Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవంబరు 30, 2015 న పారిస్ లో జరిగిన కాప్ 21 సర్వసభ్య సదస్సులో


ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఫ్రాంకోయిస్ హోలెండ్, ఇతర ప్రముఖులారా..

పారిస్ వేదన ఇంకా తీరిపోలేదు. ఇంతటి దుఃఖంలోనూ మీరు కనబరుస్తున్న సహనశీలత్వాన్ని, కృత నిశ్చయాన్ని కొనియాడకుండా ఉండలేకపోతున్నాను. ఫ్రాన్స్ కు, పారిస్కు ప్రపంచ దేశాలు వెన్నంటి నిలచి, పూర్తి అండదండలను అందిస్తున్నందుకు ప్రపంచ దేశాలకు కూడా నేను ప్రణమిల్లుతున్నాను.

రాబోయే కొన్ని రోజులలో మనం ఈ భూగ్రహ భవితవ్యాన్ని నిర్దేశించబోతున్నాం. శిలాజ జనిత ఇంధనం ఊతంగా రూపుదాల్చిన పారిశ్రామిక యుగం ఆవిష్కరించిన పర్యవసానాలు, మరీ ముఖ్యంగా పేదల జీవితాలను అది ప్రభావితం చేసిన తీరుతెన్నులు మన కళ్లెదుట ఉండగానే మనం ఈ పని చేయనున్నాం.

ధనిక దేశాలు ఇప్పటికీ కర్బనాన్ని మండిస్తున్న స్థాయిలు ఎక్కువగానే ఉన్నాయి. మరో పక్క, అభివృద్ధి అనే నిచ్చెనలో అట్టడుగున ఉన్న ప్రపంచంలోని కోట్లాది మంది తమకు కూడా ఎదిగేందుకు అవకాశం ఇమ్మని అడుగుతున్నారు. అందువల్ల, ప్రత్యామ్నాయాలు అంత సులభంగా ఏమీ లేవనే చెప్పుకోవాలి. అయితే ఒకటి, మన దగ్గర చైతన్యానికి, సాంకేతిక సామర్థ్యానికీ కొదువ లేదు. మనకు కావలసిందల్లా జాతీయ సంకల్పమూ, దానికి తోడుగా మనఃపూర్వకమైన ప్రపంచ భాగస్వామ్యమూను.

ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం తన 125 కోట్ల ప్రజల (వీరిలో 30 కోట్ల మందికి ఇంధనం అందుబాటులో లేదు) ఆకాంక్షలను నెరవేర్చగలగడానికి అభివృద్ధి పథంలోకి శరవేగంగా దూసుకుపోవలసివుంది. మేం ఆ పని మీదే ఉండటానికి కంకణబద్ధులం అయ్యాం. ప్రజలు, భూమి వేరు వేరు కాదు; మానవుల శ్రేయస్సు, ప్రకృతి అవిభాజ్యాలు.. అవి భిన్నమైనవేం కావు అన్న మా పూర్వీకుల నమ్మికే ఈ కృషిలో మాకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ దిశగా మేం సాధించడానికి పెద్ద లక్ష్యాలనే పెట్టుకున్నాం. 2030కల్లా మేం ఉద్గారాల తీవ్రతను జీడీపీలో ఒక యూనిట్కు 2005 నాటి స్థాయిలతో పోలిస్తే 33- 35 శాతం స్థాయికి తగ్గిస్తాం. దీంతోపాటు, మా స్థాపక సామర్థ్యంలో 40 శాతం సామర్థ్యాన్ని శిలాజజనితం కాని ఇంధనంతో సమకూర్చుకొంటాం.

మేం పునర్వినియోగ ఇంధన సత్తాను పెంచి పోషించుకోవడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తాం. ఉదాహరణకు, 2022కల్లా అదనంగా 175 గిగావాట్ల పునర్వినియోగ ఇంధన శక్తిని ఉత్పత్తి చేయనున్నాం. కనీసం 250 కోట్ల టన్నులకు సమానమైన బొగ్గుపులుసు వాయువును పీల్చుకొనేందుకు మా అటవీప్రాంతాన్ని విస్తరిస్తాం.

లెవీలు విధించే, సబ్సిడీలను తగ్గించే, సాధ్యమైనంతవరకు ఇంధన వనరులను మార్పిడికి మళ్లే పద్ధతులతో శిలాజ జనిత ఇంధనంపై ఆధారపడే ధోరణులను నిరుత్సాహపరుస్తున్నాం. అంతే కాకుండా, నగరాలు, ప్రజా రవాణా తీరుతెన్నులలో సమూల మార్పులు తెస్తున్నాం కూడా.

పారిశ్రామికంగా పురోగతి చెందిన దేశాలు ఘనమైన లక్ష్యాలను పెట్టుకొని, వాటిని సాధించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తాయని మేం ఆశిస్తున్నాం. ఇది ఒక్క చారిత్రక బాధ్యత మాత్రమే కాదు; ఆ దేశాలకు కోతలు విధించుకోవడానికి, అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపించడానికి కూడా ఎంతో వీలుంది.

వాతావరణ పరంగా న్యాయం ఒనగూరాలంటే కావలసింది కూడా ఇదే. మండించడానికి ఇంకా ప్పటికీ మిగిలివున్న కర్బనం కూడా అంత పెద్దదేమీ కాకపోవడంతో, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవి ఎదగడానికి తగినంత అవకాశం లభించాల్సివుంది.

దీనికి మరో భాష్యం కూడా చెప్పుకోవలసి ఉంది. అదేమిటంటే.. పారిశ్రామికంగా పురోగతి చెందిన దేశాలు 2020 సంవత్సరానికి లోపే క్యోటో ఒడంబడికల ప్రాథమిక పత్రం లోని రెండో వాగ్దాన అవధిని ఆమోదించడం, షరతుల తొలగింపు, లక్ష్యాల దిద్దుబాటు వంటి వాటితో పాటు దూకుడుగా చర్యలు చేపట్టాలి. ఉమ్మడి బాధ్యతలను నెరవేర్చడంలో వేర్వేరు పంథాలను అవలంబించినా సరే.. కార్యాచరణ, అమలు, అమలుకు అనుసరించాల్సిన మార్గాలు.. ఇలా అన్ని రంగాలలో మనం అందరం కలసికట్టుగా ముందడుగు వేయాలి. సమానత్వ సిద్ధాంతానికి పెద్ద పీట వేయాలి. దీనికి భిన్నమైన బాట పట్టామా అంటే, అది నైతికంగా పొరపాటు కావడమే కాకుండా, అసమానతకు తావు ఇచ్చినట్లు కూడా అవుతుంది.

ఇక్కడ సమానత్వానికి అర్థం.. ఆయా దేశాలు ఆక్రమించే కర్బన స్థలాలకు తగ్గట్టే జాతీయ కార్యాచరణలు కూడా ఉండాలి అని. అలాగే, అడాప్టేషన్ అండ్ లాస్ అండ్ డామేజ్ పై ఒక శక్తిమంతమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవలసిన ఆవశ్యకత సైతం ఉంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో అన్ని దేశాలకూ శుద్ధమైన, ఖర్చును భరించగలిగే ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావలసిన తమ బాధ్యత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలపైన ఉన్నది. ఈ బాధ్యతను ఈ దేశాలు నెరవేర్చి తీరాలి.

ఇందులోనే మన అందరి హితం ఇమిడి ఉంది.

అందువల్ల, అభివృద్ధి చెందుతున్న దేశాలలో మిటిగేషన్, అడాప్టేషన్ల కోసం 2020కల్లా ఏటా 100 బిలియన్ అమెరికా డాలర్లను పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు పోగుచేస్తాయని మేం ఎదురుచూస్తాము. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇచ్చిన మాటను విశ్వసనీయమైన, పారదర్శకమైన, అర్ధవంతమైన రీతిలో నిలబెట్టుకోవాల్సివుంది.

ఇంధనం మానవాళి కనీస అవసరాలలో ఒకటి. కాబట్టి, మనం సాంకేతికంగా ఒక గొ్ప్ప కార్యాచరణకు నడుం కట్టాలి. దీని పరమార్థం ప్రజా ప్రయోజనం కావాలి. అంతే తప్ప, కేవలం మార్కెట్కు ప్రోత్సాహకాలను ప్రకటించినట్లుగానే మిగలకూడదు. ఇందుకోసం మనం హరిత వాతావరణ నిధికి మరింత ఎక్కువ డబ్బు పోగేయాలి. ఈ నిధి సాంకేతికత, మేధో సంపత్తిల అందుబాటును మెరుగుపర్చుకొనేందుకు ఉపయోగపడాలి.

మనకు సంప్రదాయక ఇంధనం ఇప్పటికీ అవసరమే. దీనిని మనం కాలుష్యానికి తావివ్వకుండా ఉత్పత్తి చేసుకోవాలి తప్ప, దీనిని ఉత్పత్తి చేయడాన్నే మానివేయాలని చూడ కూడదు. అలాగే, ఇతరులకు ఆర్థికంగా అడ్డంకులుగా మారేటటువంటి ఏకపక్ష చర్యలకు చోటు ఇవ్వకూడదు.

దాపరికానికి వీలు ఉండని, బాసటగా నిలిచే, భిన్నప్రాతిపదికలతో కూడిన చర్యలకు మేం స్వాగతం పలుకుతున్నాం.చివరగా చెప్పవచ్చేదేమిటంటే, విజయం కోసం, మన జీవన శైలిలో పరివర్తన చేసుకోవలసిన అవసరం ఉంది. సాధ్యపడేటట్లయితే గనక ముందుముందు తక్కువ కర్బనాన్ని వినియోగించడంపైన దృష్టి నిలపాలి.

ప్రముఖులారా,

ఇక్కడకు196 దేశాలు తరలి వచ్చాయంటే మనం ఒక ఉమ్మడి లక్ష్యం కో్సం ఏకమయ్యే అవకాశం ఉన్నదని ఈ పరిణామంతో చాటి చెప్పినట్లయింది.

నిజాయతీతో కూడిన, బాధ్యతలను, సామర్థ్యాలను, ఆకాంక్షలను, అవసరాలను సమతూకం వేయగలిగిన ఉమ్మడి భాగస్వామ్యాన్ని నెలకొల్పుకొనే తెలివితేటలు, దమ్ము మనకు ఉంటే గనక మనం విజయులం అవుతాం. అటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోగలమన్న నమ్మకం నాకుంది.

ధన్యవాదాలు.