ఆయ‌న వారికి ఉద్బోధించారు. వారి స‌ముద్ర యానాన్ని విజ‌య‌వంతంగా ముగించుకొన్న త‌రువాత వారి అనుభ‌వాల‌ను గ్రంథస్తం చేసి అంద‌రితోను పంచుకోవాలంటూ ఆయ‌న వారిలో ఉత్సాహం నింపారు.

లెఫ్టెనంట్ క‌మాండ‌ర్ వ‌ర్తిక జోషి ఈ ఓడ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తారు. నావికా సిబ్బందిలో లెఫ్టెనంట్ క‌మాండర్‌ లు ప్ర‌తిభా జామ్‌వాల్‌, పి. స్వాతి మ‌రియు లెఫ్టెనంట్ ఎస్‌. విజ‌యా దేవి, బి. ఐశ్వ‌ర్య, పాయ‌ల్ గుప్తాలు స‌భ్యులుగా ఉంటారు.