ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఐఎఎస్ యువ అధికారులతో మాట్లాడుతూ, మార్పు ను ప్రతిఘటించే ఆలోచనాసరళి నుండి తప్పించుకోవలసిందిగాను, భారతదేశంలోని పరిపాలన వ్యవస్థలో ‘నవ భారతం’ యొక్క శక్తిని నింపవలసిందిగాను సలహా ఇచ్చారు.
2015 సంవత్సర ఐఎఎస్ అధికారుల జట్టును ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం పురోగమించవలసినంతగా పురోగమించలేదని చెప్పారు. భారతదేశం తరువాత స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొన్న దేశాలు, భారతదేశం కన్నా వనరులకు భారీ లోటు ఉన్న దేశాలు, అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకొన్నాయని ఆయన అన్నారు. మార్పునకు చోదకంగా ఉండటానికి ధైర్యం అవసరమవుతుందని ఆయన అన్నారు. చీలికలతో కూడినటువంటి పరిపాలన స్వరూపం అధికారుల సమష్టి బాధ్యతలను అభిలషణీయమైన స్థాయిలో నెరవేర్చనీయడం లేదని కూడా ఆయన చెప్పారు. వ్యవస్థలో పరివర్తన ను తీసుకురావడానికి హుషారయిన మార్పు చోటు చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
సహాయక కార్యదర్శుల మూడు నెలల కార్యక్రమం ఇప్పుడు మూడో సంవత్సరంలోకి ప్రవేశించిందని, ఇది ఒక గొప్ప ప్రభావాన్ని ప్రసరింపచేయగలుగుతుందని ఆయన చెప్పారు. యువ అధికారులు రానున్న మూడు మాసాలలో కేంద్ర ప్రభుత్వంలోని అత్యంత సీనియర్ అధికారులతో అరమరికలు లేకుండా నడుచుకోవాలని ఆయన కోరారు. తద్వారా వారి శక్తియుక్తులు, తాజా ఆలోచనలు, కార్యదర్శి స్థాయి అధికారుల పాలనానుభవం.. వీటి కలయికతో ఈ వ్యవస్థ ప్రయోజనం పొందగలుగుతుందని ఆయన అన్నారు.
యుపిఎస్ సి ఫలితాల రోజు వరకు కూడా వారు గడిపిన జీవనాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను గురించి యువ అధికారులు జ్ఞప్తికి తెచ్చుకోవాలని; అంతే కాకుండా వ్యవస్థలోను, సామాన్య ప్రజానీకం జీవితాలలోను సకారాత్మకమైన మార్పులను తీసుకురావడానికి వారికి ఇప్పుడు లభించిన అవకాశాలను వారు వినియోగించుకోవాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఇంకా ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***