అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ నెస్) నవీ ముంబయిలోని ఖార్గర్లో స్థాపించిన శ్రీ శ్రీ రాధా మదన్‌మోహన్‌జీ దేవాలయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ ఈ తరహా దైవిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం, శ్రీల ప్రభుపాద స్వామి ఆశీస్సులతోపాటు ఇస్కాన్ సంతుల అపార వాత్సల్యం, ప్రేమ, ఆప్యాయతలను స్వీకరించడం తన సౌభాగ్యమన్నారు. ఆరాధనీయులైన సంతులందరికీ ఆయన తన కృతజ్ఞతలను వ్యక్తం చేశారు. వారికి ఆయన వందనాన్ని సమర్పించారు. శ్రీ శ్రీ రాధా మదన్మోహన్జీకి ఓ దేవాలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలన్న భావననూ, దీని ఆకృతినీ ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ… ఆధ్యాత్మికత్వం, జ్ఞానం ద్వారా సంపూర్ణ సంప్రదాయానికి ఇది అద్దం పట్టిందన్నారు. ఈ ఆలయం దైవానికున్న వివిధ రూపాలను కళ్లకు కడుతోందనీ, ‘ఏకో అహం బహు శ్యాం’ అనే ఆలోచనను ప్రతిబింబిస్తోందనీ ఆయన అన్నారు. నవ తరానికున్న ఆసక్తులను, జిజ్ఞాసను తీర్చడం కోసం రామాయణ, మహాభారతాలను స్ఫూర్తిగా తీసుకొని ఒక మ్యూజియంను నిర్మిస్తున్నారని ప్రధాని తెలిపారు. దీనికి తోడు, బృందావనంలో భాగంగా ఉన్న 12 వనాల నుంచి ప్రేరణను పొంది ఒక ఉద్యానాన్ని కూడా తీర్చిదిద్దుతున్నారని ఆయన చెప్పారు. ఈ దేవాలయ ప్రాంగణం భారతదేశ ధర్మావలంబనతోపాటు చేతనత్వాన్ని సుసంపన్నం చేసే ఒక పవిత్ర కేంద్రంగా వృద్ధిలోకి రాగలదన్న విశ్వాసాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు. ఈ పవిత్ర కార్యాన్ని సాధించినందుకు సంతులకు, ఇస్కాన్ సభ్యులకు, మహారాష్ట్ర ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
పూజనీయులు గోపాల్ కృష్ణ గోస్వామి మహారాజ్‌ను శ్రీ మోదీ ఉద్వేగభరితంగా స్మరించుకొంటూ, మహారాజ్ దార్శనికత, ఆశీర్వాదాలు భగవాన్ కృష్ణుని పట్ల గాఢ భక్తితో కూడి ఉన్నాయనీ, అవి ఈ ప్రాజెక్టులో అంతర్భాగమయ్యాయనీ అభివర్ణించారు. మహారాజ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆధ్యాత్మిక ఉనికిని అందరూ అనుభూతి చెందుతున్నారని శ్రీ మోదీ అన్నారు. మహారాజ్ చూపించిన ప్రేమాదరణలకు, ఆయన జ్ఞాపకాలకు తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని చెప్పారు. ప్రపంచంలో అతి పెద్ద గీతా గ్రంథాన్ని ఆవిష్కరించడానికి మహారాజ్ తనను ఆహ్వానించడాన్ని, శ్రీల ప్రభుపాద జీ 125వ జయంతి సందర్బంగా ఆయన మార్గదర్శకత్వాన్ని అందుకోవడాన్ని శ్రీ మోదీ గుర్తుకు తెచ్చుకొన్నారు. మహారాజ్ కన్న కలల్లో మరో కల సాకారమైనందుకు ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
‘‘ప్రపంచమంతటా ఉన్న ఇస్కాన్ అనుయాయులు భగవాన్ కృష్ణుని పట్ల వారికున్న భక్తి భావంతో ఒకరితో మరొకరు పెనవేసుకొని ఉన్నారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. శ్రీల ప్రభుపాద స్వామి ప్రబోధాలు భక్తులకు ప్రతి రోజూ మార్గదర్శనం చేస్తున్న మరో బంధమని శ్రీ మోదీ అన్నారు. భారత్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాలంలో వేదాలు, వేదాంతం, గీత ప్రాముఖ్యాన్ని శ్రీల ప్రభుపాద స్వామి వ్యాప్తి చేశారనీ, భక్తి వేదాంతాన్ని సామాన్య ప్రజానీకం చేతనతో ముడివేశారని ప్రధానమంత్రి వివరించారు.70 ఏళ్ల వయసులో చాలా మంది వారి కర్తవ్యాల నిర్వహణ పూర్తి అయిందని భావిస్తారనీ, శ్రీల ప్రభుపాద స్వామి ఆ వయసులో ఇస్కాన్ మిషన్‌ను మొదలుపెట్టి ప్రపంచం నలుమూలలా పర్యటించి భగవాన్ కృష్ణుని సందేశాన్ని ప్రచారం చేశారని శ్రీ మోదీ అన్నారు. ఆయన నిర్ణయంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ ప్రజలు ప్రయోజనం పొందారని ప్రధాని చెబుతూ… శ్రీల ప్రభుపాద స్వామి చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు మనకు ప్రేరణనిస్తూ ఉంటాయని స్పష్టం చేశారు.
‘‘భారత్ ఒక అసాధారణమైన, అద్భుతమైన నేల.. భౌగోళిక హద్దులున్న భూఖండం అనుకుంటే పొరపాటు.. నిత్య చైతన్యంతో, జాజ్వల్యమాన సంస్కృతితో విలసిల్లుతున్న దేశం’’ అని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఆధ్యాత్మికమే ఈ సంస్కృతికి మూలమని, భారత్‌ను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆధ్యాత్మికత్వాన్ని అక్కున చేర్చుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బౌతిక వాదులు భారత్‌ను భిన్న భాషల, ప్రాంతాల సమాహారంగానే చూస్తారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అసలైన భారతదేశపు ఆత్మను తెలుసుకోవాలనుకునే వారు…ఈ దేశ సాంస్కృతిక చేతనతో మమేకం కావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. దూర ప్రాచ్యంలో చైతన్య మహాప్రభు వంటి సంతులు బెంగాల్లో ఉదయించారనీ, పశ్చిమాన చూస్తే నాందేవ్, తుకారామ్, జ్ఞానేశ్వర్ వంటి సంతులు పుట్టారని ఆయన ప్రస్తావించారు. చైతన్య మహాప్రభు సామాన్యుల కోసం మహావాక్యాన్ని ప్రచారం చేయగా, మహారాష్ట్రలో సాధువులు ‘రామకృష్ణ హరి’ మంత్రాన్ని అందించి ఆధ్యాత్మిక సుధను పంచారని శ్రీ మోదీ తెలిపారు. భగవాన్ కృష్ణుడు బోధించిన అపార జ్ఞానాన్ని జ్ఞానేశ్వరి గీత ద్వారా అందరికీ అందుబాటులోకి సంత్ జ్ఞానేశ్వర్ తీసుకువచ్చారని శ్రీ మోదీ అన్నారు. శ్రీల ప్రభుపాద ఇస్కాన్ మాధ్యమం ద్వారా గీతా వ్యాఖ్యానాలను ప్రచురిస్తూ గీతకు ప్రజాదరణను సంపాదించిపెట్టారనీ, గీత సారాన్ని ప్రజల చెంతకు చేరవేశారన్నారు. వేరు వేరు చోట్ల, విభిన్న కాలాల్లో జన్మించిన ఈ సంతులు ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి జలాలను వారికే సొంతమైన విశిష్ట మార్గాలలో కాలవలు కట్టించి మరీ పారించారంటూ ప్రధాని చెప్పారు. ఈ సంతుల జన్మ కాలాల్లో, భాషల్లో, పద్ధతుల్లో, అవగాహనలో, ఆలోచనల్లో భేదాలున్నా వారిలోని అంతఃచేతన ఒకటేననీ, వారందరూ కలసి భక్తి వెలుగులను అందించడం ద్వారా సమాజంలోకి ఒక కొత్త ప్రాణశక్తిని ప్రసరింపచేశారనీ, సమాజానికి ఒక కొత్త దిశనూ, కొత్త శక్తినీ సంతరించారని శ్రీ మోదీ అన్నారు.
మానవ సేవే.. భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతికి మూలాధారంగా ఉందని శ్రీ మోదీ వ్యాఖ్యానిస్తూ… అలాంటి ఆధ్యాత్మికత్వంలో దైవానికి సేవ చేయడమూ, ప్రజలకు సేవ చేయడమూ ఒకటిగా మారుతుందని స్పష్టం చేశారు. భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతి సాధకులను సమాజంతో పెనవేస్తుందనీ, కరుణను పెంచుతుందనీ, వారిని సేవాపథంలో ముందుకు నడిపిస్తుందన్నారు.
నిజమైన సేవ అంటే అది స్వార్థం లేనిదనే అర్థాన్నిచ్చే శ్రీ కృష్ణుని శ్లోకాన్ని ప్రధాని ఉదాహరిస్తూ అన్ని ధర్మ గ్రంథాలూ, పవిత్ర గ్రంథాలూ సేవ భావనయే ప్రధానాంశంగా రూపొందాయన్నారు. ఒక సువిశాల సంస్థ ఇస్కాన్ ఈ సేవయే స్ఫూర్తిగా కార్యకలాపాలను నిర్వహిస్తోందనీ, విద్య, ఆరోగ్యం, పర్యావరణం రంగాలకు తోడ్పాటునిస్తోందనీ ఆయన చెప్పారు. కుంభ్ మేళాలో ఇస్కాన్ సార్థక సేవ కార్యకలాపాలను చేపడుతోందని ఆయన తెలిపారు.
సేవ చేయాలనే భావనతోనే ప్రభుత్వం పౌరుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతోందని ప్రధాని చెప్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క ఇంటికీ టాయిలెట్‌ను నిర్మించడం, పేద మహిళలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను సమకూర్చడం, ప్రతి కుటుంబానికీ నల్లా నీటిని అందించడం, ప్రతి నిరుపేదకూ రూ.5 లక్షల వరకు వైద్య చికిత్సను ఉచితంగా అందించడం, ఇదే తరహా సదుపాయాన్ని 70 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు కూడా కల్పించడం, ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ పక్కా గృహాన్ని అందజేయడం.. ఈ పనులన్నీ ఈ విధమైన సేవాభావంతో చేపడుతున్నవేనని ఆయన వివరించారు.
ఈ సేవ స్ఫూర్తే నిజమైన సామాజిక న్యాయాన్ని అందిస్తుంది. ఇది నిజమైన లౌకికవాదానికి ఒక సంకేతంగా నిలుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
కృష్ణా సర్క్యూట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వివిధ యాత్రాస్థలాలనూ, ధార్మిక స్థలాలనూ కలుపుతోందనీ, ఈ సర్క్యూట్ గుజరాత్ మొదలు రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా వరకు విస్తరించిందనీ శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ స్థలాలను స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల్లో భాగంగా తీర్చిదిద్దుతున్నారని ఆయన చెప్పారు. ఈ దేవాలయాలు భగవాన్ కృష్ణుని వివిధ రూపాలను కళ్లకు కడతాయనీ, ఈ రూపాల్లో భగవాన్ కృష్ణుడు ఆయన బాల్యం మొదలుకొని రాధాతో కలసి పూజలో పాలుపంచుకోవడం, ఆయన కర్మయోగి రూపం, ఆయనను ఒక రాజు రూపంలో ఆరాధించడం వరకు ఉన్నాయనీ ప్రధాని అన్నారు. భగవాన్ కృష్ణుని జీవనంతో ముడిపడ్డ వివిధ క్షేత్రాల్ని సందర్శించడాన్ని సులభతరంగా మార్చివేయడం కృష్ణా సర్క్యూట్ ఉద్దేశమనీ, దీనిని నెరవేర్చడానికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారన్నారు. కృష్ణా సర్క్యూట్‌తో ముడిపడ్డ ఈ శ్రద్ధా కేంద్రాలకు భక్తుల్ని చేరవేయడంలో ఇస్కాన్ తోడ్పడవచ్చంటూ ప్రధానమంత్రి సూచించారు. మన దేశంలో ఈ తరహా ప్రదేశాల్ని కనీసం అయిదింటిని సందర్శించాల్సిందిగా ఇస్కాన్ తన కేంద్రాలతో అనుబంధం ఉన్న భక్తజనులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
గత పదేళ్లలో దేశం అభివృద్ధి, వారసత్వం.. ఈ రెండు విషయాల్లోనూ ఏకకాలంలో పురోగతి ఉందని ప్రధానమంత్రి చెబుతూ, వారసత్వం మాధ్యమం ద్వారా అభివృద్ధిని సాధించే క్రమంలో ఇస్కాన్ వంటి సంస్థలు చెప్పుకోదగ్గ పాత్రను పోషించాలన్నారు.
దేవాలయాలు, ధార్మిక స్థలాలు వందల ఏళ్లుగా సామాజిక చైతన్య ప్రబోధ కేంద్రాలుగా ఉంటూ వచ్చాయనీ, విద్యాబోధనలో, నైపుణ్యాభివృద్ధిలో గురుకులాలు కీలక పాత్రను పోషించాయనీ ఆయన తెలిపారు. ఇస్కాన్ తన కార్యక్రమాల నిర్వహణ ద్వారా యువజనులు వారి జీవనాల్లో ఆధ్యాత్మికతను ఒక భాగంగా చేసుకోవాలనే ప్రేరణనిస్తోందన్నారు. ఇస్కాన్‌లో యువ సాధకులు వారి సంప్రదాయాల్ని పాటిస్తూనే, ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని కూడా అలవర్చుకొంటున్నారనీ, దీంతో వారి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఇతరులకు ఒక నమూనాగా మారుతోందనీ ప్రధాని అన్నారు. ఇస్కాన్ మార్గదర్శకత్వంలో యువత సేవ చేయడాన్నీ, అంకితభావాన్నీ స్ఫూర్తిగా తీసుకొంటూ దేశ హితం కోరి పనిచేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భక్తివేదాంత ఆయుర్వేదిక ఉపచార కేంద్రం, వైదిక విద్య కోసం ఉద్దేశించిన భక్తివేదాంత కళాశాలలు సమాజానికీ, దేశానికీ ఉపయోగపడతాయని శ్రీ మోదీ వెల్లడించారు. ‘హీల్ ఇండియా’ అంటూ తాను ఇచ్చిన పిలుపును ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
సమాజం ఆధునిక బాటలో పయనిస్తున్నకొద్దీ, సమాజంలో కరుణ, ప్రతిస్పందన స్వభావం పెరగాల్సిన అవసరం ఉందని శ్రీ మోదీ అన్నారు. మానవత్వం, ఆత్మీయతలు ఉట్టిపడే, స్పందించే గుణమున్న వ్యక్తులతో నిండిఉండేలా సమాజాన్ని తీర్చిదిద్దాల్సి ఉందని ఆయన ప్రధానంగా చెప్పారు. ఇస్కాన్ తన భక్తి వేదాంత ప్రచారం ద్వారా ప్రపంచంలో ప్రతిస్పందన స్వభావానికి సరికొత్త ప్రాణశక్తిని ప్రసాదించడంతోపాటు మానవీయ విలువలను ప్రోత్సహించగలుగుతుందని ప్రధాని చెప్పారు. ఆయన తన ప్రసంగం చివర్లో… శ్రీల ప్రభుపాద స్వామి ఆదర్శాల పరిరక్షణను ఇస్కాన్ ప్రముఖులు కొనసాగిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాధా మదన్‌మోహన్‌జీ దేవాలయాన్ని ప్రారంభించుకొన్న సందర్భంగా ఇస్కాన్ కుటుంబంతోపాటు పౌరులందరికీ ఆయన మరోసారి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మహారాష్ట్ర గవర్నరు శ్రీ సి.పి. రాధాకృష్ణన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ శిందే సహా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
నేపథ్యం
నవీ ముంబయిలోని ఖార్ఘర్లో ఇస్కాన్ చేపట్టిన ప్రాజెక్టే శ్రీ శ్రీ రాధా మదన్‌మోహన్‌జీ దేవాలయం. ఇది 9 ఎకరాల్లో విస్తరించింది. దీనిలో అనేక దేవతలతో కూడిన ఓ ఆలయం, ఒక వైదిక విద్యాకేంద్రం, ఏర్పాటు చేయాలనుకొంటున్న మ్యూజియంలు, ఒక సభా భవనం, ఉపచార కేంద్రం వంటివి కూడా భాగంగా ఉండబోతున్నాయి. వైదిక బోధనలను కొనసాగిస్తుండడం ద్వారా ప్రతి ఒక్కరిలో సోదర భావననూ, శాంతినీ, సద్భావననూ పెంపొందించాలన్నదే ఈ దేవాలయ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
Speaking at the inauguration of Sri Sri Radha Madanmohanji Temple in Navi Mumbai. https://t.co/ysYXd8PLxz
— Narendra Modi (@narendramodi) January 15, 2025
दुनियाभर में फैले इस्कॉन के अनुयायी भगवान श्रीकृष्ण की भक्ति के डोर से बंधे हैं।
— PMO India (@PMOIndia) January 15, 2025
उन सबको एक-दूसरे से कनेक्ट रखने वाला एक और सूत्र है, जो चौबीसों घंटे हर भक्त को दिशा दिखाता रहता है।
ये श्रील प्रभुपाद स्वामी के विचारों का सूत्र है: PM @narendramodi
भारत केवल भौगोलिक सीमाओं में बंधा भूमि का एक टुकड़ा मात्र नहीं है।
— PMO India (@PMOIndia) January 15, 2025
भारत एक जीवंत धरती है, एक जीवंत संस्कृति है।
और, इस संस्कृति की चेतना है- यहाँ का आध्यात्म!
इसलिए, यदि भारत को समझना है, तो हमें पहले आध्यात्म को आत्मसात करना होता है: PM @narendramodi
हमारी आध्यात्मिक संस्कृति की नींव का प्रमुख आधार सेवा भाव है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 15, 2025
नवी मुंबई में इस्कॉन के दिव्य-भव्य श्री श्री राधा मदनमोहन जी मंदिर में दर्शन-पूजन कर मन को अत्यंत प्रसन्नता हुई है। pic.twitter.com/3WlVpgeEnY
— Narendra Modi (@narendramodi) January 15, 2025
भगवान श्रीकृष्ण के संदेश को दुनिया के कोने-कोने में पहुंचाने वाले श्रील प्रभुपाद स्वामी जी के प्रयास आज भी सभी देशवासियों को प्रेरित करने वाले हैं। pic.twitter.com/JDN2bVLVQA
— Narendra Modi (@narendramodi) January 15, 2025
श्रील प्रभुपाद जी ने इस्कॉन के माध्यम से गीता को लोकप्रिय बनाया। अलग-अलग कालखंड में जन्मे कई और संतों ने भी भक्ति के प्रकाश से समाज को नई दिशा दी है। pic.twitter.com/WwgfApsmtO
— Narendra Modi (@narendramodi) January 15, 2025
हमारे सभी धार्मिक ग्रंथों और शास्त्रों के मूल में सेवा भावना ही है। मुझे संतोष है कि हमारी सरकार भी इसी सेवा भावना के साथ लगातार देशवासियों के हित में काम कर रही है। pic.twitter.com/m9Q1wekk9k
— Narendra Modi (@narendramodi) January 15, 2025