Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవంబర్ 14-15 తేదీల్లో ప్రధానమంత్రి జార్ఖండ్ పర్యటన


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 నవంబరు 14, 15 తేదీల్లో ఝార్ఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా నవంబరు 15న ఉదయం 9:30 గంటలకు రాంచీలో భగవాన్ బిర్సా ముండా స్మారక పార్కు/ స్వాతంత్ర్య సమర యోధుల ప్రదర్శనశాలను ఆయన సందర్శిస్తారు. అక్కడి నుంచి ప్రధాని గిరిజనులకు ఆరాధ్యుడైన భగవాన్ జన్మస్థలం ఉలిహతు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ భగవాన్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్తారు. ఈ మేరకు ఉలిహతు గ్రామం సందర్శించిన తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించనున్నారు. అలాగే ఖుంటి గ్రామంలో ఉదయం 11:30 గంటలకు మూడో గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం-2023 వేడుకలలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘వికసిత భారతం సంకల్ప యాత్ర’తోపాటు ‘ప్రధానమంత్రి దుర్బల గిరిజన సంఘాల ప్రత్యేక కార్యక్రమం’ కూడా ప్రారంభిస్తారు. మరోవైపు ‘పిఎం-కిసాన్’ పథకం కింద 15వ విడత నిధులను విడుదల చేస్తారు. దీంతోపాటు రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజె్క్టులను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తారు.

వికసిత భారతం సంకల్ప యాత్ర

   వివిధ పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సకాలంలో అందేవిధంగా చూడడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం నేపథ్యంలో ‘వికసిత భారతం సంకల్ప యాత్ర’ను ప్రధాని ప్రారంభిస్తారు. ప్రజలకు చేరువ కావడం ద్వారా సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంపై వారికి అవగాహన కల్పించడం ఈ యాత్ర ప్రధాన ధ్యేయం. ఈ మేరకు పారిశుద్ధ్య సౌకర్యాలు, కీలక ఆర్థిక సేవలు, విద్యుత్ కనెక్షన్లు, వంటగ్యాస్ సిలిండర్ల సౌలభ్యం, పేదలకు పక్కా ఇళ్లు, ఆహార భద్రత, సముచిత పోషకాహారం, విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ, రక్షి మంచినీటి సరఫరా వగైరా పథకాల  ప్రయోజనాలు వారికి అందిస్తారు. ఈ యాత్రలో భాగంగా సేకరించే వివరాల ఆధారంగా సంభావ్య లబ్ధిదారుల నమోదు చేపడతారు.

   ‘వికసిత భారతం సంకల్ప యాత్ర’ ప్రారంభోత్సవానికి గుర్తుగా జార్ఖండ్‌లోని ఖుంటిలో ‘ఐఇసి’ (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్) వాహనాలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. ముందుగా గిరిజనులు గణనీయ సంఖ్యలోగల జిల్లాల నుంచి యాత్ర ప్రారంభమై 2024 జనవరి 25 నాటికి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పూర్తవుతుంది.

‘పిఎం పివిటిజి’ కార్యక్రమం

   ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలో తొలిసారి చేపడుతున్న ‘ప్ర‌ధానమంత్రి దుర్బ‌ల గిరిజన సంఘాల ప్రత్యేక కార్యక్రమం’ (పిఎం పివిటిజి)ని కూడా ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 28 లక్షల జనాభాగల 22,544 గ్రామాల్లో (220 జిల్లాలు) నివసించే గిరిజనం కోసం 75 ‘పివిటిజి’లు ఉన్నాయి. వివిధ తెగలకు చెందిన ఈ గిరిజనం పలు మారుమూల, దుర్గమ ప్రాంతాల్లోని ఆవాసాలలో జీవిస్తుంటారు. వీరిలో అధికశాతం అటవీ ప్రాంతాలలో నివసిస్తుంటారు. అందుకే దాదాపు 24,000 కోట్ల బడ్జెట్‌తో ‘పివిటిజి’ల కుటుంబాలు, ఆవాసాలను రహదారులు, టెలి కమ్యూనికేషన్లు, విద్యుత్, సురక్షిత గృహాలు వంటి ప్రాథమిక సౌకర్యాలతో అనుసంధానించే ప్రణాళిక రూపొందించబడింది. అలాగే పరిశుభ్రమైన తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణల మెరుగైన లభ్యతసహా సుస్థిర  జీవనోపాధి అవకాశాలు వారికి లభిస్తాయి.

   కేంద్ర ప్రభుత్వంలోని 9 మంత్రిత్వశాఖల పరిధిలోగల 11 ప్రస్తుత కార్యక్రమాల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలు చేయబడుతుంది. ఉదాహరణకు… ‘పిఎంజిఎస్‘వై, పిఎంజిఎవై, జల్ జీవన్ మిషన్ తదితరాలన్నిటినీ మారుమూల ఆవాసాలు వర్తింపజేసేలా కొన్ని పథకాల నిబంధనలు సడలించబడతాయి. దీంతోపాటు ‘పిఎంజెఎవై’, కొడవలి కణ రక్తహీతన వ్యాధి నిర్మూలన, క్షయ నిర్మూలన, వందశాతం రోగనిరోధక టీకాలు, పిఎం సురక్షిత మాతృత్వ యోజన, పిఎం మాతృ వందన యోజన, పిఎం పోషణ్, పిఎం జన్ ధన్ యోజన తదితరాలన్నీ సంతృప్త స్థాయిలో అమలయ్యేలా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుంది.

‘పిఎం-కిసాన్’ పథకం 15విడత నిధుల విడుదల.. ఇతర ప్రగతి పథకాలు

   రైతుల సంక్షేమంపై ప్రధాని నిబద్ధతను చాటే మరో పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 15వ విడతగా 8 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు 18,000 కోట్లు ప్రత్యక్ష లబ్ధి బదిలీ పద్ధతిలో వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయబడతాయి. ఈ పథకం కింద ఇప్పటిదాకా 14 విడతల్లో 2.62 లక్షల కోట్లు రైతు ఖాతాలకు బదిలీ చేయబడ్డాయి.

   మరోవైపు రాష్ట్రంలో రైలు, రోడ్డు, విద్య, బొగ్గు, పెట్రోలియం-సహజవాయువు తదితర రంగాలకు సంబంధించి 7200 కోట్ల విలువైన కొన్ని ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తారు.

   ప్రధాని శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులలో జాతీయ రహదారి-133లోని మహాగామ- హన్స్‌దిహా విభాగంలో 52 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరణ; జాతీయ రహదారి-114ఎ పరిధిలో బాసుకినాథ్-దేవగఢ్ విభాగంలో 45 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలకు విస్తరణ; కెడిహెచ్-పూర్ణదిహ్ బొగ్గు నిర్వహణ ప్రాజెక్టు వంటివి ఉన్నాయి.

   అలాగే ప్రధానమంత్రి ట్రిపుల్ ఐటీ-రాంచీ కొత్త విద్యా-పరిపాలన భవనం ప్రారంభంతోపాటు జాతికి అంకితం చేయబోయే ప్రాజెక్టులలో: ఐఐటి-ఐఎస్ఎం ధన్‌బాద్ కొత్త హాస్టల్; బొకారోలో పెట్రోలియం-లూబ్రికెంట్స్ (పిఒఎల్) డిపో; హటియా-పక్రా విభాగం, తల్గారియా – బొకారో విభాగం, జరంగ్డిహ్-పాట్రాటు విభాగల్లో రైల్వే లైన్ డబ్లింగ్ సహా ఇతర ప్రాజెక్టులు, జార్ఖండ్ రాష్ట్రంలో రైల్వే విద్యుదీకరణ 100 శాతం లక్ష్యం పూర్తయ్యే ప్రాజెక్టు కూడా ఉన్నాయి.

 

*****