Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాలుగేళ్లపాటు ఇ-కోర్టుల మూడో దశకు మంత్రిమండలి ఆమోదం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ రూ.7,210 కోట్ల అంచనా వ్య‌యంతో (2023 నుంచి) నాలుగేళ్లపాటు కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఇ-కోర్టుల ప్రాజెక్ట్ మూడోదశ (ఫేజ్-III)కు ఆమోదం తెలిపింది. గౌరవనీయ ప్రధాని శ్రీ మోదీ ప్రబోధిత “సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా విశ్వాస్‌’ సూత్రానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞాన సద్వినియోగం ద్వారా ప్రజలకు న్యాయ సౌలభ్యం కల్పనకు ఉద్యమ తరహాలో ప్రవేశపెట్టిన కీలక పథకం ‘ఇ-కోర్టులు’. భారత న్యాయవ్యవస్థకు ‘ఐసిటి’ సామర్థ్యం కల్పించిన ఈ పథకం జాతీయ ఇ-పరిపాలన ప్రణాళికలో భాగంగా 2007 నుంచి అమలవుతుండగా దీని రెండో దశ (ఫేజ్‌-II) 2023తో ముగిసింది. ఈ నేపథ్యంలో ‘సౌలభ్యం-సార్వజనీనత’ ప్రాతిపదికగా మూడో దశకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.

   ఈ పథకం తొలి, మలి (ఫేజ్-I, II) దశల్లో ఒనగూడిన ప్రయోజనాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు వారసత్వ రికార్డులుసహా కోర్టు రికార్డులన్నిటి డిజిటలీకరణ చేపట్టడం ప్రస్తుతం మూడోదశ (ఫేజ్‌-III) లక్ష్యం. తద్వారా డిజిటల్-ఆన్‌లైన్-కాగితరహిత కోర్టులతో గరిష్ఠ న్యాయ ప్రదాన సౌలభ్యం కల్పించడమే ధ్యేయం. ఇందులో భాగంగా అన్ని కోర్టు సముదాయాలను ఇ-సేవా కేంద్రాలతో సంధానించి ఇ-ఫైలింగ్/ఇ-చెల్లింపుల సార్వజనీనత కల్పించాలని కూడా ఈ పథకం నిర్దేశిస్తోంది. కేసుల విచారణ క్రమం నిర్వహణ లేదా ప్రాధాన్యంపై న్యాయమూర్తులు, రిజిస్ట్రీలకు సమాచార-ఆధారిత నిర్ణయం తీసుకునే అత్యాధునిక వ్యవస్థ దీనిద్వారా అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా- న్యాయవ్యవస్థ కోసం ఏకీకృత సాంకేతిక వేదికను సృష్టించడం మూడోదశ ఇ-కోర్టుల పథకం ప్రధాన లక్ష్యం. తద్వారా న్యాయస్థానాలు, కక్షిదారులు, ఇతర భాగస్వాముల మధ్య నిరంతర కాగితరహిత వ్యవహారాలు కొనసాగే వెసులుబాటు లభిస్తుంది.

   కేంద్ర న్యాయ-చట్ట మంత్రిత్వశాఖ పరిధిలోని న్యాయ విభాగం, ఇ-కమిటీ, భారత సర్వోన్నత న్యాయస్థానాల సంయుక్త భాగస్వామ్యం కింద ఈ కేంద్ర ప్రాయోజిత ఇ-కోర్టుల మూడోదశ పథకం ఆయా హైకోర్టుల పర్యవేక్షణలో వికేంద్రీకృత పద్ధతిలో అమలవుతుంది. ప్రజలు సహా వ్యవస్థలో భాగస్వాములందరికీ మరింత అందుబాటులో, సరసమైన, విశ్వసనీయ, ఆకాంక్షిత,  పారదర్శక న్యాయ సౌలభ్యంగల న్యాయవ్యవస్థను రూపొందించడం దీని ధ్యేయం.

ఈ మేరకు ఇ-కోర్టుల మూడోదశలో ప్రధానాంగాలు కిందివిధంగా ఉంటాయి:

1

కేసు రికార్డుల స్కానింగ్, డిజిటలీకరణ, డిజిటల్ భద్రత

2038.40

2

క్లౌడ్ మౌలిక సదుపాయాలు

1205.23

3

ఇప్పటికేగల ఇ-కోర్టులకు అదనపు హార్డ్‌వేర్

643.66

4

కొత్తగా ఏర్పాటయ్యే ఇ-కోర్టులలో మౌలిక సదుపాయాల కల్పన

426.25

5

1,150 వర్చువల్ కోర్టుల ఏర్పాటు

413.08

6

4,400 పూర్తిస్థాయిలో పనిచేసే ఇ-సేవా కేంద్రాలు

394.48

7

కాగితరహిత కోర్టు

359.20

8

వ్యవస్థాగత, అనువర్తన సాఫ్ట్‌వేర్ రూపకల్పన

243.52

9

సౌరశక్తితో నిరంతర విద్యుత్‌ సదుపాయం

229.50

10

వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం

228.48

11

ఇ-ఫైలింగ్

215.97

12

అనుసంధానం (ప్రాథమిక + నిరంతర)

208.72

13

సామర్థ్య వికాసం

208.52

14

కోర్టు సముదాయాల్లోని 300 కోర్టు గదులలో ‘క్లాస్’ (ప్రత్యక్ష దశ్య-శ్రవణ ప్రసార వ్యవస్థ)

112.26

15

మానవ వనరులు

56.67

16

భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞాన వికాసం

53.57

17

న్యాయ ప్రక్రియ రీ-ఇంజనీరింగ్

33.00

18

దివ్యాంగుల కోసం ‘ఐసిటి’ సామర్థ్య సదుపాయాలు

27.54

19

ఎన్‌ఎస్‌టిఇపి

25.75

20

ఆన్‌లైన్ వివాద పరిష్కారం (ఒడిఆర్‌)

23.72

21

సమాచార-విజ్ఞాన నిర్వహణ వ్యవస్థ

23.30

22

హైకోర్టులు-జిల్లా కోర్టుల కోసం ఇ-ఆఫీస్

21.10

23

పరస్పర-నిర్వహణాత్మక నేర న్యాయవిచారణ వ్యవస్థ (ఐసిజెఎస్‌)తో ఏకీకరణ

11.78

24

‘ఎస్‌3డబ్ల్యుఎఎఎస్‌’ వేదిక

6.35

మొత్తం

7210.00

సం. పథకంలోని అంగాలు వ్యయం అంచనా (రూ.కోట్లలో)

ఈ పథకం ద్వారా లభించగలవని ఆశిస్తున్న ఫలితాలు కిందివిధంగా ఉన్నాయి:

  • సాంకేతికత సౌలభ్యం లేని పౌరులు ఇ-సేవా కేంద్రాల నుంచి న్యాయ సేవలు పొందవచ్చు, తద్వారా డిజిటల్ అంతరం తగ్గుతుంది.
  • కోర్టు రికార్డుల డిజిటలీకరణతో ఈ పథకం కింద అన్ని ఇతర డిజిటల్ సేవల ప్రదానానికి బీజం పడుతుంది. దీంతో కాగితాలపై దాఖలు చేసే కేసుల సంఖ్య తగ్గి, పత్రాల భౌతిక మార్పిడి శ్రమను తొలగిస్తుంది. తద్వారా ప్రక్రియలన్నీ మరింత పర్యావరణ అనుకూలం కాగలవు.
  • సాక్షులు, న్యాయమూర్తులు, ఇతర భాగస్వాములు ఉన్న చోటినుంచే హాజరయ్యే వీలు. తద్వారా విచారణతో ముడిపడిన ప్రయాణ, ఇతర ఖర్చులు తగ్గడంతోపాటు నేరుగా విచారణలో భాగస్వాములు కావచ్చు.
  • కోర్టు ఫీజులు, అపరాధ రుసుములు, జరిమానాలు ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా చెల్లించే వీలు.
  • పత్రాల దాఖలు సమయం, శ్రమ తగ్గించే ఇ-ఫైలింగ్‌ సదుపాయం విస్తరణ. పత్రాల స్వయంచాలక తనిఖీ; తదుపరి కాగితరహిత రికార్డుల తయారీకి వీలు; ఫలితంగా మానవ తప్పిదాల తగ్గుదల.
  • సరళ న్యాయ ప్రదాన అనుభవం కోసం కృత్రిమ మేధస్సుతోపాటు దాని అనుబంధ సాంకేతికతలు మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్‌), ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఒసిఆర్‌), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పి) వంటివాటి వినియోగం ద్వారా “స్మార్ట్” పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు. దీంతో రిజిస్ట్రీలకు సమాచార నమోదు భారం తగ్గి, మెరుగైన నిర్ణయాధికారం, విధాన ప్రణాళిక సరళీకరణ దిశగా ఫైళ్ల కనీస పరిశీలన వెసులుబాటు ఉంటుంది. దీంతో స్మార్ట్ షెడ్యూలింగ్, న్యాయమూర్తులు-రిజిస్ట్రీల కోసం సమాచార-ఆధారిత నిర్ణయం సౌలభ్యంగల ఆధునిక వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇది న్యాయమూర్తులు-న్యాయవాదుల సామర్థ్యం పెంచడంతోపాటు మరింత అంచనా వేయగల, గరిష్టీకరించగల వీలు కలుగుతుంది.
  • వర్చువల్ కోర్టుల విస్తరణతో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులలో నిందితులు లేదా న్యాయవాదులు నేరుగా కోర్టుకు హాజరయ్యే అవసరం ఉండదు.
  • కోర్టు వ్యవహారాల్లో కచ్చితత్వం, పారదర్శకత మెరుగుపడతాయి.
  • ‘ఎన్‌ఎస్‌టిఇపి’ (నేషనల్ సర్వింగ్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్‌) మరింత విస్తరణ ద్వారా కోర్టు సమన్లు స్వయంచాలకంగా బట్వాడా కావడం సులువవుతుంది. తద్వారా విచారణలో జాప్యం భారీగా తగ్గుతుంది.
  • సరికొత్త సాంకేతికతల వినియోగంతో కోర్టు ప్రక్రియలు మరింత సమర్థంగా, ప్రభావవంతంగా మారుతాయి. తద్వారా కేసుల పెండింగ్‌ గణనీయంగా తగ్గే వీలుంటుంది.

 

****