Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాయకత్వమే పలుకుతుంది : “నేటి సమకాలీన ప్రపంచంలో మహాత్మాగాంధీ ఆవశ్యకత” ఎకోసోక్ చాంబర్


శాంతి, అహింసలకు ప్రపంచంలోనే ఒక చిహ్నం అయిన మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 74వ సమావేశాల సందర్భంగా ఎకోసోక్ చాంబర్ లో అత్యున్నత స్థాయి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చారు.

ఈ సమావేశానికి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటియో గుటెరెస్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా గౌరవాధ్యక్షుడు మూన్ జే ఇన్, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ గౌరవ ప్రధానమంత్రి లీ హీన్ లూంగ్, రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ గౌరవ ప్రధానమంత్రి షేక్ హసీనా, జమైకా ప్రధానమంత్రి గౌరవ ఆండ్రూ హోల్ నెస్, న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ జాసిండా ఆర్డర్న్ హాజరయ్యారు.

ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖుల్లో భూటాన్ ప్రధానమంత్రి గౌరవ లోటే త్సెరింగ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రథమ మహిళ గౌరవ కిమ్ జంగ్ సూక్, ఐక్యరాజ్యసమితి సీనియర్ అధికారులు, వివిధ సభ్యదేశాల దౌత్యవేత్తలు కూడా పాల్గొన్నారు.

విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఆహూతులకు స్వాగతం పలికారు. సమావేశంలో పాల్గొన్నగౌరవ అతిథులందరూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద గాంధీ సోలార్ పార్క్ ను (భారతదేశం ఐక్యరాజ్యసమితికి బహూకరించిన), ఓల్డ్ వెస్ట్ బరీలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయ కళాశాలలో గాంధీ శాంతివనాన్ని ప్రారంభించారు. గాంధీ@150 పేరిట ఐక్యరాజ్యసమితి తపాలా విభాగం రూపొందించిన ప్రత్యేక స్మారక ఎడిషన్ ను కూడా ఆవిష్కరించారు.

20వ శతాబ్దిలో విస్తృతమైన మానవ స్వేచ్ఛకు; మానవాళి సంక్షేమానికి (సర్వోదయ); సమాజంలో నిరాదరణకు గురవుతున్న వారి స్థితిగతులు మెరుగుపరిచేందుకు (అంత్యోదయ); పర్యావరణ స్థిరత్వానికి మహాత్మాగాంధీ అందించిన సేవల గురించి ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. సంఘటిత ఆకాంక్ష, భాగస్వామ్య గమ్యం, నైతికత, ప్రజా ఉద్యమం, వ్యక్తిగత బాధ్యత వంటి అంశాలపై మహాత్మాంగాంధీకి గల విశ్వాసం నేటి సమకాలీన సమాజానికి కూడా ఎంతో అవసరమని ప్రధానమంత్రి అన్నారు.

దౌర్జన్యపూరితమైన సంఘర్షణలు, ఉగ్రవాదం, ఆర్థిక అసమానతలు, సామాజిక-ఆర్థిక నిరాకరణ, అంటువ్యాధులు, వాతావరణ మార్పులకు ఎదురవుతున్న ముప్పు వంటివన్నీ ప్రజలు, రాష్ర్టాలు, సమాజాలపై ప్రభావం చూపుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఈ సమస్యల్లో ప్రతీ ఒక్కటీ నిర్మూలించడానికి నాయకత్వమే కీలకమని, గాంధీజీ ప్రోత్సహించిన విలువలు పరిణతి చెందిన నాయకత్వానికి నైతిక మార్గసూచి అని ఆయన వ్యాఖ్యానించారు.

పేదల కోసం రూపొందించే ఏ విధానాలైనా, ఏ కార్యాచరణ అయినా ప్రజాజీవనం మెరుగుదలకు, వారి ఆత్మగౌరవం కాపాడేందుకు, వారికి ఉజ్వలమైన భవిష్యత్తు అందించడానికి ఉపయోగపడుతున్నది, లేనిది మదింపు చేసేందుకు మహాత్మాగాంధీ ఒక గీటురాయిని అందించారని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్ అన్నారు. పారిశుధ్యం, మాతృత్వ ఆరోగ్యం, ప్రాథమిక విద్య, లింగ సమానత, మహిళా సాధికారత, ఆకలిబాధ నిర్మూలన వంటి విభాగాల్లో అభివృద్ధి భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకునేందుకు గాంధీ జీవితం మూలంగా నిలిచిందని ఆయన చెప్పారు. సుమారు శతాబ్ది కన్నా క్రితమే ఎండిజిలు, ఎస్ డిజిలను మహాత్ముడు ఆచరించారని ఆయన అన్నారు. వాస్తవానికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు గాంధీ సిద్ధాంతాల కార్యాచరణేనని ఆయన చెప్పారు.

ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ గాంధీజీ సిద్ధాంతాలకు నివాళి అర్పించడానికి ఈ వేదికను చక్కగా ఉపయోగించుకున్నారు. మహాత్ముడు చూపిన బాట రాబోయే కొన్ని తరాలను సుసంపన్నం చేస్తుందని కొనియాడారు. మహాత్మా గాంధీ పేరే వర్గ, మత, జాతి, దేశ బంధనాలన్నింటిని ఛేదించుకుంటూ సమాజంలోని అట్టడుగుకు చేరి 21వ శతాబ్దికి ఒక ప్రవక్త వచనం వలె నిలిచిందన్నారు.గాంధీ బహుముఖీన వ్యక్తిత్వం గల వారని పేర్కొన్నారు. ఆయన ఒక జాతీయ వాది, అంతర్జాతీయవాది; సాంప్రదాయవాది, సంస్కర్త; రాజకీయ నాయకుడు, ఆధ్యాత్మిక గురువు; రచయిత, సిద్ధాంతకర్త; సామాజిక సంస్కరణ, మార్పులకు అనుకూలంగా అందరినీ బుజ్జగించే వ్యక్తి, ఉద్యమకారుడు అని కొనియాడారు. మహాత్ముడు అహింసా సిద్ధాంతం, అత్యున్నతమైన మానవత్వ విలువల ఆచరణ పట్ల ఆసక్తి, కట్టుబాటు గల నాయకుడుగానే కాకుండా ప్రజాజీవనంలోని వారిని, రాజకీలయ సిద్ధాంతాలు, ప్రభుత్వ విధానాలు రూపొందించే గురుతరమైన బాధ్యత గల పురుషులు, మహిళలను మదింపు చేయడానికి; భాగస్వామ్య భూగోళం ఆశలు, కోర్కెలకు ఒక గీటురాయిగా నిలుస్తారని వారన్నారు.

**************